ముంబై: దేశవ్యాప్తంగా 2023 ఏప్రిల్‌లో వైట్–కాలర్ జాబ్స్‌కు డిమాండ్ తగ్గిందని నౌకరీ.కామ్ నివేదిక తెలిపింది. 2022 ఏప్రిల్‌తో పోలిస్తే నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ ప్రకారం ఉద్యోగాల కోసం ప్రకటనలు గత నెలలో 5 శాతం తగ్గి 2,715 నమోదయ్యాయి. ఐటీ రంగంలో దిద్దుబాటు ఇందుకు కారణమని నివేదిక తెలిపింది. ఈ పరిశ్రమలో నియామకాలు 27 శాతం క్షీణించాయి. బీపీవో విభాగంలో 18 శాతం, ఎడ్‌టెక్ 21, రిటైల్‌లో 23 శాతం తగ్గాయి.
‘టెక్నాలజీయేతర రంగాలైన బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ విభాగాల్లో నియామకాలు చురుకుగా ఉన్నాయి. మెట్రో నగరాల్లో కొత్తగా గృహ, వాణిజ్య భవనాల నిర్మాణం అధికం కావడంతో రియల్టీలో రిక్రూట్‌మెంట్ 21 శాతం పెరిగింది. దీంతో టెండర్ మేనేజర్, కన్‌స్ట్రక్షన్ ఇంజనీర్, సివిల్ ఇంజనీర్లకు డిమాండ్ దూసుకెళ్లింది. వీరి నియామకాలు కోల్‌కతలో 28 శాతం, పుణే 22, హైదరాబాద్‌లో 19 శాతం అధికం అయ్యాయి.
16 ఏళ్లకుపైబడి నైపుణ్యం ఉన్న సీనియర్లకు డిమాండ్ 30 శాతం ఎక్కువగా ఉంది. ఫ్రెష్ గ్రాడ్యుయేట్లు, 4–7 ఏళ్ల అనుభవం ఉన్న నిపుణుల డిమాండ్ క్షీణించింది. నియామకాలు చమురు, సహజవాయువు రంగాల్లో 20 శాతం, బీమా 13, బ్యాంకింగ్ 11 శాతం వృద్ధి చెందాయి. వాహన పరిశ్రమలో 4 శాతం, ఫార్మా రంగంలో ఇది 3 శాతంగా ఉంది. మెట్రోయేతర నగరాల్లో అహ్మదాబాద్ 28 శాతం వృద్ధితో ముందంజలో ఉంది. ఈ నగరాల్లో బ్యాంకింగ్, వాహన, బీమా రంగాలు ప్రధాన పాత్ర పోషించాయి’ అని నివేదిక వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment