
న్యూఢిల్లీ: బీపీవో, కేపీవో సేవలను జీఎస్టీ కింద ఇంటర్‌మీడియరీలు (మధ్యవర్తిత్వ సంస్థలు)గా పరిగణిస్తున్నందున పన్ను నిబంధనల పరంగా స్పష్టత తీసుకురావాలని ఐటీ కంపెనీల సంఘం నాస్కామ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. పరిశ్రమలో వృద్ధి రేటు మందగించినప్పటికీ... 2016 ఆర్థిక సంవత్సరం నుంచి 24 బిలియన్‌డాలర్ల ఆదాయాన్ని ఈ రంగం తెచ్చిపెట్టడమే కాకుండా నికరంగా ఎక్కువ ఉద్యోగాలు కల్పించిన విషయాన్ని గుర్తు చేసింది. స్టార్టప్‌ల్లో చేసే పెట్టుబడులపై ఏంజెల్ ట్యాక్స్ పేరుతో విధిస్తున్న లెవీని ఎత్తివేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు బడ్జెట్ ముందస్తు ప్రతిపాదనలను నాస్కామ్ కేంద్ర ఆర్థిక శాఖకు పంపింది.
ఇంటర్‌మీడియరీలు కావు...
బీపీవో, కేపీవోలు సహా ఐటీ ఆధారిత సేవలను ఇంటర్‌మీడియరీలుగా రెవెన్యూ శాఖ పరిగణిస్తుండడంపై నాస్కామ్ ఆందోళన వ్యక్తం చేసింది. సరఫరా ప్రదేశం, ప్రధాన కార్యాలయం, బ్రాంచ్‌ల లావాదేవీలు, సెజ్ కొనుగోళ్లనూ సత్వరమే పరిష్కరించాల్సిన అంశాలుగా నాస్కామ్ కోరింది.
పెట్టుబడులకు ప్రోత్సాహం...
స్టార్టప్‌లను ప్రోత్సహించేందుకు గాను ఏంజెల్ ట్యాక్స్‌ను రద్దు చేయాలన్నది నాస్కామ్ ప్రధాన డిమాండ్లలో మరొకటి. అంతేకాదు స్టార్టప్‌లకు రాయితీలు కూడా కల్పించాలని కోరింది. ‘‘ఏంజెల్ ఇన్వెస్టర్లు ఓ కంపెనీ ఆరంభ దశలో ఎంతో రిస్క్ తీసుకుని పెట్టుబడులు పెడుతుంటారు. కొత్త కంపెనీ ఆవిర్భవించి, వృద్ధి చెందేందుకు ఈ పెట్టుబడులు కీలకం. ఒకవేళ వీటికి రాయితీలు ఇవ్వకపోతే, కనీసం ప్రోత్సాహం అయినా ఇవ్వాల్సిన అవసరం ఉంది’’ అని ఆశిష్ అగర్వాల్ వివరించారు.