భారతదేశంలో ఐఫోన్ అమ్మకాలను ప్రారంభించిన తరువాత మొదటిసారి యాపిల్ వాల్యూమ్ పరంగా టాప్ 5 స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లిస్ట్‌లోకి చేరింది. 2024 అక్టోబర్-డిసెంబర్ కాలంలో 10% మార్కెట్ వాటాను సాధించింది. దేశంలో యాపిల్‌కు పెరుగుతున్న ప్రజాదరణకు ఈ విజయం నిదర్శనమని కంపెనీ తెలిపింది. జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో యాపిల్ మార్కెట్ వాటా 8.6 శాతంగా ఉంది. ఆ సమయంలో ఎగుమతులు ఏడాది ప్రాతిపదికన 58.5% పెరిగాయి.
యాపిల్ విజయానికి ప్రధాన కారణాలు
మార్కెట్ వాటా వృద్ధి: 2024 పండుగ సీజన్ అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో యాపిల్ 9-10% మార్కెట్ వాటాను కైవసం చేసుకుంది. ట్రేడ్-ఇన్ ఆఫర్లు, పండుగ డిస్కౌంట్లు, 24 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ వంటి ఆకర్షణీయమైన ఫైనాన్సింగ్ ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షించింది. దాంతో మార్కెట్ వాటా పెరిగింది.
పాపులర్ మోడల్స్: ఐఫోన్ 15, ఐఫోన్ 13 వంటి పాత మోడళ్ల కొనుగోలుకు వినియోగదారులు ఎంతో ఆసక్తి చూపించారు. ఇటీవల లాంచ్ చేసిన ఐఫోన్ 16 సిరీస్ కూడా కంపెనీ విక్రయాలు పెరిగేందుకు దోహదం చేశాయి.
స్థానికంగా తయారీ: దేశీయ తయారీపై యాపిల్ దృష్టి సారించింది. కంపెనీ విక్రయాలు గణనీయంగా పెరిగేందుకు ఇది కూడా తోడైంది. ఫాక్స్‌కాన్, పెగాట్రాన్, టాటా టెక్నాలజీస్ వంటి భాగస్వాముల ద్వారా ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌ను భారత్‌లో తయారు చేస్తోంది. దేశీయంగా ఖర్చులు తగ్గించుకునేందుకు ఇది దోహదం చేస్తుంది. దాంతోపాటు భారతీయ వినియోగదారుల్లో సానుకూల బ్రాండ్ ఇమేజ్‌ను సృష్టిస్తుందని కంపెనీ నమ్ముతుంది.
ఆర్థిక కారకాలు: మధ్యతరగతి, ముఖ్యంగా యువతలో పెరుగుతున్న ఆర్థిక స్వేచ్ఛ వల్ల ప్రీమియం మోడళ్ల కొనుగోళ్లు అధికమవుతున్నాయి. యాపిల్ బ్రాండ్‌కు ఉన్న విలువ వల్ల ఎక్కువ మంది వీటిపై ఆసక్తి చూపుతున్నారు.
ఇదీ చదవండి: త్రైమాసిక ఫలితాలు డీలా.. కంపెనీ షేర్ల నేలచూపులు
భవిష్యత్తు అవకాశాలు
2026 నాటికి యాపిల్ మూడో అతిపెద్ద మార్కెట్‌గా భారత్ అవతరించనుందని, వార్షిక ఐఫోన్ అమ్మకాలు 15 మిలియన్ యూనిట్లకు చేరుకుంటాయని అంచనా. దేశీయ తయారీ, సమర్థవంతమైన పంపిణీ, ప్రీమియం ఆఫర్లపై కంపెనీ దృష్టి సారిస్తుండడం వంటి అంశాలు భారత మార్కెట్లో వృద్ధికి దోహదపడుతుంది.
Comments
Please login to add a commentAdd a comment