TS ipass
-
‘ఈజీ’ ఐపాస్.. టీజీ ఐపాస్‌కు భారీగా మార్పులు!
సాక్షి, హైదరాబాద్: పెట్టుబడుల ఆకర్షణ, ఉద్యోగాల కల్పన లక్ష్యంగా కొత్త పారిశ్రామిక పాలసీని తయారు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రస్తుతమున్న విధానాల కంటే మెరుగైన విధానాలను అమలు చేయాలని యోచిస్తోంది. పరిశ్రమల శాఖ అధికారులు ఈ మేరకు నూతన పారిశ్రామిక విధానం రూపకల్పనపై కసరత్తు చేస్తున్నారు. దీనిపై సీఎం రేవంత్ ఇటీవల పరిశ్రమల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. కాగా ఈ సందర్భంగా అధికారులకు ముఖ్యమంత్రి పలు సూచనలు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆవిర్భావం తర్వాత కేసీఆర్ ప్రభుత్వం రూపొందించిన టీజీ ఐపాస్ (గతంలో టీఎస్ ఐపాస్) చట్టంలో సమూల మార్పులు చేస్తూ కొత్త పారిశ్రామిక విధానం ఉంటుందని తెలుస్తోంది. పరిశ్రమల శాఖ అధికారులు మాత్రం ఈ విషయంలో గోప్యత పాటిస్తున్నారు. రెండు పథకాలు అమలు చేసిన బీఆర్ఎస్ సర్కార్ నూతన పాలసీలో ప్రోత్సాహకాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశముందని అంటున్నారు. వాస్తవానికి పరిశ్రమల ఏర్పాటు కోసం పెట్టుబడులతో వచ్చే వారికి సత్వర అనుమతులు ఇచ్చేందుకు గత ప్రభుత్వం టీజీ ఐపాస్‌ను అమలు చేసింది. మరోవైపు పెట్టుబడులు పెట్టే వారికి రాయితీలు, ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు రెండు ప్రత్యేక పథకాలను కూడా అమలు చేసింది. టీ ఐడియా (జనరల్ కేటగిరీ), టీ ప్రైడ్ (ఎస్సీ, ఎస్టీ) స్కీమ్‌ల కింద పలు ప్రోత్సాహకాలు ప్రకటించింది. పెట్టుబడి సబ్సిడీ, స్టాంప్ డ్యూటీ రీయింబర్స్మెంట్, పావలా వడ్డీ, సేల్స్ టాక్స్ తదితరాల్లో రాయితీలు, ప్రోత్సాహకాలు ఇస్తున్నట్లు చెప్పింది. అయితే గత ప్రభుత్వంలో రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వలేదని, నూతన పారిశ్రామిక విధానంలో తాము వీటికి పెద్దపీట వేస్తామన్నట్టుగా ప్రభుత్వం సంకేతాలు ఇస్తోంది. పేరుకు పోయిన బకాయిలు కొత్త ప్రభుత్వం చెప్తున్న వివరాల ప్రకారం.. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ప్రోత్సాహకాలను పెండింగులో పెట్టడంతో బకాయిలు పేరుకుపోయాయి. చాలా పరిశ్రమలు మూత పడ్డాయి. అధికారిక లెక్కల ప్రకారం.. ఈ ఏడాది మే 20వ తేదీ నాటికి రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలకు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాల బకాయిలు దాదాపు రూ.3,736.67 కోట్లు. వీటిలో రూ.3,007 కోట్లు చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు సంబంధించినవి కాగా, రూ.728 కోట్లు భారీ, మెగా పరిశ్రమలకు సంబంధించినవి ఉన్నాయి. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొన్ని పరిశ్రమలకు ప్రోత్సాహకం కింద ప్రభుత్వం ఇచి్చన రూ.684 కోట్ల విలువైన చెక్కులు చెల్లలేదని తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు ప్రోత్సాహకాలు చెల్లించేలా కొత్త పారిశ్రామిక విధాన రూపకల్పన జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. -
ఏడేళ్లలో రూ.4.1 లక్షల కోట్ల పెట్టుబడులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం 2014లో ప్రవేశ పెట్టిన నూతన పారిశ్రామిక విధానం టీఎస్ ఐపాస్ అమలు ద్వారా రూ.4.1 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయి. వీటి మూలంగా గడిచిన ఏడేళ్లలో 5 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలను సృష్టించింది. ఎంఎస్ఎంఈ ఎక్స్పోర్ట్ కౌన్సిల్, బిల్‌మార్ట్ ఫిన్‌టెక్ సంస్థల సంయుక్త అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. అధ్యయన వివరాలను ఎంఎస్ఎంఈ ఈపీసీ చైర్మన్ డీఎస్ రావత్, బిల్‌మార్ట్ ఫిన్‌టెక్ సీఈఓ వ్యవస్థాపకుడు జిగేశ్ సొనగరా గురువారం విడుదల చేశారు. 10 రోజుల కంటే తక్కువ వ్యవధిలోనే 38 వేర్వేరు ప్రభుత్వ విభాగాల నుంచి అనుమతులు ఇవ్వడం.. పెట్టుబడులను ఆకర్షించడంలో తెలంగాణను ప్రత్యేక స్థానంలో నిలబెట్టిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవ సులభతర వాణిజ్య విధానానికి దోహదం చేసిందని వివరించారు. గతంలో వచ్చిన పెట్టుబడుల కంటే టీఎస్ ఐపాస్ అమలు ద్వారా గడిచిన ఏడేళ్లలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులే ఎక్కువని ఈ అధ్యయనం వెల్లడించింది. -
ఆ రెండు పాలసీలు ‘పాస్’
మాదాపూర్: రాష్ట్రంలో ప్రవేశపెట్టిన టీఎస్ ఐపాస్, టీఎస్ బీపాస్ పాలసీలు విజయవంతంగా కొనసాగుతున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో మూడు రోజులపాటు జరుగనున్న ఐఐఏ (ది ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆర్కిటెక్ట్స్) ఉత్సవ్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ మహానగరం దినదినాభివృద్ధి చెందుతోందని, ప్రతి ఒక్కరూ జీవించేందుకు అనుకూలంగా ఉంటుందని అన్నారు. టీఎస్ ఐపాస్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న 15 రోజులలో, టీఎస్ బీపాస్‌లో దరఖాస్తు చేసుకున్న 21 రోజులలో అనుమతులను పొందవచ్చని తెలిపారు. ఈపాలసీల ద్వారా సమయం, డబ్బు ఆదా అవుతుందని, మధ్యవర్తులు లేకుండా పనులు పారదర్శకంగా జరుగుతాయని చెప్పారు. నగరంలో అండర్ పాస్‌లను ఏర్పాటు చేయడం వల్ల ట్రాఫిక్ సమస్య తగ్గుముఖం పట్టిందని అన్నారు. తెలంగాణలో వ్యవసాయవృద్ధి విస్త్రృత స్థాయిలో పెరిగిందని పేర్కొన్నారు. హరితహారంలో భాగంగా 2.5 కోట్ల మొక్కలను నాటామని, రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణగా మార్చనున్నామని తెలిపారు. హైదరాబాద్ మహానగరం ఒకప్పుడు రాజభవనాలు, ఉద్యానవనాలతో ఉండేదని, నగరంలో నిర్మితమైన ప్రతి ప్యాలెస్‌కు గుర్తింపు ఉందని చెప్పారు. చార్మినార్‌తోపాటు కేబుల్‌బ్రిడ్జి హైదరాబాద్ ప్రత్యేకతను తెలుపుతున్నాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఐఐఏ తెలంగాణ చాప్టర్ చైర్మన్ ఉదయశంకర్ దోనీ, ఐఐఏ నాట్కాన్–21 కన్వీనర్ శ్రీధర్ గోపిశెట్టి తదితరులు పాల్గొన్నారు. పలువురు ఇంజనీర్లకు బంగారు పతకాలను అందజేశారు. కార్యక్రమానికి సంబందించిన బ్రోచర్‌ను విడుదల చేశారు. -
టీఎస్ ఐపాస్ ద్వారా రూ.2.2 లక్షల కోట్లు పెట్టుబడులు
సాక్షి, నందిగామ: పారిశ్రామిక రంగంలో దేశంలోనే తెలంగాణ ముందు వరుసలో ఉందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. 2015 నవంబర్ నుంచి ఇప్పటి వరకు టీఎస్ ఐపాస్ ద్వారా రాష్ట్రానికి రూ.2.2 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం మేకగూడలో పోకర్ణ ఇంజనీర్డ్ స్టోన్ లిమిటెడ్ కంపెనీ ఏర్పాటు చేసి క్వాంట్రా క్వార్జ్ (గ్రానైట్) పరిశ్రమను శనివారం మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సబితాఇంద్రారెడ్డితో కలసి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సమర్థవంతమైన నాయకత్వం, సుస్థిరతతో కూడిన ప్రభుత్వం ఉన్నం దునే పెట్టుబడులు తరలివస్తున్నాయని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో సమతుల్యమైన అభివృద్ధి జరుగుతోందని, ఐటీ, పారిశ్రామిక రంగాలకు ప్రాధాన్యం ఇస్తూనే ఉపాధికి అవకాశాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా టీఆర్ఎస్ ప్రభుత్వం 2015 నవంబర్‌లో టీఎస్ ఐపాస్ విధానాన్ని ప్రవేశపెట్టిందని, పెట్టుబడిదారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదనేది పాలసీ ఉద్దేశమని స్పష్టం చేశారు. టీఎస్ ఐపాస్ ద్వారా పరిశ్రమను స్థాపించాలనుకునే వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే చాలు 15 రోజుల్లోనే అన్ని అనుమతులు ఇస్తామని చెప్పారు. పోకర్ణ కంపెనీ రూ.500 కోట్లతో ఈ పరిశ్రమను స్థాపించడం అభినందించదగ్గ విషయమన్నారు. ఈ పరిశ్రమతో సుమారు 500 మందికి ప్రత్యక్షంగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని మంత్రి వివరించారు. పరిశ్రమల స్థాపనకు అన్ని రకాలుగా సహకారం అందిస్తామని, మౌలిక సదుపాయాలు సైతం కల్పిస్తామని ఆయన అన్నారు. అంతకు ముందు మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సుమారు 500 ఎకరాల్లో రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెస్ యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పరిశ్రమ ఎండీ గౌతం చంద్ జైన్, ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు అంజయ్య యాదవ్, మర్రి జనార్దన్ రెడ్డి, కాలే యాదయ్య, దానం నాగేందర్, ఎమ్మెల్సీలు కసిరెడ్డి నారాయణ రెడ్డి, కూచుకుళ్ల దామోదర్ రెడ్డి పాల్గొన్నారు. -
పరిశ్రమల్లో స్థానికులకే ఎక్కువ ఉద్యోగాలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమల్లో స్థానికులకు ఎక్కువ సంఖ్యలో ఉద్యోగావకాశాలు కల్పించే కొత్త విధానాన్ని రాష్ట్ర మంత్రిమండలి ఆమోదించింది. టీఎస్ఐపాస్ ద్వారా రాష్ట్రంలో పారిశ్రామిక రంగం వృద్ధి చెందుతుండటంతో స్థానికులకు ఎక్కువ ఉపాధి అవకాశాలు లభించేలా పరిశ్రమలశాఖ రూపొందించిన ముసాయిదాను కేబినెట్ ఆమోదించింది. ఈ నూతన విధానంలో భాగంగా స్థానిక మానవ వనరులకు ఎక్కువ సంఖ్యలో ఉపాధి కల్పించే పరిశ్రమలకు జీఎస్టీలో రాయితీ, విద్యుత్ చార్జీల్లో ప్రోత్సాహకాలు, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం కొంత మొత్తం ప్రభుత్వం చెల్లిస్తుంది. టీఎస్‌ఐపాస్‌లో భాగంగా టీ ప్రైడ్, టీ ఐడియాలో భాగంగా పరిశ్రమలకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పలు రాయితీలు, ప్రోత్సాహకాలిస్తోంది. పరిశ్రమలకు ప్రోత్సాహకాలివే.. రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమలకు అవసరమైన స్థానిక మానవ వనరులను ప్రభుత్వ, పారిశ్రామిక, విద్యా సంస్థల సహకారంతో అందించాలనేది ఈ పాలసీ ఉద్దేశం. అయితే మహారాష్ట్రలో 80 శాతం, ఏపీ, కర్ణాటకలో 75 శాతం, మధ్యప్రదేశ్‌లో 70 శాతం మేర స్థానికులకు ఉపాధి కల్పించే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇస్తున్నారు. ఈ విధానంపై విమర్శ లు వస్తున్న నేపథ్యంలో రెండు కేటగిరీల్లో ప్రోత్సాహకాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సెమీ స్కిల్డ్ కేటగిరీలో 70 శాతం, స్కిల్డ్ కేటగిరీలో 60 శాతం స్థానికుల కు ఉపాధి కల్పించే పరిశ్రమలకు రాయితీలు, ప్రోత్సాహకాలిస్తారు. టీ ప్రైడ్, టీ ఐడియాలలో ఇస్తున్న రాయితీలు, ప్రోత్సాహకాలకు ఇవి అదనం. స్కిల్డ్ కేటగిరీలో మధ్య తరహా, భారీ పరిశ్రమలకు వ్యాట్/సీఎస్టీ/జీఎస్టీలో 10 శా తం రాయితీ ఇస్తారు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు ఎలాంటి రాయితీలుండవు. విద్యుత్ ఖర్చు పరిహారానికి సంబంధించి సెమీ స్కిల్డ్ కేటగిరీలో ఐదేళ్ల వరకు సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు యూనిట్‌కు 50 పైసలు, స్కిల్డ్ కేటగిరీలో రూపాయి వంతున ప్రోత్సాహకం ఇస్తారు. మధ్య తరహా, భారీ పరిశ్రమలకు సెమీ స్కిల్డ్ కేటగిరీలో యూనిట్‌కు 75 పైసలు, స్కిల్డ్ కేటగిరీలో రూపాయి చొప్పున ఇస్తారు. సూక్ష్మ, చిన్న పరిశ్రమలకు పెట్టుబడి రాయితీలో 5 శాతం, నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం ఒక్కో వ్యక్తికి చిన్న, సూక్ష్మ పరిశ్రమలకు రూ. 3 వేలు, మధ్య తరహా, భారీ పరిశ్రమలకు రూ.5 వేలకు మించకుండా చెల్లిస్తారు. ఎలక్ట్రిక్ వాహన పాలసీకి ఆమోదం వాహన కాలుష్యాన్ని తగ్గించే చర్యల్లో భాగంగా రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహనాల వాడకం, తయారీని ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ‘తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిక్ వెహికిల్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్ పాలసీ’ని రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. -
కేబినెట్ భేటీలో కీలక నిర్ణయాలు
సాక్షి, హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించి పాఠశాల విద్యార్థులకు డిజిటల్ క్లాసులు నిర్వహించాలని, ఇందుకోసం దూరదర్శన్ను వినియోగించుకోవాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. దీనికి సంబంధించిన షెడ్యూల్ ఖరారు చేయాలని అధికారులను ఆదేశించింది. అన్ని ప్రవేశ పరీక్షల నిర్వహణకు షెడ్యూల్ రూపొందించాలని కోరింది. డిగ్రీ, పీజీ ఫైనల్ ఇయర్ పరీక్షల నిర్వహణ విషయంలో కోర్టు ఆదేశాల మేరకు నడుచుకోవాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన బుధవారం ప్రగతి భవన్లో మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 11 గంటల వరకు రాష్ట్ర మంత్రివర్గం సుదీర్ఘంగా సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. సచివాలయం కొత్త భవన సముదాయం నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబం« దించిన డిజైన్లను ఆమోదించింది. బాధితులకు హోం ఐసోలేషన్ కిట్లు కరోనా వ్యాప్తి – వైరస్ సోకిన వారికి అందుతున్న చికిత్స– ప్రభుత్వ వైద్యాన్ని మరింత పటిష్టం చేసే అంశాలపై రాష్ట్ర మంత్రివర్గం విస్తృతంగా చర్చించింది. దాదాపు రెండున్నర గంటల పాటు నిపుణులు, వైద్యులతో చర్చించింది. ‘కరోనా ప్రస్తుతం పెద్ద నగరాల్లో తగ్గుముఖం పట్టింది. హైదరాబాద్‌లోనూ కేసులు తగ్గుతున్నాయి. తెలంగాణలో మరణాల రేటు తక్కువగానూ, కోలుకుంటున్న వారి రేటు ఎక్కువగానూ నమోదవుతున్నది. కాబట్టి ప్రజలు పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’అని వైద్య నిపుణులు కేబినెట్ కు వివరించారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, ఎన్ని కేసులు వచ్చినా వైద్యం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేబినెట్ ఉద్ఘాటించింది. ఎక్కువ వ్యయం చేసి ప్రైవేటు ఆసుపత్రులకు పోవాల్సిన అవసరం లేదని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని వసతులు, మందులు, నిపుణులైన డాక్టర్లు అందుబాటులో ఉన్నారని, వారిని ఉపయోగించుకోవాలని కేబినెట్ ప్రజలను కోరింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కావాల్సిన మందులు, పరికరాలు, వసతులు ఏర్పాటు చేయడానికి ఎంత డబ్బుకైనా వెనకాడేది లేదని స్పష్టం చేసింది. – రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రెమ్‌డెసివిర్, డెక్సామితజోన్ ఇంజక్షన్లు, ఫావిపిరావిర్ టాబ్లెట్లు, ఇతర మందులు, పిపిఇ కిట్లు, టెస్ట్ కిట్లు లక్షల సంఖ్యలో అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. కోవిడ్ చికిత్సపై కేబినెట్ తీసుకున్న నిర్ణయాలిలా ఉన్నాయి. – పరీక్షలో పాజిటివ్ వచ్చినట్లు తేలగానే వారికి వెంటనే హోమ్ ఐసోలేషన్ కిట్స్ ఇవ్వాలి. 10 లక్షల హోమ్ ఐసోలేషన్ కిట్స్ సిద్ధంగా ఉంచాలి. – రాష్ట్రవ్యాప్తంగా 10 వేల ఆక్సిజన్ బెడ్లను సిద్ధంగా ఉంచాలి. – ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఎక్కడైనా సిబ్బంది కొరత ఉంటే తాత్కాలిక పద్ధతిలో నియమించుకునేందుకు కలెక్టర్లకు అధికారం. – కోవిడ్ రోగులకు చికిత్స అందించే విషయంలో అవకతవకలకు పాల్పడే ప్రైవేటు ఆసుపత్రుల విషయంలో కఠినంగా వ్యవహరించాలి. – ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన వందకోట్లకు అదనంగా మరో వంద కోట్లను విడుదల చేసింది. వైద్య ఆరోగ్య శాఖ నిధులను నెలవారీగా ఖచ్చితంగా విడుదల చేయాలి. –ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్నందున వారికి కావాల్సిన మందులు, ఇంజక్షన్లు, భోజనాలు ఖర్చులు ప్రభుత్వం భరించాలని నిర్ణయించింది. – ప్రతీ రోజు 40వేల వరకు పరీక్షలు నిర్వహించాలని అధికారులను ఆదేశించింది. త్వరలో ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం, పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు పెంచడం లక్ష్యంగా రాష్ట్రంలో వ్యవసాయాధారిత పరిశ్రమలు పెంచాలని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ సెజ్‌లు పెట్టాలనే సీఎం నిర్ణయాన్ని కేబినెట్ అభినందించింది. ఇందుకోసం సమగ్ర విధానం తీసుకురావాలని నిర్ణయించింది. వలస కార్మికుల సంక్షేమానికి పాలసీ లాక్డౌన్ సమయంలో వలస కార్మికుల కష్టాలను ప్రపంచమంతా కళ్లారా చూసిందని, భవిష్యత్తులో వారికి ఎలాంటి కష్టం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని కేబినెట్ అభిప్రాయపడింది. తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కార్మికులు పనిచేస్తున్నారని, వారి సంక్షేమం కోసం ప్రత్యేక పాలసీ తయారు చేయాలని నిర్ణయించింది. పుట్టిన ఊరిని, కన్నవారిని, కుటుంబాన్ని వదిలి పనికోసం తెలంగాణకు వచ్చే కార్మికులు ఇదే తమ ఇల్లు అనే భావన, భరోసా కలిగించేలా చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడింది. వలస కార్మికుల సంక్షేమ పాలసీ రూపొందించాలని అధికారులను ఆదేశించింది. టీఎస్–బీపాస్‌కు ఆమోదం భవన నిర్మాణ అనుమతులను సరళతరం చేస్తూ రూపొందించిన టీఎస్–బీపాస్ పాలసీని మంత్రివర్గం ఆమోదించింది. టీఎస్–ఐపాస్ లాగానే టీఎస్–బీపాస్ కూడా అనుమతుల విషయంలో పెద్ద సంస్కరణ అని కేబినెట్ అభిప్రాయపడింది. స్థానిక సంస్థలకు వన్‌టైం సెటిల్మెంట్ అవకాశం మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీలు, ప్రభుత్వ కార్యాలయాలు చెల్లించాల్సిన కరెంటు బిల్లులను ప్రతీ నెలా క్రమం తప్పకుండా చెల్లించాలని కేబినెట్ ఆదేశించింది. ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని హెచ్చరించింది. గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల పాత విద్యుత్ బిల్లుల బకాయిలను వన్‌టైమ్ సెటిల్మెంట్ ద్వారా చెల్లించే వెసులుబాటు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది – ప్రభుత్వ శాఖలకు చెందిన పనికిరాని పాత వాహనాలను అమ్మేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. – కోవిడ్ నిబంధనల నేపథ్యంలో ఈసారి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అత్యంత నిరాడంబరంగా నిర్వహించాలని నిర్ణయించింది. –దుమ్ముగూడెం బ్యారేజికి సీతమ్మ సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్‌కు నృసింహ స్వామి రిజర్వాయర్, తుపాకులగూడం బ్యారేజికి సమ్మక్క బ్యారేజిగా నామకరణం చేస్తూ తీర్మానించింది. – రాష్ట్రంలో వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు చేపట్టాల్సిన చర్యలపై కేబినెట్ దాదాపు రెండున్నర గంటలు చర్చించింది. నియంత్రిత పద్ధతిలో 1.13 కోట్ల ఎకరాల్లో పంటలు వేసారని, మరో 10–12 లక్షల ఎకరాల్లో పంటలు వేయాల్సి ఉందని, 8.65 లక్షల ఎకరాల్లో వివిధ రకాల తోటలున్నాయని వ్యవసాయ శాఖ అధికారులు చెప్పారు. -
రూ.24,577 కోట్లు.. 2,253 పరిశ్రమలు..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పారిశ్రామిక విధానం ‘టీఎస్ ఐపాస్’ద్వారా 9 నెలల వ్యవధిలో రాష్ట్రానికి రూ.24,577 కోట్ల పెట్టుబడులతో 2,253 పరిశ్రమలొచ్చాయి. ఈ పరిశ్రమల ఏర్పాటు పూర్తయితే 1,70,888 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు లభించనున్నాయి. 2019 ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ మధ్య కాలంలో రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తాయని ఈ గణాంకాలు పేర్కొంటున్నాయి. ఏడాదిన్నరగా తీవ్ర ఆర్థిక మాంద్యం నెలకొని ఉన్నా రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుపై ఎలాంటి ప్రభావం పడకపోవడం గమనార్హం. కేటగిరీల వారీగా పరిశీలిస్తే.. అత్యధిక సంఖ్యలో వరుసగా ఇంజనీరింగ్, ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయ ఆధారిత, సిమెంట్, కాంక్రీట్ ఉత్పత్తులు, బూడిద ఇటుకులు, గ్రానైట్, స్టోన్ క్రషింగ్, ప్లాస్టిక్ అండ్ రబ్బర్ ఉత్పత్తుల పరిశ్రమలు అత్యధిక సంఖ్యలో వచ్చాయి. వీటిలో రూ.712.58 కోట్ల పెట్టుబడులతో 437 ఇంజనీరింగ్ పరిశ్రమలు అగ్రస్థానంలో నిలిచాయి. ఇక ఇవి ఏర్పాటైతే 9,186 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. 6,23,071 మందికి ఉద్యోగాలొచ్చాయి ఇక టీఎస్ ఐపాస్ ద్వారా గత ఐదేళ్లలో రూ.1,84,655.44 కోట్ల పెట్టుబడులతో మొత్తం 11,857 పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఈ పరిశ్రమల ఏర్పాటు పూర్తయి ఉత్పత్తి ప్రారంభమైతే 13,08,056 మందికి ప్రత్యక్ష ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. గత డిసెంబర్ 31 నాటికి రూ.85,125.83 కోట్ల పెట్టుబడులతో 9,020 పరిశ్రమల ఏర్పాటు పూర్తి కావడంతో 6,23,071 మందికి ఉద్యోగావకాశాలు లభించాయి. రూ.28,116.96 కోట్ల పెట్టుబడులతో చేపట్టిన మరో 764 పరిశ్రమలు తుదిదశలో ఉండగా, వీటి నిర్మాణం పూర్తయితే 2,87,112 మందికి కొత్తగా ఉద్యోగాలు లభించనున్నాయి. రూ.51,023 కోట్ల పెట్టుబడితో వచ్చిన 1,428 పరిశ్రమల ఏర్పాటు ప్రారంభ దశలో ఉంది. వీటి ఏర్పాటు పూర్తయితే మరో 2,57,323 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. అనుమతులు పొందిన పరిశ్రమల్లో ఇంకా 1,428 పరిశ్రమలు ప్రారంభం కాలేదు. రూ.20,388.85 కోట్ల పెట్టుబడులతో వచ్చిన పరిశ్రమలు ఏర్పాటైతే 1,40,550 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. భారీగాపెరిగిన ఎగుమతులు ఇక రాష్ట్రం నుంచి వస్తు సేవల ఉత్పత్తుల ఎగుమతులు గతేడాది భారీగా పెరిగాయి. 2017–18లో రూ.1,35,783 కోట్లు విలువ చేసే ఎగుమతులు జరగ్గా, 2018–19లో రూ.1,59,729 కోట్లకు ఎగబాకాయి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ కమర్షియల్ ఇంటెలిజెన్స్ స్టాటిస్టిక్స్ గణాంకాల ప్రకారం 2015–16లో రూ.35,444 కోట్లు విలువ చేసే వస్తు ఎగుమతులు జరగ్గా, 2018–19లో రూ.50,510 కోట్లకు పెరిగాయి. అంతకుముందు ఏడాదితో పోల్చితే 2018–19లో జరిగిన వస్తు ఎగుమతుల్లో 12.5 శాతం వృద్ధి కనబడింది. -
