కృత్రిమమేధ(ఏఐ) ఉద్యోగుల పాలిట శాపంగా మారుతుంది. వివిధ కంపెనీ యాజమాన్యాలు ఉద్యోగుల కార్యకలాపాల స్థానంలో ఏఐని వాడడం ప్రారంభించాయి. దాంతో ఆయా స్థానాల్లోని ఉద్యోగులను తొలగిస్తున్నాయి. థర్డ్‌పార్టీ ఆన్‌లైన్ పేమెంట్ సేవల సంస్థ ఫోన్‌పే తన కస్టమర్ సపోర్ట్ స్టాఫ్ కార్యకలాపాల్లో 90 శాతం ఏఐ చాట్‌బాట్‌లను వినియోగిస్తోంది. దాంతో గత ఐదేళ్లలో 60 శాతం ఉద్యోగులను తొలగించింది. గతంలో ఈ విభాగంలో ఉన్న 1,100 మంది ఉద్యోగులను 400కు కుదించింది.
ఫోన్‌పే అక్టోబర్ 21న విడుదల చేసిన వార్షిక నివేదిక ప్రకారం..గత ఐదేళ్లలో కస్టమర్ సపోర్ట్ విభాగంలో 90 శాతం ఏఐ చాట్‌బాట్‌ను వినియోగిస్తున్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరం నుంచి 2023-24 వరకు లావాదేవీలు 40 రెట్లు పెరిగాయి. కొవిడ్ 19 పరిణామాల వల్ల గతంలో చాలా సమస్యలు ఎదుర్కొన్నా ఆటోమేషన్ విధానం కోసం ప్రణాళికలు సిద్ధం చేసింది. దానివల్ల ప్రస్తుతం కంపెనీ రెవెన్యూ పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. కస్టమర్ సంతృప్తికి పెద్దపీట వేస్తూ, అదే సమయంలో గణనీయంగా ఖర్చు ఆదా చేసేలా పని చేస్తోంది. గత పదేళ్లలో కస్టమర్ నెట్ ప్రమోటర్ స్కోర్ (ఎన్‌పీఎస్-కస్టమర్లు కంపెనీ అందించే సేవల వల్ల సంతృప్తి పొందడం) పెరుగుతోందని కంపెనీ తెలిపింది.
కంపెనీ వార్షిక నివేదికలో తెలియజేసిన వివరాల ప్రకారం కస్టమర్ సపోర్ట్ విభాగంలో ఉద్యోగుల సంఖ్య 400కు చేరింది. ఇది గతంలో 1,100గా ఉండేది. ఈ విభాగంలో 90 శాతం ఏఐను వినియోగిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. దేశం అంతటా సంస్థలో దాదాపు 22 వేల ఉద్యోగులున్నట్లు పేర్కొంది. 1,500 కంటే ఎక్కువ మంది అగ్రశ్రేణి ఇంజినీర్‌లకు కంపెనీ ఉపాధి కల్పిస్తోందని చెప్పింది. ఫోన్‌పే ఆగస్టులో తెలిపిన వివరాల ప్రకారం మార్చి 2024తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి రూ.5,064 కోట్ల ఆదాయం సమకూరినట్లు నివేదించింది. ఇది అంతకుముందు సంవత్సరంలో రూ.2,914 కోట్లగా నమోదైంది. అంటే ఏడాదిలో 74 శాతం వృద్ధిని సాధించినట్లయింది.
ఇదీ చదవండి: పెళ్లి చేసే కుటుంబాలకు ధీమా.. వివాహ బీమా
ఏఐ వల్ల ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోనున్నారని కొందరు నిపుణులు భావిస్తున్నారు. కస్టమర్ సర్వీస్ విభాగంలో ఇలా ఉద్యోగాలు కోల్పోయే వారి సంఖ్య అధికంగా ఉంటుందన్నారు. అయితే ఏఐకు శిక్షణ ఇచ్చే విభాగంలో సరైన నైపుణ్యాలు కలిగిన ఉద్యోగుల కొరత ఉందని చెబుతున్నారు. కాబట్టి ఇప్పటికే సర్వీస్ విభాగంలో పని చేస్తున్నవారు నిరాశ పడకుండా తమ రంగంలో ఏఐకు శిక్షణ ఇచ్చే నైపుణ్యాలు నేర్చుకోవాలని సూచిస్తున్నారు. దాంతో ప్రస్తుతం ఉద్యోగం కోల్పోయినా భవిష్యత్తులో మెరుగైన నైపుణ్యాలు సాధన చేస్తే మంచి ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment