చార్జీల పెంపు ఏపీలో ఎంత?
కన్సల్టెన్సీతో కలసి తెలంగాణ డిస్కంల అధ్యయనం
అయినా ఇంకా కొలిక్కి రాని టారిఫ్ ప్రతిపాదనలు
సాక్షి, హైదరాబాద్ : పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఏ మేరకు విద్యుత్ చార్జీల పెంపును ప్రతిపాదించింది? మనమెంత పెంపునకు ప్రతిపాదించాలి? అన్న అంశాలపై తెలంగాణ విద్యుత్ సంస్థ(డిస్కం)లు క్షుణ్ణంగా పరిశీలించాయి. ఏపీలో రూ.859 కోట్ల విద్యుత్ చార్జీల పెంపునకు గత బుధవారం అక్కడి డిస్కంలు ఆ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి ప్రతిపాదనలు సమర్పించిన విషయం తెలిసిందే. ఏ రంగాల వినియోగదారుల పై ఎంతమేర చార్జీల పెంపునకు ఏపీ డిస్కంలు ప్రతి పాదించాయి? తెలంగాణలో ఎంత వరకు పెంచవ చ్చు? అనే అంశాలపై తెలంగాణ ట్రాన్స్కో, డిస్కంల ఉన్నతాధికారులు, ప్రపంచ బ్యాంక్ కన్సల్టెన్సీ ‘కేపీఎంజీ సంస్థ’ నిపుణులు తాజాగా హైదరాబా ద్లో సమావే శమై పరిశీలించారు.
చార్జీల పెంపు అమలు చేసినా రాష్ట్రంలో విద్యుత్ చార్జీలు ఏపీకి మించకుండా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని, రెండు రాష్ట్రాల్లో విద్యుత్ చార్జీల మధ్య వ్యత్యాసం ఎక్కువ కాకుండా చూసేందుకు ఈ సమావేశం నిర్వహించారని తెలిసింది. ప్రధానంగా పారిశ్రామిక రంగ వినియోగ దారులపై చార్జీల పెంపు ఏపీకి మించకుండా ఉండాలని నిర్ణయించినట్లు సమాచారం. ఉజ్వల్ డిస్కం అష్యురెన్స్ యోజన (ఉజ్వల్) పథకంలో ఇటీవల తెలంగాణ డిస్కంలు చేరడంతో మారిన పరిస్థితులపై సైతం ఈ సమావే శంలో అధ్యయనం చేసినట్లు తెలిసింది. ప్రతి ఏటా వార్షిక ఆదాయ అవసరాల నివేదిక(ఏఆర్ఆర్)/ టారిఫ్ ప్రతిపాదనల రూపకల్పనతోపాటు ఇతరత్రా అవసరాలకు రెండు రాష్ట్రాల డిస్కంలూ కేపీఎంజీ సంస్థ సేవలను వినియోగించుకుంటున్నాయి. చార్జీల పెంపు ప్రతి పాదనలు ఓ కొలిక్కి వచ్చినా అధికారులు ఇంకా ఖరారు చేయలేదు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావుతో చర్చించిన అనంతరం ఆయన సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటామని అధికారవర్గాలు తెలిపాయి.
నెలాఖరుకే ప్రతిపాదనలు...
విద్యుత్ చట్టం నిబంధనల ప్రకారం డిస్కం లు విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదనలను గత నవంబర్లోగా ఈఆర్సీకి సమర్పించాల్సి ఉండగా, డిస్కంల విజ్ఞప్తి మేరకు డిసెంబర్ వరకు ఈఆర్సీ గడువు పొడిగించింది. ఆ తర్వాత కూడా డిస్కంల కోరిక మేరకు జనవరి 16 వరకు రెండోసారి, ఆ తర్వాత జనవరి 23 వరకు మూడోసారి గడువును ఈఆర్సీ పొడిగించింది. అయినా, చార్జీల పెంపు ప్రతిపాదనలను డిస్కంలు ఇంకా ఖరారు చేయలేక పోయాయి. దీంతో సోమవారం ఈఆర్సీకి కొత్త టారిఫ్ ప్రతిపాదనలు సమర్పించే అవకాశం లేదని ట్రాన్స్కో అధికారవర్గాలు పేర్కొన్నాయి. నెలాఖరు వరకు నాలుగోసారి గడువు పొడిగింపు కోరాలని డిస్కంలు నిర్ణయించినట్లు తెలిసింది.