1.6 కోట్ల టన్నుల ఆహారధాన్యాల ఉత్పత్తి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఆహార పంటలు ఆశించిన మేర ఉత్పత్తి అవుతున్నాయి. 2018–19 ఖరీఫ్, రబీ సీజన్లలో 1.6 కోట్ల టన్నుల ఆహార పంటల ఉత్పత్తి వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ సామాజిక ఆర్థిక సర్వే–2020 నివేదిక వెల్లడించింది. ఇక 2019–20 రెండో ముందస్తు అంచనాలతో అమాంతం పెరిగింది. ఇందులో ఒక వరినే 98.74 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉంది. దీనిప్రకారం 2018 ఖరీఫ్, రబీ సీజన్లలో వరి 66.69 లక్షల టన్నుల్లో ఉత్పత్తి వచ్చింది. అలాగే మొక్కజొన్న 20.83 లక్షల టన్నుల ఉత్పత్తి వచ్చింది. రాష్ట్రంలో ఆహారేతర పంటల సాగు పెరిగింది. 2016–17కు వచ్చే సరికి 33.6 శాతం ఉండగా 2017–18లో 38.7 శాతానికి పెరిగింది. 2018–19లో 38.8 శాతానికి చేరింది. ఇక పంట రుణాలు 2016–17 సంవత్సరంలో రూ. 26,282 కోట్లు ఇచ్చారు. 2018–19లో రూ.31,410 కోట్లు పంపిణీ చేశారు. 2018–19లో రూ.42,494 కోట్లకు రూ.33,751 కోట్లు బ్యాంకులు ఇచ్చాయి. 6.6 లక్షల ఎకరాల్లో సూక్ష్మసేద్యం.. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి 2019–20 ఫిబ్రవరి వరకు 6.6 లక్షల ఎకరాల్లో సూక్ష్మసేద్యం అందుబాటులోకి తీసుకొచ్చారు. రాష్ట్ర ఉద్యానశాఖ ఆధ్వర్యంలో ఈ పథకం అమలవుతోంది. ఈ ఆరేళ్ల కాలంలో 2.48 లక్షల మంది రైతులు డ్రిప్ సౌకర్యం పొందినట్లు ఈ నివేదిక పేర్కొంది. డ్రిప్ ద్వారా నీటితో పాటు అనేక విషయాల్లో రైతులకు ఆదాయం మిగిలిందని, నాబ్కాన్స్ సర్వే కూడా వెల్లడించింది. సూక్ష్మసేద్యం అమలు చేసేందుకు రాష్ట్రప్రభుత్వం నాబార్డు నుంచి రుణం తీసుకుంది. ఉద్యాన శాఖ ద్వారా ఈ పథకాన్ని అమలు చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం సబ్సిడీ ఇచ్చారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం 4.65 లక్షల ఎకరాల్లో డ్రిప్ ఇవ్వగా, 1.89 లక్షల ఎకరాల్లో స్ప్రింక్లర్లు ఇచ్చారు. 2016–17, 2017–18 సంవత్సరాల్లో ఎక్కువ మంది రైతులకు లబ్ధి చేకూరింది. ఈ 2 సంవత్సరాల్లో వరుసగా 55,121, 83,458 మంది రైతులకు సూక్ష్మసేద్యం అందింది. ఇక 2018–19లో 37,596 మంది రైతులకు, 2019–20లో ఇప్పటివరకు 1,745 మంది రైతులకు డ్రిప్ అందింది. ఇలా రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 56 లక్షల మంది రైతులు ఉన్నారు. ఇందులో 2.48 లక్షల మందికి మాత్రమే సూక్ష్మసేద్యం అందింది. మరింత మంది రైతులకు లబ్ధి చేకూర్చేందుకు దీంతో ఈసారి బడ్జెట్ అంచనాల్లో రూ.600 కోట్లు ప్రతిపాదించింది. లక్ష్మీ పంప్‌హౌస్ నుంచి 51.77 టీఎంసీల ఎత్తిపోత కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా ఉన్న లక్ష్మీ (మేడిగడ్డ) పంప్‌హౌస్ నుంచి మార్చి 4వ తేదీ నాటికి మొత్తంగా 51.77 టీఎంసీల గోదావరి జలాలను ఎత్తిపోసినట్లు సామాజిక, ఆర్థిక సర్వేలో వెల్లడైంది. అలాగే ఎగువన ఉన్న సరస్వతి (అన్నారం) పంప్‌హౌస్ ద్వారా 46.53 టీఎంసీలు, దాని పైన ఉన్న పార్వతి (సుందిళ్ల) ద్వారా 44.06 టీఎంసీల నీటిని ఎల్లంపల్లి రిజర్యాయర్‌లోకి ఎత్తిపోసినట్లు సర్వే తెలిపింది. ఇక ఎల్లంపల్లి నుంచి నంది పంప్‌హౌస్ ద్వారా 59.94 టీఎంసీలు, గాయత్రి పంప్‌హౌస్ ద్వారా 57.64 టీఎంసీల నీటిని ఎత్తిపోసినట్లు వెల్లడించింది. ఇక మిషన్ కాకతీయ ద్వారా ఇప్పటి వరకు నాలుగు విడతలుగా 27,584 చెరువుల పునరుద్ధరణను రూ.8,735.32 కోట్లతో చేపట్టినట్లు సర్వే వెల్లడించింది. ఇందులో ఇప్పటివరకు 21,601 చెరువుల పనులు పూర్తయ్యాయని, దీనికి రూ.4,352 కోట్లు ఖర్చు చేశారని పేర్కొంది. ఈ చెరువుల పునరుద్ధరణ ద్వారా 8.94 టీఎంసీల నీటి నిల్వలు పెరిగాయని వెల్లడైంది. మరో 5,983 చెరువుల పనులు పూర్తి చేయాల్సి ఉందని తెలిపింది. టీఎస్ ఐపాస్ ద్వారా 13.08 లక్షల మందికి ఉపాధి తెలంగాణ పారిశ్రామిక విధానం ‘టీఎస్ఐపాస్’ద్వారా గతేడాది డిసెంబర్ 31 నాటికి రాష్ట్రంలో 6,23,071 మందికి ఉద్యోగావకాశాలు లభించాయి. రూ.1,84,655 కోట్ల పెట్టుబడితో 11,857 కొత్త పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చాయి. ఇందులో 9,020 పరిశ్రమల్లో ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభమైంది. టీఎస్ఐపాస్ కింద రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమల పురోగతి -
ఐటీ.. సిటీ మేటి
సాక్షి, హైదరాబాద్: ఐటీ కంపెనీలు గ్రేటర్ సిటీకి జైకొడుతున్నాయి. మహా నగర శివారు ప్రాంతాలు ఈ కంపెనీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారనున్నాయి. కొత్త పరిశ్రమల ఏర్పాటుకు వీలుగా ప్రభుత్వం టీఎస్ ఐపాస్, హార్డ్‌వేర్, ఐటీ పాలసీలను ప్రవేశపెట్టడంతో మూడేళ్లుగా ఐటీ, హార్డ్‌వేర్ కంపెనీలతోపాటు తయారీ, ఏరోస్పేస్, ఫార్మా రంగాల్లో దిగ్గజ పరిశ్రమలు వందలాదిగా నగర శివార్లకు తరలివస్తున్నా యి. పరిశ్రమల శాఖ వర్గాల ప్రకారం.. గత 6 నెలల్లో నగరంలో పరిశ్రమల ఏర్పాటుకు 255 దరఖాస్తులు అందాయి. వీటిలో 60 తయారీరంగం, 80 ప్లాస్టిక్, 40 ఏరోస్పేస్ విడిభాగాలు, 20 ఫార్మా కంపెనీలున్నాయి. ఐటీ సంబంధ కంపెనీలు 55 వరకు ఉన్నాయి. ఇవి శివార్లలోని శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, రాజేంద్రనగర్, మహేశ్వరం, బుద్వేల్‌లో పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్నాయి. రెండేళ్లలో వీటి ద్వారా రూ.18,400 కోట్ల పెట్టుబడులు వస్తాయని, 50 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని అంచనా. 2015 నుంచి ఐటీ వెల్లువ.. నూతన పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడుల ప్రవాహానికి దారులు వేయడం, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీఎస్ ఐపాస్‌కు విశేష స్పందన లభిస్తోంది. 2015 నుంచి గ్రేటర్ శివారు ప్రాంతాల్లో వివిధ రకాల కంపెనీల ఏర్పాటుకు దాదాపు 800 దరఖాస్తులు అందగా, 478 పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. వీటి ఏర్పాటుతో రూ.28,000 కోట్ల పెట్టుబడులు నగరానికి తరలివచ్చాయని పరిశ్రమల శాఖ వర్గాలు తెలిపాయి. ఆయా కంపెనీల్లో 3.29 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కాయి. రాబోయే రెండు మూడేళ్లలో మిగతా పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయి. ఇబ్బడిముబ్బడిగా ఉపాధి.. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం గ్రేటర్ నగరంలో సుమారు వంద చిన్న, పెద్ద ఐటీ కంపెనీలు ఏర్పాటయ్యాయి. ఇవన్నీ శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, హైటెక్‌సిటీ పరిసరాలకే పరిమితమయ్యాయి. వీటి ద్వారా 50 వేల మందికి ఉపాధి లభించినట్లు ఐటీ శాఖ వర్గాలు తెలిపాయి. గ్రేటర్ కేంద్రంగా ఇప్పటికే బహుళ జాతి, దేశీయ దిగ్గజ సంస్థలకు చెందిన 647 ఐటీ కంపెనీల శాఖలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. వీటిలో సుమారు 6 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. అంతా అనుకూలమే.. టీఎస్ ఐపాస్ కింద దరఖాస్తు చేసుకున్న కంపెనీలు ఇప్పటికే కార్యకలాపాలు సాగిస్తున్నాయి. విస్తరణలో భాగంగా ఇవన్నీ మరిన్ని బ్రాంచీలను ఏర్పాటు చేస్తాయని ఐటీ శాఖ అధికారులు తెలిపారు. నగరంలో విశిష్ట భౌగోళిక వాతావరణ పరిస్థితులు, నైపుణ్యంగల ఐటీ నిపుణులు అందుబాటులో ఉండటంతో చాలా కంపెనీలు ఇక్కడ కంపెనీల ఏర్పాటుకు మక్కువ చూపుతున్నాయి. -
నిర్మాణాల కోసం.. ఇక టీఎస్–బీపాస్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు ఏకగవాక్ష (సింగిల్ విండో) పద్ధతిలో అనుమతులు జారీ చేసేందుకు ఐదేళ్ల కిందట చేపట్టిన కొత్త పారిశ్రామిక విధానం ‘టీఎస్–ఐపాస్’సత్ఫలితాలను సాధించిపెట్టింది. ఈ తరహాలోనే భవనాలు, లేఅవుట్ల నిర్మాణానికి సింగిల్ విండో విధానంలో అనుమతులిచ్చేందుకు రాష్ట్ర పురపాలక శాఖ త్వరలో ‘టీఎస్–బీపాస్’పేరుతో కొత్త పాలసీని తీసుకురాబోతోంది. పురపాలనలో సంస్కరణల అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం గతేడాది తీసుకొచ్చిన కొత్త మునిసిపల్ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు ‘టీఎస్–బీపాస్’విధానానికి రూపకల్పన చేసింది. ఖాళీ స్థలాల్లో లే–అవుట్లు, భవనాల నిర్మాణానికి అనుమతుల కోసం బిల్డర్లు, డెవలపర్లతో పాటు సాధారణ పౌరులు సైతం వివిధ ప్రభుత్వ శాఖల నుంచి పలు రకాల అనుమతులు పొందాల్సిన వస్తోంది. వాటి జారీలో అవినీతి, జాప్యం కారణంగా దరఖాస్తుదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. దీనికి పరిష్కారంగా ‘టీఎస్–బీపాస్’అనే కొత్త విధానానికి టౌన్,కంట్రీప్లానింగ్ విభాగం అభివృద్ధిపరిచింది. భవనాలు, లేఅవుట్ల నిర్మాణానికి వివిధ ప్రభుత్వ శాఖల నుంచి తీసుకోవాల్సిన అనుమతులన్నింటినీ ఒకే చోట (సింగిల్ విండో) నుంచి జారీ చేయనున్నారు. భూయజమాని/డెవలపర్ కేవలం స్వీయధ్రువీకరణ పత్రం ఇస్తే టీఎస్–ఐపాస్ తరహాలో 21 రోజుల నిర్దేశిత గడువులోగా సత్వర అనుమతులు జారీ చేయనున్నారు. సాధారణ పౌరులతో పాటు బిల్డర్లు, డెవలపర్లు ఈ కొత్త విధానంతో ప్రయోజనం పొందనున్నారు. త్వరలో ఈ వెబ్‌సైట్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురాబోతోంది. ►భవనాలు, లేఅవుట్ల అభివృద్ధి కోసం వచ్చే దరఖాస్తుల పరిశీలన కోసం జిల్లా కలెక్టర్ల నేతృత్వంలో జిల్లా స్థాయి టీఎస్–బీపాస్ కమిటీలను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. అనుమతులు పొందిన తర్వాత నిర్దేశిత ప్లాన్ప్రకారమే నిర్మాణాలు జరిపారా? లేక ఉల్లంఘనలున్నాయా? అనుమతులు లేకుండా జరిపారా? అన్న అంశాలను ఈ కమిటీ తనిఖీ చేసి చర్యలు తీసుకోనుంది. ►75 చదరపు గజాలలోపు స్థలంలో ఇళ్ల నిర్మాణానికి దరఖాస్తుదారులు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ►500 చదరపు మీటర్లలోపు ప్లాట్లలో 10 మీటర్లలోపు ఎత్తు వరకు నిర్మించే భవనాలకు స్వీయ ధ్రువీకరణ ఆధారంగా తక్షణ అనుమతులు జారీ చేయనున్నారు. ►నివాసేతర భవనాలు, 10 మీటర్లకు మించిన ఎత్తైన భవనాల నిర్మాణానికి 21 రోజుల నిర్దేశిత గడువులోగా సింగిల్ విండో విధానంలో అన్ని రకాల అనుమతుల జారీ. ►200 చదరపు మీటర్ల వరకు ప్లాట్లలో 7 మీటర్ల ఎత్తు వరకు నిర్మించే భవనాల నిర్మాణానికి అనుమతుల కోసం తనఖా పెట్టాల్సిన అవసరం లేదు. ►అనుమతుల అనంతరం జిల్లా స్థాయి కమిటీ దరఖాస్తులను తనిఖీ చేయనుంది. ►దరఖాస్తుదారులు తప్పుడు సమాచారమిస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. ►అనుమతులను ఉల్లంఘించి నిర్మిస్తే.. ఎలాంటి నోటీసులు లేకుండా తొలగిస్తారు. ►స్వీయధ్రువీకరణ ఆధారంగా ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీ. -
టీఎస్–ఐపాస్ పురస్కారం అందుకున్న ఇన్చార్జి కలెక్టర్
సాక్షి, రంగారెడ్డి: పరిశ్రమలకు అనుమతులు జారీ చేయడంలో అత్యుత్తమ పురోగతి కనబర్చిన మన జిల్లాకు అవార్డు వరించింది. ఈమేరకు ‘టీఎస్–ఐపాస్ అవార్డు’ను ఇన్ చార్జి కలెక్టర్ డాక్టర్ హరీష్, జిల్లా పరిశ్రమల కేంద్రం (డీఐసీ) జనరల్ మేనేజర్ జె.రాజేశ్వర్‌రెడ్డికి రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రదానం చేశారు. హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో బుధవారం రాష్ట్ర పరిశ్రమలు, కామర్స్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన టీఎస్–ఐపాస్ ఐదు వసంతాల వేడుకల్లో భాగంగా వీరిద్దరూ అవార్డు అందుకున్నారు. ఐదేళ్ల కింద అమల్లోకి వచ్చిన టీఎస్–ఐపాస్ కింద దరఖాస్తు చేసుకున్న పరిశ్రమల సంఖ్య ఆధారంగా అన్ని జిల్లాలను మూడు కేటగిరీలుగా విభజించారు. అత్యధికంగా పరిశ్రమలు ఉన్న తొలి జాబితాలో నిలిచిన మన జిల్లా.. సకాలంలో అనుమతుల జారీ, టీఎస్–ఐపాస్ విధానం అమలు, పారిశ్రామిక ప్రగతిలో మెరుగైన పురోగతి కనబర్చింది. ఇందుకు గుర్తింపుగా జిల్లాకు టీఎస్–ఐపాస్ అవార్డు లభించగా.. జిల్లా పరిశ్రమల ప్రమోషన్ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించే కలెక్టర్, కన్వీనర్‌గా కొనసాగుతున్న డీఐసీ జీఎం ఈ పురస్కారాన్ని అందుకున్నారు. అవార్డు లభించడంపై వారిద్దరు హర్షం వ్యక్తం చేశారు. పరిశ్రమల అనుమతుల జారీలో భాగస్వాములైన అన్ని శాఖల సహకారంతోనే ఇది సాధ్యపడిందని అన్నారు. -
పరిశ్రమల ఖిల్లా.. రంగారెడ్డి జిల్లా
పరిశ్రమల స్థాపనకు మన జిల్లా కేరాఫ్ అడ్రస్‌గా మారింది. సూక్ష్మ నుంచి మెగా వరకు ఏ కేటగిరీని తీసుకున్నా పరిశ్రమల ఏర్పాటులో జిల్లా ప్రత్యేకతను చాటుతోంది. అదేవిధంగా బహుళజాతి కంపెనీలు విస్తృతంగా వెలుస్తుండటం శుభపరిణామం. హైదరాబాద్ మహానగరం శివారు చుట్టూ మన జిల్లా విస్తరించి ఉండటం, అనువైన రవాణా వ్యవస్థ కలిగి ఉండటంతో పెట్టుబడుల వరద పారుతోంది. ముఖ్యంగా ‘టీఎస్–ఐపాస్’ పేరిట 2014లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీ.. పరిశ్రమలకు స్థాపనకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ పాలసీ అమల్లోకి వచ్చి ఐదేళ్లు గడవగా.. విజయవంతంగా అమలు చేసిన జాబితాలో మన జిల్లా అగ్రభాగాన ఉండటం విశేషం. పరిశ్రమల ఏర్పాటులో అత్యుత్తమ ప్రతిభ కనబర్చడంతో జిల్లాకు అవార్డు వచ్చింది. బుధవారం నగరంలోని శిల్పకళావేదికలో నిర్వహించే టీఎస్–ఐపాస్ ఐదేళ్ల సంబరాల్లో భాగంగా మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా జిల్లా ఇన్చార్జి కలెక్టర్ హరీష్, డీఐసీ జనరల్ మేనేజర్ జె.రాజేశ్వర్‌రెడ్డి అవార్డు అందుకోనున్నారు. ఈనేపథ్యంలో జిల్లాలో పరిశ్రమల స్థాపన.. పెట్టుబడులు.. ఉపాధి కల్పనపై ప్రత్యేక కథనం.. సాక్షి, రంగారెడ్డి: పరిశ్రమల స్థాపనలో మన జిల్లా వేగంగా దూసుకెళ్తోంది. 2014 డిసెంబర్లో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక అనుమతులు, స్వీయధ్రువీకరణ చట్టం (టీఎస్–ఐపాస్) అమల్లోకి తీసుకురావడంతో మహర్దశ పట్టింది. త్వరితగతిన అనుమతులు జారీ చేయడం, నెల రోజుల నిర్దిష్ట సమయంలో అనుమతులు మంజూరు, ఆన్లైన్లో విధానంలో దరఖాస్తు చేసుకునే సౌలభ్యం ఈ పాలసీతో కలిగింది. దీంతో పారిశ్రామికవేత్తలు.. ఎన్నో అనుకూల అంశాలు ఉన్న మన జిల్లాలో పెట్టుబడులు పెట్టేందుకు అమితమైన ఆసక్తి చూపారు. టీఎస్–ఐపాస్ పాలసీ అమల్లోకి వచ్చాక ఆయా కేటగిరీల్లో మొత్తం రూ.46 వేల కోట్ల వ్యయంతో 935 పరిశ్రమలు నెలకొల్పేందుకు ఆన్లైన్ దరఖాస్తులు అందాయి. వీటిద్వారా 7.64 లక్షల మందికి ఉపాధి కల్పించాలన్నది లక్ష్యం. ఇందులో ఇప్పటివరకు 690 పరిశ్రమలు తమ ఉత్పత్తులను ప్రారంభించాయి. రూ.13,385 కోట్ల పెట్టుబడులు జిల్లాకు వచ్చాయి. ఇప్పటివరకు 1.95 లక్షల మందికి ఉపాధి లభించడం విశేషం. పరోక్షంగా మరో 50 వేల మంది వరకు జీవనోపాధి అవకాశాలు లభించాయి. రూ.వేల కోట్ల పెట్టుబడులు జాతీయ, బహుళ జాతీయ కంపెనీలు కూడా మన జిల్లాలో ఏర్పాటయ్యాయి. మహానగరం చుట్టూ జిల్లా విస్తరించడం, రవాణామార్గాలు అనువుగా ఉండటం.. తదితర సానుకూలతలు పారిశ్రామికవేత్తలను ఆకర్షిస్తున్నాయి. ఒక్కో మెగా కంపెనీలు రూ.వేల కోట్లు పెట్టుబడులు పెడుతుండగా.. మరికొన్ని విస్తరణకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. టైల్స్ తయారీ చేసేందుకు వెల్స్పన్ ఫ్లోరింగ్ లిమిటెడ్ కంపెనీ రూ.వెయ్యి కోట్ల పెట్టుబడులు పెడుతోంది. దీనివల్ల 500 మందికి ఉపాధి లభించనుంది. అలాగే నందిగామలో ఎంఎస్ఎన్ ఫార్మా విస్తరణకు వెళ్తోంది. ఇందుకోసం రూ.300 కోట్లు ఖర్చు చేస్తుండగా.. సుమారు 1,200 మందికి ఉపాధి దొరకనుంది. ఇక ఆదిబట్లలో ఏరోసిటీలో టాటా ఏరో స్పేస్ ఆరు విభాగాల్లో తమ ఉత్పత్తులను మొదలు పెడుతోంది. ఇందుకోసం రూ.1,200 కోట్లు పెట్టుబడులు పెట్టింది. దీంతోపాటు ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్ తన సేవలను మొదలుపెట్టింది. వీటికంటే ముందు జిల్లాలో ఐటీ కారిడార్, హార్డవేర్ పార్క్‌లు, ఐడీఏ కాటేదాన్ , ఐడీఏ కొత్తూరు తదితర సెజ్‌లు, పార్క్‌లు కూడా విస్తరించడం తో పారిశ్రామికరంగంలో జిల్లా దూసుకెళ్తోంది. పరిశ్రమల స్థాపనకు అనుకూలతలు ఇవీ.. జిల్లా శివారు ప్రాంతాలన్నీ మహానగరం చుట్టూ ఉండటం నైపుణ్యం ఉన్న మానవ వనరులు పుష్కలంగా లభిస్తుండటం టీఎస్–ఐపాస్ ద్వారా సరళంగా, సులభతరంగా అనుమతులు లభించడం కమ్యూనికేషన్ వ్యవస్థ పటిష్టంగా ఉండటం రవాణా వ్యవస్థ బాగా విస్తరించడం ఇన్చార్జి కలెక్టర్ హర్షం టీఎస్–ఐపాస్ అవార్డు లభించడంపై ఇన్చార్జి కలెక్టర్ డాక్టర్ హరీష్ సంతోషం వ్యక్తం చేశారు. సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయడంతోనే ఉత్తమ ప్రతిభ చూపేందుకు సాధ్యమైందని పేర్కొన్నారు. అవార్డు మరింత బాధ్యతలను పెంచిందని చెప్పారు. పరిశ్రమల స్థాపనకు జిల్లా అన్ని విధాల అనుకూలమని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ జె.రాజేశ్వర్ రెడ్డి చెప్పారు. టీఎస్–ఐపాస్ ద్వారా జిల్లాలో ఇప్పటివరకు రూ.13 వేల కోట్లకుపైగా పెట్టుబడులు జిల్లాకు వచ్చాయని తెలిపారు. -
పరిశ్రమలు 11,000 పెట్టుబడులు 1.73 లక్షల కోట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్థిక పురోగతి, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం రూపొందించిన సులభతర వాణిజ్య, పారిశ్రామిక విధానం టీఎస్ఐపాస్(తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్, సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్) ఐదేళ్లు పూర్తి చేసుకుంది. దేశంలోనే వినూత్నమైన పారిశ్రామిక విధానంగా చెబుతున్న టీఎస్ఐపాస్ ద్వారా ఐదేళ్లలో రూ.1.73 లక్షల కోట్ల పెట్టుబడులతో 11 వేలకుపైగా పరిశ్రమలు ఏర్పాటవగా 13 లక్షల మందికి ఉపాధి లభించినట్లు పరిశ్రమలశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పరిశ్రమల అనుమతుల్లో పారదర్శక, సరళమైన, అవినీతిరహిత విధానం రూపొందిన టీఎస్ ఐపాస్‌కు 2014 నవంబర్ 27న చట్టబద్ధత కల్పించింది. జిల్లాలవారీగా వనరులను సద్వినియోగం చేసుకుంటూ పారిశ్రామిక అభివృద్ధి సాధించేందుకు 14 ప్రాధాన్యతా రంగాల్లో పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించాలని ఐపాస్‌లో లక్ష్యంగా నిర్దేశించింది. 3 కేటగిరీల్లో అవార్డులు.. నూతన పారిశ్రామిక విధానంగా పేర్కొనే టీఎస్ ఐపాస్‌కు చట్టబద్ధత కల్పించి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా పరిశ్రమలశాఖ ఆధ్వర్యంలో బుధవారం ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కె. తారక రామారావుతోపాటు మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి తదితరులు ఉత్సవాలకు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా చట్టం అమల్లో ప్రతిభ చూపిన 33 జిల్లాలను మూడు కేటగిరీలుగా వర్గీకరించి ఒక్కో కేటగిరీలో మూడేసి జిల్లాలకు బుధవారం అవార్డులు అందజేయనున్నారు. మొదటి కేటగిరీలో కరీంనగర్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, రెండో కేటగిరీలో సిద్దిపేట, కామారెడ్డి, మెదక్, మూడో కేటగిరీలో జగిత్యాల, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్ జిల్లాల తరఫున ఆయా జిల్లాల కలెక్టర్లు అవార్డులు అందుకోనున్నారు. ప్రభుత్వ విభాగాల కేటగిరీలో ఉత్తర, దక్షిణ మండల విద్యుత్ పంపిణీ సంస్థలు, భూగర్భ జలవనరులు, రెవెన్యూ విభాగాలకు అవార్డులు అందించనున్నారు. టీఎస్ ఐపాస్‌ను సమర్థంగా అమలు చేయడంలో కీలకపాత్ర పోషించిన అధికారులు ఈవీ నర్సింహారెడ్డి (టీఎస్ఐఐసీ), అర్వింద్ కుమార్ (మెట్రోపాలిటన్ కమిషనర్), టీకే శ్రీదేవి (మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్), కె. విద్యాధర్ (టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్), నీతూకుమారి ప్రసాద్ (పీసీబీ సభ్య కార్యదర్శి), అహ్మద్ నదీమ్ (లేబర్, ఇండస్ట్రీస్ కమిషనర్) అవార్డులు అందుకోనున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలే ఎక్కువ ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ, ఫార్మా, విద్యుత్, ప్లాస్టిక్, ఇంజనీరింగ్, వ్యవసాయాధార, గ్రానైట్ స్టోన్ క్రషింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, పేపర్, ప్రింటింగ్, టెక్స్టైల్, సిమెంట్, ఏరోస్పేస్, సోలార్, ఆటోమొబైల్ రంగాల పరిశ్రమలు టీఎస్‌ఐపాస్‌లో భాగంగా రాష్ట్రంలో ఏర్పాటయ్యాయి. ఈ విధానం వల్లే దేశీయ సంస్థలతోపాటు బహుళజాతి కంపెనీలు పెట్టుబడులతో రాష్ట్రానికి రాగా వాటిలో ఎక్కువగా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఉన్నాయి. ఐపాస్ మూలంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగేళ్లుగా జాతీయస్థాయిలో తొలి 2 స్థానాల్లో కొనసాగుతోంది. రాజధాని పరిసరాల్లోనే పారిశ్రామిక అభివృద్ధి కేంద్రీకృతం కాకుండా గ్రామాలకు విస్తరించే లక్ష్యంతో ఐపాస్‌లో భాగంగా పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేసి మౌలిక సౌకర్యాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఐపాస్ అమలుతో ఐదేళ్లలో పారిశ్రామిక పెట్టుబడుల ఆకర్షణలో 70 శాతానికిపైగా వృద్ధి సాధించినట్లు పరిశ్రమలశాఖ నివేదిక వెల్లడిస్తోంది ఐపాస్ ప్రత్యేకతలివే పారిశ్రామిక అనుమతులు పొందడాన్ని హక్కుగా చేస్తూ దరఖాస్తుదారుడు ఆన్లైన్లో వివరాలు సమర్పించేలా టీఎస్ఐపాస్ చట్టం–2014 రూపొందించారు. 27 ప్రభుత్వ విభాగాల పరిధిలో 35 అంశాలకు సంబంధించి అనుమతులు తీసుకోవాల్సి ఉండగా వాటన్నింటినీ ఐపాస్ గొడుగు కిందకు తెచ్చారు. పారిశ్రామిక అనుమతులకు 110 రకాలైన పత్రాలను సమర్పించాల్సి ఉండగా వాటి సంఖ్యను పదికి కుదించారు. దరఖాస్తు చేసిన 30 రోజుల్లోగా అనుమతి లభించని పక్షంలో అనుమతి లభించినట్లుగానే భావించాల్సి ఉంటుందనే నిబంధనకు చోటు కల్పించారు. రూ.200 కోట్లకు పైబడిన పెట్టుబడితో వచ్చే భారీ పరిశ్రమలకు అనుమతులను 15 రోజుల్లోనే ఇవ్వాలని చట్టంలో పేర్కొన్నారు. భారీ ప్రాజెక్టులకు అనుమతులిచ్చే ప్రక్రియను పర్యవేక్షించేం దుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ‘టీ స్విప్ట్’బోర్డుతోపాటు సీఎం నేతృత్వంలో ‘ఇండస్ట్రియల్ చేజింగ్ సెల్’ను ఏర్పాటు చేశారు. ఆన్లైన్లో దరఖాస్తుతోపాటు దరఖాస్తు రుసుము చెల్లింపునూ ఇదే విధానం లో చేయాలని చట్టంలో స్పష్టం చేయడంతో భారీ ఫలితాలు సాధించినట్లు పరిశ్రమల వర్గాలు వెల్లడించాయి. -
తెలంగాణ దేశానికే ఆదర్శం : కేటీఆర్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రం పారిశ్రామిక పాలసీలో దేశానికే ఆదర్శమని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. గురువారం ఢిల్లీలో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇండియన్ ఎకనామిక్ సమ్మిట్‌లో భాగంగా జరిగిన యూనియన్ ఆఫ్ స్టేట్స్ సెషన్లో ప్రసంగించారు. గత ఐదు సంవత్సరాలుగా తెలంగాణ అద్భతమైన పారిశ్రామిక ప్రగతిని సాధించిందన్నారు. టీఎస్ ఐపాస్ ద్వారానే పారిశ్రామిక ప్రగతి సాధ్యమయిందని తెలిపారు. విజనరీ లీడర్ షిప్ ఉన్న రాష్ట్రాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయనేందుకు తెలంగాణే నిదర్శమని అన్నారు. ఈ క్రమంలో కేంద్ర రాష్ట్రాలు బృహత్తర లక్ష్యం కోసం సమన్వయంతో పని చేసినప్పుడే దేశ ప్రగతి సాధ్యమవుతుందని అభిప్రాయపడ్డారు. మరోవైపు రాష్ట్రాలకు అనుగుణంగా కేంద్ర పాలసీలు మరింత సరళతరం కావాల్సిన అవసరముందని సూచించారు. అయితే, కేంద్ర ప్రభుత్వం ఉమ్మడి జాబితాలోని అనేక అంశాలను రాష్ట్రాలకు అప్పగించాలని కోరారు. దేశ ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్నది పట్టణాలు, నగరాలేనని అన్నారు. -
టీఎస్ ఐపాస్‌కు కొత్త మార్గదర్శకాలు!
సాక్షి, హైదరాబాద్: వరుస ఎన్నికల నేపథ్యంలో ఇన్నాళ్లూ వాయిదా పడుతూ వస్తోన్న టీఎస్ ఐపాస్ నూతన మార్గదర్శకాల రూపకల్పనపై పరిశ్రమల శాఖ దృష్టి సారించింది. నాలుగేళ్లుగా టీఎస్ ఐపాస్ అమలు తీరుపై సమీక్షించడంతోపాటు, అవసరమైన చోట సవరణలు చేసి కొత్త మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులు సూత్రప్రాయంగా నిర్ణయించారు. రాయితీలు, ప్రోత్సాహకాలపై స్పష్టత వస్తేనే మరింత మంది ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు పెట్టుబడులతో ముందుకు వస్తారని పరిశ్రమల శాఖ అంచనా వేస్తోంది. ఎన్నికల కోడ్‌ను దృష్టిలో పెట్టుకుని కొంత కాలంగా పరిశ్రమలకు భూ కేటాయింపులను కూడా పరిశ్రమల శాఖ నిలిపివేసింది. రాయితీలు, ప్రోత్సాహకాల చెల్లింపులో తదుపరి మార్గదర్శకాలు వెలువడేంత వరకు పాత మార్గదర్శకాలను అనుసరించాలని ఆ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్పత్తి, సేవా రంగాల్లో పరిశ్రమల స్థాపనను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నూతన పారిశ్రామిక చట్టం ‘టీఎస్ ఐపాస్–2014’ను రూపొందించింది. 2015 జూన్ 12 నుంచి అమల్లోకి వచ్చిన ఈ చట్టం అమలు గడువు ఈ ఏడాది మార్చి 31తో ముగిసింది. టీఎస్ ఐపాస్ కొత్త మార్గదర్శకాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి వెలువడే ఆదేశాల కొరకు పారిశ్రామికవర్గాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. పెరిగిన పారిశ్రామిక వృద్ధి రేటు.. రాష్ట్రంలోని వనరులను దృష్టిలో పెట్టుకుని 14 ప్రాధాన్యత రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేలా తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్ (టీఎస్ ఐపాస్) మార్గదర్శకాలను రూపొందించారు. పెట్టుబడులతో వచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ‘సింగిల్ విండో’విధానంలో ఆన్లైన్ ద్వారా 23 ప్రభుత్వ శాఖలకు సంబంధించి 57 రకాల అనుమతులు ఇచ్చేలా నిబంధనలు రూపొందించారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు ముఖ్యమంత్రి కార్యాలయంలో ‘స్పెషల్ చేజింగ్ సెల్’ఏర్పాటు చేశారు. టీఎస్ ఐపాస్ అమల్లోకి వచ్చిన సుమారు నాలుగేళ్ల కాలంలో రూ.1.58 లక్షల కోట్ల పారిశ్రామిక పెట్టుబడులు రాష్ట్రానికి రాగా, 15.28 లక్షల మంది ఉపాధి కల్పన జరిగినట్లు ప్రభుత్వ నివేదికలు వెల్లడిస్తున్నాయి. దేశంలో పారిశ్రామిక వృద్ధి రేటు 20.8 శాతం కాగా 2015–18 మధ్య కాలంలో తెలంగాణ ఏకంగా 68.5 శాతం వృద్ధిని నమోదు చేసినట్లు అసోచామ్ (అసోసియేటెడ్ చాంబర్ ఆఫ్ కామర్స్, ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా) అధ్యయన నివేదిక వెల్లడించింది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులు రూ 5.9 లక్షల కోట్లకు చేరాయి. పెట్టుబడులపై విశ్లేషణ.. టీఎస్ ఐపాస్ ద్వారా కొత్తగా ఏర్పాటైన పరిశ్రమల్లో ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ, ఫార్మా, విద్యుత్, ప్లాస్టిక్, ఇంజనీరింగ్, ఆగ్రోబేస్డ్, గ్రానైట్ స్టోన్ క్రషింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, పేపర్, ప్రింటింగ్, టెక్స్టైల్, సిమెంట్, ఏరోస్పేస్, సోలార్, ఆటోమొబైల్ తదితర రంగాలకు చెందినవి ఉన్నాయి. ఫుడ్ ప్రాసెసింగ్, రిటైల్ ట్రేడ్, ఎలక్ట్రికల్ వెహికల్, సోలార్.. తదితర రంగాల్లో రూపొందించే ప్రత్యేక పాలసీలతో మరిన్ని పెట్టుబడులు వస్తాయని పరిశ్రమల శాఖ అంచనా వేస్తోంది. పెట్టుబడులకు వీలున్న రంగాలపై ఎక్కువ దృష్టి సారిస్తూ, టీఎస్ ఐపాస్ కొత్త మార్గదర్శకాల్లో ఆయా పరిశ్రమలకు రాయితీలు, ప్రోత్సాహకాలపై స్పష్టత ఇచ్చేలా పరిశ్రమల శాఖ కసరత్తు ప్రారంభిం చింది. నూతన పారిశ్రామిక పార్కుల ఏర్పాటుతోపాటు, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు ప్రత్యేక పార్కుల ఏర్పాటు వంటి అంశాలకు టీఎస్ ఐపాస్ నూతన మార్గదర్శకాల్లో ప్రాధాన్యత ఇవ్వనున్నారు. ప్రోత్సాహకాల కోసం ఎదురుచూపులు టీఎస్ ఐపాస్‌లో భాగంగా ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు టీ–ప్రైడ్, ఇతరుల కోసం టీ–ఐడియా పేరిట పలు రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రకటించారు. ఈ రెండు పారిశ్రామిక రాయితీ పథకాల్లో భాగంగా పెట్టుబడి రాయితీ, స్టాంప్ డ్యూటీ, విద్యుత్ చార్జీలు, అమ్మకం పన్నుపై రాయితీ, పావలా వడ్డీ తదితర ప్రోత్సాహకాలను ప్రకటించారు. టీఎస్ ఐపాస్ 2014 చట్టం అమల్లోకి వచ్చి నాలుగేళ్లు పూర్తయినా పారిశ్రామిక రాయితీలు, ప్రోత్సాహకాలకు సంబంధించిన బకాయిలు పేరుకుపోయాయి. టీప్రైడ్, టీ–ఐడియాకు సంబంధించి సుమారు రూ.2,200 కోట్లు పేరుకుపోయాయి. ఇందులో టీ–ఐడియాకు సంబంధించి రూ.1,600 కోట్లు, టీ–ప్రైడ్కు సంబంధించి రూ.600 కోట్ల మేర రాయితీ బకాయిలు పేరుకుపోయాయి. నూతన మార్గదర్శకాల్లో రాయితీలు, ప్రోత్సాహకాల విడుదలపై స్పష్టమైన గడువు విధించాలని పారిశ్రామిక వర్గాలు కోరుతున్నాయి. -
హైదరాబాద్.. ఐటీ దౌడ్..!
సాక్షి, హైదరాబాద్ : గ్రేటర్ హైదరాబాద్ శివార్లకు ఐటీ కంపెనీలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నూతన పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా తీసుకొచ్చిన టీఎస్–ఐపాస్ విధానంతో మూడేళ్లుగా ఐటీ, హార్డ్‌వేర్ కంపెనీలతోపాటు తయారీ రంగం, ఏరోస్పేస్, ఫార్మా రంగం లోని దిగ్గజ పరిశ్రమలు వందలాదిగా నగర శివార్లలో కార్యకలాపాల ప్రారంభానికి సిద్ధమవుతున్నాయి. ఈ జాబితాలో సయెంట్, వాల్యూ ల్యాబ్స్, వర్చూసా, యాక్సెంచర్, ఏడీపీ వంటి కంపెనీలున్నాయి. ఆర్నెల్లుగా నగర శివార్లలోని శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, రాజేంద్రనగర్, మహేశ్వరం, బుద్వేల్ తదితర ప్రాంతాల్లో ప్రధానంగా ఐటీ, హార్డ్‌వేర్ కంపెనీల ఏర్పాటుకు 55 కంపెనీలు దరఖాస్తు చేసుకున్నట్లు పరిశ్రమల శాఖ వర్గాలు తెలిపాయి. రాబోయే రెండేళ్లలో వీటి ఏర్పాటు ద్వారా 3.30 లక్షలమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ కంపెనీల ఏర్పాటుతో రూ.18,400 కోట్ల పెట్టుబడుల ప్రవాహానికి అవకాశం ఉంది. ఆర్నెల్లలో పరిశ్రమల ఏర్పాటుకు 255 దరఖాస్తులు అందగా ఇందులో 60 తయారీరంగం, మరో 80 ప్లాస్టిక్, 40 ఏరోస్పేస్ విడిభాగాలు, 20 ఫార్మా కంపెనీలున్నట్లు పరిశ్రమల శాఖ వర్గాలు వెల్లడించాయి. 2015 నుంచి పరిశ్రమల వెల్లువ పరిశ్రమల ఏర్పాటు, పెట్టుబడుల ప్రవాహానికి దారులు తెరవడం, లక్షలాది మంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీఎస్–ఐపాస్‌కు పరిశ్రమల వర్గాల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ప్రధానంగా 2015 నుంచి గ్రేటర్ శివారు ప్రాంతాల్లో వివిధ రకాల కంపె నీల ఏర్పాటుకు సుమారు 800 దరఖాస్తులు అం దగా.. ఇందులో ఇప్పటికే 478 పరిశ్రమలు ఏర్పాటయ్యాయని.. వీటి ఏర్పాటుతో సుమారు 28 వేల కోట్లపెట్టుబడులు నగరానికి తరలివచ్చాయని పరిశ్రమల శాఖ వర్గాలు తెలిపాయి. ఆయా కంపెనీల్లో 3.29 లక్షలమందికి ఉద్యోగ,ఉపాధి అవకాశాలు దక్కాయన్నాయి. రాబోయే 2, 3 ఏళ్లలో మిగతా పరిశ్రమలు ఏర్పాటవుతాయన్నారు. గ్రేటర్ ఐటీ కంపెనీల్లో ఉపాధి ఇలా.. తెలంగాణా ఆవిర్భావం అనంతరం గ్రేటర్లో సుమారు వంద చిన్న, పెద్ద ఐటీ కంపెనీలు ఏర్పాటయ్యాయి. ఇవన్నీ ప్రధానంగా శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, హైటెక్‌సిటీ పరిసర ప్రాంతాలకే పరిమితమయ్యాయి. ఆయా కంపెనీల్లో నూతనంగా 50 వేలమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించినట్లు ఐటీశాఖ వర్గాలు తెలిపాయి. గ్రేటర్ కేంద్రంగా ఇప్పటికే బహుళ జాతి, దేశీయ దిగ్గజ సంస్థలకు చెందిన సుమారు 647 ఐటీ కంపెనీల శాఖలు కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఆయా కంపెనీల్లో సుమారు 5 లక్షలమంది ఉపాధి పొందుతున్నారు. -
పారిశ్రామిక విప్లవానికి నాంది పలికాం: కవిత
సాక్షి, హైదరాబాద్: టీఎస్–ఐపాస్ ద్వారా పారిశ్రామిక విప్లవానికి తెలంగాణ నాంది పలికిందని ఎంపీ కవిత అన్నారు. గత పాలకులు పరిశ్రమలను నిర్లక్ష్యం చేయడంతో ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయని, ప్రస్తుతం రాష్ట్రంలో పారిశ్రామిక రంగం పునర్ నిర్మాణమవుతుందని పేర్కొన్నారు. ఉద్యమ సమయంలో ఈ రంగం స్థితిగతులను స్వయంగా చూసిన సీఎం కేసీఆర్ పారిశ్రామిక రంగంపై ప్రత్యేక దృష్టి సారించారని మంగళవారం ట్విట్టర్లో పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న టీఎస్–ఐపాస్ ప్రశంసలు అందుకుంటుందన్నారు. ఎస్సీ, ఎస్టీలు పరిశ్రమలు స్థాపించేందుకు టీఫ్రైడ్ ద్వారా రుణాలు అందుతున్నాయని తెలిపారు. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాలకు ఐటీ విస్తరణ లక్ష్యంతో తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ పనిచేస్తోందన్నారు. 2016–17 ఆర్థిక సంవత్సరంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్‌గా నిలిచిందని గుర్తుచేశారు. ఇప్పటివరకు 7,802 పరిశ్రమలు రాష్ట్రంలో ఏర్పాటయ్యాయని, 1.31 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. -
రాష్ట్రంలో ఫార్మా కంపెనీల హవా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగం హవా కొనసాగుతోంది. ఔషధ పరిశోధనలు, తయారీ రంగాల్లో ఆసియా ఖండంలోనే అగ్రగామిగా ఉన్న రాష్ట్రం... గత నాలుగేళ్లలో అనేక కొత్త కంపెనీలను అకర్షించింది. అలాగే ఇప్పటికే రాష్ట్రంలో కార్యకలాపాలు సాగిస్తున్న కంపెనీలూ విస్తరణ ప్రణాళికలు అమలు చేయడంతో ఫార్మా రంగం మరింత అభివృద్ధి చెందుతోంది. ప్రపంచ ప్రఖ్యాత ఫెర్రింగ్ ఫార్మా, కెమో ఫార్మా, జీఎస్కే, సినర్జీ, స్లే బ్యాక్ ఫార్మా, జాన్సన్ అండ్ జాన్సన్ వంటి కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయి.స్థానికంగా ఉన్న నొవార్టిస్, బయోలాజికల్ ఈ, లారుస్ ల్యాబ్స్, పల్స్ ఫార్మా కంపెనీలు విస్తరణ ప్రణాళికలను ప్రకటించాయి. టీఎస్ ఐపాస్ ప్రకటించిన 2015 జనవరి నుంచి ఇప్పటివరకు రాష్ట్రానికి 700 కంపెనీల ఏర్పాటు ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సుమారు వంద వరకు పరిశోధనలు, అభివృద్ధి (ఆర్ అండ్ డీ) రంగ కంపెనీలున్నాయి. ఇందులో 80 శాతం ఇప్పటికే తమ ఉత్పత్తులు ప్రారంభించాయి. రూ. కోట్లలో పెట్టుబడులు.. కొత్త ఫార్మా సంస్థల ఏర్పాటు, విస్తరణ ద్వారా 20 వేల ఉన్నతస్థాయి పరిశోధన ఉద్యోగాలతోపాటు 50 వేల ఉద్యోగాలు లభించనున్నాయి. ఈ రంగంలో గత నాలుగేళ్లలో రాష్ట్రం రూ. 10,222 కోట్ల పెట్టుబడులను రాబట్టగలిగింది. ఇందులో రూ. 3 వేల కోట్లు అర్ అండ్ డీ రంగంలో వచ్చాయి. ఫార్మా ఎగుమతుల్లోనూ రాష్ట్రం గణనీయమైన ప్రగతిని సాధించింది. కేవలం లైఫ్ సైన్సెస్ రంగం ఒక్కటే మొత్తం 36 శాతంతో సింహభాగాన్ని ఆక్రమించింది. జాతీయ సగటు 1.18 శాతమే ఉండగా తెలంగాణ మాత్రం గత నాలుగేళ్లలో ఎగుమతులను 2.41 శాతానికి పెంచుకుంది. అంటే దేశ సగటుకు రెట్టింపు పెరుగుదలతో ఉత్పత్తులను ఎగుమతి చేస్తోంది. ఫార్మా సంబంధ శిక్షణ కార్యక్రమాల్లోనూ రాష్ట్రం ముందంజలో ఉంది. ఇప్పటికే యూఎస్ ఫార్మకోపియా (US Pharmacopeia) తో కలసి ఒక శిక్షణ సంస్థను ఏర్పాటు చేసి వర్సిటీ గ్రాడ్యుయేట్లకు ఫార్మా రంగంలో నైపుణ్య అభివృద్ధి శిక్షణ ఇచ్చేందుకు వీలుగా అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ప్రభుత్వ విధానాలకు దక్కుతున్న ఫలితమిది: కేటీఆర్ ఔషధ రంగంలో సాధించిన అభివృద్ధిపట్ల మంత్రి కె. తారక రామారావు హర్షం వ్యక్తం చేశారు. దీన్ని రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు దక్కుతున్న ప్రతిఫలంగా అభివర్ణించారు. రాష్ట్రానికి సాధ్యమైనన్ని ఎక్కువ పెట్టుబడులు తీసుకురావడంతోపాటు వాటి ద్వారా స్థానిక యువతకు ఉద్యోగాలు అందించాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామన్నారు. ప్రస్తుతమున్న ఫార్మా రంగ పెరుగుదలతోపాటు ఇక్కడి పరిశ్రమ విలువను రెట్టింపు చేసి 100 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లాలనే దీర్ఘకాల లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. -
టీఎస్–ఐ‘పాస్’ కాలేదు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక విధానం (టీఎస్–ఐపాస్) ద్వారా ‘సింగిల్ విండో’లక్ష్యం నెరవేరడం లేదని కాగ్ విమర్శించింది. పరిశ్రమల ఏర్పాటుకు కావాల్సిన అన్ని అనుమతులకు కాకుండా.. వ్యాపారవేత్తలు కోరిన కొన్నింటికే ప్రభుత్వం అనుమతి పత్రాలు జారీ చేస్తోందని తప్పుబట్టింది. మరోవైపు అన్ని అనుమతుల కోసం దరఖాస్తు చేసుకోవాలంటూ తెలియజేసే కచ్చితమైన వ్యవస్థ కూడా లేదని పేర్కొంది. 2017 మార్చి–జూన్ మధ్య టీఎస్–ఐపాస్ పనితీరుపై పరిశీలన జరిపిన కాగ్.. అందులోని లోపాలు ఎత్తిచూపింది. ‘అన్ని రకాల అనుమతులకు దరఖాస్తు చేసుకున్నట్లు నిర్ధారించుకునేలా సాఫ్ట్‌వేర్‌లో వ్యవస్థ లేదు. నుమతులకు తరువాత దరఖాస్తు చేసుకునేందుకు ‘అప్లై లేటర్’ఆప్షనూ లేదు. 2016–17లో 1,941 దరఖాస్తులొస్తే 177 మంది దరఖాస్తుదారులే అన్ని రకాల అనుమతులు కోరారు. మిగిలిన వారు పాక్షిక అనుమతులే పొందారు. పాక్షికంగా అనుమతులు తీసుకున్న పరిశ్రమలు యూనిట్లు ఏర్పాటు చేసి కార్యకలాపాలు ప్రారంభించాయని నిర్ధారించుకునే వ్యవస్థ కూడా లేదు. కాలుష్య నియంత్రణ మండలి నుంచి రెడ్ కేటిగిరీ పరిశ్రమల ఏర్పాటుకు 148 పరిశ్రమలు అనుమతి పొందాల్సి ఉండగా, 85 పరిశ్రమలే దరఖాస్తు చేసుకున్నాయి. ఆరెంజ్ కేటగిరీ కింద 441 పరిశ్రమలకు గాను 175.. అగ్నిమాపక శాఖ నుంచి ఎన్ఓసీ కోసం 106 పరిశ్రమలకు గాను 9 మాత్రమే దరఖాస్తు చేసుకున్నాయి. పంచాయతీల నుంచి ఎన్ఓసీ కోసం 1,425 పరిశ్రమలకు గాను 147 మాత్రమే దరఖాస్తు చేసుకున్నాయి’అని కాగ్ పేర్కొంది. -
ఏరోస్పేస్.. యమాజోష్..!
