హైదరాబాద్‌లో కొత్త కొలువుల జోరు: నౌకరీ
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆర్థిక పరిస్థితులపై సెంటిమెంటు మెరుగుపడుతున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో గత నెల జోరుగా నియామకాలు జరిగాయి. గతేడాది ఆగస్టుతో పోలిస్తే ఈసారి హైరింగ్ 17% పెరిగింది. నియామకాలకు సంబంధించి నౌకరీడాట్‌కామ్ నిర్వహించే జాబ్ స్పీక్ సూచీ ద్వారా ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఫార్మా, ఐటీ, ఐటీఈఎస్ రంగాల ఊతంతో హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో జాబ్ మార్కెట్ గణనీయంగా ఊపందుకుందని నౌకరీడాట్‌కామ్ చీఫ్ సేల్స్ ఆఫీసర్ వి. సురేష్ తెలిపారు.
కొత్త రాష్ట్రం ఏర్పాటు, పండుగ సీజన్ కారణంగా రాబోయే రోజుల్లో హైరింగ్ సెంటిమంటు మరింత మెరుగుపడొచ్చని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, దేశవ్యాప్తంగా చూస్తే .. టెలికం, ఐటీ/బీపీవో రంగాల ఊతంతో గత నెల నియామకాలు 18% మేర పెరిగాయి. 2013తో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టులో ఈ సూచీ 18% పెరిగి 1,478 వద్ద నిల్చింది. జూలైతో పోలిస్తే ఆగస్టులో నియామకాలు సుమారు 10% క్షీణించినప్పటికీ.. రాబోయే రోజుల్లో మాత్రం జోరు కొనసాగవచ్చని నౌకరీడాట్‌కామ్ అంచనా. రంగాల వారీగా చూస్తే టెలికంలో 36%, బీపీవోలో 26 శాతం మేర వృద్ధి నమోదైంది. మెట్రో నగరాల వారీగా చూస్తే ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో గరిష్టంగా నియామకాలు జరగ్గా.. బెంగళూరు, చెన్నై, కోల్‌కతా తర్వాత స్థానాల్లో ఉన్నాయి. ముంబైలో అత్యంత తక్కువ శాతం నమోదైంది.