
వృత్తి జీవితాలను ఇతర కారణాలతో మధ్యలో వదిలేసిన మహిళలకు మహీంద్రా గ్రూప్(Mahindra Group) శుభవార్త చెప్పింది. సుదీర్ఘ విరామం తరువాత మహిళా ప్రొఫెషనల్స్(women professionals) తిరిగి వృత్తి జీవితంలోకి ప్రవేశించడానికి ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు తెలిపింది. ఎస్ఓఏఆర్ (సీమ్‌లెస్ అపర్చునిటీ ఫర్ అమేజింగ్ రిటర్న్‌షిప్) పేరుతో ఆరు నెలల నుంచి మూడు సంవత్సరాల వరకు విరామం తీసుకున్న కనీసం ఐదు సంవత్సరాల వృత్తిపరమైన అనుభవం ఉన్న మహిళలకు ఈ ప్రాగ్రామ్ ద్వారా సాయం అందించనున్నారు.
మహీంద్రా గ్రూప్ హ్యూమన్ రిసోర్సెస్ ప్రెసిడెంట్, గ్రూప్ ఎగ్జిక్యూటివ్ బోర్డ్ సభ్యుడు రుజ్ బెహ్ ఇరానీ ఈ సందర్భంగా మాట్లాడుతూ..‘తిరిగి వృత్తి జీవితంలోకి అడుగుపెట్టాలనుకునే మహిళలు రెట్టించిన ఉత్సాహంతో పని చేసి గణనీయమైన వృద్ధిని తీసుకువస్తారు. సోర్ ప్రోగ్రామ్‌లో భాగంగా మహిళలకు మెంటార్ షిప్, అప్ స్కిల్, ఫ్లెక్సిబుల్ వర్క్ అరేంజ్‌మెంట్స్, నెట్ వర్కింగ్ సెషన్‌లు అందిస్తారు. ప్రతి ఒకరికి ఒక మెంటార్‌ను కేటాయిస్తారు. దాంతో ప్రోగ్రామ్ సమయంలో ఏదైనా అనుమానాలు వస్తే నిత్యం మెంటార్‌లు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టారు’ అని అన్నారు.
ఇదీ చదవండి: అమెరికా సుంకాలు ప్రపంచానికే ప్రమాదం
కార్పొరేట్ హెచ్‌ఆర్ అండ్ గ్రూప్ టాలెంట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సాక్షి హండా మాట్లాడుతూ..‘పనిప్రాంతంలో లింగ వైవిధ్యాన్ని పెంపొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇప్పటికే కొంత పని అనుభవం ఉన్న మహిళలు కొన్ని కారణాల వల్ల పని చేయాలని ఉన్నా చేయలేకపోతున్నారు. అలాంటి వారికి కొంత ప్రోత్సాహం, సమయం ఇస్తే తిరిగి వారు శ్రామికశక్తి(workforce)లో భాగమవుతారు. అందుకు కంపెనీ అన్ని విధాలా ప్రోత్సాహం అందించాలని నిర్ణయించింది’ అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారికి సంస్థ సంస్కృతి, విలువల గురించి పరిచయం చేయడం కోసం మహీంద్రా లీడర్‌షిప్ యూనివర్శిటీలో ప్రత్యేక కోర్సు కూడా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment