‘ఇంటి పనే’ ఇద్దాం! | Work From Jobs Increasing In India | Sakshi
Sakshi News home page

‘ఇంటి పనే’ ఇద్దాం!

Published Fri, Aug 28 2020 4:04 AM | Last Updated on Fri, Aug 28 2020 4:04 AM

Work From Jobs Increasing In India - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో ‘వర్క్‌ ఫ్రం హోం’విధానం కింద ఉద్యోగాలు మూడొంతులు పెరిగాయి. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా పని పద్ధతుల్లో వచ్చిన మార్పుచేర్పులతో దాదాపుగా అన్ని పరిశ్రమలు, సంస్థలు తమ విధానాలు, వ్యూహాలు మార్చుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇందుకు తగ్గట్టుగానే భారత్‌లో ఇంటి నుంచి చేసే ఉద్యోగాలు, పనుల్లో కూడా ఒక్కసారిగా వృద్ధి నమోదైంది. దీంతో కోవిడ్‌కు ముందు అంతగా ‘వర్క్‌ ఫ్రం హోం’పని విధానం పట్ల పెద్దగా ఆసక్తి చూపని కంపెనీలు సైతం ఇప్పుడీ పని పద్ధతిని అనుసరించక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. తాజాగా జాబ్‌ పోర్టల్‌ ‘నౌకరీ డాట్‌కాం’వెలువరించిన నివేదికలో.. కోవిడ్‌ రాకముందుతో పోల్చితే గత కొన్ని నెలల్లో ఇంటి నుంచి పనిచేసే విధానం కింద మూడు రెట్ల మేర ఎక్కువగా ఉద్యోగాల్లోకి వివిధ కంపెనీలు, సంస్థలు తీసుకున్నట్టు వెల్లడైంది. మార్చి నెలాఖరు నుంచి దేశంలో లాక్‌డౌన్‌ విధించిన నేపథ్యంలో ఉద్యోగులను వర్క్‌ ఫ్రంహోం పద్ధతిలో మినహా పనిచేయించుకోలేని పరిస్థితుల్లో ఈ విధానానికే సంస్థలు ఓటేశాయి. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి ఇంటి నుంచి పనిచేసే పద్ధతికి డిమాండ్‌ పెరగడం మొదలై, అది క్రమక్రమంగా పెరుగుతూ రావడంతో గతేడాదితో పోల్చితే వర్క్‌ ఫ్రంహోం జాబ్‌లిస్టింగ్స్‌ కూడా నాలుగు రెట్లు పెరిగినట్లు తెలుస్తోంది.

అనువుగా లేని ఉద్యోగాలు కూడా.. 
ఇక నౌకరీ డాట్‌కాంలో గత ఐదు నెలలుగా ఆన్‌లైన్‌ సెర్చింగ్‌లో అత్యధికంగా వెతికిన వాటిలో ‘వర్క్‌ ఫ్రం హోం’కీ వర్డ్‌.. ‘టాప్‌ సెర్చ్‌డ్‌ కీ వర్డ్‌’గా నిలిచినట్లు ఈ సంస్థ పేర్కొంది. ఇటు కోవిడ్‌ పరిణామాలతో రిమోట్‌ వర్కింగ్‌ ఉద్యోగాల భర్తీకి వివిధ కంపెనీలు మొగ్గు చూపగా, ప్రస్తుత పరిస్థితుల్లో ‘వర్క్‌ ఫ్రం హోం’ఉద్యోగాలు కోరుకుంటూ దరఖాస్తు చేసుకునే వారి సంఖ్య 7 రెట్లు పెరిగినట్లు వెల్లడైంది. గతంలో ఇంటి నుంచి పని చేసే విధానం పరిధిలోకి రాని, అందుకు అనువుగా లేని ఉద్యోగాలు కూడా ఇప్పుడు ఈ విధానంలోకి మారిపోవడం మరో విశేషంగా నిపుణులు అంచనా వేస్తున్నారు. సేల్స్‌ ప్రొఫెషనల్స్, బిజినెస్‌ డెవలప్‌మెంట్, కస్టమర్‌ కేర్‌ సపోర్ట్‌ ఉద్యోగాలు కూడా వర్క్‌ ఫ్రం హోంలోకి మారిపోతున్నాయి. ప్రధానంగా ఐటీ ఎనెబుల్డ్‌ సర్వీస్‌ (ఐటీఈఎస్‌), బీపీవో రంగాలకు సంబంధించిన ఉద్యోగాలే సగం (50 శాతం) వరకు ఉంటున్నట్టు, ఐటీ–సాఫ్ట్‌వేర్, ఎడ్యుకేషన్‌/టీచింగ్, ఇంటర్నెట్‌/ఈ–కామర్స్‌ వంటి నాలుగో వంతు (25 శాతం) ఉన్నట్టుగా నౌకరీ.కామ్‌ నివేదికలో వెల్లడైంది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement