సాక్షి, విశాఖపట్నం: విశాఖ కేంద్రంగా నేటి నుంచి (అక్టోబర్ 1) ఇన్ఫోసిస్ సేవలు ప్రారంభమవుతున్నాయని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ వెల్లడించారు. తొలిదశలో 1,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు ఆయన చెప్పారు. వచ్చే ఏడాది జనవరి నుంచి పూర్తిస్థాయి సేవలు మొదల వుతాయన్నారు. ఇక్కడి సర్క్యూట్ హౌస్‌లో ఇన్ఫోసిస్ సంస్థకు చెందిన ఆరుగురు ప్రతినిధులతో మంత్రి శుక్రవారం భేటీ అయ్యారు.
చదవండి: ఏపీలో గ్రూప్–1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి రాష్ట్రంలో ఓ మంచి వాతావరణంలో పారిశ్రామిక అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు. ఇప్పటికే ఈజ్ ఆఫ్ డూయింగ్‌లో ఏపీ నంబర్‌వన్ స్థానంతోపాటు పోర్టు ఆధారిత మౌలిక సదుపాయాల కల్పనలోనూ దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో నిలిచిందని గుర్తుచేశారు. ఉమ్మడి ఏపీలో మహానేత వైఎస్సార్ విశాఖలో వేసిన ఐటీ మొక్క ఇప్పుడు వృక్షంలా మారిందని మంత్రి అమర్‌నాథ్ అన్నారు.
భవిష్యత్తులో మరిన్ని ఐటీ సంస్థలు
ఇన్ఫోసిస్ రాక విశాఖ అభివృద్ధికి సంకేతమన్నారు. ఇప్పటికే కొన్ని ఇక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయని, వీరికి కావాల్సిన ఫెసిలిటీ మేనేజ్‌మెంట్‌లో ప్రభుత్వం నుంచి ఏ సహాయం కావాలన్నా అందించమని సీఎం జగన్ ఆదేశించారన్నారు. వారు కోరిన విధంగా అన్ని సౌకర్యాల ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. తాజా ఉద్యోగులతో పాటు త్వరలో కళాశాలల్లోనే క్యాంపస్ ఇంటర్వ్యూల ద్వారా కొత్త ఉద్యోగులను ఇన్ఫోసిస్ తీసుకుంటుందన్నారు.
ఇక బీచ్ ఐటీ నినాదంతో విశాఖలో ఐటీ రంగం మరింత అభివృద్ధి చెందనుందని మంత్రి అమర్‌నాథ్ తెలిపారు. రానున్న కాలంలో మైక్రోసాఫ్ట్, ఐబీఎం, టీసీఎస్ లాంటి సంస్థలు కూడా విశాఖ నుంచి సేవలందించాలని ఆకాంక్షిస్తున్నామన్నారు. ఆ దిశగా ప్రభుత్వం నుంచి అన్ని ప్రయత్నాలు చేస్తామన్నారు. దీనిపై కొందరు టీడీపీ పెద్దలు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారని, స్వయాన లోకేశే ఐటీ మంత్రిగా పనిచేసి విశాఖకు చేసింది శూన్యమని మంత్రి కౌంటర్ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment