Teamlease
-
ఆరోగ్య రంగంలో అధిక నియామకాలు
ముంబై: దేశ ఆరోగ్య సంరక్షణ రంగంలో నియామకాలు పెరగనున్నాయని టీమ్‌లీజ్ ఎడ్టెక్ తెలిపింది. ఈ రంగంలో 47 శాతం సంస్థలు నియామకాల పట్ల సానుకూలంగా ఉన్నట్టు తెలిపింది. అత్యాధునిక టెలీహెల్త్ సేవల విస్తరణ, ముందస్తు వ్యాధి నివారణ సేవలకు పెరుగుతున్న ఆదరణతో ఈ రంగంలో ఉపాధి అవకాశాలు విస్తరించనున్నట్టు పేర్కొంది.ఈ రంగంలోని కీలక పోస్ట్‌లకు ఢిల్లీ, చైన్నై నగరాల్లో ఎక్కువ డిమాండ్ ఉన్నట్టు తెలిపింది. రీసెర్చ్ అసోసియేట్ ఉద్యోగాలకు ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్ కేంద్రాలుగా అవతరించాయని, వైద్య పరిశోధన, అనుబంధ క్లినికల్ పరీక్షలు, డేటా నిర్వహణ విధులు ఇందులో కీలకమని పేర్కొంది. ‘‘వ్యాధులు వచ్చిన తర్వాత వాటికి చికిత్సలు తీసుకోవడం కంటే, అవి రాక ముందే రక్షణ చర్యలు తీసుకోవడానికి ప్రాధాన్యం పెరిగింది. ఎన్నో అంశాల కారణంగా ఈ రంగంలో నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది’’అని టీమ్‌లీజ్ ఎడ్టెక్ వ్యవస్థాపకుడు, సీఈవో శంతను రూజ్ అన్నారు. ఆన్లైన్ వైద్య సేవలకు డిమాండ్‘‘వృద్ధ జనాభా పెరుగుదల, దీర్ఘకాలిక అనారోగ్యాలు నిరంతరం వైద్య సహకారం, వినూత్నమైన చికిత్సల అవసరాన్ని తెలియజేస్తున్నాయి. అత్యాధునిక టెక్నాలజీతో దాదాపు అన్ని రంగాల్లోనూ పెద్ద ఎత్తున మార్పులు కనిపిస్తున్నాయి. కానీ, ఆరోగ్య సంరక్షణ రంగం వినూత్నంగా నిలుస్తోంది. కరోనా తర్వాత నుంచి వర్చువల్ కన్సల్టేషన్ (ఆన్లైన్లో వైద్య సలహా), రిమోట్ హెల్త్‌కేర్ సేవలు సాధారణంగా మారిపోయాయి’’అని శంతను రూజ్ తెలిపారు. నర్సింగ్ అసిస్టెంట్లకు హైదరాబాద్, చండీగఢ్, గురుగ్రామ్‌లో ఎక్కువ డిమాండ్ నెలకొన్నట్టు టీమ్‌లీజ్ ఎడ్టెక్ నివేదిక తెలిపింది.వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించే మెడికల్ ల్యాబరేటరీ టెక్నీషియన్లకు ముంబై, హైదరాబాద్, ఇండోర్‌లో ఎక్కువ డిమాండ్ ఉంది. డయాగ్నోస్టిక్స్ సేవల విస్తరణ, ఇంటర్నెట్ సాయంతో మారుమూల ప్రాంతాల నుంచే వైద్య సహకారం పొందడం వంటివి ఈ రంగంలో ఉపాధి అవకాశాలను పెంచుతున్నట్టు రూజ్ తెలిపారు. ల్యాబ్ టెక్నిక్, డయాగ్నోస్టిక్స్ టెస్టింగ్, క్లినికల్ ట్రయల్స్, రోగుల సంరక్షణ, డేటా అనలైసిస్లో నైపుణ్యాలున్న వారిని నియమించుకునేందుకు కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నట్టు చెప్పారు. -
కార్మికశాఖ ఒప్పందం.. 5 లక్షల మందికి ప్రయోజనం
న్యూఢిల్లీ: మరింత మందికి ఉపాధి అవకాశాలు కల్పించే లక్ష్యంతో కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ, మానవ వననరుల సేవలను అందించే టీమ్‌లీజ్ ఎడ్టెక్ చేతులు కలిపాయి. యూనివర్సిటీ విద్యార్థులకు నూతన కెరీర్ అవకాశాలు కల్పించేందుకు వీలుగా అవగాహన ఒప్పందం కుదిరింది.ఉపాధి ఆధారిత డిగ్రీ కార్యక్రమాలను ఆఫర్ చేయనున్నట్టు టీమ్‌లీజ్ ఎడ్టెక్ ప్రకటించింది. కేంద్ర ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ కెరీర్ సర్వీస్(ఎన్సీసీ) పోర్టల్‌పై 200 వరకు ఉపాధి ఆధారిత డిగ్రీ పోగ్రామ్‌లను అందించనున్నట్టు తెలిపింది. ప్రతి ప్రోగ్రామ్ విడిగా 5 లక్షల మందికి పైగా ఇంటర్న్‌షిప్ అవకాశాలతో అధ్యయన అవకాశాలు కల్పించనుంది.ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాండవీయ మాట్లాడుతూ.. టీమ్‌లీజ్ సహకారంతో అందించే డిగ్రీ ప్రోగ్రామ్‌లు అభ్యాసంతోపాటు, ప్రత్యక్ష అనుభవాన్ని సమన్వయం చేస్తుందని, యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. -
బీఎఫ్ఎస్ఐలో జోరుగా నియామకాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పండుగ సీజన్ నేపథ్యంలో ఆర్థిక లావాదేవీలు, కొనుగోళ్లు గణనీయంగా పెరుగుతున్నాయి. గడిచిన నాలుగు నెలలుగా వ్యక్తిగత రుణాలతో పాటు టూవీలర్లు, కార్లు మొదలైన వాహన రుణాలకు డిమాండు 12 శాతం పెరిగింది. ఈ నేపథ్యంలో సెపె్టంబర్లో వినాయక చవితితో మొదలై నవంబర్ వరకు కొనసాగే పండుగల సీజన్లో కార్యకలాపాలను సమర్ధమంతంగా నిర్వహించుకునేందుకు బీఎఫ్ఎస్ఐ (బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా) సంస్థలు మరింతగా దృష్టి పెడుతున్నాయి. ఆర్థిక సంస్థలు ఈ బిజీ వ్యవధిలో కస్టమర్లకు మెరుగైన సరీ్వసులు అందించగలిగే, డిజిటల్ బ్యాంకింగ్ కార్యకలాపాలు నిర్వహించగలిగే నైపుణ్యాలున్న సిబ్బందిని రిక్రూట్ చేసుకుంటున్నాయి. స్టాఫింగ్ సేవల సంస్థ టీమ్‌లీజ్ నివేదిక ప్రకారం బీఎఫ్ఎస్ఐ రంగంలో రిటైల్ రుణాలు, సూక్ష్మ రుణాల సంస్థలు (ఎంఎఫ్ఐ), పేమెంట్ సేవల విభాగాల్లో భారీగా ఉద్యోగావకాశాలు ఉంటున్నాయి. పండుగ సీజన్ దన్నుతో జూలై–నవంబర్ మధ్య కాలంలో ఈ విభాగాల్లో కొలువులు సంఖ్య 12,000 నుంచి 19,000కు పెరిగే అవకాశం ఉందని టీమ్‌లీజ్ పేర్కొంది. అందరినీ ఆర్థిక సేవల పరిధిలోకి తేవడం, చిన్న మొత్తాల్లో రుణాలివ్వడంపై మైక్రోఫైనాన్స్ ప్రధానంగా దృష్టి పెడుతుండటంతో ఎంఎఫ్ఐ సరీ్వసులకు డిమాండ్ 25 శాతం పెరుగుతుందని తెలిపింది. అలాగే, పేమెంట్ సరీ్వసుల్లో హైరింగ్ 41 శాతం పెరుగుతుందని, క్రెడిట్ కార్డుల విభాగంలో జాబ్ ఓపెనింగ్స్ 32 శాతం పెరుగుతాయని టీమ్‌లీజ్ వివరించింది. కొత్త నైపుణ్యాల్లో సిబ్బందికి శిక్షణ .. ఆర్థిక సేవల సంస్థలు కేవలం సిబ్బంది సంఖ్యను పెంచుకోవడమే కాకుండా బిజీ సీజన్లో మార్కెట్ డిమాండ్‌కి తగ్గ సేవలందించేలా ప్రస్తుత ఉద్యోగులకు కూడా కొత్త నైపుణ్యాల్లో శిక్షణనివ్వడంపైనా దృష్టి పెడుతున్నాయి. ‘‘ఎప్పుడైనా సరే పండుగ సీజన్లో బీఎఫ్‌ఎస్‌ఐపై అధిక ఒత్తిడి ఉంటుంది. అయితే, ఈ ఏడాది నిపుణులైన ఉద్యోగులకు డిమాండ్ అసాధారణంగా పెరిగింది. రిటైల్ రుణాల నుంచి పేమెంట్ సేవల వరకు ఈ పరిశ్రమలో వేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. మా డేటా ప్రకారం కంపెనీలు కూడా పరిస్థితులకు తగ్గట్లే స్పందిస్తున్నాయి. కీలకమైన ఈ సీజన్లో నిరంతరాయ సేవలు అందించేందుకు సిబ్బందిని పెంచుకుంటున్నాయి. అలాగే ఉద్యోగులకు కొత్త నైపుణ్యాల్లో శిక్షణ కల్పించడంపై దృష్టి పెడుతున్నాయి’’ అని టీమ్‌లీజ్ సర్వీసెస్ వీపీ కృషే్ణందు చటర్జీ తెలిపారు. -
ఆతిథ్య రంగంలో కొలువుల మేళా!
ముంబై: ఆతిథ్య రంగం నిపుణుల కొరతను ఎదుర్కొంటోందని, దీంతో వచ్చే కొన్నేళ్లలో 10 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. కరోనా అనంతరం ఆతిథ్య పరిశ్రమలో డిమాండ్‌కు అనుగుణంగా కొత్త సామర్థ్యాలు పెద్ద ఎత్తున ఏర్పాటు కావడం నిపుణుల కొరతకు కారణంగా పేర్కొంటున్నారు. ప్రస్తుతం పరిశ్రమవ్యాప్తంగా డిమాండ్–సరఫరా మధ్య అంతరాయం 55–60 శాతంగా ఉంటుందని ర్యాండ్‌స్టాడ్ ఇండియా డైరెక్టర్ సంజయ్ శెట్టి తెలిపారు. కరోనా విపత్తు తర్వాత పరిశ్రమలో బూమ్ (అధిక డిమాండ్) నెలకొందని, వచ్చే కొన్నేళ్ల పాటు ఇదే ధోరణి కొనసాగుతుందన్నారు. కరోనా తర్వాత ఆతిథ్య పరిశ్రమలో నియామకాలు 4 రెట్లు పెరిగిన ట్టు చెబుతున్నారు. ముఖ్యంగా ఆరంభ స్థాయి ఉద్యోగాలకు ఎక్కువ డిమాండ్ ఉన్నట్టు చెప్పారు. నిపుణుల అంతరాన్ని అధిగమించేందుకు ఆతిథ్య కంపెనీలు తమ సిబ్బందికి నైపుణ్య శిక్షణ ఇప్పిస్తున్నట్టు నిపుణులు వెల్లడించారు. పోటీతో కూడిన వేతనాలు ఆఫర్ చేస్తూ ఉన్న సిబ్బందిని కాపాడుకోవడంతోపాటు కొత్త వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నట్టు తెలిపారు. ‘‘2023లో పర్యాటకం, ఆతిథ్య రంగం 11.1 మిలియన్ల మందికి ఉపాధి కల్పించింది. 2024 చివరికి 11.8 మిలియన్ల ఉద్యోగుల అవసరం ఏర్పడుతుంది. ఈ డిమాండ్ 2028 నాటికి 14.8 మిలియన్లకు పెరగొచ్చు. ఏటా 16.5 శాతం వృద్ధికి ఇది సమానం’’అని టీమ్‌లీజ్ బిజినెస్ హెడ్ ధృతి ప్రసన్న మహంత వివరించారు. ప్రస్తుత సిబ్బంది, భవిష్యత్ మానవ వనరుల అవసరాల మధ్య ఎంతో అంతరం కనిపిస్తున్నట్టు టీమ్‌లీజ్ సరీ్వసెస్ వైస్ ప్రెసిడెంట్, స్టాఫింగ్ బిజినెస్ హెడ్ ఎ.బాలసుబ్రమణియన్ సైతం తెలిపారు. నిపుణుల కొరతను అధిగమించేందుకు హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రత్యేక టాస్‌్కఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. అప్రెంటిస్షిప్ల ద్వారా నిపుణుల కొరతను తీర్చుకునేందుకు ఈ టాస్‌్కఫోర్స్ కృషి చేస్తోంది. -
ప్రపంచం చూపు.. భారత్ వైపు..!
ప్రపంచంలోని చాలా దేశాల్లో వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. భవిష్యత్తులో ఇతర దేశాలు శ్రామికశక్తికోసం యువకులు ఎక్కువగా ఉండే భారత్ వంటి దేశాలవైపు చూసే పరిస్థితులు ఏర్పడవచ్చని టీమ్‌లీజ్ డిగ్రీ అప్రెంటిస్‌షిప్ ఉపాధ్యక్షుడు, బిజినెస్ హెడ్ ధృతి ప్రసన్న మహంత ఇటీవల తెలిపారు. ప్రపంచానికి నిపుణులైన కార్మికులను అందించే సత్తా భారత్‌కు ఉందని చెప్పారు. దశాబ్దం క్రితం భారత్ నుంచి ఉపాధి కోసం, ఇతర కారణాల వల్ల కార్మికులు పలు దేశాలకు వలస వెళ్లేవారు. అలాంటిది ప్రస్తుతం పరిస్థితులు మారాయని, ప్రపంచ దేశాలకు నిపుణుల కొరత తీర్చేలా భారత్ సన్నద్ధం అవుతోందని మహంత చెప్పారు. అందులో భాగంగానే ప్రపంచంలోని నిపుణుల కొరత తీర్చడానికి ప్రస్తుతం ఇతర దేశాలకు పయనం అవుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాల్లో వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. అక్కడి శ్రామికశక్తిలో భారత కార్మికులు దాదాపు 15 శాతం ఉండడం గమనార్హం. రానున్న ఐదేళ్లలో భారత కార్మికులు ఇతర దేశాలకు వెళ్లడం 28-30శాతం పెరుగుతుందన్నారు. అంతర్జాతీయంగా ఎక్కువగా ఐటీ, నిర్మాణం, ఆరోగ్య సంరక్షణ, డేటా అనలిటిక్స్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ప్లబింగ్, మెకానిక్, ఆతిథ్యం, సేల్స్ రంగాల్లో నిపుణులకు, కార్మికులకు గిరాకీ ఏర్పడుతుందని అంచనా వేశారు. ఇదీ చదవండి: భారత్‌లో ‘యాపిల్’ ఇళ్ల నిర్మాణం..? భారత్‌లో 15-65 ఏళ్ల వయసు వారు సుమారు 55.4 కోట్ల మంది ఉన్నారని కొన్ని నివేదికల ద్వారా తెలిసింది. యూఏఈ, సౌదీ అరేబియా, ఖతార్, జర్మనీ, నెదర్లాండ్స్, యూకే, స్వీడన్, స్విట్జర్లాండ్, సింగపూర్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా, యూఎస్ఏ, జపాన్, మలేషియా తదితర దేశాల్లో భారతీయ కార్మికులకు గిరాకీ పెరుగుతోందని మహంత చెప్పారు. నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా దాదాపు లక్ష మందికి నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఇటీవలి కాలంలో సౌదీ అరేబియా 13,944 మందిని, ఖతార్ 3,646 మంది, యూఏఈ 2,941 మంది భారత నిపుణులను నియమించుకున్నట్లు పేర్కొన్నారు. -
ఫ్రెషర్లకు పెరిగిన ఉద్యోగ అవకాశాలు
హైదరాబాద్: ఫ్రెషర్లకు ఉద్యోగ అవకాశాలు గతేడాది ద్వితీయ ఆరు నెలల (జూలై–డిసెంబర్) కాలంలో 3 శాతం పెరిగాయి. క్రితం ఏడాది మొదటి ఆరు నెలల్లో ఫ్రెషర్ల నియామకాలు 62 శాతంగా ఉంటే, తర్వాతి ఆరు నెలల్లో 65 శాతంగా ఉన్నట్టు టీమ్‌లీజ్ ఎడ్టెక్ తెలిపింది. కెరీర్ అవుట్‌లుక్ రిపోర్ట్ హెచ్‌వై2, 2023 నివేదికను విడుదల చేసింది. అలాగే అన్ని విభాగాల్లోనూ నియామకాల ఉద్దేశ్యం కూడా 68 శాతం నుంచి 73 శాతానికి పెరిగింది. ఈ స్థిరమైన వృద్ది రానున్న నెలల్లో ఉద్యోగ మార్కెట్ వృద్ధికి, ఫ్రెషర్ల ఉపాధికి దారితీస్తుందని ఈ నివేదిక అంచనా వేసింది. ఫ్రెషర్లకు (విద్య అనంతం ఉపాధి మార్కెట్లోకి వచ్చిన వారు) సంబంధించి అత్యధికంగా నియామకాల ఉద్దేశ్యం ఈ కామర్స్, టెక్నాలజీ స్టార్టప్‌లలో 59 శాతం, టెలీ కమ్యూనికేషన్స్‌లో 53 శాతం, ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాలో 50 శాతం చొప్పున నమోదైంది. కానీ, ఐటీ పరిశ్రమలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి కనిపించింది. ఫ్రెషర్ల నియామక ఉద్దేశ్యం 2023 మొదటి ఆరు నెలల్లో 67 శాతంగా ఉంటే, ద్వితీయ ఆరు నెలల్లో 49 శాతానికి తగ్గింది. అంటే 18 శాతం క్షీణత కనిపించింది. ట్రావెల్, హాస్పిటాలిటీ రంగంలో నియామకాల ధోరణి 5 శాతం పెరిగింది. వీరికి డిమాండ్.. డెవలప్మెంట్ ఆపరేషన్స్ ఇంజనీర్, చార్టర్ అకౌంటెంట్, ఎస్ఈవో అనలిస్ట్, యూఎక్స్ డిజైనర్లకు డిమాండ్ ఎక్కువగా కనిపించింది. ఇతర పట్టణాల కంటే బెంగళూరు ఫ్రెషర్ల నియామకాల పరంగా ముందుంది. నియామకాల ఉద్దేశ్యం 65 శాతంగా నమోదైంది. 2023 మొదటి ఆరు నెలలతో పోలిస్తే ద్వితీయ ఆరు నెలల్లో 10 శాతం తగ్గినప్పుటికీ ముందు స్థానంలో ఉంది. ఆ తర్వాత ముంబైలో 61 శాతం, చెన్నైలో 47 శాతం, ఢిల్లీలో 43 శాతం చొప్పున నమోదైంది. కొత్త నిపుణులకు డిమాండ్ స్వల్పంగా పెరిగింది. వీటిపై దృష్టి పెట్టాలి.. ఫ్రెషర్లు తమ ఉద్యోగార్హతలు పెంచుకునేందుకు వీలుగా కొన్ని కోర్సులకు డిమాండ్ ఉన్నట్టు ఈ నివేదిక వెల్లడించింది. డిజిటల్ మార్కెటింగ్ బిజినెస్ కమ్యూనికేషన్, డేటా సైన్స్, బ్లాక్‌చైన్‌లో సర్టిఫికేషన్, ఆర్టిఫీషియల్ లెన్నింగ్ (ఏఐ), మెషిన్ లెన్నింగ్ (ఎంఎల్)లో పీజీ కోర్స్‌లకు డిమాండ్ ఉందని పేర్కొంది. డిగ్రీ అప్రెంటిస్‌లను నియమించుకునే విషయంలో తయారీ, ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రా, విద్యుత్, ఇంధన రంగాలు టాప్–3గా ఉన్నాయి. -
డిష్మన్- టీమ్‌లీజ్- జూబిలెంట్.. బోర్లా
సరిహద్దు వద్ద చైనాతో వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో దేశీ స్టాక్ మార్కెట్లు నేలచూపులతో కదులుతున్నాయి. సెన్సెక్స్ 220 పాయింట్లు, నిఫ్టీ 55 పాయింట్లు చొప్పున క్షీణించాయి. కాగా.. ఈ ఏడాది తొలి క్వార్టర్లో నిరుత్సాహకర ఫలితాలు ప్రకటించడంతో జూబిలెంట్ లైఫ్ సైన్సెస్ కౌంటర్లో అమ్మకాలు కొనసాగుతున్నాయి. ఈ బాటలో పనితీరు నిరాశపరచడంతో డిష్మన్ కార్బొజెన్ కౌంటర్ సైతం బోర్లా పడింది. మరోపక్క స్కూల్‌గురు ఎడ్యుసర్వ్‌లో మరో 36 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు వెల్లడించడంతో టీమ్‌లీజ్ సర్వీసెస్ కౌంటర్లోనూ ఇన్వెస్టర్లు అమ్మకాలకు ఎగబడుతున్నారు. వెరసి ఈ మూడు కౌంటర్లూ భారీ నష్టాలతో డీలాపడ్డాయి. వివరాలు చూద్దాం.. టీమ్‌లీజ్ సర్వీసెస్ అదనంగా 36.17 శాతం వాటాను సొంతం చేసుకోవడం ద్వారా స్కూల్‌గురు ఎడ్యుసర్వ్‌లో వాటాను 76.37 శాతానికి పెంచుకున్నట్లు టీమ్‌లీజ్ సర్వీసెస్ తాజాగా వెల్లడించింది. దీంతో స్కూల్‌గురును అనుబంధ సంస్థగా మార్చుకున్నట్లు తెలియజేసింది. ఈ నేపథ్యంలో టీమ్‌లీజ్ షేరు తొలుత ఎన్ఎస్ఈలో 8 శాతం దిగజారి రూ. 2,140ను తాకింది. ప్రస్తుతం 5.2 శాతం నష్టంతో రూ. 2172 దిగువన ట్రేడవుతోంది. జూబిలెంట్ లైఫ్ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో కన్సాలిడేటెడ్ నికర లాభం 52 శాతం క్షీణించి రూ. 88 కోట్లకు పరిమితమైన నేపథ్యంలో మూడో రోజూ జూబిలెంట్ లైఫ్ కౌంటర్ బోర్లా పడింది. దీనికితోడు సీఎఫ్‌వో అలోక్ వైష్ పదవికి రాజీనామా చేసినట్లు కంపెనీ తాజాగా పేర్కొంది. రాజీనామాను ఆమోదించినట్లు తెలియజేసింది. దీంతో ఎన్ఎస్ఈలో జూబిలెంట్ లైఫ్ షేరు ప్రస్తుతం 5.2 శాతం క్షీణించి రూ. 711 వద్ద ట్రేడవుతోంది. తొలుత ఒక దశలో రూ. 686 వరకూ జారింది. గత మూడు రోజుల్లో ఈ షేరు 17 శాతం నీరసించడం గమనార్హం! డిష్మన్ కార్బొజెన్ ఈ ఏడాది క్యూ1(ఏప్రిల్-జూన్)లో డిష్మన్ కార్బొజెన్ ఎమిక్స్ రూ. 21.4 కోట్ల నికర నష్టం ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన గతేడాది క్యూ1లో రూ. 34.3 కోట్ల నికర లాభం ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 9 శాతం క్షీణించి రూ. 474 కోట్లకు పరిమితమైంది. ఈ నేపథ్యంలో డిష్మన్ షేరు ఎన్ఎస్ఈలో ప్రస్తుతం 5 శాతం లోయర్ సర్క్యూట్‌ను తాకింది. రూ. 171 దిగువన ఫ్రీజయ్యింది. -
2.76 లక్షల కొత్త కొలువులు
ముంబై: ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలోని తొలి ఆరు నెలల్లో రిటైల్, ఎఫ్ఎంసీజీ (ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్) రంగాల్లో అత్యధికంగా 2.76 లక్షల ఉద్యోగాల కల్పన జరగనుంది. విదేశీ రిటైల్ దిగ్గజాలు ఆయా రంగాల్లోకి పెద్ద యెత్తున విస్తరిస్తుండటమే ఇందుకు కారణం. ఏప్రిల్–సెప్టెంబర్ 2019–20 కాలానికి సంబంధించి ఉద్యోగాల అంచనాల నివేదికలో టీమ్‌లీజ్ సర్వీసెస్ సంస్థ ఈ విషయాలు వెల్లడించింది. దీని ప్రకారం రిటైల్ రంగంలో నికరంగా ఉద్యోగావకాశాలు 2 శాతం పెరిగి అదనంగా 1.66 లక్షల ఉద్యోగాలు రానున్నాయి. ఇక ఎఫ్ఎంసీజీలో 1 శాతం వృద్ధితో 1.10 లక్షల కొత్త ఉద్యోగాలు వస్తాయి. 27,560 ఉద్యోగాలతో ఢిల్లీ రిటైల్ రంగం అగ్రస్థానంలో.. 22,770 కొత్త కొలువులతో బెంగళూరు ఆ తర్వాత స్థానంలో ఉంటాయి. విదేశీ రిటైల్ దిగ్గజాల రాకతో పాటు రిటైల్ రంగం భారీగా వృద్ధి చెందడం, కార్యకలాపాలు విస్తరించడం, కంపెనీల కొనుగోళ్లు జరగడం తదితర అంశాలు ఉపాధి కల్పనకు ఊతంగా నిలుస్తున్నాయని టీమ్‌లీజ్ సర్వీసెస్ పేర్కొంది. ఎఫ్ఎంసీజీలో ముంబై, ఢిల్లీ టాప్.. రిటైల్‌లో కొత్త కొలువులకు ఢిల్లీ, బెంగళూరు అగ్రస్థానాల్లో ఉండగా.. ఎఫ్ఎంసీజీ విభాగంలో ముంబై (14,770 కొత్త ఉద్యోగాలు), ఢిల్లీ (10,880) టాప్ స్థానాల్లో ఉంటాయి. ఫుడ్ పార్కుల ఏర్పాటు, సామర్థ్యాల పెంపు, ప్రస్తుత కంపెనీలు.. ఇతర సంస్థలను కొనుగోళ్లు చేయడం, క్యాష్ అండ్ క్యారీ విభాగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలు సడలించడం, సింగిల్, మల్టీ బ్రాండ్ రిటైల్‌లో ఆటోమేటిక్ రూట్లో పెట్టుబడులకు అనుమతించడం వంటి అంశాలు ఈ ఉపాధి కల్పనకు ఊతంగా ఉండగలవని టీమ్‌లీజ్ సర్వీసెస్ హెడ్ (డిజిటల్, ఐటీ విభాగం)మయూర్ సారస్వత్ తెలిపారు. మొత్తం మీద చూస్తే రిటైల్ ద్వారా 15.11 శాతం, ఎఫ్ఎంసీజీ వల్ల 10.31% ఉద్యోగాల వృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. అనుభవజ్ఞులకు మాత్రమే కాకుండా ఫ్రెషర్లకు కూడా బాగానే అవకాశాలు లభించగలవని సారస్వత్ తెలిపారు. కేవలం రిటైల్‌లోనే 33,310 తాజా గ్రాడ్యుయేట్స్‌కు కొత్తగా ఉద్యోగావకాశాలు లభించగలవన్నారు. నివేదిక ప్రకారం 2018–19 అక్టోబర్–మార్చి వ్యవధితో పోలిస్తే 2018–19 ఏప్రిల్–సెప్టెంబర్ మధ్య కాలంలో రిటైల్, ఎఫ్ఎంసీజీ రంగాల్లో ఉద్యోగుల వలసలు భారీగా నమోదయ్యాయి. రిటైల్‌లో 19.82 శాతంగాను, ఎఫ్ఎంసీజీలో 16.03 శాతంగాను ఉన్నట్లు నివేదిక పేర్కొంది. -
కొత్త ఉద్యోగాలకు ఎన్నికల జోష్
సుస్థిర ప్రభుత్వం వస్తే 20 లక్షల కొత్త కొలువులు న్యూఢిల్లీ: ఎన్నికల అనంతరం స్థిరమైన ప్రభుత్వం ఏర్పడితే, 20 లక్షల కొత్త ఉద్యోగాలొస్తాయని ఉద్యోగ నియామక సంస్థలు ఆశిస్తున్నాయి. దీంతో ఈ ఏడాది హైరింగ్ కార్యకలాపాలు 30-40 శాతం వృద్ధి చెందుతాయని ఆయా సంస్థలు అంచనా వేస్తున్నాయి. టీమ్‌లీజ్, గ్లోబల్‌హంట్, మాన్‌స్టర్‌డాట్‌కామ్, నౌకరీ డాట్‌కామ్ వంటి సంస్థలు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది భారత కంపెనీలకు 12-14 లక్షల మంది కొత్త ఉద్యోగులు అవసరం. ఎన్నికల తర్వాత సుస్థిర సర్కారు ఏర్పాటైతే, పెట్టుబడులు పెరిగి.. ఆర్థిక వృద్ధి జోరందుకుంటుంది. 20 లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలొస్తాయి. గత ఏడాది వివిధ రంగాల్లో 10 లక్షల కొత్త ఉద్యోగాలొచ్చాయి. అయితే బలహీనంగా ఉన్న ఆర్థిక పరిస్థితుల కారణంగా భారీ సంఖ్యలోనే ఉద్యోగాలు కూడా పోయాయి. ఎన్నికల కారణంగా ఇప్పటికే మీడియా, పబ్లిక్ రిలేషన్స్, ఈవెంట్ మేనేజ్మెంట్, సోషల్ మీడియా రంగాల్లో ఉద్యోగాల వృద్ధి కనిపిస్తోంది. అయితే, ఇవన్నీ తాత్కాలిక ఉద్యోగాలే. ఎన్నికల ఫలితాలనుబట్టి దీర్ఘకాలిక ఉద్యోగవకాశాలుంటాయి.