Naukri.com
-
ఏప్రిల్‌లో నియామకాలు తగ్గాయ్
ముంబై: దేశవ్యాప్తంగా 2023 ఏప్రిల్‌లో వైట్–కాలర్ జాబ్స్‌కు డిమాండ్ తగ్గిందని నౌకరీ.కామ్ నివేదిక తెలిపింది. 2022 ఏప్రిల్‌తో పోలిస్తే నౌకరీ జాబ్‌స్పీక్ ఇండెక్స్ ప్రకారం ఉద్యోగాల కోసం ప్రకటనలు గత నెలలో 5 శాతం తగ్గి 2,715 నమోదయ్యాయి. ఐటీ రంగంలో దిద్దుబాటు ఇందుకు కారణమని నివేదిక తెలిపింది. ఈ పరిశ్రమలో నియామకాలు 27 శాతం క్షీణించాయి. బీపీవో విభాగంలో 18 శాతం, ఎడ్టెక్ 21, రిటైల్‌లో 23 శాతం తగ్గాయి. ‘టెక్నాలజీయేతర రంగాలైన బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్ విభాగాల్లో నియామకాలు చురుకుగా ఉన్నాయి. మెట్రో నగరాల్లో కొత్తగా గృహ, వాణిజ్య భవనాల నిర్మాణం అధికం కావడంతో రియల్టీలో రిక్రూట్మెంట్ 21 శాతం పెరిగింది. దీంతో టెండర్ మేనేజర్, కన్స్ట్రక్షన్ ఇంజనీర్, సివిల్ ఇంజనీర్లకు డిమాండ్ దూసుకెళ్లింది. వీరి నియామకాలు కోల్‌కతలో 28 శాతం, పుణే 22, హైదరాబాద్‌లో 19 శాతం అధికం అయ్యాయి. 16 ఏళ్లకుపైబడి నైపుణ్యం ఉన్న సీనియర్లకు డిమాండ్ 30 శాతం ఎక్కువగా ఉంది. ఫ్రెష్ గ్రాడ్యుయేట్లు, 4–7 ఏళ్ల అనుభవం ఉన్న నిపుణుల డిమాండ్ క్షీణించింది. నియామకాలు చమురు, సహజవాయువు రంగాల్లో 20 శాతం, బీమా 13, బ్యాంకింగ్ 11 శాతం వృద్ధి చెందాయి. వాహన పరిశ్రమలో 4 శాతం, ఫార్మా రంగంలో ఇది 3 శాతంగా ఉంది. మెట్రోయేతర నగరాల్లో అహ్మదాబాద్ 28 శాతం వృద్ధితో ముందంజలో ఉంది. ఈ నగరాల్లో బ్యాంకింగ్, వాహన, బీమా రంగాలు ప్రధాన పాత్ర పోషించాయి’ అని నివేదిక వివరించింది. -
మూడేళ్ల సీక్రెట్ బయటపడింది.. స్వయంగా ఆర్డర్లు డెలివరీ చేస్తున్న సీఈఓ!
కంపెనీ యజమాని స్వయంగా వర్కర్లా మారి పని చేయడం లాంటి ఘటనలు మనం సినిమాల్లో చూసే ఉంటాం. అయితే రీల్‌పై ఇలాంటివి సాధ్యమే గానీ రియల్ లైఫ్‌లో ఇలాంటివి చాలా అరుదనే చెప్పాలి. కానీ ఓ కంపెనీ సీఈవో స్థాయిలో ఉంటూ సాధారణ డెలివరీ బాయ్‌గా సేవలు అందించారు జొమాటో సీఈఓ దీపిందర్ గోయల్. అది కూడా ఒకటి, రెండు సార్లు కాదండోయ్, గత మూడు సంవత్సరాలుగా అప్పుడప్పుడు ఆయన ఇలా డెలివరీ బాయ్‌లా మారి కస్టమర్లకు సర్వీస్ అందిస్తున్నాడట. వినడానికి ఆశ్చర్యంగా విన్నా ఇది నిజమే! ఈ విషయాన్ని నౌకరీ.కామ్ వ్యవస్థాపకుడు సంజీవ్ బిక్చందానీ తెలిపారు. దీని వెనుక అసలు మ్యాటర్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ఇలా వెలుగోలోకి వచ్చింది! దీపిందర్ గోయల్ సాధారణ జొమాటో డెలివరీ బాయ్ లాగా ఎర్ర టీషర్డ్ వేసుకుని ఆర్డర్లు డెలివరీ చేస్తున్నారని నౌకరీ.కామ్ వ్యవస్థాపకుడు సంజీవ్ బిక్చందానీ తన ట్వీట్టర్ ఖాతాలో వెల్లడించారు. అంతేకాకుండా ఆ ట్వీట్లో.. కంపెనీలోని సీనియర్ మేనేజర్లు సైతం ఈ ట్రెండ్‌నే ఫాలో అవుతారని తెలిపారు. మోటార్ సైకిల్‌పై తాను ఆర్డర్లు డెలివరీ చేస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఎవరూ గుర్తించలేదని జోమోటో సీఈఓ దీపిందర్ చెప్పినట్లు ఆ ట్వీట్లో ప్రస్థావించారు. సీక్రెట్‌గా మూడు నెలలకొక సారి.. ఒక స్టార్టప్ కంపెనీగా మార్కెట్లో వచ్చిన జొమోటో, అనతి కాలంలోనే తన కస్టమర్ల సంఖ్యను లక్షల నుంచి కోట్లకు మార్చుకుని తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. అయితే కంపెనీ స్టార్ట్ చేయడం, ఉన్నత స్థానానికి తీసుకెళ్లడం ఎంత ముఖ్యమో ఆ తర్వాత ఆ స్థానాన్ని, కస్టమర్ల నమ్మకాన్ని, మార్కెట్లో ఉన్న కంపెనీ విలువలను కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. పైగా ఏ కంపెనీకైనా కస్టమర్లకు అనుగుణంగా సేవలను అందించేందుకు ప్రాముఖ్యతనిస్తుంది. ఈ క్రమంలోనే అసలు మార్కెట్లో కస్టమర్లు ఏమి కోరుకుంటున్నారు, క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఎలా ఉంటాయనే విషయం తెలుసుకోవటం చాలా కీలకమని భావించారు Zomato CEO దీపిందర్ గోయల్. అందుకే ప్రతి మూడు నెలలకు ఒకసారి ఒక రోజంతా డెలివరీ బాయ్‌గా మారి సేవలను అందిస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఆధార్ కార్డ్‌లో ఆ అప్డేట్ చాలా ముఖ్యం, చేయకపోతే చిక్కులు తప్పవ్! -
‘ఇంటి పనే’ ఇద్దాం!
సాక్షి, హైదరాబాద్: దేశంలో ‘వర్క్ ఫ్రం హోం’విధానం కింద ఉద్యోగాలు మూడొంతులు పెరిగాయి. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా పని పద్ధతుల్లో వచ్చిన మార్పుచేర్పులతో దాదాపుగా అన్ని పరిశ్రమలు, సంస్థలు తమ విధానాలు, వ్యూహాలు మార్చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇందుకు తగ్గట్టుగానే భారత్‌లో ఇంటి నుంచి చేసే ఉద్యోగాలు, పనుల్లో కూడా ఒక్కసారిగా వృద్ధి నమోదైంది. దీంతో కోవిడ్‌కు ముందు అంతగా ‘వర్క్ ఫ్రం హోం’పని విధానం పట్ల పెద్దగా ఆసక్తి చూపని కంపెనీలు సైతం ఇప్పుడీ పని పద్ధతిని అనుసరించక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. తాజాగా జాబ్ పోర్టల్ ‘నౌకరీ డాట్కాం’వెలువరించిన నివేదికలో.. కోవిడ్ రాకముందుతో పోల్చితే గత కొన్ని నెలల్లో ఇంటి నుంచి పనిచేసే విధానం కింద మూడు రెట్ల మేర ఎక్కువగా ఉద్యోగాల్లోకి వివిధ కంపెనీలు, సంస్థలు తీసుకున్నట్టు వెల్లడైంది. మార్చి నెలాఖరు నుంచి దేశంలో లాక్డౌన్ విధించిన నేపథ్యంలో ఉద్యోగులను వర్క్ ఫ్రంహోం పద్ధతిలో మినహా పనిచేయించుకోలేని పరిస్థితుల్లో ఈ విధానానికే సంస్థలు ఓటేశాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇంటి నుంచి పనిచేసే పద్ధతికి డిమాండ్ పెరగడం మొదలై, అది క్రమక్రమంగా పెరుగుతూ రావడంతో గతేడాదితో పోల్చితే వర్క్ ఫ్రంహోం జాబ్లిస్టింగ్స్ కూడా నాలుగు రెట్లు పెరిగినట్లు తెలుస్తోంది. అనువుగా లేని ఉద్యోగాలు కూడా.. ఇక నౌకరీ డాట్‌కాంలో గత ఐదు నెలలుగా ఆన్లైన్ సెర్చింగ్‌లో అత్యధికంగా వెతికిన వాటిలో ‘వర్క్ ఫ్రం హోం’కీ వర్డ్.. ‘టాప్ సెర్చ్డ్ కీ వర్డ్’గా నిలిచినట్లు ఈ సంస్థ పేర్కొంది. ఇటు కోవిడ్ పరిణామాలతో రిమోట్ వర్కింగ్ ఉద్యోగాల భర్తీకి వివిధ కంపెనీలు మొగ్గు చూపగా, ప్రస్తుత పరిస్థితుల్లో ‘వర్క్ ఫ్రం హోం’ఉద్యోగాలు కోరుకుంటూ దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య 7 రెట్లు పెరిగినట్లు వెల్లడైంది. గతంలో ఇంటి నుంచి పని చేసే విధానం పరిధిలోకి రాని, అందుకు అనువుగా లేని ఉద్యోగాలు కూడా ఇప్పుడు ఈ విధానంలోకి మారిపోవడం మరో విశేషంగా నిపుణులు అంచనా వేస్తున్నారు. సేల్స్ ప్రొఫెషనల్స్, బిజినెస్ డెవలప్మెంట్, కస్టమర్ కేర్ సపోర్ట్ ఉద్యోగాలు కూడా వర్క్ ఫ్రం హోంలోకి మారిపోతున్నాయి. ప్రధానంగా ఐటీ ఎనెబుల్డ్ సర్వీస్ (ఐటీఈఎస్), బీపీవో రంగాలకు సంబంధించిన ఉద్యోగాలే సగం (50 శాతం) వరకు ఉంటున్నట్టు, ఐటీ–సాఫ్ట్వేర్, ఎడ్యుకేషన్/టీచింగ్, ఇంటర్నెట్/ఈ–కామర్స్ వంటి నాలుగో వంతు (25 శాతం) ఉన్నట్టుగా నౌకరీ.కామ్ నివేదికలో వెల్లడైంది. -
ఉద్యోగుల తొలగింపుపై నౌక్రి.కామ్ సర్వే
న్యూఢిల్లీ: కోవిడ్-19ను ఎదుర్కొనేందుకు దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమలవుతున్న క్రమంలో కొన్ని ఐటీ కంపెనీ యాజమాన్యాలు ఉద్యోగులను తొలగిస్తామని ప్రకటించాయి. ఉద్యోగుల తొలగింపు ఊహాగానాల నేపథ్యంలో ప్రముఖ ఉద్యోగ కల్పన సైట్ నౌక్రి.కామ్ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో 50,000 మంది పాల్గొన్నారు. సర్వేలో పాల్గొన్న 60 శాతం మంది వ్యక్తులు ఉద్యోగుల ఉద్వాసనకు సంబంధించి స్పష్టమైన అభిప్రాయాన్ని తెలపలేదు. కాగా 40 శాతం మంది మాత్రం కంపెనీలు ఉద్యోగులను తొలగించే అవకాశం లేదని తెలిపారు. సర్వేలో పాల్గోన్న 50 శాతం మంది నైపుణ్యాలను పెంచుకునేందుకు ఉపయోగించుకున్నామని తెలిపారు. మరో 50 శాతం మంది తమకున్న ప్రత్యేక నేపుణ్యలపై శ్రద్ధ పెడతున్నామని తెలిపారు. కాగా ఐటీ, ఫార్మా, ఆరోగ్య రంగాలపై కోవిడ్ ఏ మాత్రం ప్రభావం చూపదని 29 శాతం మంది వ్యక్తులు అభిప్రాయపడ్డారు. మెరుగైన విద్యను అభ్యసించాలని 70శాతం వ్యక్తులు తెలిపగా. ఉద్యోగుల జీత భత్యాలలో కోత విధిస్తారని 16 శాతం వ్యక్తులు అభిప్రాయపడ్డారు. జీతాల చెల్లింపుల్లో ఏ మాత్రం పెంపుదల ఉండదని 63 శాతం మంది వ్యక్తులు పేర్కొన్నారు. చదవండి: నియామకాలపై కోవిడ్-19 ఎఫెక్ట్ -
ఐటీ డౌన్.. ఆటోమొబైల్ అప్..
సాక్షి, సిటీబ్యూరో : కొలువుల జాతరలో ఐటీ స్పీడుకు బ్రేకులు పడ్డాయి. ఆటోమొబైల్ రంగం రయ్‌న దూసుకుపోతోంది. పలు మెట్రో నగరాల్లో ఆటోమొబైల్, టెలికాం, నిర్మాణ రంగాల్లో ఉపాధి, ఉద్యోగ అవకాశాల జోరు ఊపందుకున్నట్లు నౌక్రి డాట్‌కామ్ తాజా నివేదికలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా ఉపాధి, ఉద్యోగ కల్పనలో వృద్ధిరేటు 21శాతంగా నమోదైంది. జూన్ వరకు మెట్రో నగరాల్లో వృద్ధిరేటును పరిశీలిస్తే వివిధ రంగాల్లో ఉపాధి కల్పనలో 38శాతంతో కోల్‌కతా అగ్రభాగాన నిలిచింది. 15శాతం వృద్ధిరేటుతో ఢిల్లీ రెండో స్థానంలో, 14శాతంవృద్ధిరేటుతో ముంబై మూడో స్థానంలో నిలిచాయి. ఇక 13శాతం వృద్ధిరేటుతో హైదరాబాద్, చెన్నై సరిపెట్టుకోవాల్సి వచ్చిందని నౌక్రి డాట్‌కామ్ ఆన్లైన్ జాబ్ పోర్టల్ అర్ధ వార్షిక నివేదికలో స్పష్టమైంది. గ్రేటర్ పరిధిలో ఐటీ రంగంలో కేవలం 2శాతమే వృద్ధి నమోదైంది. కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బిగ్ డేటా అనలిటిక్స్ తదితర మాధ్యమాలపై పనిచేసే వారికి కొలువుల అవకాశాలు బాగానే ఉన్నట్లు ఈ నివేదిక తెలిపింది. ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే గ్రేటర్లో ఐటీ రంగంలో కొలువు జోరు కాస్త మందగించినట్లు ఈ రంగం నిపుణులు వెల్లడిస్తున్నారు. కాగా గ్రేటర్ కేంద్రంగా బహుళ జాతి దేశీయ దిగ్గజ సంస్థలకు చెందిన సుమారు 1,000 సాఫ్ట్వేర్ కంపెనీల బ్రాంచీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఆయా కంపెనీల్లో సుమారు 6లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. అయితే ఆయా కంపెనీల విస్తరణ ప్రణాళికలు ప్రతి ఏటా ఆశించిన మేరకు అమలు కాకపోవడం, కొత్త ప్రాజెక్టులు చేజిక్కకపోవడం, అంతర్జాతీయంగా మార్కెట్ ఆశించిన స్థాయిలో లేకపోవడం తదితర కారణాలతో కొలువుల్లో మందగమనం నమోదైనట్లు ఐటీ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వ సౌజన్యంతో గ్రేటర్లో నిర్మించ తలపెట్టిన ఐటీఐఆర్ ప్రాజెక్టు నాలుగేళ్లుగా సాకారం కాకపోవడం, దీనికి తాజా బడ్జెట్లో కేంద్రం నిధులు కేటాయించకపోవడం కూడా ఐటీ రంగం వృద్ధికి ప్రతిబంధకంగా మారిందంటున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఐటీ, హార్డ్‌వేర్ పాలసీ, టీఎస్ఐపాస్లతో ఐటీ, పారిశ్రామిక రంగాలు ఇప్పుడిప్పుడే పురోగమిస్తున్నాయని... త్వరలో ఆయా రంగాల్లో క్రమంగా వృద్ధి నమోదవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ రంగాల్లో కొలువుల జోష్... ♦ దేశంలోని పలు మెట్రో నగరాల్లో ఆటోమొబైల్,టెలికాం, నిర్మాణరంగంతో పాటు పలు ఇంజినీరింగ్ విభాగాల్లో కొలువుల జోష్ కనిపించినట్లు నివేదిక పేర్కొంది. వివిధ రంగాల వారీగా వృద్ధి ఇలా... ♦ ఐటీ రంగంలో కేవలం 2 శాతమే వృద్ధినమోదైంది. ♦ ఆటోమొబైల్ రంగంలో 31శాతం వృద్ధి నమోదైంది. ♦ నిర్మాణ రంగంలో 21శాతం పురోగతి. ♦ ఫార్మా రంగంలో 18శాతం వృద్ధి. ♦ టెలికాం రంగంలో 25శాతం నమోదు ♦ నిత్యావసరాల అమ్మకం (ఎఫ్ఎంసీజీ) విభాగంలో 21 శాతం. ♦ బిజినెస్‌ప్రాసెస్ ఔట్సోర్సింగ్ (బీపీఓ)లో 18 శాతం వృద్ధి నమోదైంది. ఉద్యోగ కల్పనలో వృద్ధి ఇలా... మెట్రో నగరం వృద్ధిశాతం కోల్‌కతా 38 ఢిల్లీ 15 ముంబై 14 హైదరాబాద్ 13 చెన్నై 13 -
జోరుగా నియామకాలు
న్యూఢిల్లీ: ఉద్యోగావకాశాలు మెరుగుపడుతున్న దానికి సూచనగా నియామకాలు గణనీయంగా పెరుగుతున్నాయి. నౌకరీడాట్‌కామ్ నివేదిక ప్రకారం మే నెలలో రిక్రూట్మెంట్స్ 11% పెరిగాయి. కంపెనీ నిర్వహించే జాబ్‌స్పీక్ సూచీ గతేడాది మేలో 1,904 పాయింట్లుగా ఉండగా.. ఈసారి మేలో 11% వృద్ధితో 2,106 పాయింట్లుగా నమోదైంది. ఏప్రిల్‌లో నియామకాల వృద్ధి 21%గా ఉన్నట్లు నౌకరీడాట్‌కామ్ చీఫ్ సేల్స్ ఆఫీసర్ వి.సురేశ్ వెల్లడించారు.ఆటోమొబైల్, ఆటోమొబైల్ విడిభాగాలు, నిర్మాణ, ఇంజినీరింగ్, ఎఫ్ఎంసీజీ తదితర రంగాల్లో అత్యధికంగా నియామకాలు జరుగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. నిపుణులకు డిమాండ్ పెరుగుతుండటం .. ఉద్యోగావకాశాలు మెరుగుపడుతున్నాయనడానికి స్పష్టమైన సూచనగా సురేశ్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో 13 శాతం .. నగరాలవారీగా చూస్తే ఢిల్లీలో అత్యధికంగా 15 శాతం, ముంబైలో 14% నియామకాలు పెరిగాయి. హైదరాబాద్, చెన్నైలలో ఇది 13 శాతంగా ఉంది. బెంగళూరులో ఒక మోస్తరుగా 3 శాతం వృద్ధి నమోదైంది. లో బేస్ కారణంగా కోల్‌కతా మాత్రం అత్యధికంగా 38 శాతం వృద్ధి కనపర్చింది. నెలలవారీగా తమ వెబ్సైట్లో నమోదయ్యే జాబ్ లిస్టింగ్స్ ఆధారంగా నౌకరీడాట్‌కామ్ ఈ సూచీ నిర్వహిస్తోంది. ఇందుకోసం 1,000 పాయింట్ల ప్రారంభ స్కోరుతో 2008 జూలైని బేస్ ఇయర్‌గా పరిగణిస్తుంది. ఆటో, నిర్మాణ, ఎఫ్ఎంసీజీల్లో జోరు: రంగాలవారీగా చూస్తే ఆటోమొబైల్, అనుబంధ సంస్థల్లో నియామకాలు వార్షికంగా 31 శాతం పెరిగాయి. నిర్మాణ, ఇంజనీరింగ్‌లో 21 శాతం మేర వృద్ధి చెందాయి. అనుభవం కోణంలో చూస్తే ఫ్రెషర్స్‌కి ఉద్యోగావకాశాలు స్థిరంగా 15 శాతం మేర పెరిగాయి. మిడ్ లెవెల్ మేనేజ్మెంట్ ఉద్యోగుల (4–7 ఏళ్ల అనుభవం) నియామకాలు 11 శాతం పెరిగాయి. ఇక సబ్ సీనియర్ (8–12 ఏళ్లు), టాప్ మేనేజ్మెంట్ (16 ఏళ్ల పైగా అనుభవం) పోస్టుల్లో హైరింగ్ 5 శాతం మేర వృద్ధి నమోదైంది. -
ఐటీ ఇండస్ట్రిలోనే భారీగా పతనం
న్యూఢిల్లీ : ఐటీ ఇండస్ట్రిలో ఇటీవల నెలకొన్న ఉద్యోగులపై ఉద్వాసన వేటు తెలిసిందే. ఇటు ఉద్యోగుల కోత మాత్రమే కాక, అటు ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల నియామకం కూడా భారీగా పతనమవుతోంది. ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఐటీ ఇండస్ట్రిలో ఉద్యోగుల నియామకం 24 శాతం పడిపోయినట్టు నౌకరి.కామ్ తాజా సర్వేలో తెలిసింది. మొత్తంగా కొత్త ఉద్యోగాల కల్పన 11 శాతం పడిపోగా.. దానిలో ఎక్కువగా ఐటీ ఇండస్ట్రీలోనే క్షీణించినట్టు తాజా సర్వే పేర్కొంది. గతేడాది కంటే ఈ ఏడాదిలో 24 శాతం పడిపోయినట్టు నౌకరి జాబ్ సీక్ ఇండెక్స్ నివేదించింది. మేజర్ మెట్రోలు ఢిల్లీ/ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు, చెన్నైలోనే ఏడాది ఏడాదికి ఉద్యోగుల కల్పన తగ్గిపోయినట్టు ఈ ఇండెక్స్ పేర్కొంది. టెలికాం, బీపీఓ, ఇన్సూరెన్స్, నిర్మాణ రంగాల్లో ఈ క్షీణత ఎక్కువగా కనబడుతుందని తెలిపింది. కీలక పరిశ్రమలు నిర్మాణం, బీపీఓలలో 10 శాతం, 12 శాతం ఉద్యోగుల నియామకం పడిపోగా, బ్యాంకింగ్ సెక్టార్ లో 11 శాతం తగ్గిపోయింది. జాబ్ మార్కెట్ ప్రస్తుతం అనిశ్చిత పరిస్థితుల్లో కొనసాగుతుందని, ఏప్రిల్ నెలలో ఈ నెగిటివ్ వృద్ధి 11 శాతం నమోదైనట్టు పేర్కొంది. మరి కొన్ని నెలల పాటు మార్కెట్లో ఇదే పరిస్థితి కొనసాగనుందని ఈ ఇండెక్స్ తెలిపింది. ఎనిమిది మెట్రోల్లో ఆరు మెట్రోల్లో పరిస్థితి దారుణంగా ఉందని ఈ ఇండెక్స్ రిపోర్టు తెలిపింది. -
సెప్టెంబర్‌లో నియామకాల వృద్ధి 18 శాతం: నౌకరీ
న్యూఢిల్లీ: నియామకాల జోరు కొనసాగుతోంది. నియామకాల వృద్ధి సెప్టెంబర్ నెలలో 18 శాతంగా నమోదైంది. టెలికం, బ్యాంకింగ్, సాఫ్ట్వేర్ సర్వీసెస్ రంగాల్లో నియామకాల వృద్ధి అధికంగా ఉంది. హైదరాబాద్‌లో నియామకాల వార్షిక వృద్ధి 25 శాతంగా నమోదైంది. రానున్న కాలంలో నియామకాల జోరు మరింత పెరిగే అవకాశముందని నౌకరీ.కామ్ పేర్కొంది. గతేడాది సెప్టెంబర్ నెలతో పోలిస్తే ఈ ఏడాది అదే నెలలో నౌకరీ జాబ్ ఇండెక్స్ 18 శాతం వృద్ధితో 1,796కు పెరిగింది. వార్షిక ప్రాతిపదికన చూస్తే.. టెలికం, ఎంటర్టైన్మెంట్, మీడియా, ఐటీ, ఐటీఈఎస్, వాహన రంగ నియామకాల్లో స్థిర వృద్ధి నమోదు అయ్యిందని నౌకరీ.కామ్ చీఫ్ సేల్స్ ఆఫీసర్ వి. సురేశ్ తెలిపారు. పట్టణాల వారీగా చూస్తే.. ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో నియామకాల వార్షిక వృద్ధి అత్యధికంగా 29 శాతంగా నమోదైంది. -
కొత్త ఉద్యోగాలకు ఎన్నికల జోష్
సుస్థిర ప్రభుత్వం వస్తే 20 లక్షల కొత్త కొలువులు న్యూఢిల్లీ: ఎన్నికల అనంతరం స్థిరమైన ప్రభుత్వం ఏర్పడితే, 20 లక్షల కొత్త ఉద్యోగాలొస్తాయని ఉద్యోగ నియామక సంస్థలు ఆశిస్తున్నాయి. దీంతో ఈ ఏడాది హైరింగ్ కార్యకలాపాలు 30-40 శాతం వృద్ధి చెందుతాయని ఆయా సంస్థలు అంచనా వేస్తున్నాయి. టీమ్‌లీజ్, గ్లోబల్‌హంట్, మాన్‌స్టర్‌డాట్‌కామ్, నౌకరీ డాట్‌కామ్ వంటి సంస్థలు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది భారత కంపెనీలకు 12-14 లక్షల మంది కొత్త ఉద్యోగులు అవసరం. ఎన్నికల తర్వాత సుస్థిర సర్కారు ఏర్పాటైతే, పెట్టుబడులు పెరిగి.. ఆర్థిక వృద్ధి జోరందుకుంటుంది. 20 లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలొస్తాయి. గత ఏడాది వివిధ రంగాల్లో 10 లక్షల కొత్త ఉద్యోగాలొచ్చాయి. అయితే బలహీనంగా ఉన్న ఆర్థిక పరిస్థితుల కారణంగా భారీ సంఖ్యలోనే ఉద్యోగాలు కూడా పోయాయి. ఎన్నికల కారణంగా ఇప్పటికే మీడియా, పబ్లిక్ రిలేషన్స్, ఈవెంట్ మేనేజ్మెంట్, సోషల్ మీడియా రంగాల్లో ఉద్యోగాల వృద్ధి కనిపిస్తోంది. అయితే, ఇవన్నీ తాత్కాలిక ఉద్యోగాలే. ఎన్నికల ఫలితాలనుబట్టి దీర్ఘకాలిక ఉద్యోగవకాశాలుంటాయి. -
ఉద్యోగాలు పెరుగుతాయ్..
న్యూఢిల్లీ: ఈ ఏడాది భారత్‌లో ఉద్యోగ నియామకాలు మెరుగుపడతాయని ప్రముఖ జాబ్ పోర్టల్ నౌకరీడాట్‌కామ్ తెలిపింది. ఐటీ, ఐటీఈఎస్ రంగాల్లో జోరు దీనికి కారణం కానున్నదని వివరిం చింది. గత ఏడాది నవంబర్లోలాగానే గత నెలలో కూడా ఉద్యోగ నియామక కార్యకలాపాలు ఉన్నాయని వివరించింది. హైదరాబాద్, ఢిల్లీలో హైరింగ్ కార్యకలాపాలు గరిష్టంగా మెరుగుపడ్డాయంటున్న ఈ సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం..., ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నందున కంపెనీలు విస్తరణ కార్యకలాపాలు చేపడుతాయి. ఫలితంగా కొత్త కొలువులు పెరుగుతాయి. ఆన్లైన్ ద్వారా నెలవారీ హైరింగ్ కార్యకలాపాలను ట్రాక్ చేసే నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ గతేడాది డిసెంబర్లో 1,296 పాయింట్లకు చేరింది. 2012, డిసెంబర్‌తో పోల్చితే ఇది 13 శాతం అధికం. అయితే గతేడాది నవంబర్‌తో పోల్చితే మాత్రం ఎలాంటి మార్పు లేదు. బీపీవో హైరింగ్ 33% పెరిగింది. ఫార్మా(16%), టెలికాం (7%) చొప్పున వృద్ధి చెందాయి. ఐటీ, బీపీవో, ఫైనాన్స్ రంగాల్లో డిమాండ్ పెరగ్గా, బ్యాంకింగ్, బీమా, సరఫరా చెయిన్ మేనేజ్మెంట్లో ఉద్యోగాలు తగ్గాయి. ఇక హైదరాబాద్, ఢిల్లీ నగరాల్లో హైరింగ్ కార్యకలాపాలు బాగా మెరుగుపడగా, చెన్నైలో మాత్రం 4 శాతం తగ్గాయి.