జనవరిలో జోరుగా హైరింగ్
న్యూఢిల్లీ: ఈ ఏడాది జనవరిలో హైరింగ్ పెరిగిందని ఆన్‌లైన్ హైరింగ్ పోర్టల్ నౌకరీడాట్‌కామ్ తెలిపింది. గత మూడు నెలలుగా హైరింగ్ కార్యకలాపాలు పెరుగుతున్నాయని, ఎన్నికల తర్వాత మరింతగా ఊపందుకుంటాయని తెలియజేసింది. మెట్రో నగరాల్లో హైరింగ్ పరిస్థితులు హైదరాబాద్, కోల్‌కతాల్లో గరిష్ట మెరుగుదల ఉందని పేర్కొంది.
నౌఖరీ సర్వే ప్రకారం...
గతేడాది డిసెంబర్‌తో పోల్చితే ఈ ఏడాది జనవరిలో ఆన్‌లైన్ హైరింగ్ కార్యకలాపాలను ప్రతిబింబించే నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ 13 శాతం వృద్ధితో 1,466 పాయింట్లకు పెరిగింది. ఇక గత ఏడాది జనవరితో పోల్చితే ఇది 15 శాతం పెరిగింది.
ఐటీ, బీపీవో రంగాల్లో అధికంగా ఉద్యోగాలొచ్చాయి. టెలికాం రంగంలో హైరింగ్ చాలా ఎక్కువ తగ్గింది. వాహన రంగంలో స్వల్పంగా తగ్గింది.
సేల్స్, బిజినెస్ డెవలప్‌మెంట్, ప్రాజెక్ట్ డెవలప్‌మెంట్ ఉద్యోగులకు డిమాండ్ పెరగడం కొనసాగుతోంది.
గత మూడు నెలలుగా నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ నెలకు సగటున 4% చొప్పున వృద్ధి సాధిస్తోంది.
అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుండడం, త్వరలో జరగనున్న ఎన్నికలు తదితర కారణాలతో నియామకాలు పుంజుకుంటాయి.
ఎన్నికల అనంతరం పలు కంపెనీలు విస్తరణ కార్యకలాపాలు చేపడతాయి. ఫలితంగా ప్రతిభ గల ఉద్యోగుల కోసం డిమాండ్ పెరుగుతుంది.