పరిశ్రమలు 11,000 పెట్టుబడులు 1.73 లక్షల కోట్లు | TS IPASS Successfully Completed Five Years In Industrialization | Sakshi
Sakshi News home page

పరిశ్రమలు 11,000 పెట్టుబడులు 1.73 లక్షల కోట్లు

Published Wed, Dec 4 2019 1:05 AM | Last Updated on Wed, Dec 4 2019 4:46 AM

TS IPASS Successfully Completed Five Years In Industrialization - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ఆర్థిక పురోగతి, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం రూపొందించిన సులభతర వాణిజ్య, పారిశ్రామిక విధానం టీఎస్‌ఐపాస్‌(తెలంగాణ స్టేట్‌ ఇండస్ట్రియల్‌ ప్రాజెక్ట్‌ అప్రూవల్, సెల్ఫ్‌ సర్టిఫికేషన్‌ సిస్టమ్‌) ఐదేళ్లు పూర్తి చేసుకుంది. దేశంలోనే వినూత్నమైన పారిశ్రామిక విధానంగా చెబుతున్న టీఎస్‌ఐపాస్‌ ద్వారా ఐదేళ్లలో రూ.1.73 లక్షల కోట్ల పెట్టుబడులతో 11 వేలకుపైగా పరిశ్రమలు ఏర్పాటవగా 13 లక్షల మందికి ఉపాధి లభించినట్లు పరిశ్రమలశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.

పరిశ్రమల అనుమతుల్లో పారదర్శక, సరళమైన, అవినీతిరహిత విధానం రూపొందిన టీఎస్‌ ఐపాస్‌కు 2014 నవంబర్‌ 27న చట్టబద్ధత కల్పించింది. జిల్లాలవారీగా వనరులను సద్వినియోగం చేసుకుంటూ పారిశ్రామిక అభివృద్ధి సాధించేందుకు 14 ప్రాధాన్యతా రంగాల్లో పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించాలని ఐపాస్‌లో లక్ష్యంగా నిర్దేశించింది.

3 కేటగిరీల్లో అవార్డులు..
నూతన పారిశ్రామిక విధానంగా పేర్కొనే టీఎస్‌ ఐపాస్‌కు చట్టబద్ధత కల్పించి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా పరిశ్రమలశాఖ ఆధ్వర్యంలో బుధవారం ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కె. తారక రామారావుతోపాటు మంత్రులు మహమూద్‌ అలీ, మల్లారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి తదితరులు ఉత్సవాలకు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా చట్టం అమల్లో ప్రతిభ చూపిన 33 జిల్లాలను మూడు కేటగిరీలుగా వర్గీకరించి ఒక్కో కేటగిరీలో మూడేసి జిల్లాలకు బుధవారం అవార్డులు అందజేయనున్నారు.

మొదటి కేటగిరీలో కరీంనగర్, మేడ్చల్‌ మల్కాజిగిరి, రంగారెడ్డి, రెండో కేటగిరీలో సిద్దిపేట, కామారెడ్డి, మెదక్, మూడో కేటగిరీలో జగిత్యాల, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్‌ జిల్లాల తరఫున ఆయా జిల్లాల కలెక్టర్లు అవార్డులు అందుకోనున్నారు. ప్రభుత్వ విభాగాల కేటగిరీలో ఉత్తర, దక్షిణ మండల విద్యుత్‌ పంపిణీ సంస్థలు, భూగర్భ జలవనరులు, రెవెన్యూ విభాగాలకు అవార్డులు అందించనున్నారు.

టీఎస్‌ ఐపాస్‌ను సమర్థంగా అమలు చేయడంలో కీలకపాత్ర పోషించిన అధికారులు ఈవీ నర్సింహారెడ్డి (టీఎస్‌ఐఐసీ), అర్వింద్‌ కుమార్‌ (మెట్రోపాలిటన్‌ కమిషనర్‌), టీకే శ్రీదేవి (మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌), కె. విద్యాధర్‌ (టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌), నీతూకుమారి ప్రసాద్‌ (పీసీబీ సభ్య కార్యదర్శి), అహ్మద్‌ నదీమ్‌ (లేబర్, ఇండస్ట్రీస్‌ కమిషనర్‌) అవార్డులు అందుకోనున్నారు.

ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలే ఎక్కువ
ఫుడ్‌ ప్రాసెసింగ్, ఐటీ, ఫార్మా, విద్యుత్, ప్లాస్టిక్, ఇంజనీరింగ్, వ్యవసాయాధార, గ్రానైట్‌ స్టోన్‌ క్రషింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, పేపర్, ప్రింటింగ్, టెక్స్‌టైల్, సిమెంట్, ఏరోస్పేస్, సోలార్, ఆటోమొబైల్‌ రంగాల పరిశ్రమలు టీఎస్‌ఐపాస్‌లో భాగంగా రాష్ట్రంలో ఏర్పాటయ్యాయి. ఈ విధానం వల్లే దేశీయ సంస్థలతోపాటు బహుళజాతి కంపెనీలు పెట్టుబడులతో రాష్ట్రానికి రాగా వాటిలో ఎక్కువగా ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమలు ఉన్నాయి.

ఐపాస్‌ మూలంగా ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ర్యాంకింగ్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగేళ్లుగా జాతీయస్థాయిలో తొలి 2 స్థానాల్లో కొనసాగుతోంది. రాజధాని పరిసరాల్లోనే పారిశ్రామిక అభివృద్ధి కేంద్రీకృతం కాకుండా గ్రామాలకు విస్తరించే లక్ష్యంతో ఐపాస్‌లో భాగంగా పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేసి మౌలిక సౌకర్యాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఐపాస్‌ అమలుతో ఐదేళ్లలో పారిశ్రామిక పెట్టుబడుల ఆకర్షణలో 70 శాతానికిపైగా వృద్ధి సాధించినట్లు పరిశ్రమలశాఖ నివేదిక వెల్లడిస్తోంది

ఐపాస్‌ ప్రత్యేకతలివే
పారిశ్రామిక అనుమతులు పొందడాన్ని హక్కుగా చేస్తూ దరఖాస్తుదారుడు ఆన్‌లైన్‌లో వివరాలు సమర్పించేలా టీఎస్‌ఐపాస్‌ చట్టం–2014 రూపొందించారు. 27 ప్రభుత్వ విభాగాల పరిధిలో 35 అంశాలకు సంబంధించి అనుమతులు తీసుకోవాల్సి ఉండగా వాటన్నింటినీ ఐపాస్‌ గొడుగు కిందకు తెచ్చారు. పారిశ్రామిక అనుమతులకు 110 రకాలైన పత్రాలను సమర్పించాల్సి ఉండగా వాటి సంఖ్యను పదికి కుదించారు. దరఖాస్తు చేసిన 30 రోజుల్లోగా అనుమతి లభించని పక్షంలో అనుమతి లభించినట్లుగానే భావించాల్సి ఉంటుందనే నిబంధనకు చోటు కల్పించారు.

రూ.200 కోట్లకు పైబడిన పెట్టుబడితో వచ్చే భారీ పరిశ్రమలకు అనుమతులను 15 రోజుల్లోనే ఇవ్వాలని చట్టంలో పేర్కొన్నారు. భారీ ప్రాజెక్టులకు అనుమతులిచ్చే ప్రక్రియను పర్యవేక్షించేం దుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ‘టీ స్విప్ట్‌’బోర్డుతోపాటు సీఎం నేతృత్వంలో ‘ఇండస్ట్రియల్‌ చేజింగ్‌ సెల్‌’ను ఏర్పాటు చేశారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తుతోపాటు దరఖాస్తు రుసుము చెల్లింపునూ ఇదే విధానం లో చేయాలని చట్టంలో స్పష్టం చేయడంతో భారీ ఫలితాలు సాధించినట్లు పరిశ్రమల వర్గాలు వెల్లడించాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement