మహిళలు.. మధ్యలోనే కెరీర్‌కు గుడ్‌బై!
న్యూఢిల్లీ: చాలా మంది మహిళలు తమ ఉద్యోగాలను మధ్యలోనే వదిలేస్తున్నారని నిపుణులంటున్నారు. పనిచేసే చోట లింగ వివక్షకు తావులేదంటూ ప్రచారం హోరెత్తిపోతున్నప్పటికీ, 60 శాతం మంది మహిళలు మధ్యలోనే తమ కెరీర్‌కు మంగళం పాడేస్తున్నారని వారంటున్నారు. మహీంద్రా గ్రూప్‌కు చెందిన బ్రిజిల్‌కోన్, గ్లోబల్ హంట్, పీడబ్ల్యూసీ ఇండియా, తదితర సంస్థల నిపుణుల అభిప్రాయాల ప్రకారం...
చాలా కంపెనీలు ఎంట్రీ లెవల్‌లో మహిళలను ఉద్యోగాల్లోకి తీసుకొని, వారికి తగిన శిక్షణ కూడా ఇస్తున్నాయి. ఈ విషయంలో అవి వంద శాతం విజయం సాధిస్తున్నాయి. అయితే సమస్య అంతా వారు మధ్య స్థాయి నిర్వహణ ఉద్యోగాల్లోకి వచ్చేటప్పటికి ఉత్పన్నమవుతోంది. ఈ స్థాయికి వచ్చేటప్పటికి చాలా మంది మహిళలకు వ్యక్తిగత, కుటుంబ బాధ్యతలు పెరుగుతున్నాయి. మరో వైపు కంపెనీల్లో మరింతగా ఎదగటానికి తగిన తోడ్పాటు లభించడం లేదు. నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో మహిళ, పురుష ఉద్యోగులకు సమాన అవకాశాలు ఇవ్వడం, లింగ వివక్షతకు తావులేని విధానాలు అనుసరించడం తదితర చర్యల ద్వారా ఈ సమస్య నుంచి కొంత వరకూ గట్టెక్కవచ్చు. అయితే మహిళలకు సాధికారత కల్పించడం సమాజానికి ఎంతగానో మేలు చేస్తుంది. ఈ విషయంలో టాటా స్టీల్ తేజస్విని పేరుతో ఒక కార్యక్రమం ప్రారంభించింది. ఈ కార్యక్రమం కింద గతంలో పురుషులకే పరిమితమైన ఉద్యోగాలకు మహిళలను తీసుకొని, వారికి తగిన శిక్షణనిస్తోంది.