అమెరికా ఉత్పత్తులపై సుంకాలు పెంచాలనే నిర్ణయం వల్ల ప్రపంచ వృద్ధి ప్రభావం చెందుతుందని ప్రపంచ బ్యాంకు హెచ్చరికలు జారీ చేసింది. తాజాగా విడుదల చేసిన గ్లోబల్ ఎకనామిక్ ప్రాస్పెక్ట్ నివేదిక ప్రకారం, వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు, వాణిజ్య భాగస్వాములు తమ సొంత టారిఫ్‌లను పెంచుతూ ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే ఇప్పటికే మందకొడిగా 2.7%గా ఉన్న ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు 2025లో 0.3 శాతం పడిపోయే ప్రమాదం ఉందని స్పష్టం చేసింది.
ఇతర దేశాలు అనుసరిస్తే ప్రమాదం
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన వివరాల ప్రకారం.. ప్రపంచ దిగుమతులపై 10 శాతం సుంకం, కెనడా, మెక్సికో దిగుమతులపై 25 శాతం, చైనా వస్తువులపై 60 శాతం సుంకాన్ని విధించబోతున్నట్లు సమాచారం. ప్రపంచ స్థూల ఆర్థిక నమూనా ప్రకారం ఇలాంటి నిర్ణయాల వల్ల ప్రపంచ వృద్ధి 0.3 శాతం తగ్గిపోనుంది. ఇతర దేశాలు కూడా ఇదే పంథాను అనుసరిస్తే మరింత ప్రమాదం వాటిల్లుతుందని ప్రపంచ బ్యాంకు తెలిపింది.
కుంటుపడనున్న వృద్ధిరేటు
అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు 2000 సంవత్సరం తర్వాత అత్యంత బలహీనమైన దీర్ఘకాలిక వృద్ధి సమస్యను ఎదుర్కొంటున్నాయని నివేదిక ఎత్తిచూపింది. అధిక రుణ భారాలు, బలహీనమైన పెట్టుబడులు, ఉత్పాదకతలో తగ్గుతున్న వృద్ధి, పెరుగుతున్న వాతావరణ మార్పుల ఖర్చుల కారణంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో 2025-26 ఏడాదికిగాను వృద్ధి రేటు 4%గా ఉంటుందని అంచనా.
ఇదీ చదవండి: భారత్‌లో టాప్ 5 బ్రాండ్ లిస్ట్‌లోకి యాపిల్
వచ్చే 25 ఏళ్లు మరిన్ని సవాళ్లు
పెట్టుబడులను ప్రోత్సహించడానికి, వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడానికి వివిధ దేశాలు మెరుగైన సంస్కరణలను అవలంబించాలని ప్రపంచ బ్యాంకు చీఫ్ ఎకనమిస్ట్ ఇందర్మిత్ గిల్ నొక్కి చెప్పారు. గత 25 సంవత్సరాలతో పోలిస్తే వచ్చే 25 ఏళ్లు అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలకు కఠినమైన అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉందన్నారు. వీటిని తగ్గించుకునేందుకు క్రియాశీల చర్యలు తీసుకోవాలని కోరారు. బ్యాంక్ ఫర్ ఇంటర్నేషనల్ సెటిల్మెంట్స్ సైతం ప్రపంచ వాణిజ్యంలో పెరుగుతున్న అనిశ్చితుల గురించి హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment