BPO
-
జనరేటివ్ ఏఐ వల్ల ఈ ఉద్యోగాలు ఊడనున్నాయా..?
జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల చాలా రంగాల్లో ఉద్యోగాలుపోయే ప్రమాదముందని చాలామంది నిపుణులు చెబుతున్నారు. తాజాగా ఐటీ పరిశ్రమ సంఘం నాస్కామ్ ఛైర్మన్ రాజేశ్ నంబియార్ ఈ అంశంపై స్పందిస్తూ జనరేటివ్ ఏఐ కారణంగా బిజినెస్ ప్రాసెస్ ఔట్సోర్సింగ్ (బీపీఓ) రంగంలో పనిచేసే ఉద్యోగులకు అధికంగా ముప్పు వాటిల్లనుందని తెలిపారు. భారత టెక్ పరిశ్రమలో కీలకమైన సాఫ్ట్వేర్ సేవల విభాగం మాత్రం ఈ విషయంలో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఏఐ ముప్పును గ్రహించి, 48.9 బిలియన్ డాలర్ల (సుమారు రూ.4.06 లక్షల కోట్ల) విలువైన దేశీయ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్ (బీపీఎం) పరిశ్రమ త్వరగా తన విధానాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. 250 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 20.75 లక్షల కోట్ల) విలువైన దేశీయ ఐటీ పరిశ్రమపైనా కొంతమేర ఏఐ ప్రభావం చూపొచ్చని పేర్కొన్నారు. ‘తమ పనిలో ఏఐను వినియోగించలేని ఐటీ నిపుణులను.. ఏఐ వినియోగించే వారు భర్తీ చేసే ప్రమాదం ఉంద’ని నంబియార్ అభిప్రాయపడ్డారు. ఇదీ చదవండి: ప్రపంచ టాప్ కంపెనీలో నోటీసు లేకుండా ఉద్యోగాల తొలగింపు.. భవిష్యత్తు అవసరాల కోసం ఏఐ ఆధారిత నైపుణ్యాలను తమ ఉద్యోగులకు కల్పించడానికి ఐటీ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. చివరకు మానవ సామర్థ్యాల్లో మాత్రమే తేడా ఉంటుందని, ప్రస్తుత వ్యవస్థతో ఏఐ సమీకృతమైనప్పుడు అసలైన మార్పులు వెలుగుచూస్తాయని నంబియార్ తెలిపారు. వైట్‌కాలర్ ఉద్యోగాలపైనే జనరేటివ్ ఏఐ ప్రభావం అధికంగా ఉంటుందని, కొత్త సాంకేతికతలకు మారాల్సిన అవసరం ఉంటుందన్నారు. ప్రస్తుతం కాగ్నిజెంట్ ఇండియాకు ఛైర్మన్, ఎండీగా నంబియార్ వ్యవహరిస్తున్నారు. -
ఉద్యోగం నుంచి తీసేశారని..బీపీఓ కంపెనీ హెడ్‌పై కాల్పులు
ఒక ప్రైవేటు కంపెనీ మాజీ ఉద్యోగి తనను ఉద్యోగం నుంచి తొలగించారని తన యజమానిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటన గ్రేటర్ నోయిడాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే...అనూప్ సింగ్ అనే వ్యక్తి గేట్రర్ నోయిడా సెక్టార్2లో ఎన్సీబీ బీపీఓలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేసేవాడు. ఐతే ఆఫీస్‌లో అతని ప్రవర్తన సరిగా లేకపోవడంతో కంపెనీ సర్కిల్ హెడ్ సద్రూల్ ఇస్లాం అనూప్‌ని ఆరు నెలలక్రితం ఉద్యోగం నుంచి తొలగించాడు. ఐతే గత నెల అనూప్ మేనేజర్ సద్రూల్ వద్దకు వచ్చి తనను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని అభ్యర్థించారు. అందుకు సద్రూల్ అంగీకరించ లేదు. దీంతో అనూప్ మళ్లీ బుధవారం సాయంత్రం సద్రూల్ వద్దకు వచ్చి ఈ విషయమై అడుగగా...ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం తలెత్తింది. అనంతరం అనూప్ దేశీయ తుపాకీతో మేనేజర్ ఛాతిపై తీవ్రంగా కాల్పలు జరిపి ..పరారయ్యాడు. దీంతో సదరు మేనేజర్ సద్రూల్ని హుటాహుటినా కైలాష్ ఆస్పత్రికి తరలించారు. ఐతే అతని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. ఈ మేరకు అశుతోష్ ద్వివేది కేసు నమోదు చేసి నిందితుడు కోసం తీవ్రంగా గాలిస్తున్నట్లు వెల్లడించారు. (చదవండి: ఇడియట్స్ అని తిడుతూ..కాంట్రాక్టర్ కళ్ల అద్దాలను పగలు కొట్టిన ఎమ్మెల్యే) -
నిరుద్యోగులకు శుభవార్త.. భారీగా కొలువులు!
ముంబై: బిజినెస్ ప్రాసెస్ అవుట్సౌర్సింగ్ (బీపీవో) సేవల సంస్థ ఐసీసీఎస్ వివిధ విభాగాల్లో దాదాపు 7,000 మందిని రిక్రూట్ చేసుకునే యోచనలో ఉంది. వచ్చే 12 నెలల కాలంలో ఈ మేరకు నియామకాలు జరపనున్నట్లు సంస్థ సీఈవో దివిజ్ సింఘాల్ తెలిపారు. కస్టమర్ సపోర్ట్, ఆపరేషన్స్, మార్కెట్ రీసెర్చ్, మానవ వనరులు, ఫైనాన్స్, మార్కెటింగ్ తదితర విభాగాల్లో హైరింగ్ ఉంటుందని వివరించారు. ఐసీసీఎస్కి ప్రస్తుతం ఎనిమిది ప్రాంతాల్లో డెలివరీ సెంటర్లు ఉన్నాయి. దాదాపు 6,600 మంది ఎగ్జిక్యూటివ్‌లు ఉన్నారు. చదవండి: పండుగ సీజన్.. కొత్త బైక్ కొనేవారికి షాక్! -
రికార్డు: ‘ఐబీపీఎస్’లో ఏపీ ఫస్ట్
సాక్షి, అమరావతి: ఐటీ బిజినెస్ ప్రాసెస్ ఔట్సోర్సింగ్ (బీపీవో) కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. కేంద్ర సమాచార, ప్రసార శాఖ ప్రవేశపెట్టిన ఇండియా బీపీవో ప్రమోషన్ స్కీమ్ (ఐబీపీఎస్) కింద అత్యధిక బీపీవో యూనిట్లు రాష్ట్రంలోనే ఏర్పాటయ్యాయి. ఐబీపీఎస్ కింద ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 45,792 సీట్లు కేటాయించగా.. అందులో మన రాష్ట్రంలోనే 13,792 సీట్లున్నాయి. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 10,365 మంది స్థానికులకు నేరుగా ఉపాధి లభించిందని, తద్వారా 10,000 మార్కును అందుకున్న తొలి రాష్ట్రంగా ఏపీ రికార్డులకు ఎక్కిందని సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఓంకార్ రాయ్ తెలిపారు. రాష్ట్రంలో మొత్తం 11 పట్టణాల్లో బీపీవో యూనిట్లు నెలకొల్పడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి కల్పించామని ఆయన చెప్పారు. రెండేళ్లలో 45 వేల ఉద్యోగాలు రాష్ట్రంలో బీపీవో యూనిట్లు ఏర్పాటు చేయడానికి పలు సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయని ఎస్టీపీఐ విశాఖ జాయింట్ డైరెక్టర్ ఎం.పి.దూబే ‘సాక్షి’కి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మంచి సహకారం అందిస్తుండటంతో ఇక్కడ యూనిట్లు ఏర్పాటు చేయడానికి కంపెనీలు ముందుకు వస్తున్నాయన్నారు. ఐబీపీఎస్ కింద ఇప్పటివరకు 10,365 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించగా దీనికి నాలుగు రెట్లు పరోక్షంగా ఉపాధి లభిస్తుందన్నారు. ప్రత్యక్షంగా ఉపాధి లభించినవారిలో 90 శాతం మంది స్థానిక యువతే ఉన్నారని పేర్కొన్నారు. ఈ స్కీమ్ కింద వచ్చే రెండేళ్లలో ప్రత్యక్షంగా 45 వేల మందికి, పరోక్షంగా మూడు లక్షల మందికి ఉపాధి లభిస్తుందన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. ఐబీపీఎస్ అంటే.. గ్రామీణ ప్రాంతాల్లో బీపీవో కేంద్రాలను ఏర్పాటు చేసి.. స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ శాఖ ఐబీపీఎస్‌ను ప్రవేశపెట్టింది. చెన్నై, హైదరాబాద్, బెంగళూరు లాంటి పెద్ద నగరాల్లో కాకుండా చిన్న పట్టణాల్లో ఏర్పాటయ్యే బీపీవో యూనిట్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. ఈ స్కీమ్ కింద ఏర్పాటు చేసే ప్రతి సీటుకు గరిష్టంగా రూ.లక్ష ప్రోత్సాహం లభిస్తుంది. అదే మహిళలకు ఉపాధి కల్పిస్తే 5 శాతం, దివ్యాంగులకైతే మరో 5 శాతం అదనంగా ఆర్థిక ప్రయోజనం కల్పిస్తారు. చదవండి: డేటాతో పురోగతికి బాట ‘పంచాయతీ’ ఫలితం.. బాబుకు భయం -
స్టార్టప్‌లను ప్రోత్సహించాలి..
న్యూఢిల్లీ: బీపీవో, కేపీవో సేవలను జీఎస్టీ కింద ఇంటర్మీడియరీలు (మధ్యవర్తిత్వ సంస్థలు)గా పరిగణిస్తున్నందున పన్ను నిబంధనల పరంగా స్పష్టత తీసుకురావాలని ఐటీ కంపెనీల సంఘం నాస్కామ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. పరిశ్రమలో వృద్ధి రేటు మందగించినప్పటికీ... 2016 ఆర్థిక సంవత్సరం నుంచి 24 బిలియన్డాలర్ల ఆదాయాన్ని ఈ రంగం తెచ్చిపెట్టడమే కాకుండా నికరంగా ఎక్కువ ఉద్యోగాలు కల్పించిన విషయాన్ని గుర్తు చేసింది. స్టార్టప్‌ల్లో చేసే పెట్టుబడులపై ఏంజెల్ ట్యాక్స్ పేరుతో విధిస్తున్న లెవీని ఎత్తివేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు బడ్జెట్ ముందస్తు ప్రతిపాదనలను నాస్కామ్ కేంద్ర ఆర్థిక శాఖకు పంపింది. ఇంటర్మీడియరీలు కావు... బీపీవో, కేపీవోలు సహా ఐటీ ఆధారిత సేవలను ఇంటర్మీడియరీలుగా రెవెన్యూ శాఖ పరిగణిస్తుండడంపై నాస్కామ్ ఆందోళన వ్యక్తం చేసింది. సరఫరా ప్రదేశం, ప్రధాన కార్యాలయం, బ్రాంచ్‌ల లావాదేవీలు, సెజ్ కొనుగోళ్లనూ సత్వరమే పరిష్కరించాల్సిన అంశాలుగా నాస్కామ్ కోరింది. పెట్టుబడులకు ప్రోత్సాహం... స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు గాను ఏంజెల్ ట్యాక్స్‌ను రద్దు చేయాలన్నది నాస్కామ్ ప్రధాన డిమాండ్లలో మరొకటి. అంతేకాదు స్టార్టప్‌లకు రాయితీలు కూడా కల్పించాలని కోరింది. ‘‘ఏంజెల్ ఇన్వెస్టర్లు ఓ కంపెనీ ఆరంభ దశలో ఎంతో రిస్క్ తీసుకుని పెట్టుబడులు పెడుతుంటారు. కొత్త కంపెనీ ఆవిర్భవించి, వృద్ధి చెందేందుకు ఈ పెట్టుబడులు కీలకం. ఒకవేళ వీటికి రాయితీలు ఇవ్వకపోతే, కనీసం ప్రోత్సాహం అయినా ఇవ్వాల్సిన అవసరం ఉంది’’ అని ఆశిష్ అగర్వాల్ వివరించారు. -
ఏరోస్పేస్.. యమాజోష్..!
సాక్షి, హైదరాబాద్ : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ).. బిజినెస్ ప్రాసెస్ ఔట్సోర్సింగ్(బీపీవో).. నాలెడ్జ్ ప్రాసెస్ ఔట్సోర్సింగ్(కేపీవో) రంగాలకు నిలయంగా మారిన హైదరాబాద్ మహానగరం ఇప్పుడు ఏరోస్పేస్, ఎయిర్‌క్రాఫ్ట్ రంగాలకు కూడా హబ్‌గా మారుతోంది. నూతన పరిశ్రమల ఏర్పాటుకు వివిధ విభాగాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే విధానానికి స్వస్తి పలుకుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏకగవాక్ష విధానంలో ఒకేసారి అన్ని అనుమతులు మంజూరు చేసేందుకు వీలుగా టీఎస్ఐపాస్(తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం)విధానానికి 2015 జూన్‌లో శ్రీకారం చుట్టిన విషయం విదితమే. టీఎస్ఐపాస్ విధానం రాకతో 2015 జూన్ నుంచి 2017 డిసెంబర్ వరకూ గ్రేటర్ పరిధిలో వివిధ రంగాలకు సంబంధించి 386 మంది నూతన పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో 207 కంపెనీలు మరో మూడు నెలల్లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సన్నాహాలు మొదలుపెట్టాయి. ఆయా కంపెనీల ఏర్పాటుతో సుమారు రూ.2,407 కోట్ల పెట్టుబడులు నగరానికి తరలివచ్చినట్లు పరిశ్రమల శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇందులో అత్యధికంగా 60 ఏరోస్పేస్, ఎయిర్‌క్రాఫ్ట్ విడిభాగాల తయారీ పరిశ్రమలే ఉన్నాయి. ఆ తర్వాత తయారీ రంగం, ప్లాస్టిక్, సోలార్, ఐటీ రంగ పరిశ్రమలు ఉన్నాయి. ఇవన్నీ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలే. వీటి ద్వారా సుమారు 22 వేల మందికి నూతనంగా ఉపాధి దక్కే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. మరో మూడు నెలల్లో షురూ ప్రధానంగా గ్రేటర్ శివార్లలోని ఆదిభట్ల, నాదర్గుల్, మంగల్‌పల్లి, అంబర్పేట్, జీడిమెట్ల, పాశమైలారం, ఖాజిపల్లి, బొంతపల్లి, పటాన్చెరు, కాటేదాన్, మల్లాపూర్ తదితర ప్రాంతాల్లో నూతన పరిశ్రమలు ఏర్పాటుకానున్నాయి. ఆయా కంపెనీలకు అనుమతుల ప్రక్రియ పూర్తి కావడంతో మరో మూడు నెలల్లో ఉత్పత్తి ప్రారంభించే అవకాశాలున్నట్లు పరిశ్రమల శాఖ వర్గాలు తెలిపాయి. మొత్తంగా 386 మంది దరఖాస్తులు సమర్పించగా.. సాంకేతిక కారణాలు, భూమి, ఇతర మౌలిక వసతుల లభ్యత, పరపతి సౌకర్యం తదితర సమస్యల కారణంగా 179 కంపెనీల ఏర్పాటు ప్రక్రియ మందగించింది. ప్రస్తుతానికి 207 కంపెనీలు మాత్రమే కార్యరూపం దాల్చనున్నట్లు తెలిసింది. మిగతావి కూడా దశలవారీగా సమస్యలను అధిగమించి కంపెనీలు నెలకొల్పే అవకాశాలున్నట్లు సమాచారం. కాగా మహానగరానికి ఆనుకుని ఉన్న ఆయా పారిశ్రామిక వాడల్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు సుమారు 3 వేల వరకు ఉన్నట్లు పరిశ్రమల శాఖ వర్గాలు వెల్లడించాయి. -
చిన్న పట్టణాలకు బీపీఓ కంపెనీలు!
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ (బీపీవో) కంపెనీలను చిన్న పట్టణాల దిశగా కదిలించేందుకు ప్రోత్సాహకాలతో ముందుకొచ్చింది. ఇండియా బీపీవో ప్రమోషన్ స్కీమ్ కింద మొత్తం 48,300 సీట్లకుగాను 35,000 సీట్లు చిన్న పట్టణాలకే కేటాయించినట్టు తెలిపింది. రానున్న ఆరు నెలల్లో పూర్తి లక్ష్యాన్ని చేరుకుంటామని ఆశాభావం వ్యక్తం చేసింది. చిన్న పట్టణాల్లోనూ బీపీవో కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు కేంద్రం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ఒక్కో సీటుకు రూ.లక్ష చొప్పున ప్రత్యేక ప్రోత్సాహకాన్ని అందిస్తామని కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలియజేశారు. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) కింద ఈ ప్రోత్సాహకం ఇవ్వనున్నట్టు చెప్పారు. ‘‘ఈ పథకం ఆసరాతో బీపీవో అన్నది చిన్న పట్టణాల్లోనూ డిజిటల్ ఆకాంక్షలకు వేదికగా అవతరిస్తుంది. డిజిటల్ సాధికారతకు చిన్న పట్టణాల్లోని బీపీవోలు అతిపెద్ద చోదక శక్తి అవుతాయి’’ అని రవి శంకర్ ప్రసాద్ వివరించారు. ఇప్పటి వరకు నాలుగు దశల బిడ్డింగ్‌లో, 18,160 సీట్లను 87 కంపెనీలకు చెందిన 109 యూనిట్లకు కేటాయించినట్టు మంత్రి వెల్లడించారు. వీటిలో 76 యూనిట్లు కార్యకలాపాలు ఆరంభించాయని, ఇప్పటికే 10,297 మందికి ఉపాధి లభించిందని చెప్పారు. గత నెల ముగిసిన ఐదో దశ బిడ్డింగ్‌లో 68 కంపెనీలు 17,000 సీట్లకు బిడ్లు సమర్పించాయని, ప్రస్తుతం అవి పరిశీలనలో ఉన్నాయని ఆయన తెలియజేశారు. ఏపీలో మూడు చోట్ల కేంద్రాలు: కొత్తగా బీపీవో కేంద్రాలు ఆరంభించిన పట్టణాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, రాజమండ్రి, గుంటుపల్లి కూడా ఉన్నాయి. అలాగే, ఏపీలోని చిత్తూరు సహా తిర్పూర్, గయ, వెల్లూర్, జహనాబాద్, మధుర తదితర పట్టణాల్లోనూ బీపీవో కేంద్రాలకు బిడ్లు వచ్చినట్టు మంత్రి తెలిపారు. -
చిల్.. జిల్.. జిగా..
► గ్రేటర్ పరిధిలో లిక్కర్ కిక్కుకు వీకెండ్ జోష్ ► శుక్ర, శనివారాల్లో తెగతాగేస్తున్న మందుబాబులు ► నెలకు రూ.700 కోట్ల మేర అమ్మకాలు ► వీకెండ్లో రూ.100 కోట్లు దాటుతోన్న సేల్స్ ► రోజుకు పది లక్షల లీటర్ల బీరు.. ఐదు లక్షల లీటర్ల లిక్కర్ స్వాహా సాక్షి, హైదరాబాద్: ‘‘మందేస్తూ.. చిందెయ్‌రా.. చిందేస్తూ.. మందెయ్‌రా..’’ఇది ఓ సినిమాలోని పాట.. ఇప్పుడు గ్రేటర్‌లోని మందుబాబులు ఇదే పాట పాడుకుంటున్నారు. అటు లిక్కర్.. ఇటు బీరు అనే తేడా లేకుండా తెగ తాగేస్తున్నారు.. ఊగిపోతున్నారు. దీంతో గ్రేటర్లో లిక్కర్ కిక్కు.. కొత్త పుంతలు తొక్కుతోంది. కాస్మోపాలిటన్ సిటీగా పేరొందిన భాగ్యనగరంలో రోజుకు సుమారు పది లక్షల లీటర్ల బీరు.. ఐదు లక్షల లీటర్ల మద్యాన్ని ‘నిషా’చరులు కుమ్మేస్తున్నారట. నగరవ్యాప్తంగా నిత్యం లక్ష కేసుల(ఒక్కో కేసులో 12 సీసాలు) బీరు.. 25 వేల కేసుల లిక్కర్ అమ్ముడవుతోందట. ఇది ఇప్పటివరకు ఆల్‌టైమ్ రికార్డు అని ఆబ్కారీ శాఖ చెపుతోంది. ప్రధానంగా వీకెండ్ అయిన శుక్ర, శనివారాల్లోనే మందుబాబులు అత్యధికంగా తాగి ఊగేస్తున్నట్లు ఆబ్కారీ శాఖ లెక్కలు చెబుతున్నాయి. మందుబాబుల్లోనూ బీరు తాగేవారే అధికంగా ఉండడం విశేషం. 16 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు వారు బీరును ఎక్కువగా సేవిస్తుండగా.. 35 నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్కులు విస్కీకి ఓటేస్తున్నారట. ఇక జీవనశైలి సమస్యలతో బాధ పడుతున్నవారు బ్రాందీ, రెడ్‌వైన్ వంటి వాటిని ఇష్టపడుతున్నారట. వీకెండ్లో ఫుల్ జోష్.. ఐటీ, బీపీవో, కేపీవో, రియల్టీ, సేవా రంగాల్లో పని చేస్తున్నవారిలో ఎక్కువ మంది శుక్ర, శనివారాల్లో లిక్కర్ కిక్కుతో పసందు చేసేందుకు మక్కువ చూపిస్తున్నట్లు అమ్మకాల తీరును చూస్తే అవగతమవుతోంది. గ్రేటర్లో సాధారణ రోజుల్లో నిత్యం రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల మద్యం అమ్మకాలు జరుగుతుండగా.. వీకెండ్ రెండు రోజుల్లో రూ.100 కోట్ల మేర లిక్కర్ అమ్మకాలు జరుగుతున్నాయని అంచనా. కిక్కు కోట్లలో.. గ్రేటర్లో జనాభా కోటికి చేరువైంది. సిటీలో సుమారు 500 బార్లు.. మరో 400 మద్యం దుకాణాలు, 60 పబ్‌లు ఉన్నాయి. వీటిల్లో రోజువారీగా లిక్కర్ సేల్స్ మూడు ఫుల్లు.. ఆరు బీర్లు అన్న చందంగా మారింది. నెలకు సుమారు రూ.700 కోట్ల మద్యం అమ్మకాలు సాగుతుండగా.. ఇందులో వీకెండ్ రోజుల్లో రూ.400 కోట్లు.. సాధారణ రోజుల్లో రూ.300 కోట్ల మేర అమ్మకాలు జరుగుతున్నాయి. కాగా, మందుబాబులు ఒక్కొక్కరూ సగటున ఏటా 8.23 లీటర్ల బీరు, 7.48 లీటర్ల లిక్కర్‌ను స్వాహా చేస్తుండడం గమనార్హం. లిక్కర్ మాల్.. క్యా కమాల్.. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లోని ‘టానిక్’బడా లిక్కర్ మాల్ మందుబాబులను విశేషంగా ఆకర్షిస్తోంది. 15 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ లిక్కర్ మాల్ ఆసియాలోనే అతి పెద్దదిగా ప్రాచుర్యం పొందింది. ఈ మాల్లో 1,100 రకాల దేశ, విదేశీ లిక్కర్ బ్రాండ్లు లభ్యమవుతున్నాయి. రూ.300 బీరు మొదలు రూ. 5.23 లక్షల ఖరీదైన జాన్ వాకర్ విస్కీ వరకు ఇక్కడ లభిస్తున్నాయి. నిత్యం వేలాది మంది ఈ మాల్‌ను సందర్శిస్తున్నారు. క్షణాల్లో బీ(రు)రెడీ.. బీరు ప్రియుల దాహార్తిని తీర్చేం దుకు.. క్షణాల్లో చిల్డ్ బీర్‌ను సర్వ్ చేసేందుకు గ్రేటర్ పరిధిలో ఫ్రోస్ట్, మిర్చీ, హాట్ కప్ తదతర పేర్లతో ఏడు మినీ బ్రూవరీలు అందుబాటులోకి వచ్చాయి. ఇటీవల వీటికి ఆదరణ పెరిగింది. జూబ్లీహిల్స్‌లోని ‘జూబ్లీ 800’మినీ బ్రూవరీ పబ్‌లో 500 మి.లీ. పరిమాణంలో ఉండే బీరు ధర రూ.300. రుచి, నాణ్యత విషయంలో ఈ బీరు యూత్‌ను విశేషంగా ఆకర్షిస్తోందని నిర్వాహకులు చెపుతున్నారు. ఇందులోనూ స్ట్రౌట్, బీట్, స్ట్రాగేల్, యాపిల్ వంటి ఫ్లేవర్స్ లభ్యమవుతున్నాయి. -
మార్చిలో నియామకాలు 5 % జంప్
న్యూఢిల్లీ: ఉద్యోగ నియమాకాలు మార్చి నెలలో 5 శాతం పెరిగాయి. దీనికి బీఎఫ్ఎస్ఐ, బీపీవో, ఆటో, నిర్మాణ రంగాలు బాగా దోహదపడ్డాయి. రానున్న నెలల్లో కూడా నియామకాల జోరు కొనసాగవచ్చనే అంచనాలు ‘నౌకరి.కామ్’ నివేదికలో వెల్లడయ్యాయి. ఈ ఏడాది మార్చి నెలకు సంబంధించి నౌకరి జాబ్‌స్పీక్ ఇండెక్స్ 2,073 వద్ద ఉంది. గతేడాది ఇదే నెలతో పోలిస్తే ఇండెక్స్‌లో 5 శాతం వృద్ధి నమోదయ్యింది. ‘వార్షిక ప్రాతిపదికన చూస్తే జాబ్‌స్పీక్ ఇండెక్స్‌లో 5 శాతం వృద్ధి కనిపిస్తోంది. నిర్మాణ, ఇంజనీరింగ్, బీఎఫ్ఎస్ఐ రంగాల్లోని నియామకాల్లో మంచి వృద్ధి నమోదయ్యింది’ అని నౌకరి డాట్‌కామ్ చీఫ్ సేల్స్ ఆఫీసర్ వి.సురేశ్ చెప్పారు. స్వల్పకాల ఒడిదుడుకులు ఉన్నప్పటికీ వచ్చే త్రైమాసికాల్లో జాబ్ మార్కెట్ జోరు కొనసాగుతుందన్నారు. నియామకాల కదలికలను రంగాల వారీగా చూస్తే... బీఎఫ్ఎస్ఐలో 26 శాతం వృద్ధి నమోదయింది. బీపీవో/ఐటీఈఎస్, నిర్మాణ రంగాల్లో 9 శాతం చొప్పున పెరుగుదల కనిపించింది. ఐటీ–సాఫ్ట్‌వేర్‌లో ఎలాంటి పురోగతి లేదు. టెలికం రంగంలో మాత్రం 15% క్షీణత నమోదైంది. ప్రాంతాల వారీగా.. 13 ప్రధాన నగరాలకు గాను ఎనిమిదింటిలో నియామకాలు తగ్గాయి. ఢిల్లీ/ఎన్సీఆర్, ముంబై, బెంగళూరు, చెన్నై ప్రాంతాల్లో నియామకాలు వరుసగా 15%, 12%, 4%, 10% పడ్డాయి. కాగా 13–16 ఏళ్ల అనుభవమున్న వారి కి ఎక్కువ ఉద్యోగ అవకాశాలు లభించాయి. -
కాల్ సెంటర్లో ‘కేటుగాళ్లు’
► వినియోగదారుల డేటా లీక్ చేస్తోంది బీపీవో ఉద్యోగులే ► దీని ఆధారంగానే స్వాహా చేస్తున్న ‘జమ్‌తార’గ్యాంగ్ ► కరంతాడ్ ద్వయం ఇళ్లల్లో జరిపిన సోదాల్లో ఆధారాలు లభ్యం ► కాల్ సెంటర్ ఉద్యోగులపై చర్యలకు సన్నాహాలు సాక్షి, హైదరాబాద్: జాతీయ బ్యాంకులు తమ ఖాతాదారులకు అవసరమైన సేవలందించడా నికి ఏర్పాటు చేసుకున్న కాల్ సెంటర్ల నుంచే కస్టమర్ల ‘డేటా’ లీక్ అవుతోంది. దీని ఆధారం గానే సైబర్ నేరగాళ్లు ఆయా వినియోగదా రులకు ఫోన్లు చేసి అందినకాడికి దండుకుం టున్నారు. సీసీఎస్ ఆధీనంలోని సైబర్ క్రైమ్ పోలీసులు ఇటీవల అరెస్టు చేసిన కరంతాడ్ ద్వయం కేసులో దీనికి సంబంధించిన కీలకా ధారాలు లభించాయి. ఫిర్యాదు వివరాలు చెప్పడంతో... నగరంలోని డీఆర్డీఏలో పనిచేసే ఓ సైంటిస్ట్ తన సమస్యపై ఎస్బీఐ కాల్ సెంటర్‌కు ఫిర్యా దు చేశారు. 24 గంటల్లోనే ఆయనకు ‘కాల్ సెంటర్’ నుంచి ఫోన్ వచ్చింది. ఫిర్యాదు పరి ష్కరించడానికి ఫోన్ చేశామని చెప్పిన నేరగా ళ్లు.. దానికోసం మరో బ్యాంకు ఖాతా వివరా లు కోరారు. దీంతో తనకు మరో బ్యాంక్‌లో ఉన్న ఖాతా వివరాలు చెప్పారు. ఇలా ఆ సైంటిస్ట్‌ను బుట్టలో వేసుకున్న సైబర్ గ్యాంగ్ ఆయన ఖాతా నుంచి రూ.1.09 లక్షలు కాజేసింది. దీనిపై సైంటిస్ట్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించారు. సైంటిస్ట్ కేసు దర్యాప్తులో భాగంగా... ‘బ్యాంక్ కాల్స్’ పేరుతో రెచ్చిపోతున్న ఉదం తాలు ఇటీవల పెరిగిపోయాయి. ఈ నేర గాళ్లలో కొందరు జార్ఖండ్– పశ్చిమ బెంగాల్ మధ్య ఉన్న జమ్‌తార కేంద్రంగా దందాలు సాగిస్తున్నట్లు గుర్తించారు. వీరిని పట్టుకోవడా నికి అక్కడికి వెళ్లిన సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ నేతృత్వంలోని ప్రత్యేక బృందం కరంతాడ్లో మనీష్బర్నవాల్, వికాస్కుమార్ రావణిని పట్టుకున్నారు. సైంటిస్ట్ ఖాతా నుంచి డబ్బు కాజేసింది వీరిద్దరే కావడంతో.. కాల్ సెంటర్‌కు ఫిర్యాదు చేసిన 24 గంటల్లోనే విషయం ఎలా తెలిసిందనేది ఆరా తీశారు. మరో కేసు నమోదుకు సన్నాహాలు... మనీష్, వికాస్‌ను లోతుగా విచారించగా.. తమకు బ్యాంక్ కస్టమర్ల సమాచారం కాల్ సెంటర్ నుంచే అందుతోందని అంగీకరించా రు. నష్టపోతున్న వారిలో ఎక్కువగా కొన్ని బ్యాంకుల వినియోగదారులు ఉండటానికీ ఇదే కారణమని పోలీసులు అంచనా వేస్తు న్నారు. ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న అధికారులు సదరు కాల్ సెంటర్ పాత్రనూ కేసులో పొందుపరచాలని నిర్ణయించారు. కాల్ సెంటర్ ఉద్యోగుల్నీ నిందితులుగా చేర్చి అరెస్టు చేయడానికి రంగం సిద్ధం చేశారు. దీనిపై సైబర్ క్రైమ్ ఏసీపీ రఘువీర్ ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘ఇక్కడ నమోదైన కేసుకు సంబంధించి వినియోగదారుడి సమాచారం మనీష్, వికాస్‌కు ఏ కాల్ సెంటర్ నుంచి అందిందనేది గుర్తించాలి. న్యాయస్థానం అనుమతితో నిందితుల్ని కస్టడీలోకి తీసుకుని ఈ కోణంలో విచారిస్తాం. వివరాలు వెలుగులోకి వచ్చిన తర్వాత చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం’అని చెప్పారు. సోదాల్లో దొరికిన ‘కోల్‌కతా నోటీసు’.. మనీష్, వికాస్ ఇళ్లల్లో సోదాలు చేసిన సైబర్ క్రైమ్ పోలీసులకు లభించిన కోల్‌కతా పోలీసుల నోటీసు ‘సమాచారం గుట్టు’ వీడడానికి కీలకమైంది. బెంగాల్‌ల్లో ఎస్బీఐ కాల్ సెంటర్‌ను ఇంటెల్ నెట్ గ్లోబెల్ సర్వీసె స్ బీపీవో సంస్థ నిర్వహిస్తోంది. ఇందులో పని చేసే విధాన్ దాస్ మరికొందరు ఉద్యోగులు సైబర్ నేరగాళ్లకు సహకరిస్తు న్నారు. కస్టమర్ల నుంచి వచ్చే ఫిర్యాదుల సమాచారాన్ని కమీషన్ తీసుకుని మనీష్, వికాస్‌కు అందిస్తున్నారు. ‘లీకేజ్’వ్యవహారా న్ని గతంలోనే గుర్తించిన బ్యాంకు.. కోల్‌కతా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా మనీష్, వికాస్ పేర్లు వెలుగులోకి రావడంతో విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారు. ఇవే సైబర్ క్రైమ్ పోలీసులకు సోదాల్లో లభించాయి. -
చిన్న పట్టణాల్లో బీపీవో కాల్ సెంటర్లు
9వేల సీట్లకు ఎస్టీపీఐ అనుమతి న్యూఢిల్లీ: చిన్న పట్టణాల్లో బిజినెస్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్ (బీపీవో) కేంద్రాలు మరిన్ని తెరుచుకోనున్నాయి. 9 వేల సీట్ల (ఉద్యోగుల) సామర్థ్యంతో కూడిన పలు బీపీవో కాల్ సెంటర్లను దేశవ్యాప్తంగా వివిధ పట్టణాల్లో ఏర్పాటు చేసేందుకు సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్టీపీఐ) సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. వారణాసి, సిలిగురి, పాట్నా, ఉన్నావో, అమరావతి, ధూలే, కటక్, ముజఫర్‌పూర్, దాల్సింగ్సరాయ్ తదితర పట్టణాల్లో బీపీవోలు రానున్నాయి. 18 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 60 ప్రదేశాల్లో 50 కంపెనీలు బీపీవో కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాయి. ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి రాజీవ్‌కుమార్ మాట్లాడుతూ... ఎస్టీపీఐ 9,020 సీట్ల సామర్థ్యానికి సూత్రప్రాయ ఆమోదం తెలిపిందని, సోమవారం ప్రారంభమైన మూడో దశ బిడ్డింగ్ ద్వారా మరో 3,000 సీట్ల సామర్థ్యానికి అనుమతులు జారీ చేసే అవకాశం ఉందన్నారు. టీసీఎస్, అమేజాన్ తదితర పెద్ద కంపెనీలే బిడ్డింగ్‌లో పాల్గొంటున్నట్టు అధికారులు తెలిపారు. సోమవారం ఢిల్లీలో జరిగిన బీపీవో వర్క్‌షాప్ సందర్భంగా కేంద్ర ఐటీ, న్యాయ శాఖల మంత్రి రవిశంకర్ ప్రసాద్ విలేకరులతో మాట్లాడారు. తాను గతంలో బెంగళూరులో పర్యటించిన సమయంలో ఈశాన్య రాష్ట్రాలు, బిహార్, ఇతర ప్రాంతాల ప్రజలు తాము తమ స్వస్థలాల్లో పనిచేసుకుంటామని, అందుకోసం ఏదో ఒకటి చేయాలని అడిగారని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. బీపీవోలు చిన్న పట్టణాల్లో ఏర్పాటు చేయడం పట్ల తనకు సంతోషంగా ఉందని, స్థానికులు తమ ప్రాంతాలను విడిచిపెట్టే అవసరం లేకుండా అక్కడే పనిచేసుకోగలుగుతారని పేర్కొన్నారు. బీపీవో కేంద్రాల ప్రోత్సాహక పథకం కింద కేంద్రం దేశవ్యాప్తంగా మొత్తం 48,300 సీట్ల సామర్థ్యం వరకు కాల్ సెంటర్ల ఏర్పాటుకు అవసరమైన ఆర్థిక సహకారం అందించనుంది. ఒక్కో సీటుపై రూ.ఒక లక్ష వరకు వ్యయం చేస్తే అందులో సగాన్ని కేంద్రం భరిస్తుంది. -
మోటిఫ్ నియామకాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: గుజరాత్‌లోని అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న బీపీవో, కేపీవో సంస్థ మోటిఫ్ వచ్చే మూడు నెలల్లో 300 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ప్రకటించింది. నైపుణ్యం కలిగిన మానవ వనరుల నియామకం కోసం హైదరాబాద్ వంటి పట్టణాల్లో రోడ్ షోలతోపాటు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నుట్లు మోటిఫ్ వైస్ ప్రెసిడెంట్ (హెచ్ఆర్) సంజయ్ సాహ్ని తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆదివారం ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని, ఈ కేంద్రం నుంచి కనీసం 40 నుంచి 50 మందిని తీసుకోగలమన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. ప్రారంభ వేతనం(సీటీసీ) నెలకు రూ. 18,000 నుంచి రూ. 21,000 వరకు ఉంటుందన్నారు. ప్రస్తుతం అహ్మదాబాద్ కేంద్రంలో 1,500 మంది పనిచేస్తున్నారని, అక్కడ సిబ్బంది 2,000 దాటితే మరో నగరంలో కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం మోటిఫ్ అమెరికా, ఫిలిఫ్పైన్స్లలో కేంద్రాలున్నాయి. ప్రస్తుతం సంస్థ టర్నోవర్ రూ. 100 కోట్ల మార్కును అందుకొందని, ఈ ఏడాది వ్యాపారంలో 20% వృద్ధిని అంచనావేస్తున్నట్లు సాహ్ని తెలిపారు. -
హైదరాబాద్‌లో కొత్త కొలువుల జోరు: నౌకరీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆర్థిక పరిస్థితులపై సెంటిమెంటు మెరుగుపడుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో గత నెల జోరుగా నియామకాలు జరిగాయి. గతేడాది ఆగస్టుతో పోలిస్తే ఈసారి హైరింగ్ 17% పెరిగింది. నియామకాలకు సంబంధించి నౌకరీడాట్‌కామ్ నిర్వహించే జాబ్ స్పీక్ సూచీ ద్వారా ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఫార్మా, ఐటీ, ఐటీఈఎస్ రంగాల ఊతంతో హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో జాబ్ మార్కెట్ గణనీయంగా ఊపందుకుందని నౌకరీడాట్‌కామ్ చీఫ్ సేల్స్ ఆఫీసర్ వి. సురేష్ తెలిపారు. కొత్త రాష్ట్రం ఏర్పాటు, పండుగ సీజన్ కారణంగా రాబోయే రోజుల్లో హైరింగ్ సెంటిమంటు మరింత మెరుగుపడొచ్చని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, దేశవ్యాప్తంగా చూస్తే .. టెలికం, ఐటీ/బీపీవో రంగాల ఊతంతో గత నెల నియామకాలు 18% మేర పెరిగాయి. 2013తో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టులో ఈ సూచీ 18% పెరిగి 1,478 వద్ద నిల్చింది. జూలైతో పోలిస్తే ఆగస్టులో నియామకాలు సుమారు 10% క్షీణించినప్పటికీ.. రాబోయే రోజుల్లో మాత్రం జోరు కొనసాగవచ్చని నౌకరీడాట్‌కామ్ అంచనా. రంగాల వారీగా చూస్తే టెలికంలో 36%, బీపీవోలో 26 శాతం మేర వృద్ధి నమోదైంది. మెట్రో నగరాల వారీగా చూస్తే ఢిల్లీ-ఎన్సీఆర్ ప్రాంతంలో గరిష్టంగా నియామకాలు జరగ్గా.. బెంగళూరు, చెన్నై, కోల్‌కతా తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ముంబైలో అత్యంత తక్కువ శాతం నమోదైంది. -
ఐటీ సిటీలో... బీపీవో/కేపీవో కెరీర్!
బీపీవో అంటే.. బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్. కేపీవో అంటే.. నాలెడ్జ్ ప్రాసెస్ అవుట్సోర్సింగ్. బీపీవో/కేపీవో రంగం దేశ యువతకు అద్భుత అవకాశాలను అందిస్తోంది. ఇప్పటికే వేల మందికి ఉపాధి కల్పిస్తోంది. ఐటీ హబ్ హైదరాబాద్‌లో బీపీవో/కేపీవో రంగం విస్తృతమవుతోంది. గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం 33 శాతం అధికంగా నియామకాలు జరిగినట్లు అంచనా. టీసీఎస్ బీపీవో, ఇన్ఫోసిస్ బీపీవో, విప్రో బీపీవో, హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్ తదితర ప్రధాన కంపెనీలు నియామకాలను వేగవంతం చేస్తున్న నేపథ్యంలో సిటీలో బీపీవో/కేపీవోలో అవకాశాలపై ఫోకస్.. అంచనాలిలా : నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్(నాస్కామ్) అంచనా ప్రకారం- దేశవ్యాప్తంగా 500పైగా బీపీవో/కేపీవో కంపెనీలు, బిలియన్ల అమెరికన్ డాలర్ల రెవెన్యూతో లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. రానున్న రోజుల్లో బీపీవో/కేపీవో జాబ్‌మార్కెట్ మరింత ఆశాజనకంగా మారుతుందని అంచనా వేస్తున్నారు. మొత్తం ప్రపంచ అవుట్‌సోర్సింగ్‌లో భారత్ నుంచే 52 శాతం మేర జరుగుతోంది. 2016 నాటికి ప్రపంచంలో బీపీవో సేవల ద్వారా వచ్చే ఆదాయం 176 బిలియన్ అమెరికన్ డాలర్లు దాటుతుందని సర్వేలు చెబుతున్నాయి. ఆ మేరకు భారత్‌లోనూ ఈ రంగం ఏటా గణనీయంగా వృద్ధి నమోదు చేసుకునే అవకాశముంది. తద్వారా బీపీవో/కేపీవో రంగంలో దేశంలోని యువతకు ఉపాధి లభించనుంది. ఆరు వేలకు పైగా : ఐటీ హబ్‌గా పేరుపొందిన హైదరాబాద్‌లో బీపీవో/కేపీవో జాబ్ మార్కెట్ మరింత ఊపందుకోనుంది. గతేడాదితో పోల్చితే ప్రస్తుతం నియామకాలు గణనీయంగా పెరిగాయంటున్నారు. ఇప్పటికే పలు బీపీవో కంపెనీలు రిక్రూట్‌మెంట్స్‌ను వేగవంతం చేశాయి. ఈ ఏడాది హైదరాబాద్‌లోని బీపీవో సంస్థల్లో కనీసం ఆరు వేలకు పైగా కొలువులు ఖాయమని ఆయా కంపెనీల ప్రతినిధులు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ స్థాయిలో సేవలు అందించడం, పలు దేశాలకు చెందిన క్లయింట్స్‌తో పనిచేయాల్సి రావడంతో కంపెనీలు ఉద్యోగులకు మంచి ప్యాకేజీలను అందిస్తున్నాయని తెలిపారు బీ4బీ ఐటీ సొల్యూషన్స్ చైర్మన్ సురేశ్‌సింగ్. బీపీవో/కేపీవో సేవలివే: డేటా ఎంట్రీ మొదలుకొని మెడికల్ ట్రాన్స్క్రిప్షన్, కంటెంట్ రైటింగ్, సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్, హెచ్ఆర్, ప్రాసెసింగ్, డిపార్ట్మెంట్ అవుట్సోర్సింగ్, టెక్నికల్ సపోర్ట్, కస్టమర్ సపోర్ట్, ఫైనాన్షియల్ సర్వీసెస్ వరకూ.. అన్ని రకాల సేవలను విదేశాల్లోని తమ క్లయింట్లకు ఇక్కడి బీపీవో కంపెనీలు అందిస్తాయి. కేపీవో కంపెనీలు మాత్రం రీసెర్చ్ అండ్ డవలప్మెంట్, ఫైనాన్సియల్ కన్సల్టెన్సీ అండ్ సర్వీసెస్, లీగల్ సర్వీసెస్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ, పేటెంట్ సంబంధిత సేవలు, ఇంజనీరింగ్, అడ్వాన్స్డ్ వెబ్ అప్లికేషన్స్, వెబ్ డెవలప్మెంట్, క్యాడ్/క్యామ్, బిజినెస్ రీసెర్చ్, అనలిటిక్స్, క్లినికల్ రీసెర్చ్, ఫార్మాస్యూటికల్ అండ్ బయోటెక్నాలజీ, బిజినెస్ అండ్ మార్కెట్ రీసెర్చ్ వంటి వాటిపై ప్రధానంగా దృష్టి సారిస్తాయి. ఇవిగో అవకాశాలు ఇక్కడ బీపీవోలో డేటా ఎంట్రీ, మెడికల్ ట్రాన్స్‌స్క్రిప్షన్, కంటెంట్ రైటింగ్, సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్, హెచ్ఆర్, ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి విభాగాలు ఉంటాయి. అన్ని రకాల వ్యాపారాల్లో బీపీఓ సేవలు అందుబాటులో ఉన్నాయి. పరిజ్ఞానం, సమాచార సంబంధమైన కార్యకలాపాల నిర్వహణను కేపీవో అంటారు. ఇందులో అధిక నైపుణ్యాలున్న వ్యక్తులకు అవకాశాలు లభిస్తాయి. కేపీవోలో లీగల్ సర్వీసెస్, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, పేటెంట్ సంబంధ సేవలు, ఇంజనీరింగ్ సంబంధిత సేవలు, వెబ్ డెవలప్మెంట్, క్యాడ్/క్యామ్ అప్లికేషన్స్, బిజినెస్ రీసెర్చ్, అనలిటిక్స్, లీగల్ రీసెర్చ్, క్లినికల్ రీసెర్చ్, పబ్లిషింగ్, మార్కెట్ రీసెర్చ్ వంటి విభాగాలుంటాయి. నాలెడ్జ్ ప్రాసెస్ విభాగంలో ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్, మేనేజ్మెంట్, లా, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్, అకౌంటింగ్, బయోలాజికల్ సెన్సైస్ ఉత్తీర్ణులకు కంపెనీలు అవకాశం కల్పిస్తున్నాయి. యూకే, యూఎస్ పబ్లికేషన్ సంస్థలు డేటా ఎంట్రీ ఆపరేటర్స్, వెబ్ డిజైనర్స్, గ్రాఫిక్ డిజైనర్స్‌ను నియమించుకుంటున్నాయి. డిప్లొమా, మల్టీమీడియా సర్టిఫికెట్ కోర్సులు చేసిన వారిని కూడా తీసుకుంటున్నాయి. ఈ రంగంలో స్థాయిని బట్టి ప్రారంభ వేతనం రూ.8 వేల నుంచి రూ.25 వేల వరకూ ఉంటుంది. కావాల్సిన అర్హతలు బీపీవో రంగంలో అడుగుపెట్టాలంటే భారీ విద్యార్హతలు, అనుభవం ఏమీ అవసరం లేదు. ఇంటర్ లేదా బ్యాచిలర్‌స డిగ్రీ పూర్తయిన తర్వాత నేరుగా ఇందులోకి ప్రవేశించవచ్చు. బీపీఓలో షిఫ్ట్‌లవారీగా విధులు ఉంటాయి. పనివేళలు పగలు, రాత్రి ఉంటాయి. ఈ రంగంలో నిలదొక్కుకోవాలంటే సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనే తత్వం అవసరం. వేగంగా పనిచేసే నేర్పు ఉండాలి. ఇంగ్లిషు, ఎంఎస్ ఆఫీస్, ఇంటర్నెట్ వంటి అంశాల్లో నైపుణ్యాలు పెంచుకోవాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే కస్టమర్ సర్వీసెస్ విభాగంలో పనిచేయొచ్చు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో గట్టి పట్టు ఉంటే టెక్నికల్ సపోర్ట్ ప్రొఫెషనల్స్‌గా స్థిరపడొచ్చు. కేపీవోలో చేరడానికి బీపీవోతో పోలిస్తే ఇంజనీరింగ్/మేనేజ్మెంట్/లా వంటి అర్హతలు అవసరం. బలాలు... బలహీనతలు బీపీవో/కేపీవోలో పుష్కలమైన అవకాశాలు లభిస్తున్నప్పటికీ జీవనశైలికి భిన్నంగా రాత్రివేళలో విధులు ఉంటాయి. నిద్రలేమి కారణంగా తరచూ అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుం టే ఈ రంగంలో పనిచేయడం సులువే. నాస్కామ్ గణాంకాల ప్రకారం... టాప్-10 బీపీఓ కంపెనీలు జెన్పాక్ట్ , డబ్ల్యూఎన్ఎస్ గ్లోబల్, ఐబీఎం దక్ష్, ఆదిత్య బిర్లా మినాక్స్ వరల్డ్‌వైడ్, టీసీఎస్ బీపీఓ, విప్రో బీపీవో, ఫస్ట్‌సోర్స్, ఇన్ఫోసిస్ బీపీఓ, హెచ్‌సీఎల్ బీపీఓ, ఎక్సెల్ సర్వీస్ హోల్డింగ్. బీపీవో/కేపీవోపై యువత ఆసక్తి ‘‘బీపీఎం (బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్) సెక్టార్లో భారీ సంఖ్యలో ఉద్యోగుల నియామకం జరుగుతోంది. పనివేళల్లో కొంత వెసులుబాటు కల్పించ డం ద్వారా ఉద్యోగుల పనితీరును పెంచుతున్నాం. రాత్రి వేళల్లో విధులు కావడంతో ఈ రంగంపై గతంలో కొన్ని అపోహలు ఉండేవి. వాటిని పోగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రస్తుతం ‘నాస్కామ్’తోపాటు పలు బీపీవో కంపెనీలు చేపడుతున్న చర్యలతో యువత బీపీవో/కేపీవోను కెరీర్‌గా ఎంచుకు నేందుకు ఆసక్తి చూపుతోంది. విద్యార్థులు చదువుకుంటూనే తీరిక వేళల్లో కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తూ సంపాదించుకొనే అవకాశం ఉంది’’ - సురేశ్‌సింగ్, చైర్మన్, బీ4బీ ఐటీ సొల్యూషన్స ఆర్థిక వ్యవస్థలో కీలకం ‘‘మన దేశంలో ఢిల్లీ, బెంగళూరు, పుణె తదితర నగరాలతో పాటు హైదరాబాద్ కూడా ఐటీ సెక్టార్లో దూసుకుపోతోంది. బిజినెస్ ప్రాసెస్ మేనేజ్మెంట్(బీపీఎం) రంగంలో యువతకు పుష్కలమైన అవకాశాలున్నాయి. ప్రారంభంలోనే మంచి వేతనం అందుకునే అవ కాశం ఉంది. ఇండియన్ బీపీవో సెక్టార్లో ఉద్యో గస్తుల సగటు వయసు 21-30 ఏళ్ల లోపే. బీపీఎం యువతకు మంచి కెరీర్ ఆప్షన్. కరిక్యులంలో బీపీఎం కోర్సును అకడమిక్ స్థాయిలో చేర్చాలని ప్రభుత్వానికి నాస్కామ్ ప్రతిపాదించింది. గ్లోబల్ బిజినెస్, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో బీపీఎం రంగం కీలకమైనదని అన్ని దేశాలూ గుర్తించాయి. సోషల్ మీడియా, మొబైల్ అప్లికేషన్స, డేటా అనలిటిక్స్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటివి ప్రపంచాన్నే శాసించగల టెక్నాలజీలుగా మారాయి. ఈ నేపథ్యంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటే కెరీర్లో ఉన్నతస్థాయికి ఎదగొచ్చు. బీపీవో/ కేపీవోలో రాణించాలంటే ఆంగ్ల ఉచ్ఛారణ, కమ్యూనికేషన్ స్కిల్స్, భావోద్వేగాలపై నియంత్రణ, టీమ్ స్పిరిట్ ఉంటే చాలు’’ -పార్థ డే సర్కార్, సీఈవో, హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్ -
జనవరిలో జోరుగా హైరింగ్
న్యూఢిల్లీ: ఈ ఏడాది జనవరిలో హైరింగ్ పెరిగిందని ఆన్లైన్ హైరింగ్ పోర్టల్ నౌకరీడాట్‌కామ్ తెలిపింది. గత మూడు నెలలుగా హైరింగ్ కార్యకలాపాలు పెరుగుతున్నాయని, ఎన్నికల తర్వాత మరింతగా ఊపందుకుంటాయని తెలియజేసింది. మెట్రో నగరాల్లో హైరింగ్ పరిస్థితులు హైదరాబాద్, కోల్‌కతాల్లో గరిష్ట మెరుగుదల ఉందని పేర్కొంది. నౌఖరీ సర్వే ప్రకారం... గతేడాది డిసెంబర్‌తో పోల్చితే ఈ ఏడాది జనవరిలో ఆన్లైన్ హైరింగ్ కార్యకలాపాలను ప్రతిబింబించే నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ 13 శాతం వృద్ధితో 1,466 పాయింట్లకు పెరిగింది. ఇక గత ఏడాది జనవరితో పోల్చితే ఇది 15 శాతం పెరిగింది. ఐటీ, బీపీవో రంగాల్లో అధికంగా ఉద్యోగాలొచ్చాయి. టెలికాం రంగంలో హైరింగ్ చాలా ఎక్కువ తగ్గింది. వాహన రంగంలో స్వల్పంగా తగ్గింది. సేల్స్, బిజినెస్ డెవలప్మెంట్, ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఉద్యోగులకు డిమాండ్ పెరగడం కొనసాగుతోంది. గత మూడు నెలలుగా నౌకరీ జాబ్ స్పీక్ ఇండెక్స్ నెలకు సగటున 4% చొప్పున వృద్ధి సాధిస్తోంది. అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుండడం, త్వరలో జరగనున్న ఎన్నికలు తదితర కారణాలతో నియామకాలు పుంజుకుంటాయి. ఎన్నికల అనంతరం పలు కంపెనీలు విస్తరణ కార్యకలాపాలు చేపడతాయి. ఫలితంగా ప్రతిభ గల ఉద్యోగుల కోసం డిమాండ్ పెరుగుతుంది.