సాక్షి, హైదరాబాద్ : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ).. బిజినెస్ ప్రాసెస్ ఔట్సోర్సింగ్(బీపీవో).. నాలెడ్జ్ ప్రాసెస్ ఔట్సోర్సింగ్(కేపీవో) రంగాలకు నిలయంగా మారిన హైదరాబాద్ మహానగరం ఇప్పుడు ఏరోస్పేస్, ఎయిర్‌క్రాఫ్ట్ రంగాలకు కూడా హబ్‌గా మారుతోంది. నూతన పరిశ్రమల ఏర్పాటుకు వివిధ విభాగాల చుట్టూ కాళ్లరిగేలా తిరిగే విధానానికి స్వస్తి పలుకుతూ రాష్ట్ర ప్రభుత్వం ఏకగవాక్ష విధానంలో ఒకేసారి అన్ని అనుమతులు మంజూరు చేసేందుకు వీలుగా టీఎస్ఐపాస్(తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం)విధానానికి 2015 జూన్‌లో శ్రీకారం చుట్టిన విషయం విదితమే. టీఎస్ఐపాస్ విధానం రాకతో 2015 జూన్ నుంచి 2017 డిసెంబర్ వరకూ గ్రేటర్ పరిధిలో వివిధ రంగాలకు సంబంధించి 386 మంది నూతన పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్నారు. వీటిలో 207 కంపెనీలు మరో మూడు నెలల్లో కార్యకలాపాలు ప్రారంభించేందుకు సన్నాహాలు మొదలుపెట్టాయి. ఆయా కంపెనీల ఏర్పాటుతో సుమారు రూ.2,407 కోట్ల పెట్టుబడులు నగరానికి తరలివచ్చినట్లు పరిశ్రమల శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇందులో అత్యధికంగా 60 ఏరోస్పేస్, ఎయిర్‌క్రాఫ్ట్ విడిభాగాల తయారీ పరిశ్రమలే ఉన్నాయి. ఆ తర్వాత తయారీ రంగం, ప్లాస్టిక్, సోలార్, ఐటీ రంగ పరిశ్రమలు ఉన్నాయి. ఇవన్నీ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలే. వీటి ద్వారా సుమారు 22 వేల మందికి నూతనంగా ఉపాధి దక్కే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. మరో మూడు నెలల్లో షురూ ప్రధానంగా గ్రేటర్ శివార్లలోని ఆదిభట్ల, నాదర్గుల్, మంగల్‌పల్లి, అంబర్పేట్, జీడిమెట్ల, పాశమైలారం, ఖాజిపల్లి, బొంతపల్లి, పటాన్చెరు, కాటేదాన్, మల్లాపూర్ తదితర ప్రాంతాల్లో నూతన పరిశ్రమలు ఏర్పాటుకానున్నాయి. ఆయా కంపెనీలకు అనుమతుల ప్రక్రియ పూర్తి కావడంతో మరో మూడు నెలల్లో ఉత్పత్తి ప్రారంభించే అవకాశాలున్నట్లు పరిశ్రమల శాఖ వర్గాలు తెలిపాయి. మొత్తంగా 386 మంది దరఖాస్తులు సమర్పించగా.. సాంకేతిక కారణాలు, భూమి, ఇతర మౌలిక వసతుల లభ్యత, పరపతి సౌకర్యం తదితర సమస్యల కారణంగా 179 కంపెనీల ఏర్పాటు ప్రక్రియ మందగించింది. ప్రస్తుతానికి 207 కంపెనీలు మాత్రమే కార్యరూపం దాల్చనున్నట్లు తెలిసింది. మిగతావి కూడా దశలవారీగా సమస్యలను అధిగమించి కంపెనీలు నెలకొల్పే అవకాశాలున్నట్లు సమాచారం. కాగా మహానగరానికి ఆనుకుని ఉన్న ఆయా పారిశ్రామిక వాడల్లో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు సుమారు 3 వేల వరకు ఉన్నట్లు పరిశ్రమల శాఖ వర్గాలు వెల్లడించాయి. -
టీఎస్ ఐపాస్ పనితీరు భేష్
సాక్షి, హైదరాబాద్: టీఎస్ ఐపాస్ పనితీరును కొనియాడుతూ ఓ పారిశ్రామికవేత్త బుధవారం పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు లేఖ రాశారు. దీనిపై మంత్రి స్పందిస్తూ పారిశ్రామికవర్గాల నుంచి ప్రభుత్వ విధానాల పట్ల లభించే సానుకూల ఫీడ్‌బ్యాక్ మరింత బాగా పని చేసేందుకు స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు. పరిశ్రమల స్థాపన, పెట్టుబడుల ద్వారా ఉద్యోగాల కల్పన లక్ష్యం వైపు పని చేసేందుకు దోహదపడుతుందని వెల్లడించారు. రాష్ట్ర పారిశ్రామిక విధానం టీఎస్–ఐపాస్ పనితీరును ప్రశంసిస్తూ డెల్ ఎక్సెల్ ఫార్మా సీఈఓ రఘుపతి కందారావు మంత్రికి లేఖ రాశారు. గతంలో వివిధ కంపెనీల్లో పని చేసిన రఘుపతి సొంత పరిశ్రమ ఏర్పాటు కోసం ప్రయత్నించగా ఎదుర్కొన్న అనుభవాలను లేఖలో పంచుకున్నారు. 15 ఏళ్ల పాటు అనేక సంస్థల్లో ఔషధ పరిశోధన విభాగాధిపతిగా పని చేశానని, పరిశ్రమల స్థాపనకు ఇంత సులభమైన, పారదర్శకమైన పద్ధతి ఎప్పుడూ లేదని కొనియాడారు. గతంతో పోల్చితే ప్రస్తుతం డ్రగ్ లైసెన్సింగ్ విధానం అత్యంత సులువుగా ఉందని పేర్కొన్నారు. -
హైదరాబాద్‌కు అద్భుత భవిత
డాలస్ సెంటర్ భూమి పూజ కార్యక్రమంలో కేటీఆర్ - అభివృద్ధిలో కనీవినీ ఎరగని రీతిలో దూసుకుపోతోంది.. - అన్ని నగరాలకు ఒకేతీరున నిధులివ్వొద్దని కేంద్రానికి వినతి - మెట్రో, కార్పొరేషన్, మున్సిపాలిటీలకు స్థాయిని బట్టి నిధులివ్వాలి.. - స్మార్ట్ సిటీగా కరీంనగర్‌ను ఎంపిక చేసినందుకు కృతజ్ఞతలు సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ భవిష్యత్ అద్భుతంగా ఉంటుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. శుక్రవారం హోటల్ తాజ్‌కృష్ణాలో డాలస్ సెంటర్‌కు కేటీఆర్ భూమి పూజ చేశారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ, ఇతర నగరాలతో పోలిస్తే బెస్ట్ లివింగ్ సిటీగా హైదరాబాద్ ముం దుందని, గతంలో ఎన్నడూ లేనంతగా హైదరా బాద్ అభివృద్ధి చెందుతోందని ఉద్ఘాటించారు. ఐటీ కంపెనీలకు హైదరాబాద్‌పై ఎంతో నమ్మకం ఏర్పడిందని, టీఎస్ ఐపాస్‌తో కంపెనీలకు వేగంగా అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. దేశంలో అతిపెద్ద ఇంక్యుబేటర్‌గా టీ–హబ్ మారిందని, 2,000 స్టార్టప్స్‌కు వేదికైందని పేర్కొన్నారు. ఇక నగరంలో రోడ్ల అభివృద్ధిపై సామాజిక మాధ్యమాల ద్వారా సూచనలు, సలహాలు తీసుకుంటున్నామని తెలిపారు. నగరానికి ల్యాండ్‌మార్క్‌గా చెప్పుకునే భవనాలు అవ సరమని ప్రభుత్వ సలహాదారు పాపారావు అన్నారు. ఇలాంటి అధునాతన భవనాలు పెట్టుబడులను సైతం ఆకర్షిస్తాయని అభిప్రాయపడ్డారు. రాజధానిలో నిర్మించే డాలస్ సెంటర్.. ఇంక్యుబేషన్ స్థాయి ని దాటి అంత ర్జాతీయ స్థాయికి ఎదుగుతున్న ఐటీ కంపె నీలకు వేదికగా ఉంటుందని కంపెనీ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. కార్యక్రమం లో ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రం జన్ తదితరులు పాల్గొన్నారు. నగరాల స్థాయిని బట్టి నిధులివ్వాలి కేంద్రం చిన్న పట్టణాలు, పెద్ద నగరాలను ఒకేతీరుగా చూడటం సరికాదని కేటీఆర్ అన్నారు. అన్ని నగరాలకు సమంగా నిధులు కేటాయించటం సరికాదని, మెట్రో సిటీలు, కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పట్టణాలు, పంచాయతీలకు వాటి స్థాయిని బట్టి నిధులు కేటాయించాలని కోరారు. కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చే నిధులను తక్షణమే విడుదల చేయాలని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడును కోరినట్లు తెలిపారు. స్మార్ట్ సిటీల జాబితాలో కరీంనగర్‌కు చోటు కల్పిం చినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలి పారు. ఆకర్షణీయ నగరాల జాబితాలో కరీం నగర్‌కు స్థానం దక్కడం సంతోషంగా ఉంద న్నారు. జీఎస్టీ వల్ల తాగు, సాగునీటి ప్రాజెక్టు లపై ఒక్క తెలంగాణలోనే రూ.10 వేల కోట్ల భారం పడేలా ఉందని, జీఎస్టీతో బీడీ కార్మికులు ఉపాధి కోల్పోయే అవకాశం ఉందని చెప్పారు. గ్రానైట్ పరిశ్రమ, టెక్స్ టైల్స్, హ్యాండ్లూమ్ రంగాలను కూడా జీఎస్టీ నుంచి మినహాయిం చాలని కేంద్రాన్ని కోరు తున్నామని తెలిపారు. సీఎం ఢిల్లీలో ఉన్నా రని, దీనిపై కేంద్ర ప్రభుత్వ పెద్దలను కూడా కలిసి విన్నవించే అవకాశముందని వివరిం చారు. శనివారం ఉదయం పోచంపల్లిలో పొదుపు పథకాన్ని ప్రారంభిస్తున్నామని పేర్కొన్నారు. కాగా, ఇప్పటికే తెలంగాణలో వరంగల్ స్మార్ట్ సిటీ జాబితాలో ఉండగా.. తాజాగా కరీంనగర్‌కు చోటు కల్పించారు. ఆగస్టులో మారథాన్.. హైదరాబాద్ రన్నర్స్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించే మారథాన్ పరుగు టీషర్ట్, లోగోను కేటీఆర్ ఆవిష్కరించారు. ఆగస్టు 19, 20 తేదీల్లో హైదరాబాద్‌లో మారథాన్ పరుగు ఉంటుందని తెలిపారు. పరుగులో వివిధ నగరాల నుంచి 20 వేల మంది పాల్గొంటున్నారని వెల్లడించారు. ఈ సారి తాను కూడా మారథాన్ పరుగులో భాగస్వామిని అవుతానని కేటీఆర్ ప్రకటించారు. -
2,929 పరిశ్రమలొచ్చాయి: కేటీఆర్
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటివరకు 2,929 పరిశ్రమలు వచ్చాయని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. సోమవారం అసెంబ్లీలో టీఎస్ ఐపాస్‌పై ప్రకటన చేసిన కేటీఆర్.. మెగా ప్రాజెక్టులకు 15 రోజుల్లో, ఇతర పరిశ్రమలకు 30 రోజుల్లో అనుమతి లభిస్తుందని తెలిపారు. రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలతో 95 వేల మందికి ప్రత్యక్షంగా.. మరో 3 లక్షల మందికి పరోక్షంగా లబ్ది చేకూరుతుందని కేటీఆర్ తెలిపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణ రాష్ట్రానికి మొదటి స్థానం రావడం గర్వంగా ఉందని అన్నారు. -
కొత్త సీఎస్‌గా ప్రదీప్ చంద్ర
రాజీవ్‌శర్మ నుంచి బాధ్యతల స్వీకరణ 1982 బ్యాచ్ ఐఏఎస్ అధికారి టీఎస్ ఐపాస్ రూపకల్పనలో కీలక పాత్ర ఇప్పటిదాకా 22 రకాల పోస్టుల్లో విధులు అభినందనలు తెలిపిన సీఎం కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ కొత్త ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రదీప్ చంద్ర నియమితులయ్యారు. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న ప్రదీప్ చంద్ర 1982 బ్యాచ్‌కి చెందిన ఐఏఎస్ అధి కారి. రాజీవ్‌శర్మ బ్యాచ్‌కు చెందిన సీనియర్ అధికారి కావటం, వివిధ శాఖల్లో పని చేసిన అనుభవమున్న అధికారి కావటంతో ముఖ్య మంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆయనకు సీఎస్ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయం తీసుకు న్నారు. తెలంగాణ పారిశ్రామిక విధానం టీఎస్ ఐపాస్ రూపకల్పనలో ప్రదీప్ చంద్ర కీలకపాత్ర పోషించారు. మరో నెలరోజులు మాత్రమే పదవీ కాలం ఉన్నప్పటికీ రాజీవ్ శర్మ తర్వాత సీనియర్ కావడంతో ప్రదీప్చం ద్రకు అవకాశం ఇవ్వాలని సీఎం నిర్ణరుుం చారు. బుధవారం సీఎస్ రాజీవ్‌శర్మ పదవీ విరమణ చేసిన వెంటనే ప్రదీప్ చంద్ర కొత్త సీఎస్‌గా బాధ్యతలు చేపట్టారు. సచివా లయం సమత బ్లాక్‌లోని సీఎస్ చాంబర్లో సాయంత్రం 6.20 గంటలకు బాధ్యతలు స్వీక రించారు. రిటైరవుతున్న సీఎస్ రాజీవ్‌శర్మ తన పదవీ బాధ్యతలను కొత్త సీఎస్‌కు అప్పగించారు. ప్రదీప్‌చంద్రకు సీఎం ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. తెలుగువాడు.. ప్రదీప్ చంద్ర గుంటూరు జిల్లాకు చెందినవారు. 1956 డిసెంబర్ 15న జన్మించారు. మద్రాస్ ఐఐటీలో బీటెక్ పూర్తి చేశారు. కలకత్తాలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్లో బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సులో పీజీ చేశారు. యూనివర్సిటీ ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా నుంచి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో పీహెచ్డీ పట్టా పొందారు. గతంలో గుంటూరు, విశాఖ జిల్లాల కలెక్టర్‌గా పని చేశారు. సబ్ కలెక్టర్‌గా సర్వీస్ ప్రారంభించిన ఆయన.. 22 రకాల పోస్టుల్లో విధులు నిర్వహించారు. -
ఐటీ, పరిశ్రమలు అభివృద్దికి రెండు కళ్ళు
- రెండేళ్లలో రూ.35 వేల కోట్ల పారిశ్రామిక పెట్టుబడులు - గతేడాది రూ.68,258 కోట్ల మేర ఐటీ ఎగుమతులు - టీఎస్ ఐపాస్, ఐటీ పాలసీలతో పెట్టుబడులకు ఊపు - ప్రాథమిక దశలోనే నిమ్జ్, ఫార్మాసిటీ ప్రతిపాదనలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఊతమివ్వడంతో పాటు ఉపాధి కల్పన లక్ష్యంగా ప్రభుత్వం పారిశ్రామిక, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది. పారదర్శకత, సరళమైన, అవినీతి రహిత విధానాలకు పెద్దపీట వేస్తూ... నూతన పారిశ్రామిక విధానం టీఎస్ ఐపాస్‌కు రూపకల్పన చేసింది. 2014 నవంబర్ 27న టీఎస్ఐపాస్కు చట్టబద్ధత కల్పించగా 2015 జూన్ 12న సీఎం కేసీఆర్ నూతన పాలసీని ఆవిష్కరించారు. దరఖాస్తు చేసుకున్న పక్షం రోజుల్లోనే పరిశ్రమల స్థాపనకు అవసరమైన అనుమతులన్నీ ఇచ్చేలా ‘సింగిల్ విండో’ విధానాన్ని బలోపేతం చేస్తూ నూతన విధానాన్ని ప్రతిపాదించారు. పెట్టుబడులతో ముందుకొచ్చే వారికి ఎదురేగి స్వాగతం పలికి, పరిశ్రమల స్థాపనకు అనుమతులు, సౌకర్యాలు సమకూర్చేలా సీఎం కార్యాలయంలో ‘ఛేజింగ్ సెల్’ను ఏర్పాటు చేశారు. భారీగా పెట్టుబడులు ప్రపంచంలోనే అత్యుత్తమ విధానంగా ప్రభుత్వం చెబుతున్న టీఎస్ ఐపాస్ ద్వారా ఏడాది వ్యవధిలోనే రూ.35 వేల కోట్ల మేర పెట్టుబడులు వచ్చినట్లు పరిశ్రమల శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్రస్థాయిలో 396, జిల్లా స్థాయిలో 1,623 పరిశ్రమల స్థాపనకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వం... 1,20,169 మందికి కొత్తగా ఉపాధి దక్కుతుందని అంచనా వేస్తోంది. టీఎస్ఐపాస్ ఆవిష్కరణ రోజే రూ.8 వేల కోట్ల మేర పెట్టుబడులను పారిశ్రామికవేత్తలు ప్రకటించగా... తర్వాత పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులకు సుముఖత వ్యక్తం చేశాయి. టీఎస్ ఐపాస్ ద్వారా మరో ఏడాదిలో రూ.50 వేల కోట్ల నుంచి రూ.80 వేల కోట్ల మేర పెట్టుబడులు వస్తాయని పరిశ్రమల శాఖ అంచనా వేస్తోంది. పరిశ్రమల స్థాపనకు వీలుగా 1.45 లక్షల ఎకరాలను రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సౌకర్యాల కల్పన సంస్థ టీఎస్ఐఐసీకి సర్కారు అప్పగించింది. మూతపడిన నిజాం షుగర్స్ రాష్ట్రంలో అతిపెద్ద వ్యవసాయాధారిత పరిశ్రమ నిజాం దక్కన్ షుగర్స్‌ను నష్టాలు సాకుగా చూపుతూ ప్రైవేటు భాగస్వామ్య సంస్థ డెల్టా పేపర్ మిల్స్ మూసివేసింది. దీంతో సుమారు 350 మంది ఉద్యోగులతో పాటు వేల మంది రైతుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ఇక మె గా టెక్స్టైల్ పార్కు, చేనేత విధానం రూపకల్పన ప్రాథమిక దశలోనే ఉండగా.. రాష్ట్రంలో చేనేత వృత్తిపై ఆధారపడిన వారి సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోంది. రెండేళ్లలో ముగ్గురు మంత్రులు రాష్ట్ర ఆవిర్భావం రోజున తొలి మంత్రివర్గంలో సీఎం కె.చంద్రశేఖర్‌రావు స్వయంగా పరిశ్రమల శాఖ బాధ్యత చేపట్టారు. 2014 డిసెంబర్లో మంత్రివర్గాన్ని విస్తరించినప్పుడు జూపల్లి కృష్ణారావుకు పరిశ్రమల శాఖ బాధ్యతలు అప్పగించారు. ఈ ఏడాది జరిగిన మంత్రిత్వ శాఖల మార్పుల్లో కేటీఆర్‌కు పరిశ్రమల శాఖను అప్పగించారు. ఔత్సాహికులకు ప్రేరణ టీ-హబ్ వినూత్న ఆలోచనలతో ముందుకు వచ్చే ఔత్సాహికులను ప్రోత్సహించేందుకు ‘టీ-హబ్’ పేరిట 2015 నవంబర్‌లో దేశంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్‌కు రాష్ట్ర ప్రభుత్వం అంకురార్పణ చేసింది. ఐఐటీ, ఐఎస్బీ, నల్సార్ వర్సిటీ సహకారం అందిస్తున్న టీ-హబ్ ద్వారా స్టార్టప్‌లకు ప్రేరణ ఇచ్చే దిశగా అడుగులు వేస్తోంది. తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్ (టాస్క్), ఫైబర్ గ్రిడ్, రాష్ట్రవ్యాప్తంగా 4జీ సేవలు, ముఖ్య నగరాల్లో వైఫై సేవలు, ఈ-గ్రామ పంచాయతీలు, పాఠశాలల్లో కంప్యూటర్ విద్య తదితరాలకు పెద్దపీట వేస్తోంది. భూసేకరణ వివాదాల్లో నిమ్జ్ రాష్ట్ర పారిశ్రామిక రంగానికి కొత్త ఊపు తెచ్చేందుకు ప్రభుత్వం భారీ పారిశ్రామిక వాడల ఏర్పాటును ప్రతిపాదించింది. కొన్ని ప్రతిపాదనలకు భూసేకరణ ప్రధాన అవరోధంగా పరిణమించగా... మరికొన్ని ప్రతిపాదనలు ప్రాథమిక దశలోనే ఉన్నాయి. ఖమ్మం జిల్లాలో మెగా ఫుడ్‌పార్కు స్థాపనకు కేంద్రం అనుమతివ్వగా ప్రతిపాదనలు ఇంకా ప్రాథమిక దశలోనే ఉన్నాయి. వరంగల్ జిల్లాలో మెగా టెక్స్టైల్ పార్కుకు ప్రతిపాదనలు సిద్ధమైనా సీఎం వద్ద పరిశీలన దశలోనే ఆగిపోయాయి. ► మెదక్ జిల్లా జహీరాబాద్‌లో జాతీయ పెట్టుబడులు, ఉత్పాదక మండలి (నిమ్జ్) స్థాపనకు కేంద్రం ఆమోదం తెలిపింది. 12 వేల ఎకరాల్లో నిమ్జ్‌ను ప్రతిపాదించగా.. ఇప్పటివరకు 3,700 ఎకరాలను మాత్రమే సేకరించారు. నిర్ణీత గడువులోగా భూమి సేకరిస్తేనే నిమ్జ్‌కు తుది అనుమతులిస్తామని కేంద్రం స్పష్టం చేసింది. ► రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో ‘ఫార్మాసిటీ’ని 12,500 ఎకరాల్లో స్థాపిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించగా.. నిమ్జ్ హోదా ఇచ్చేందుకు కేంద్రం సూత్రప్రాయంగా అంగీకరించింది. దీనికి డీపీఆర్ తయారీ ప్రాథమిక దశలోనే ఉండిపోయింది. భూసేకరణ కూడా నత్తనడకన సాగుతోంది. పరిహారం చెల్లింపు విషయంలో జహీరాబాద్, ముచ్చర్లలో రైతులు ఆందోళన బాట పట్టారు. ఐటీకి ప్రత్యేక పాలసీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో ప్రపంచ స్థాయి గుర్తింపు పొందిన హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఐటీ పరిశ్రమను మరింతగా విస్తరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,300కుపైగా ఐటీ కంపెనీలుండగా.. ఐటీ ఉత్పత్తుల ఎగుమతి ద్వారా గతే ఏడాది రూ.68,258 కోట్లు ఆర్జించాయి. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఆపిల్, ఐబీఎం వంటి అంతర్జాతీయ కంపెనీలతో పాటు ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ వంటి జాతీయ దిగ్గజ కంపెనీలకూ హైదరాబాద్ కేంద్రంగా మారింది. ఆన్లైన్ వాణిజ్య సంస్థ అమెజాన్ భారత్‌లో తన కార్యకలాపాలను హైదరాబాద్ కేంద్రంగా ప్రారంభించింది. ఇక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో గ్రామీణ యువతను పట్టణ యువతతో సమానంగా ప్రోత్సహించే లక్ష్యంతో ఈ ఏడాది ఏప్రిల్‌లో నూతన ఐటీ పాలసీని ప్రభుత్వం ప్రకటించింది. ఇన్నోవేషన్, గేమింగ్-యానిమేషన్, ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్, రూరల్ టెక్నాలజీ తదితర అనుబంధ పాలసీలూ తెచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో ఏర్పాటయ్యే ఐటీ కంపెనీలకు రాయితీలను ప్రకటించారు. ఈ విధానం ద్వారా రాష్ట్రం నుంచి రూ.1.36 లక్షల కోట్ల ఐటీ ఎగుమతులతో పాటు ఐదు లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. -
టీఎస్ ఐపాస్ ను ప్రధాని మెచ్చారు..
♦ 15 రోజుల్లో అనుమతులు, ఆరు నెలల్లో కంపెనీ ప్రారంభం ♦ జిల్లాకు భారీ పరిశ్రమలు రానున్నాయి ♦ ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ♦ రావిర్యాల, శ్రీనగర్ ఫ్యాబ్‌సిటీలో మైక్రోమ్యాక్స్ సెల్ఫోన్లు, ఎల్ఈడీల తయారీ యూనిట్లు ప్రారంభం మహేశ్వరం: టీఎస్ ఐపాస్ విధానాలను ప్రధాని నరేంద్ర మోదీతోపాటు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రశంసించారని ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. కొత్త కంపెనీ ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్న 15 రోజుల్లో అనుమతులు ఇస్తున్నామని తెలిపారు. మహేశ్వరం మండలం రావిర్యాల, శ్రీనగర్ ఫ్యాబ్‌సిటీలో మైక్రోమ్యాక్స్ సెల్ఫోన్ల తయారీ యూనిట్‌ను మంత్రి మహేందర్‌రెడ్డితో కలిసి గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో కంపెనీల అనుమతికి సంవత్సరాలు పట్టేదని, ప్రస్తుతం 15 రోజుల్లో అనుమతులు, ఆరు నెలల్లో కంపెనీ నిర్మాణం చేస్తున్నారని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో జిల్లాకు మరిన్ని ఐటీ, హార్డ్‌వేర్, సాఫ్ట్వేర్, ఎలక్ట్రానిక్ కంపెనీలు, పరిశ్రమలు రానున్నాయని తెలిపారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు రూ.20,300 కోట్ల పెట్టుబడులతో మొత్తం 1,631 పరిశ్రమలకు టీఎస్ ఐపాస్ నుంచి అనుమతులు లభించాయని చెప్పారు. అందులో 840 పరిశ్రమలు ప్రారంభమై ప్రొడక్షన్ తయారు చేస్తూ 38 వేల మందికి ఉద్యోగాలు కల్పించాయని వివరించారు. మైక్రోమ్యాక్స్ కంపెనీ ప్రపంచంలో టాప్ టెన్‌లో ఉందని, ఈ కంపెనీ ఏర్పాటుతో మరింత మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ 13 ఐటీ కారిడార్లు రానున్నాయన్నారు. మంత్రి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ, రావిర్యాల, శ్రీనగర్ ప్యాబ్‌సిటీలో కల్యాణి గ్రూప్స్, సెల్‌కాన్‌తోపాటు మరిన్ని ఎలక్ట్రానిక్ పరిశ్రమలు వస్తాయని పేర్కొన్నారు. ఉద్యోగులతో మాటామంతీ... రావిర్యాల, శ్రీనగర్ ఫ్యాబ్‌సిటీలో మైక్రోమ్యాక్స్ కంపెనీ ప్రారంభం కార్యక్రమం సందర్భంగా మంత్రి కేటీఆర్ ఉద్యోగులతో మాట్లాడారు. ఏ గ్రామం నుంచి వస్తున్నారు.. నెల జీతం ఎంత.. సదుపాయాలున్నాయా.. వంటి విషయాలు అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగులు అంతా బాగుందని చెప్పారు. సెల్ఫోన్లను కంపెనీ ఎండీ అగర్వాల్ అందజేశారు. అంతకు ముందు జ్యోతి ప్రజ్వలన చేసి మైక్రోమ్యాక్స్ సెల్‌ఫోన్, ఎల్ఈడీ తయారీల యూనిట్‌ను ప్రారంభించారు. పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, టీఎస్ఐఐసీ ఎండీ నర్సింహారెడ్డి, మైక్రోమ్యాక్స్ కంపెనీ చైర్మన్ రాజేష్ అగర్వాల్, మైక్రోమాక్స్ కంపెనీ వైస్ చైర్మన్ ఎస్కె.శర్మ తదితరులు పాల్గొన్నారు. -
బంగారు తెలంగాణకు బాటలెయ్యండి
♦ స్థానికులకు ఉపాధి కల్పించాలని పరిశ్రమలకు మంత్రి జూపల్లి పిలుపు ♦ ఆరో విడతలో 18 పరిశ్రమలకు అనుమతి పత్రాలు అందజేత ♦ రూ.2,167 కోట్ల పెట్టుబడులు, 13,817 మందికి ఉపాధి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమలు స్థానికులకు ఉపాధి కల్పించడం ద్వారా బంగారు తెలంగాణ సాధనలో భాగస్వాములు కావాలని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక విధానం(టీఎస్ఐపాస్)లో భాగంగా ఆరో విడతలో నూతనంగా ఏర్పాటయ్యే 18 పరిశ్రమల ప్రతినిధులకు అనుమతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సచివాలయంలోని డీ బ్లాక్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మంత్రి జూపల్లి పాల్గొన్నారు. మెదక్, మహబూబ్‌నగర్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల పరిధిలో రూ.2,167.47 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటవుతున్న ఈ పరిశ్రమల ద్వారా 13,817 మందికిఉపాధి దక్కుతుందని జూపల్లి వెల్లడించారు. ఈ పరిశ్రమల్లో కాగ్నిజెంట్ టెక్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.655 కోట్ల పెట్టుబడులకు ముందుకు రాగా 8,500 మందికి ఉపాధి ఇవ్వనుందని వివరించారు. వీటితో పాటు ఒప్పందాలు చేసుకున్న ప్రముఖ పరిశ్రమల్లో ఐటీసీ, విన్సోల్, కెమో ఇండియా, సురానా, ఎర్త్ సోలార్ మొదలైనవి ఉన్నాయన్నారు. ఆరు విడతల్లో జరిగిన ఒప్పందాలతో కలిపి మొత్తంగా రూ.33,101 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, వీటిద్వారా 1,20,169 మందికి ఉద్యోగావకాశాలు లభించాయని పేర్కొన్నారు. పాశ్చాత్య దేశాల్లో పరిశ్రమల అనుమతులకు కనీసం 45 రోజులు పడుతుండగా, టీఎస్ఐపాస్ ద్వారా 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నామన్నారు. అనుమతుల్లో జాప్యం మూలంగా పెట్టుబడులతో రాష్ట్రానికి వచ్చే ఏ ఒక్క పారిశ్రామికవేత్త ఇబ్బందులు పడకూడదనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఎలాంటి ఆటంకాలు, అవినీతి లేని పారిశ్రామిక విధానానికి దేశ, విదేశాల్లో ప్రశంసలు లభిస్తున్నాయన్నారు. పెట్టుబడిదారులు తెలంగాణ రాష్ట్రానికి పారిశ్రామిక రాయబారులుగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు. సీఎం కేసీఆర్ దూరదృష్టితో రాష్ట్రం బంగారు తెలంగాణగా ఆవిర్భవించడం ఖాయమని జూపల్లి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటు చేసే వారికి వీలైనంత త్వరగా ప్రోత్సాహకాలు అందేలా చర్యలు చేపడుతున్నామన్నారు. ఈ సందర్భంగా అనుమతులు అందుకున్న పారిశ్రామిక వేత్తలు టీఎస్ఐపాస్పై అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ.. గతంలో కంటే భిన్నంగా అధికారులే ముందుకు వచ్చి అనుమతులు ఇస్తున్నారని, తక్కువ సమయంలోనే ఆదేశాలు జారీ చేసి పరిశ్రమల స్థాపనకు మెరుగైన వాతావరణం కల్పిస్తున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్, టీఎస్ఐపాస్ ఎండీ వెంకట నరసింహారెడ్డి, జాయింట్ సెక్రటరీ సైదా, అడిషనల్ డెరైక్టర్ దేవానంద్ పాల్గొన్నారు. -
బయో ఆసియాలో వెయ్యి కోట్ల పెట్టుబడులు
సదస్సు సక్సెస్: మంత్రి జూపల్లి సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా రెండు రోజులపాటు జరిగిన బయో ఆసియా-2016 సదస్సు పూర్తిస్థాయిలో విజయవంతమైనట్లు పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న టీఎస్ ఐపాస్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోందని ఆయన బుధవారం సదస్సులో విలేకరులతో చెప్పారు. వివిధ కంపెనీలు రూ.వెయ్యి కోట్ల మేరకు పెట్టుబడులు పెట్టేందుకు ఈ సదస్సులో ముందుకొచ్చాయన్నారు. ఫెర్రింగ్ ఫార్మా కంపెనీ తమ భారత్ కార్యకలాపాలకు హైదరాబాద్‌ను కేంద్రంగా ఎంచుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచస్థాయి హంగులతో ఏర్పాటు చేయబోతున్న ఫార్మాసిటీతో హైదరాబాద్ లైఫ్‌సెన్సైస్ హబ్‌గా మారుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదన్నారు. అన్నీ ఇక్కడి నుంచే: మైకేల్ ఫెర్రింగ్ ఫార్మా 21 ఏళ్లుగా ముంబై నుంచి పనిచేస్తున్నప్పటికీ హైదరాబాద్ కేంద్రం ఏర్పాటు తరువాత భారత్‌లో ప్రధాన కార్యాలయం ఇదే అవుతుందని సంస్థ సీఓఓ మైకెల్ పెటీగ్రూ తెలిపారు. హైదరాబాద్ కేంద్ర ఏర్పాటుకు 2.5 కోట్ల డాలర్లు (రూ.170 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నామన్నారు. పరిశోధన, అభివృద్ధి కేంద్రంతో మొదలుపెట్టి.. దశలవారీగా అన్ని లావాదేవీలు, తయారీలను ఇక్కడి నుంచే చేపడతామన్నారు. యూరప్, అమెరికాల్లో ఇప్పటికే ఇలాంటి కేంద్రాలు 11 వరకూ ఉండగా, హైదరాబాద్ కేంద్రం పన్నెండోది అవుతుందన్నారు. ఫెర్రింగ్ ఫార్మా భారత్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ అశోక్ అలాటే మాట్లాడుతూ, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్రల్లోని అనేక ప్రాంతాలను పరిశీలించిన తరువాత తాము హైదరాబాద్‌లో కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. -
మీరే పారిశ్రామిక రాయబారులు!
సాక్షి, హైదరాబాద్: పెట్టుబడిదారులు తెలంగాణకు పారిశ్రామిక రాయబారులుగా వ్యవహరించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. తెలంగాణ పారిశ్రామిక విధానం(టీఎస్ ఐపాస్)లో భాగంగా రెండో విడతలో 16 పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చిన పారిశ్రామికవేత్తలకు బుధవారం సచి వాలయంలో ఆయన అనుమతిపత్రాలు అందజేశారు. అనంతరం వారితో విడివిడిగా భేటీ కావడంతో పాటు గ్రూప్ ఫొటో దిగారు. పరిశ్రమల ఏర్పాటుపై ఏవైనా సమస్యలుంటే సీఎం కార్యాలయంలోని చేజింగ్ సెల్ అదనపు ము ఖ్యకార్యదర్శి శాంతికుమారి దృష్టికి తీసుకు రావాల్సిందిగా సూచించారు. పరిశ్రమల ఏర్పాటుకు దరఖాస్తు చేసుకున్న వారికి పది రోజుల్లోగా అనుమతులు ఇస్తామని ప్రకటించి న విషయాన్ని సీఎం గుర్తు చేశారు. హామీలో భాగంగానే గతనెల 23న రూ.1,521.42 కోట్ల పెట్టుబడులతో ముందు కు వచ్చిన 17 పరిశ్రమలకు తొలి విడతలో అనుమతులు ఇచ్చామని తెలిపారు. పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూమి, నీరు, విద్యు త్ తదితర మౌలిక సౌకర్యాలను ప్రభుత్వమే సమకూరుస్తుందన్నారు. సీఎం చేతుల మీదు గా అనుమతి పత్రాలు అందుకున్న వారిలో స్పెయిన్‌కు చెందిన అంతర్జాతీయ ఫార్మా కంపెనీ కెమోతోపాటు తోషిబా, మైక్రోమ్యాక్స్, పారగాన్ తదితర సంస్థలకు చెందిన సీఎండీలు, సీఈఓలు, చైర్మన్లు ఉన్నారు. ఈ కార్యక్రమంలో వాణిజ్య, పరిశ్రమల మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, చేజింగ్ సెల్ అదనపు ముఖ్య కార్యదర్శి శాంతికుమారి, పరిశ్రమల శాఖ కార్యదర్శి అరవింద్‌కుమార్, టీఎస్ ఐఐసీ వైస్ చైర్మన్, ఎండీ ఈవీ నర్సింహారెడ్డి పాల్గొన్నారు. 16 సంస్థలు.. 19 యూనిట్లు.. టీఎస్ ఐపాస్‌లో భాగంగా రెండో విడతలో బుధవారం అనుమతులు పొందిన 16 సంస్థలు (19 యూనిట్లు) రాష్ట్రంలో రూ.1,087.37 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నాయి. రంగారెడ్డి, మహబూబ్‌నగర్, మెదక్, వరంగల్ జిల్లాలో ఈ పరిశ్రమల స్థాపన ద్వారా 5,321 మందికి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి. అనుమతులు పొందిన వాటిలో ఫార్మాస్యూటికల్ ఫార్ములేషన్స్, హెలికాప్టర్ కేబిన్ కిట్ల తయారీ, ఉక్కు, ఇనుము మిశ్రమ లోహాల పోత, పాదరక్షలు, సెల్ఫోన్ల తయారీ తదితర రంగాలకు చెందిన సంస్థలు ఉన్నాయి. -
కొత్త విధానాలతో ముందుకు సాగండి
కేంద్ర పంచాయతీరాజ్ సంయుక్త కార్యదర్శి విజయానంద్ సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పంచాయతీరాజ్ సంస్థలను బలోపేతం చేసేందుకు ఎన్నో అవకాశాలున్నాయని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సంయుక్త కార్యదర్శి విజయానంద్ అన్నారు. టీఎస్ ఐపార్డ్‌లో ఆదివారం జరిగిన మేధోమథన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయానంద్ మాట్లాడుతూ.. కొత్త రాష్ట్రమైనందున సరికొత్త విధానాలతో ముందుకు సాగాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు సూచించారు. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసే విషయంలో రోడ్‌మ్యాప్ కోసం నిపుణులతో సదస్సును నిర్వహించడం శుభపరిణామమన్నారు. కేరళలో పంచాయతీ వ్యవస్థల తీరుతెన్నులను పరిశీలించేందుకు ఎమ్మెల్యేల బృందాన్ని పంపాలని కోరారు. ఉత్తమ విధానాలను అనుసరిస్తాం: కేటీఆర్ గ్రామ పంచాయతీలను బలోపేతం చేసేందుకు వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న విధానాలను పరిశీలించి, అత్యుత్తమ విధానాలను తాము అనుసరిస్తామని మంత్రి కె.తారకరామారావు తెలిపారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని ఈ - పంచాయతీల ఏర్పాటు ద్వారా పౌరసేవలను అందించబోతున్నట్లు చెప్పారు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల గౌరవ వేతనం పెంపుద్వారా వారిలో విశ్వాసాన్ని పెంచగలిగామన్నారు. ఈ సదస్సులో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్‌పీటర్, కమిషనర్ అనితా రాంచంద్రన్, వివిధ ప్రభుత్వ విభాగాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఆరంభం అదిరింది
సాక్షి, హైదరాబాద్: టీఎస్ ఐపాస్ ఆరంభం అదిరింది. అనుమతులను గడువు కంటే ముందే జారీ చేశారు. ప్రభుత్వం ఈ నెల 12న ప్రకటించిన నూతన పారిశ్రామికవిధానం మరో అడుగు ముందుకేసింది. దీంతో కొత్త విధానం అమల్లోకి వచ్చిన తొలి రెండు వారాల్లోనే రాష్ట్రానికి రూ. 1,500 కోట్ల మేరకు పెట్టుబడులు వచ్చినట్లయింది. 17 కంపెనీలకు గడువు కంటే ముందుగానే అనుమతుల జారీకి ప్రభుత్వం సన్నాహాలు చేసింది. మొదటి విడత అనుమతులు పొందిన కంపెనీలకు స్వయంగా సీఎం కేసీఆర్ మంగళవారం సెక్రటేరియట్లో అనుమతిపత్రాలు అందజేయనున్నారు. ఈ పరిశ్రమల ఏర్పాటుతో 4 వేల మందికిపైగా ఉద్యోగ అవకాశాలు పొందుతారు. తొలివిడత అనుమతి పొందే వాటిలో ఐటీసీతోపాటు పలు ప్రముఖ కంపెనీలు ఉన్నాయి. కొత్త రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని, తమవంతు సహాయ సహకారాలు అందిస్తామని ఇప్పటికే అంతర్జాతీయస్థాయిలో పేరొందిన కంపెనీలను ప్రభుత్వం రాష్ట్రానికి ఆహ్వానించింది. కొత్త విధానం ప్రకారం రెండు వారాల్లోగా అర్జీదారులకు అనుమతులు జారీ చేయాలి. కానీ అధికారులు వేగంగా పనిచేసి నిర్దేశించిన గడువు కంటే ముందుగానే ఈ అనుమతుల జారీ ప్రక్రియను పూర్తి చేయడం విశేషం. స్వయంగా సీఎం పర్యవేక్షణలో ముఖ్యమంత్రి కార్యాలయంలో ఛేజింగ్ సెల్ సారధ్యంలో పది రోజుల్లోనే అనుమతులు మంజూరు కావటం గమనార్హం. -
తెలంగాణలో 17 కొత్త కంపెనీలకు అనుమతులు
హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా తీసుకొచ్చిన పారిశ్రామిక విధానం(టీఎస్ ఐపాస్) ద్వారా 17 కంపెనీలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతులు మంజూరుచేసింది. మంగళవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కేసీఆర్ సదరు కంపెనీలకు అనుమతి పత్రాలు అందజేయనున్నారు. ఐటీసీతోపాటు అనుమతులు కూడా మరికొన్ని కంపెనీలు పొందనున్నాయి. మొత్తం పదిహేడు కంపెనీలు కలిసి దాదాపు రూ.1500 కోట్ల పెట్టుబడులు పెడతాయని అంచనా. కాగా ఈ కంపెనీల ఏర్పాటు ద్వారా నాలుగు వేలమందికి ఉపాధి లభించనుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవలె ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త పారిశ్రామిక విధానం (టీఎస్ ఐపాస్)ను హెచ్ఐసీసీలో ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఆ సమయంలో హెటెక్స్‌లో పారిశ్రామికవేత్తలు, కంపెనీల సీఈవోలతో ఆయన సమావేశమయ్యారు. వారిలో మైక్రోసాప్ట్, టాటా, ఐటీసీ, షాపూర్జీ-పల్లోంజీ, ఇన్పోసిస్ కంపెనీల ప్రతినిధులతో పాటు అమెరికా, కెనడా, స్వీడన్, గల్ఫ్ దేశాలకు చెందిన విదేశాంగ రాయబారులు పాల్గొన్న విషయం తెలిసిందే. -
ఎయిర్‌పోర్టులోనే ఎదుర్కోలు
* పారిశ్రామికవేత్తలకు రెడ్‌కార్పెట్ స్వాగతం * 12న ఐపాస్ మార్గదర్శకాల విడుదల కార్యక్రమానికి ముమ్మర ఏర్పాట్లు * స్వాగత ఏర్పాట్లపై నేడు మంత్రి జూపల్లి సమీక్ష సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నూతన పారిశ్రామిక విధానం (టీఎస్ ఐపాస్) మార్గదర్శకాల విడుదల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. హైదరాబాద్ మాదాపూర్‌లోని హెచ్ఐసీసీలో ఈ నెల 12న జరిగే కార్యక్రమానికి హాజరయ్యే పారిశ్రామిక దిగ్గజాలకు మర్యాదల్లో ఎక్కడా లోటు రాకుండా చూడాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే కార్యక్రమ నిర్వహణ ఏర్పాట్ల బాధ్యతను ఓ ప్రముఖ ఈవెంట్ ఆర్గనైజింగ్ సంస్థకు అప్పగించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే అతిథులను శంషాబాద్ ఎయిర్‌పోర్టు బయటి ద్వారం వద్ద కాకుండా నేరుగా విమానాశ్రయంలోనే ఎదురేగి స్వాగతం పలకాలని నిర్ణయించారు. అతిథులకు స్థానికంగా బస ఏర్పాటు చేసేందుకు అవసరమైన ఏర్పాట్లపై అధికారులు దృష్టి సారించారు. ఈ కార్యక్రమం ఏర్పాట్లపై కేసీఆర్ పరిశ్రమలశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆహ్వాన పత్రాల పంపిణీ పూర్తి కావడంతో అతిథులకు అసౌకర్యం కలగకుండా చేయాల్సిన ఏర్పాట్లపై పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు మంగళవారం మరోమారు సమీక్ష నిర్వహించనున్నారు. ప్రముఖులకు ఆహ్వానాలు... ఈ కార్యక్రమానికి వచ్చే 2 వేల మంది ప్రముఖులను కేటగిరీలుగా వర్గీకరించి ఆహ్వానాలు అందజేస్తున్నారు. సీఎంవోతోపాటు పరిశ్రమలశాఖ కార్యదర్శి ఆహ్వాన పత్రాల పంపిణీ ప్రక్రియను పర్యవేక్షిస్తున్నారు. ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రులు కేటీఆర్, జూపల్లి కృష్ణారావు ముంబై వెళ్లి టాటా సన్స్ చైర్మన్ సైరస్ మిస్త్రీని ఆహ్వానించారు. సీఎం కేసీఆర్ మరో 130 మంది ప్రముఖ వ్యాపార, వాణిజ్య, పరిశ్రమల ప్రముఖులకు స్వయంగా లేఖలు రాశారు. ఆహ్వాన పత్రాలు అందుకున్న వారిలో చాలా మంది పారిశ్రామిక దిగ్గజాలు సుముఖత వ్యక్తం చేస్తూ లేఖలు పంపినట్లు పరిశ్రమలశాఖ వర్గాలు వెల్లడించాయి. పరిశ్రమలశాఖ కమిషనరేట్, టీఎస్ ఐఐసీ, టీఎస్ ఎండీసీ తదితర ప్రభుత్వశాఖల అధికారులు అతిథుల రాకపోకలకు సంబంధించిన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.