సాక్షి, హైదరాబాద్ : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ).. బిజినెస్ ప్రాసెస్ ఔట్‌సోర్సింగ్(బీపీవో).. నాలెడ్జ్ ప్రాసెస్ ఔట్‌సోర్సింగ్(కేపీవో) రంగాలకు నిలయంగా మారిన హైదరాబాద్ మహానగరం ఇప్పుడు ఏరోస్పేస్, ఎయిర్‌క్రాఫ్ట్ రంగాలకు కూడా హబ్‌గా మారుతోంది. నూతన పరిశ్రమల ఏర్పాటుకు వివిధ విభాగాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే విధానానికి స్వస్తి పలుకుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏకగవాక్ష విధానంలో ఒకేసారి అన్ని అనుమతులు మంజూరు చేసేందుకు వీలుగా టీఎస్‌ఐపాస్(తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం)విధానానికి 2015 జూన్‌లో శ్రీకారం చుట్టిన విషయం విదితమే.
టీఎస్‌ఐపాస్ విధానం రాకతో 2015 జూన్ నుంచి 2017 డిసెంబర్ వరకూ గ్రేటర్ పరిధిలో వివిధ రంగాలకు సంబంధించి 386 మంది నూతన పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో 207 కంపెనీలు మరో మూడు నెలల్లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సన్నాహాలు మొదలుపెట్టాయి. ఆయా కంపెనీల ఏర్పాటుతో సుమారు రూ.2,407 కోట్ల పెట్టుబడులు నగరానికి తరలివచ్చినట్లు పరిశ్రమల శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇందులో అత్యధికంగా 60 ఏరోస్పేస్, ఎయిర్‌క్రాఫ్ట్ విడిభాగాల తయారీ పరిశ్రమలే ఉన్నాయి. ఆ తర్వాత తయారీ రంగం, ప్లాస్టిక్, సోలార్, ఐటీ రంగ పరిశ్రమలు ఉన్నాయి. ఇవన్నీ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలే. వీటి ద్వారా సుమారు 22 వేల మందికి నూతనంగా ఉపాధి దక్కే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.
మరో మూడు నెలల్లో షురూ
ప్రధానంగా గ్రేటర్ శివార్లలోని ఆదిభట్ల, నాదర్‌గుల్, మంగల్‌పల్లి, అంబర్‌పేట్, జీడిమెట్ల, పాశమైలారం, ఖాజిపల్లి, బొంతపల్లి, పటాన్‌చెరు, కాటేదాన్, మల్లాపూర్ తదితర ప్రాంతాల్లో నూతన పరిశ్రమలు ఏర్పాటుకానున్నాయి. ఆయా కంపెనీలకు అనుమతుల ప్రక్రియ పూర్తి కావడంతో మరో మూడు నెలల్లో ఉత్పత్తి ప్రారంభించే అవకాశాలున్నట్లు పరిశ్రమల శాఖ వర్గాలు తెలిపాయి. మొత్తంగా 386 మంది దరఖాస్తులు సమర్పించగా.. సాంకేతిక కారణాలు, భూమి, ఇతర మౌలిక వసతుల లభ్యత, పరపతి సౌకర్యం తదితర సమస్యల కారణంగా 179 కంపెనీల ఏర్పాటు ప్రక్రియ మందగించింది. ప్రస్తుతానికి 207 కంపెనీలు మాత్రమే కార్యరూపం దాల్చనున్నట్లు తెలిసింది. మిగతావి కూడా దశలవారీగా సమస్యలను అధిగమించి కంపెనీలు నెలకొల్పే అవకాశాలున్నట్లు సమాచారం. కాగా మహానగరానికి ఆనుకుని ఉన్న ఆయా పారిశ్రామిక వాడల్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు సుమారు 3 వేల వరకు ఉన్నట్లు పరిశ్రమల శాఖ వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment