
వేగంగా అభివృద్ధి చెందుతున్న జనరేటివ్ ఏఐ (జెన్ఏఐ) ఐటీ పరిశ్రమకు కీలక శక్తిగా అవతరించిందని బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బీసీజీ) నివేదిక తెలిపింది. గ్లోబల్ ఔట్ సోర్సింగ్‌లో 58 శాతం వాటా కలిగిన ఇండియన్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ (ఐటీఈఎస్ )కు జెన్‌ఏఐ కీలకంగా మారింది. అయితే 80 శాతం మంది భారతీయ డెవలపర్లు జెన్ఏఐ ఉత్పాదకత ప్రయోజనాలను గుర్తిస్తుండగా, కేవలం 39 శాతం మంది మాత్రమే దీన్ని సమర్థవంతంగా ఉపయోగిస్తున్నారని పేర్కొంది. జెన్ జెడ్(2000 తర్వాత జన్మించినవారు) డెవలపర్లలో ఈ అంతరం మరింత విస్తృతంగా ఉందని చెప్పింది. కేవలం 31 శాతం జెన్ జెడ్ డెవలపర్లు ఈ జెన్‌ఏఐను వినియోగిస్తున్నట్లు బీసీజీ రూపొందించిన ‘ది జెన్ఏఐ అడాప్షన్ కొనండ్రమ్’ నివేదిక తెలిపింది.
బీసీజీ నివేదికలోని అంశాలు..
క్లౌడ్ కంప్యూటింగ్ ప్రభావంతో భారత్‌లో ఐటీ సేవలను మార్చే సామర్థ్యం జెన్ఏఐకి ఉంది.
జెన్‌ఏఐను సమర్థవంతంగా వినియోగిస్తే ఐటీ పరిశ్రమ ఎన్నో రెట్లు అభివృద్ధి చెందుతుంది.
భారత ఐటీ కంపెనీలు తమ ఉద్యోగుల ఉత్పాదకతను మెరుగుపరచడానికి జెన్ఏఐ సాధనాలను స్వీకరించే ప్రయత్నాలను వేగవంతం చేయాలి.
జెన్ఏఐ రంగంలో గ్లోబల్‌గా పెట్టుబడులు పెరుగుతున్నాయి. అమెరికా, చైనా, ఈయూ, మిడిల్ ఈస్ట్ దేశాలు జెన్ఏఐని తమ వర్క్‌ఫ్లోలో ఏకీకృతం చేసేందుకు దృష్టి సారించాయి.
భారత్ కూడా ఐటీ సేవల రంగంలో ఈ మేరకు ప్రయత్నాలు చేయకపోతే ఈ విభాగంలో నాయకత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.
భారత్ కొన్నేళ్లుగా ప్రపంచ ఐటీ సేవలకు సారథ్యం వహిస్తోంది. సంక్లిష్ట కోడింగ్, సాఫ్ట్ వేర్ అభివృద్ధి, డిజిటల్ అప్లికేషన్లను పెద్ద ఎత్తున నిర్వహిస్తోంది. అయితే సాఫ్ట్‌వేర్ ఎలా నిర్మిస్తారో, ఎలా టెస్ట్ చేస్తారో, దాన్ని ఎలా ఉపయోగిస్తారో వంటి చాలా అంశాలను జెఎన్ఏఐ నిర్వహిస్తోంది. ఇలాంటి సందర్భాల్లో ఐటీ పరిశ్రమ సంప్రదాయ పద్ధతులపై మాత్రమే ఆధారపడటం సరికాదు.
పునరావృతమయ్యే పనులను ఆటోమేట్ చేసేందుకు జెన్‌ఏఐను వాడుతున్నారు. డెవలపర్లు సాధారణంగా వాడే కోడింగ్ పనులపై తక్కువ సమయం గడిపేందుకు, సమస్యలను సృజనాత్మకంగా పరిష్కారించేందుకు ఎక్కువ సమయం కేటాయించేందుకు ఇంది ఎంతో ఉపయోగపడుతుంది.
ఏఐ మంచిదే.. కానీ..
భారతీయ డెవలపర్లలో 39 శాతం మంది మాత్రమే జెఎన్ఏఐ సాధనాలను నమ్మకంగా వాడుతున్నారు. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి.
శిక్షణ, సరైన వనరులు: సమగ్ర శిక్షణా కార్యక్రమాలు, సరైన వనరులు పరిమితంగా అందుబాటులో ఉన్నాయి. దాంతో చాలా మంది డెవలపర్లకు జెఎన్ఏఐ సామర్థ్యం గురించి తెలిసినప్పటికీ, దాని పూర్తి సామర్థ్యాలను ఉపయోగించుకోవడానికి అవసరమైన నిర్మాణాత్మక మార్గదర్శకత్వాలు లేకుండా పోతున్నాయి.
ఇంటిగ్రేషన్ సమస్యలు: ప్రస్తుత పని విధానంలో కొన్నిసార్లు జెన్‌ఏఐను చేర్చడం సులభం కాదు. డెవలపర్లకు సాఫ్ట్‌వేర్ ఇంటిగ్రేషన్ అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. కోడింగ్ పద్ధతుల్లో సర్దుబాట్ల చేయాల్సి ఉంటుంది.
మార్పునకు దూరంగా: సంప్రదాయ కోడింగ్ పద్ధతులకు అలవాటు పడిన డెవలపర్లు నైపుణ్యాలు అభివృద్ధి చేసుకుని జెన్‌ఏఐను వాడడం కొంత సవాలుతో కూడుకుంది. చాలా సందర్భాల్లో కొత్త సాంకేతికతలను స్వీకరించడానికి సంకోచించవచ్చు.
జెన్ జెడ్: గ్రాడ్యుయేషన్ పూర్తయి కొత్తగా ఉద్యోగంలో చేరిన జెన్ జెడ్ కేటగిరీ యువతలో జెన్‌ఏఐ నైపుణ్య అంతరాలు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి. తాము అధికంగా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల్లో సమయం గడుపుతున్నప్పటికీ కేవలం 31 శాతం మంది మాత్రమే జెఎన్ఏఐ నైపుణ్యాలను కలిగి ఉంటున్నారు. అందుకు కొన్ని కారణాలు ఉన్నాయి.
అనుభవం లేకపోవడం: జెన్ జెడ్ డెవలపర్లు సాధారణంగా కెరియర్ ప్రారంభ దశలో ఉంటారు. అధునాతన జెన్ఏఐ సాధనాల్లో వారికి తగినంత శిక్షణ ఉండకపోవచ్చు.
విద్యా అంతరాలు: ప్రస్తుత విద్యా విధానంలో కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్‌లో తాజా పురోగతిని తగినంతగా కవర్ చేయకపోవచ్చు. ఇది యువ డెవలపర్లకు సవాలుగా మారుతుంది.
సరైన వనరులు లేకపోవడం: నేర్చుకోవాలని ఉన్నా ఆర్థిక కారణాలు, అత్యాధునిక సాధనాలు, సరైన వనరులు అందుబాటులో లేకపోవడం కూడా జెన్ జెడ్ డెవలపర్లలో ఈ నైపుణ్యాలు కొరవడేందుకు కారణాలుగా ఉన్నాయి.
ఆర్థిక అనిశ్చితి: వెండర్ కన్సాలిడేషన్(సర్వీసులు పొందేవారి సంఖ్యలో మార్పులు), అనిశ్చితుల వల్ల కుంచించుకుపోతున్న మార్కెట్లు సవాలుగా మారుతున్నాయి.
పెరుగుతున్న కస్టమర్ ఆకాంక్షలు: వేగంగా మారుతున్న ఈ విభాగంలో కస్టమర్లు ఆకాంక్షలు పెరుగుతున్నాయి.
రెగ్యులేటరీ నిబంధనలు: కఠినమైన డేటా గోప్యతా చట్టాలను అనుసరించడం, వాటికి తగ్గట్టుగా పరిమితులను సిద్ధం చేసుకోవడం క్లిష్టంగా మారుతుంది.
ఈ అంతరాన్ని పూడ్చడం ఎలా
జెన్‌ఏఐ ఉత్పాదకత ప్రయోజనాలను పూర్తిగా వినియోగించుకునేందుకు, నైపుణ్య అంతరాన్ని పూడ్చడానికి సమష్టి ప్రయత్నాలు అవసరం.
సమగ్ర శిక్షణా కార్యక్రమాలు: సంస్థాగత, విద్యా స్థాయుల్లో మెరుగైన శిక్షణా కార్యక్రమాలు నిర్వహించారు. విభిన్న డెవలపర్లతో ప్రత్యేక సెషన్లను నిర్వహించాలి. పరిశ్రమకు అవసరమయ్యే నిర్దిష్ట అవసరాలను తీర్చే ప్రోగ్రామ్‌లు నైపుణ్యాన్ని పెంపొందించడంలో సహాయపడతాయి.
మెంటార్ షిప్: మార్గదర్శకత్వాన్ని ప్రోత్సహించాలి. పీర్ లెర్నింగ్ సంస్కృతిని పెంపొందించాలి. జెన్ఏఐ వాడకాన్ని వేగవంతం చేయాలి. అనుభవజ్ఞులైన డెవలపర్లు తమకంటే తక్కువ నైపుణ్యం కలిగిన తోటివారికి మార్గనిర్దేశం చేయవచ్చు.
జెన్ ఏఐ వినియోగం పెంచాలి..
బీసీజీ మేనేజింగ్ డైరెక్టర్, సీనియర్ పార్టనర్ రాజీవ్ గుప్తా మాట్లాడుతూ..‘జెఎన్ఏఐ వేగాన్ని అందుకోవాలంటే భారతీయ ఐటీ రంగం నిబద్ధతతో దానికి నాయకత్వం వహించాలి. అత్యవసరంగా జెన్ఏఐని వినియోగాన్ని పెంచాలి. కృత్రిమ మేధ ఆధారిత సేవల భవిష్యత్తును రూపొందించే హక్కును సంపాదించాలి. ఈ విభాగంలో వస్తున్న మార్పులను స్వీకరించి ప్రపంచానికి నాయకత్వం వహించేలా చర్యలు చేపట్టాలి. లేదంటే ఐటీ విభాగంలో భారత్ ప్రస్తుతం స్థానం కోల్పోతుంది’ అన్నారు.
ఆదరణ పెరుగుతున్నా వాడకానికి సంకోచం
బీసీజీ ఎండీపీ సంభవ్ జైన్ మాట్లాడుతూ..‘జెఎన్ఎఐకు ఆదరణ పెరుగుతున్నా 40 శాతం కంటే తక్కువ మంది దాని వాడడానికి సంకోచిస్తున్నారు. అవకాశం ఉన్నా దాన్ని వినియోగించుకోవడం లేదు. ఇది ఫార్ములా 1 రేసింగ్ కారును వాకింగ్ స్పీడ్ కోసం ఉపయోగించినట్లుంది. జెన్‌జెడ్ జెన్‌ఏఐ తరం అని నమ్ముతున్నారు. కానీ అందుకు విరుద్ధంగా 31 శాతం జెన్‌జెడ్ యువతే దీన్ని వినియోగిస్తున్నారు’ అని తెలిపారు.
ఎలా ఉపయోగించాలో తెలియదు..
బీసీజీ పార్టనర్ షావీ గాంధీ మాట్లాడుతూ..‘జెఎన్ఏఐ వాడకానికి సంబంధించి డెవలపర్లు సుపరిచిత సాధనాలు, వర్క్ ఫ్లోలకు అలవాటుపడ్డారు. అందులో నుంచి బయటకు రావడానికి వారికి కష్టంగా మారుతుంది. జెన్ఏఐ దీర్ఘకాలిక విలువ గురించి వీరు నమ్మకంగా లేరు. దాంతో తరచు ఉద్యోగాలు మారేందుకు భయపడుతున్నారు. దాదాపు సగం మంది డెవలపర్లకు తమ వర్క్ ఫ్లోలో టూల్ సామర్థ్యాలను ఎలా పూర్తిగా ఉపయోగించుకోవాలో తెలియడం లేదు. 90వ దశకంలో కొత్త ఇంటర్నెట్ వచ్చిన కొత్తలో దాన్ని ఉపయోగించడానికి నిరాకరించినట్లే ప్రస్తుతం జెన్‌ఏఐ వాడేందుకు భయపడుతున్నామా’ అని సందేహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: ఐటీలో వేతన పెంపు ఎంతంటే..
అవేర్‌నెస్ ముఖ్యం..
డెవలపర్లు ఐదు లేదా అంతకంటే ఎక్కువ ట్రెయినింగ్ సెషన్లను పొందినప్పుడు జెఎన్ఏఐ అడాప్షన్ 16% నుంచి 48%కు పెరుగుతుంది. 92% ఎంటర్‌ప్రైజ్ క్లయింట్లు ఏఐ ఆధారిత సేవల కోసం ప్రీమియం చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే వారికి స్పష్టమైన ప్రణాళికలు, రుజువులు అవసరం అవుతాయి. సంస్థలు ఏఐ ఉత్పాదకతను శాస్త్రీయంగా ట్రాక్ చేయాలి. సామర్థ్యం, నాణ్యత, అవుట్ పుట్ అంతటా ఏఐ ప్రభావాన్ని పరిగణలోకి తీసుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment