చిన్న పట్టణాల్లో బీపీవో కాల్ సెంటర్లు
9వేల సీట్లకు ఎస్‌టీపీఐ అనుమతి
న్యూఢిల్లీ: చిన్న పట్టణాల్లో బిజినెస్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్ (బీపీవో) కేంద్రాలు మరిన్ని తెరుచుకోనున్నాయి. 9 వేల సీట్ల (ఉద్యోగుల) సామర్థ్యంతో కూడిన పలు బీపీవో కాల్ సెంటర్లను దేశవ్యాప్తంగా వివిధ పట్టణాల్లో ఏర్పాటు చేసేందుకు సాఫ్ట్‌వేర్ టెక్నాలజీ పార్క్స్ ఆఫ్ ఇండియా (ఎస్‌టీపీఐ) సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. వారణాసి, సిలిగురి, పాట్నా, ఉన్నావో, అమరావతి, ధూలే, కటక్, ముజఫర్‌పూర్, దాల్‌సింగ్‌సరాయ్ తదితర పట్టణాల్లో బీపీవోలు రానున్నాయి. 18 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 60 ప్రదేశాల్లో 50 కంపెనీలు బీపీవో కేంద్రాలను ఏర్పాటు చేయనున్నాయి.
ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ సంయుక్త కార్యదర్శి రాజీవ్‌కుమార్ మాట్లాడుతూ... ఎస్‌టీపీఐ 9,020 సీట్ల సామర్థ్యానికి సూత్రప్రాయ ఆమోదం తెలిపిందని, సోమవారం ప్రారంభమైన మూడో దశ బిడ్డింగ్ ద్వారా మరో 3,000 సీట్ల సామర్థ్యానికి అనుమతులు జారీ చేసే అవకాశం ఉందన్నారు. టీసీఎస్, అమేజాన్ తదితర పెద్ద కంపెనీలే బిడ్డింగ్‌లో పాల్గొంటున్నట్టు అధికారులు తెలిపారు. సోమవారం ఢిల్లీలో జరిగిన బీపీవో వర్క్‌షాప్ సందర్భంగా కేంద్ర ఐటీ, న్యాయ శాఖల మంత్రి రవిశంకర్ ప్రసాద్ విలేకరులతో మాట్లాడారు. తాను గతంలో బెంగళూరులో పర్యటించిన సమయంలో ఈశాన్య రాష్ట్రాలు, బిహార్, ఇతర ప్రాంతాల ప్రజలు తాము తమ స్వస్థలాల్లో పనిచేసుకుంటామని, అందుకోసం ఏదో ఒకటి చేయాలని అడిగారని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.
బీపీవోలు చిన్న పట్టణాల్లో ఏర్పాటు చేయడం పట్ల తనకు సంతోషంగా ఉందని, స్థానికులు తమ ప్రాంతాలను విడిచిపెట్టే అవసరం లేకుండా అక్కడే పనిచేసుకోగలుగుతారని పేర్కొన్నారు. బీపీవో కేంద్రాల ప్రోత్సాహక పథకం కింద కేంద్రం దేశవ్యాప్తంగా మొత్తం 48,300 సీట్ల సామర్థ్యం వరకు కాల్ సెంటర్ల ఏర్పాటుకు అవసరమైన ఆర్థిక సహకారం అందించనుంది. ఒక్కో సీటుపై రూ.ఒక లక్ష వరకు వ్యయం చేస్తే అందులో సగాన్ని కేంద్రం భరిస్తుంది.