global hunt
-
ఆతిథ్యం, విమానయాన రంగాల్లో అధిక ఉద్యోగాలు
ముంబై: విమానయానం, ఆతిథ్య రంగాల్లో ఈ ఏడాది ఉద్యోగాలు జోరుగా వస్తాయని నిపుణులంటున్నారు. ఈ రెండు రంగాల్లో విదేశీ కంపెనీలు పెట్టుబడులు కొనసాగిస్తున్నాయని, ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్నాయని గ్లోబల్‌హంట్ ఎండీ సునీల్ గోయల్ చెప్పారు. ఈ కారణాల వల్ల ఈ రెండు రంగాల్లో ఈ ఏడాది హైరింగ్ 40% వృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఇదే విధమైన అభిప్రాయాన్ని కెల్లీ సర్వీసెస్ ఇండియా ఎండీ కమల్ కర్నాథ్ వ్యక్తం చేశారు. ఆతిథ్య రంగంలో ఈ ఏడాది 60,000-80,000, విమానయాన రంగంలో పదేళ్లలో 3.5 లక్షల ఉద్యోగాలు వస్తాయని వివరించారు. ఈ ఏడాది హైరింగ్ 20-25 శాతం వృద్ధి సాధిస్తుందని పీపుల్‌స్ట్రాంగ్ హెచ్ఆర్ సర్వీసెస్ సీఈఓ పంకజ్ బన్సాల్ చెప్పారు. ఆతిథ్యం, బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా రంగాల్లో హైరింగ్ 25 శాతానికి పైగా వృద్ధి సాధిస్తుందని పేర్కొన్నారు. వాహన, సాఫ్ట్వేర్, ఐటీ, బీపీఓ, ఐటీఈఎస్ రంగాల్లో 10 శాతం వృద్ధి ఉంటుందని వివరించారు. బడ్జెట్లో ఆతిథ్యం, విమానయాన రంగాలకు నజరానాలు ప్రకటిస్తారని, దీంతో ఈ రెండు రంగాల్లో హైరింగ్ 8-10 శాతం చొప్పున పెరుగుతుందని తెలిపారు. ప్రధాని మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం కారణంగా తయారీ రంగంలో కూడా భారీగానే ఉద్యోగావకాశాలు ఉంటాయని, అయితే వివిధ రంగాల్లో ప్రతిభ గల ఉద్యోగుల కొరత తీవ్రంగా ఉందని నిపుణులంటున్నారు. -
కొత్త ఉద్యోగాలకు ఎన్నికల జోష్
సుస్థిర ప్రభుత్వం వస్తే 20 లక్షల కొత్త కొలువులు న్యూఢిల్లీ: ఎన్నికల అనంతరం స్థిరమైన ప్రభుత్వం ఏర్పడితే, 20 లక్షల కొత్త ఉద్యోగాలొస్తాయని ఉద్యోగ నియామక సంస్థలు ఆశిస్తున్నాయి. దీంతో ఈ ఏడాది హైరింగ్ కార్యకలాపాలు 30-40 శాతం వృద్ధి చెందుతాయని ఆయా సంస్థలు అంచనా వేస్తున్నాయి. టీమ్‌లీజ్, గ్లోబల్‌హంట్, మాన్‌స్టర్‌డాట్‌కామ్, నౌకరీ డాట్‌కామ్ వంటి సంస్థలు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ ఏడాది భారత కంపెనీలకు 12-14 లక్షల మంది కొత్త ఉద్యోగులు అవసరం. ఎన్నికల తర్వాత సుస్థిర సర్కారు ఏర్పాటైతే, పెట్టుబడులు పెరిగి.. ఆర్థిక వృద్ధి జోరందుకుంటుంది. 20 లక్షలకు పైగా కొత్త ఉద్యోగాలొస్తాయి. గత ఏడాది వివిధ రంగాల్లో 10 లక్షల కొత్త ఉద్యోగాలొచ్చాయి. అయితే బలహీనంగా ఉన్న ఆర్థిక పరిస్థితుల కారణంగా భారీ సంఖ్యలోనే ఉద్యోగాలు కూడా పోయాయి. ఎన్నికల కారణంగా ఇప్పటికే మీడియా, పబ్లిక్ రిలేషన్స్, ఈవెంట్ మేనేజ్మెంట్, సోషల్ మీడియా రంగాల్లో ఉద్యోగాల వృద్ధి కనిపిస్తోంది. అయితే, ఇవన్నీ తాత్కాలిక ఉద్యోగాలే. ఎన్నికల ఫలితాలనుబట్టి దీర్ఘకాలిక ఉద్యోగవకాశాలుంటాయి. -
మహిళలు.. మధ్యలోనే కెరీర్‌కు గుడ్‌బై!
న్యూఢిల్లీ: చాలా మంది మహిళలు తమ ఉద్యోగాలను మధ్యలోనే వదిలేస్తున్నారని నిపుణులంటున్నారు. పనిచేసే చోట లింగ వివక్షకు తావులేదంటూ ప్రచారం హోరెత్తిపోతున్నప్పటికీ, 60 శాతం మంది మహిళలు మధ్యలోనే తమ కెరీర్‌కు మంగళం పాడేస్తున్నారని వారంటున్నారు. మహీంద్రా గ్రూప్‌కు చెందిన బ్రిజిల్‌కోన్, గ్లోబల్ హంట్, పీడబ్ల్యూసీ ఇండియా, తదితర సంస్థల నిపుణుల అభిప్రాయాల ప్రకారం... చాలా కంపెనీలు ఎంట్రీ లెవల్లో మహిళలను ఉద్యోగాల్లోకి తీసుకొని, వారికి తగిన శిక్షణ కూడా ఇస్తున్నాయి. ఈ విషయంలో అవి వంద శాతం విజయం సాధిస్తున్నాయి. అయితే సమస్య అంతా వారు మధ్య స్థాయి నిర్వహణ ఉద్యోగాల్లోకి వచ్చేటప్పటికి ఉత్పన్నమవుతోంది. ఈ స్థాయికి వచ్చేటప్పటికి చాలా మంది మహిళలకు వ్యక్తిగత, కుటుంబ బాధ్యతలు పెరుగుతున్నాయి. మరో వైపు కంపెనీల్లో మరింతగా ఎదగటానికి తగిన తోడ్పాటు లభించడం లేదు. నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో మహిళ, పురుష ఉద్యోగులకు సమాన అవకాశాలు ఇవ్వడం, లింగ వివక్షతకు తావులేని విధానాలు అనుసరించడం తదితర చర్యల ద్వారా ఈ సమస్య నుంచి కొంత వరకూ గట్టెక్కవచ్చు. అయితే మహిళలకు సాధికారత కల్పించడం సమాజానికి ఎంతగానో మేలు చేస్తుంది. ఈ విషయంలో టాటా స్టీల్ తేజస్విని పేరుతో ఒక కార్యక్రమం ప్రారంభించింది. ఈ కార్యక్రమం కింద గతంలో పురుషులకే పరిమితమైన ఉద్యోగాలకు మహిళలను తీసుకొని, వారికి తగిన శిక్షణనిస్తోంది.