ఆన్‌లైన్ పేమెంట్ సేవల సంస్థ ఫోన్‌పే తన కస్టమర్ సపోర్ట్ స్టాఫ్‌ను తొలగించినట్లు వచ్చిన వార్తలను కొట్టిపారేసింది. దీనిపై స్పష్టతనిస్తూ ప్రకటన విడుదల చేసింది. కంపెనీలు ఎవరినీ ఉద్యోగం నుంచి తొలగించలేదని పేర్కొంది. అయితే కస్టమర్ సపోర్ట్ విభాగంలోని ఉద్యోగులు తగ్గిపోవడానికి కారణాన్ని తెలియజేసింది.
ఫోన్‌పే తన కస్టమర్ సపోర్ట్ స్టాఫ్ కార్యకలాపాల్లో 90 శాతం ఏఐ చాట్‌బాట్‌లను వినియోగిస్తోంది. దాంతో గత ఐదేళ్లలో 60 శాతం ఉద్యోగులను తొలగించినట్లు పలు మీడియా సంస్థలు వార్తాకథనాలు ప్రచురించాయి. గతంలో ఈ విభాగంలో ఉన్న 1,100 మంది ఉద్యోగులను 400కు తగ్గించినట్లు తెలిపాయి. దీనిపై కంపెనీ తాజాగా స్పందించింది. ‘ఏఐ, ఆటోమేషన్ వల్ల కంపెనీలో ఉద్యోగులను తొలగించినట్లు వచ్చిన వార్తల్లో వాస్తవం లేదు. గడిచిన ఐదేళ్ల కాలంలో కస్టమర్ సపోర్ట్ విభాగంలో ఏఐను వాడుతున్నాం. అదే సమయంలో కొత్తగా ఆ విభాగంలో స్టాఫ్‌ను నియమించలేదు. అలాగని ఉన్నవారిని బలవంతంగా తొలగించలేదు. ఐదేళ్ల కిందట ఈ విభాగంలో ఉన్న సిబ్బంది వివిధ కారణాలతో ఉద్యోగం మానేశారు. అయితే కొత్త స్టాఫ్‌ను నియమించకపోవడం వల్ల వీరి సంఖ్య తగ్గినట్లు కనిపింది’ అని ఫోన్‌పే ప్రకటన విడుదల చేసింది.
ఇదీ చదవండి: ఇంటి రుణం త్వరగా తీర్చండిలా..
ఏఐ వల్ల ప్రపంచవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోనున్నారని కొందరు నిపుణులు భావిస్తున్నారు. కస్టమర్ సర్వీస్ విభాగంలో కొత్తగా కొలువులు సృష్టించే అవకాశం ఉండడం లేదు. ఏఐ వల్ల ఈ విభాగంలో పని చేస్తున్నవారు ఇతర రంగాలకు మారాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే ఏఐకు శిక్షణ ఇచ్చే విభాగంలో సరైన నైపుణ్యాలు కలిగిన ఉద్యోగుల కొరత ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి ఇప్పటికే సర్వీస్ సెక్టార్‌లో పని చేస్తున్నవారు నిరాశ పడకుండా తమ రంగంలో ఏఐకు శిక్షణ ఇచ్చే నైపుణ్యాలు నేర్చుకోవాలని సూచిస్తున్నారు. దాంతో ప్రస్తుతం ఉద్యోగం కోల్పోయినా భవిష్యత్తులో మెరుగైన నైపుణ్యాలు సాధన చేస్తే మంచి ఉద్యోగం దొరికే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment