సాక్షి, సిటీబ్యూరో : కొలువుల జాతరలో ఐటీ స్పీడుకు బ్రేకులు పడ్డాయి. ఆటోమొబైల్ రంగం రయ్‌న దూసుకుపోతోంది. పలు మెట్రో నగరాల్లో ఆటోమొబైల్, టెలికాం, నిర్మాణ రంగాల్లో ఉపాధి, ఉద్యోగ అవకాశాల జోరు ఊపందుకున్నట్లు నౌక్రి డాట్‌కామ్ తాజా నివేదికలో వెల్లడైంది. దేశవ్యాప్తంగా ఉపాధి, ఉద్యోగ కల్పనలో వృద్ధిరేటు 21శాతంగా నమోదైంది. జూన్ వరకు మెట్రో నగరాల్లో వృద్ధిరేటును పరిశీలిస్తే వివిధ రంగాల్లో ఉపాధి కల్పనలో 38శాతంతో కోల్‌కతా అగ్రభాగాన నిలిచింది. 15శాతం వృద్ధిరేటుతో ఢిల్లీ రెండో స్థానంలో, 14శాతంవృద్ధిరేటుతో ముంబై మూడో స్థానంలో నిలిచాయి. ఇక 13శాతం వృద్ధిరేటుతో హైదరాబాద్, చెన్నై సరిపెట్టుకోవాల్సి వచ్చిందని నౌక్రి డాట్‌కామ్ ఆన్‌లైన్ జాబ్ పోర్టల్ అర్ధ వార్షిక నివేదికలో స్పష్టమైంది.
గ్రేటర్ పరిధిలో ఐటీ రంగంలో కేవలం 2శాతమే వృద్ధి నమోదైంది. కృత్రిమ మేధస్సు, మెషిన్ లెర్నింగ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, బిగ్ డేటా అనలిటిక్స్ తదితర మాధ్యమాలపై పనిచేసే వారికి కొలువుల అవకాశాలు బాగానే ఉన్నట్లు ఈ నివేదిక తెలిపింది. ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే గ్రేటర్‌లో ఐటీ రంగంలో కొలువు జోరు కాస్త మందగించినట్లు ఈ రంగం నిపుణులు వెల్లడిస్తున్నారు. కాగా గ్రేటర్ కేంద్రంగా బహుళ జాతి దేశీయ దిగ్గజ సంస్థలకు చెందిన సుమారు 1,000 సాఫ్ట్‌వేర్ కంపెనీల బ్రాంచీలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి.
ఆయా కంపెనీల్లో సుమారు 6లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. అయితే ఆయా కంపెనీల విస్తరణ ప్రణాళికలు ప్రతి ఏటా ఆశించిన మేరకు అమలు కాకపోవడం, కొత్త ప్రాజెక్టులు చేజిక్కకపోవడం, అంతర్జాతీయంగా మార్కెట్ ఆశించిన స్థాయిలో లేకపోవడం తదితర కారణాలతో కొలువుల్లో మందగమనం నమోదైనట్లు ఐటీ రంగ నిపుణులు పేర్కొంటున్నారు. కేంద్ర ప్రభుత్వ సౌజన్యంతో గ్రేటర్‌లో నిర్మించ తలపెట్టిన ఐటీఐఆర్ ప్రాజెక్టు నాలుగేళ్లుగా సాకారం కాకపోవడం, దీనికి తాజా బడ్జెట్‌లో కేంద్రం నిధులు కేటాయించకపోవడం కూడా ఐటీ రంగం వృద్ధికి ప్రతిబంధకంగా మారిందంటున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఐటీ, హార్డ్‌వేర్ పాలసీ, టీఎస్‌ఐపాస్‌లతో ఐటీ, పారిశ్రామిక రంగాలు ఇప్పుడిప్పుడే పురోగమిస్తున్నాయని... త్వరలో ఆయా రంగాల్లో క్రమంగా వృద్ధి నమోదవుతుందని అంచనా వేస్తున్నారు.
ఈ రంగాల్లో కొలువుల జోష్...
♦ దేశంలోని పలు మెట్రో నగరాల్లో ఆటోమొబైల్,టెలికాం, నిర్మాణరంగంతో పాటు పలు ఇంజినీరింగ్ విభాగాల్లో కొలువుల జోష్ కనిపించినట్లు నివేదిక పేర్కొంది.
వివిధ రంగాల వారీగా వృద్ధి ఇలా...
♦ ఐటీ రంగంలో కేవలం 2 శాతమే వృద్ధినమోదైంది.
♦ ఆటోమొబైల్ రంగంలో 31శాతం వృద్ధి నమోదైంది.
♦ నిర్మాణ రంగంలో 21శాతం పురోగతి.
♦ ఫార్మా రంగంలో 18శాతం వృద్ధి.
♦ టెలికాం రంగంలో 25శాతం నమోదు
♦ నిత్యావసరాల అమ్మకం (ఎఫ్‌ఎంసీజీ) విభాగంలో 21 శాతం.
♦ బిజినెస్‌ప్రాసెస్ ఔట్‌సోర్సింగ్ (బీపీఓ)లో 18 శాతం వృద్ధి నమోదైంది.
ఉద్యోగ కల్పనలో వృద్ధి ఇలా...
మెట్రో నగరం వృద్ధిశాతం
కోల్‌కతా 38
ఢిల్లీ 15
ముంబై 14
హైదరాబాద్ 13
చెన్నై 13
Comments
Please login to add a commentAdd a comment