కొత్త ఉద్యోగాలకు ఎన్నికల జోష్
సుస్థిర ప్రభుత్వం వస్తే 20 లక్షల కొత్త కొలువులు
న్యూఢిల్లీ: ఎన్నికల అనంతరం స్థిరమైన ప్రభుత్వం ఏర్పడితే, 20 లక్షల కొత్త ఉద్యోగాలొస్తాయని ఉద్యోగ నియామక సంస్థలు ఆశిస్తున్నాయి. దీంతో ఈ ఏడాది హైరింగ్ కార్యకలాపాలు 30-40 శాతం వృద్ధి చెందుతాయని ఆయా సంస్థలు అంచనా వేస్తున్నాయి. టీమ్‌లీజ్, గ్లోబల్‌హంట్, మాన్‌స్టర్‌డాట్‌కామ్, నౌకరీ డాట్‌కామ్ వంటి సంస్థలు వెల్లడించిన వివరాల ప్రకారం..
ఈ ఏడాది భారత కంపెనీలకు 12-14 లక్షల మంది కొత్త ఉద్యోగులు అవసరం.
ఎన్నికల తర్వాత సుస్థిర సర్కారు ఏర్పాటైతే, పెట్టుబడులు పెరిగి.. ఆర్థిక వృద్ధి జోరందుకుంటుంది. 20 లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలొస్తాయి.
గత ఏడాది వివిధ రంగాల్లో 10 లక్షల కొత్త ఉద్యోగాలొచ్చాయి. అయితే బలహీనంగా ఉన్న ఆర్థిక పరిస్థితుల కారణంగా భారీ సంఖ్యలోనే ఉద్యోగాలు కూడా పోయాయి.
ఎన్నికల కారణంగా ఇప్పటికే మీడియా, పబ్లిక్ రిలేషన్స్, ఈవెంట్ మేనేజ్‌మెంట్, సోషల్ మీడియా రంగాల్లో ఉద్యోగాల వృద్ధి కనిపిస్తోంది. అయితే, ఇవన్నీ తాత్కాలిక ఉద్యోగాలే. ఎన్నికల ఫలితాలనుబట్టి దీర్ఘకాలిక ఉద్యోగవకాశాలుంటాయి.