న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం బిజినెస్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్ (బీపీవో) కంపెనీలను చిన్న పట్టణాల దిశగా కదిలించేందుకు ప్రోత్సాహకాలతో ముందుకొచ్చింది. ఇండియా బీపీవో ప్రమోషన్ స్కీమ్ కింద మొత్తం 48,300 సీట్లకుగాను 35,000 సీట్లు చిన్న పట్టణాలకే కేటాయించినట్టు తెలిపింది. రానున్న ఆరు నెలల్లో పూర్తి లక్ష్యాన్ని చేరుకుంటామని ఆశాభావం వ్యక్తం చేసింది. చిన్న పట్టణాల్లోనూ బీపీవో కార్యకలాపాలను ప్రోత్సహించేందుకు కేంద్రం ఈ పథకాన్ని తీసుకొచ్చింది.
ఇందులో భాగంగా ఒక్కో సీటుకు రూ.లక్ష చొప్పున ప్రత్యేక ప్రోత్సాహకాన్ని అందిస్తామని కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలియజేశారు. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ (వీజీఎఫ్) కింద ఈ ప్రోత్సాహకం ఇవ్వనున్నట్టు చెప్పారు. ‘‘ఈ పథకం ఆసరాతో బీపీవో అన్నది చిన్న పట్టణాల్లోనూ డిజిటల్ ఆకాంక్షలకు వేదికగా అవతరిస్తుంది. డిజిటల్ సాధికారతకు చిన్న పట్టణాల్లోని బీపీవోలు అతిపెద్ద చోదక శక్తి అవుతాయి’’ అని రవి శంకర్ ప్రసాద్ వివరించారు.
ఇప్పటి వరకు నాలుగు దశల బిడ్డింగ్‌లో, 18,160 సీట్లను 87 కంపెనీలకు చెందిన 109 యూనిట్లకు కేటాయించినట్టు మంత్రి వెల్లడించారు. వీటిలో 76 యూనిట్లు కార్యకలాపాలు ఆరంభించాయని, ఇప్పటికే 10,297 మందికి ఉపాధి లభించిందని చెప్పారు. గత నెల ముగిసిన ఐదో దశ బిడ్డింగ్‌లో 68 కంపెనీలు 17,000 సీట్లకు బిడ్లు సమర్పించాయని, ప్రస్తుతం అవి పరిశీలనలో ఉన్నాయని ఆయన తెలియజేశారు.
ఏపీలో మూడు చోట్ల కేంద్రాలు: కొత్తగా బీపీవో కేంద్రాలు ఆరంభించిన పట్టణాల్లో ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతి, రాజమండ్రి, గుంటుపల్లి కూడా ఉన్నాయి. అలాగే, ఏపీలోని చిత్తూరు సహా తిర్పూర్, గయ, వెల్లూర్, జహనాబాద్, మధుర తదితర పట్టణాల్లోనూ బీపీవో కేంద్రాలకు బిడ్లు వచ్చినట్టు మంత్రి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment