జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల చాలా రంగాల్లో ఉద్యోగాలుపోయే ప్రమాదముందని చాలామంది నిపుణులు చెబుతున్నారు. తాజాగా ఐటీ పరిశ్రమ సంఘం నాస్‌కామ్ ఛైర్మన్ రాజేశ్ నంబియార్ ఈ అంశంపై స్పందిస్తూ జనరేటివ్ ఏఐ కారణంగా బిజినెస్ ప్రాసెస్ ఔట్‌సోర్సింగ్ (బీపీఓ) రంగంలో పనిచేసే ఉద్యోగులకు అధికంగా ముప్పు వాటిల్లనుందని తెలిపారు.
భారత టెక్ పరిశ్రమలో కీలకమైన సాఫ్ట్‌వేర్ సేవల విభాగం మాత్రం ఈ విషయంలో పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఏఐ ముప్పును గ్రహించి, 48.9 బిలియన్ డాలర్ల (సుమారు రూ.4.06 లక్షల కోట్ల) విలువైన దేశీయ బిజినెస్ ప్రాసెస్ మేనేజ్‌మెంట్ (బీపీఎం) పరిశ్రమ త్వరగా తన విధానాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. 250 బిలియన్ డాలర్ల (సుమారు రూ. 20.75 లక్షల కోట్ల) విలువైన దేశీయ ఐటీ పరిశ్రమపైనా కొంతమేర ఏఐ ప్రభావం చూపొచ్చని పేర్కొన్నారు. ‘తమ పనిలో ఏఐను వినియోగించలేని ఐటీ నిపుణులను.. ఏఐ వినియోగించే వారు భర్తీ చేసే ప్రమాదం ఉంద’ని నంబియార్ అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి: ప్రపంచ టాప్ కంపెనీలో నోటీసు లేకుండా ఉద్యోగాల తొలగింపు..
భవిష్యత్తు అవసరాల కోసం ఏఐ ఆధారిత నైపుణ్యాలను తమ ఉద్యోగులకు కల్పించడానికి ఐటీ కంపెనీలు భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. చివరకు మానవ సామర్థ్యాల్లో మాత్రమే తేడా ఉంటుందని, ప్రస్తుత వ్యవస్థతో ఏఐ సమీకృతమైనప్పుడు అసలైన మార్పులు వెలుగుచూస్తాయని నంబియార్ తెలిపారు. వైట్‌కాలర్ ఉద్యోగాలపైనే జనరేటివ్ ఏఐ ప్రభావం అధికంగా ఉంటుందని, కొత్త సాంకేతికతలకు మారాల్సిన అవసరం ఉంటుందన్నారు. ప్రస్తుతం కాగ్నిజెంట్ ఇండియాకు ఛైర్మన్, ఎండీగా నంబియార్ వ్యవహరిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment