సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులతో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో అద్భుతమైన పెట్టుబడి అవకాశాలు ఏర్పడనున్నాయని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. రాష్ట్రంలో జల విప్లవం కొనసాగుతుందని, తద్వారా వ్యవసాయ రంగంతో పాటు పాలు, మాంసం, చేపల ఉత్పత్తికి భవిష్యత్తులో భారీ అవకాశాలు ఏర్పడతాయని, పెద్ద మొత్తంలో ఫుడ్‌ప్రాసెసింగ్, వ్యవసాయరంగ అనుబంధ పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చే అవకాశముందన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఇతర రంగాల పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం విజయవంతంగా కొనసాగుతోందని, ఈ విషయంలో తెలంగాణ అగ్రభాగాన ఉందన్నారు.
ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే వారికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని హామీనిచ్చారు. ఇన్వెస్ట్ ఇండియా ఇన్వెస్ట్‌మెంట్ ఫోరం ఫుడ్ ప్రాసెసింగ్ రంగంపై సోమవారం ఏర్పాటు చేసిన వెబినార్‌లో కేటీఆర్ మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి సుమారు 200 మంది వ్యవసాయ, ఫుడ్ ప్రాసెసింగ్ పెట్టుబడిదారులు దీనికి హాజరయ్యారు. రెడీ టు ఈట్, బేవరేజెస్, కాయగూరలు, పండ్లు, పౌల్ట్రీ, మాంసం ఉత్పత్తికి సంబంధించి పెట్టుబడులు పెట్టేందుకు వీరు ఆసక్తి చూపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్‌లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని, తద్వారా ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయడం అత్యంత సౌకర్యవంతమైన విషయమని కేటీఆర్ వారికి వివరించారు.
పెట్టుబడులకు బడా సంస్థల ఆసక్తి
ఇప్పటికే తెలంగాణ అనేక రంగాల్లో ప్రపంచ స్థాయి పరిశ్రమలను ఆకర్షించిందని, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో అనేక పెద్దసంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో ప్రస్తుతం ప్రారంభించిన నూతన ప్రాజెక్టులతో భారీగా సాగునీటి వనరులు పెరుగుతాయని, తద్వారా వ్యవసాయ రంగంలో విభిన్న రకాలైన పంటలు, వ్యవసాయ ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయన్నారు. వ్యవసాయ, ఫుడ్ ప్రాసెసింగ్ ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు సులువుగా తరలించేందుకు వీలుగా రాష్ట్రం భౌగోళికంగా దేశానికి మధ్యలో ఉందన్నారు.
రాష్ట్రంలో అపారంగా ప్రభుత్వ భూముల లభ్యత ఉందని, ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి ప్రత్యేకంగా పారిశ్రామికవాడలను ఏర్పాటు చేశామన్నారు. ప్రత్యేకంగా స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను సైతం ఏర్పాటు చేయనున్నామన్నారు. రైతులను సంఘటిత పరిచే రైతుబంధు సమితులను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, ఇలాంటి కార్యక్రమాల ద్వారా వారికి అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు ప్రభుత్వానికి లేదా పరిశ్రమ వర్గాలకు సులువవుతుందన్నారు. స్థానికంగా ఉన్న పరిశ్రమలు లేదా ఇతర వర్గాలతో కలిసి వ్యాపారం నిర్వహించేందుకు కూడా ప్రభుత్వం సహకరిస్తుందని అంతర్జాతీయ పెట్టుబడిదారులకు మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment