ముంబై: దేశ ఆరోగ్య సంరక్షణ రంగంలో నియామకాలు పెరగనున్నాయని టీమ్‌లీజ్ ఎడ్‌టెక్ తెలిపింది. ఈ రంగంలో 47 శాతం సంస్థలు నియామకాల పట్ల సానుకూలంగా ఉన్నట్టు తెలిపింది. అత్యాధునిక టెలీహెల్త్ సేవల విస్తరణ, ముందస్తు వ్యాధి నివారణ సేవలకు పెరుగుతున్న ఆదరణతో ఈ రంగంలో ఉపాధి అవకాశాలు విస్తరించనున్నట్టు పేర్కొంది.
ఈ రంగంలోని కీలక పోస్ట్‌లకు ఢిల్లీ, చైన్నై నగరాల్లో ఎక్కువ డిమాండ్ ఉన్నట్టు తెలిపింది. రీసెర్చ్ అసోసియేట్ ఉద్యోగాలకు ఢిల్లీ, బెంగళూరు, అహ్మదాబాద్ కేంద్రాలుగా అవతరించాయని, వైద్య పరిశోధన, అనుబంధ క్లినికల్ పరీక్షలు, డేటా నిర్వహణ విధులు ఇందులో కీలకమని పేర్కొంది. ‘‘వ్యాధులు వచ్చిన తర్వాత వాటికి చికిత్సలు తీసుకోవడం కంటే, అవి రాక ముందే రక్షణ చర్యలు తీసుకోవడానికి ప్రాధాన్యం పెరిగింది. ఎన్నో అంశాల కారణంగా ఈ రంగంలో నిపుణులకు డిమాండ్ పెరుగుతోంది’’అని టీమ్‌లీజ్ ఎడ్‌టెక్ వ్యవస్థాపకుడు, సీఈవో శంతను రూజ్ అన్నారు.
ఆన్‌లైన్ వైద్య సేవలకు డిమాండ్
‘‘వృద్ధ జనాభా పెరుగుదల, దీర్ఘకాలిక అనారోగ్యాలు నిరంతరం వైద్య సహకారం, వినూత్నమైన చికిత్సల అవసరాన్ని తెలియజేస్తున్నాయి. అత్యాధునిక టెక్నాలజీతో దాదాపు అన్ని రంగాల్లోనూ పెద్ద ఎత్తున మార్పులు కనిపిస్తున్నాయి. కానీ, ఆరోగ్య సంరక్షణ రంగం వినూత్నంగా నిలుస్తోంది. కరోనా తర్వాత నుంచి వర్చువల్ కన్సల్టేషన్ (ఆన్‌లైన్‌లో వైద్య సలహా), రిమోట్ హెల్త్‌కేర్ సేవలు సాధారణంగా మారిపోయాయి’’అని శంతను రూజ్ తెలిపారు. నర్సింగ్ అసిస్టెంట్‌లకు హైదరాబాద్, చండీగఢ్, గురుగ్రామ్‌లో ఎక్కువ డిమాండ్ నెలకొన్నట్టు టీమ్‌లీజ్ ఎడ్‌టెక్ నివేదిక తెలిపింది.
వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించే మెడికల్ ల్యాబరేటరీ టెక్నీషియన్లకు ముంబై, హైదరాబాద్, ఇండోర్‌లో ఎక్కువ డిమాండ్ ఉంది. డయాగ్నోస్టిక్స్ సేవల విస్తరణ, ఇంటర్నెట్ సాయంతో మారుమూల ప్రాంతాల నుంచే వైద్య సహకారం పొందడం వంటివి ఈ రంగంలో ఉపాధి అవకాశాలను పెంచుతున్నట్టు రూజ్ తెలిపారు. ల్యాబ్ టెక్నిక్, డయాగ్నోస్టిక్స్ టెస్టింగ్, క్లినికల్ ట్రయల్స్, రోగుల సంరక్షణ, డేటా అనలైసిస్‌లో నైపుణ్యాలున్న వారిని నియమించుకునేందుకు కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నట్టు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment