industries development
-
మనిషికి పని లేని అభివృద్ధా?
ఇటీవలి సంవత్సరాలలో ఒక వైపరీత్యం కనిపిస్తున్నది. భారతదేశం రోజురోజుకీ ధనిక దేశంగా మారుతున్నది. కానీ అదే దామాషాలో ఉపాధి అవకాశాలు పెరగడం లేదు. జాతీయాదాయం పెరిగితే, ఉద్యోగ అవకాశాలు కూడా అదే స్థాయిలో పెరుగుతాయని భావిస్తాం. కానీ అలా జరగడం లేదు. కోట్లాది మంది యువకులు నిరుద్యోగులుగా రోడ్ల మీదే ఉన్నారు. అందుకే వందల ఉద్యోగాలు ఉంటే, వాటికోసం లక్షల మంది పరీక్షలు రాస్తున్నారు. దీనికి కారణం – వేగంగా పెరిగిన యాంత్రీకరణ. దినదినాభివృద్ధి చెందుతున్న యాంత్రీకరణ, సాంకేతికత మనకు తెలియకుండానే మనుషుల్ని మింగేస్తున్నది. మనుషులతో మనుషుల కోసం అభివృద్ధి కాకుండా, పెట్టుబడిదారుల కోసం యంత్రాలతో అభివృద్ధి సాగుతున్నది. ‘‘ఉద్యోగ, ఉపాధి కల్పన, అసమానతల తొలగింపు మీద భారత ప్రభుత్వం దృష్టి సారించాలి. సామాజిక, ఉద్యోగ భద్రత గురించిన విధానాలను పటిష్ఠ పరచాలి. నైపుణ్యంతో కూడిన ఉత్పాదక పురోగతిని సాధించాలి. కోవిడ్‌తో ఏర్పడిన ఇంకా అనేక పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఈ విషయాలను మరింత లోతుగా ఆలోచించాలి.’’ అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్ఓ) డైరెక్టర్ జనరల్ గిల్బర్ట్ హంగ్బో సున్నితంగా చేసిన హెచ్చరిక ఇది. ఇటీవలి సంవత్సరాలలో ఒక వైపరీత్యం కనిపిస్తున్నది. భారత దేశం రోజురోజుకీ ధనిక దేశంగా మారుతున్నది. స్థూల జాతీయా దాయం, తలసరి ఆదాయాలు పెరుగుతున్నాయి. కానీ అదే దామా షాలో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు పెరగడం లేదు. పైగా తగ్గు తున్నాయి. భారత్‌లో ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయనీ, నిరుపేద, అణగారిన వర్గాల ప్రజలు రోజు రోజుకీ ఆర్థిక ఇబ్బందు లకు గురవుతున్నారనీ ఐఎల్ఓ డైరెక్టర్ జనరల్ గిల్బర్ట్ హంగ్బో చెప్పిన మాటలు అక్షర సత్యాలు. స్థూల జాతీయాదాయం, అంటే మన దేశంలో పోగవుతున్న సంపదలో తగ్గుదల లేదు. ఏడాదికేడాది ఆ పెరుగుదల కనిపిస్తూనే ఉన్నది. అదే సమయంలో నిరుద్యోగం కూడా ఆకాశాన్నంటుతున్నది. భారతదేశ ఆర్థికాభివృద్ధిలో చాలా హెచ్చుతగ్గులు ఉన్నాయి. 1991కి ముందు ప్రభుత్వం అనుసరించిన విధానాలను తిరస్కరించి, ఆర్థిక వ్యవస్థను సరళీకృతం చేశారు. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకర ణల ద్వారా ఆర్థిక వ్యవస్థను ప్రైవేట్ వ్యక్తులకు, కంపెనీలకు అందు బాటులోకి తెచ్చారు. దాని తరువాత భారత స్థూల జాతీయాదా యాలు పెరిగినట్టు లెక్కలు చెబుతున్నాయి. 1960–70 దశకంలో జీడీపీ వృద్ధి రేటు 3–5 శాతం మాత్రమే ఉండింది. అయితే నిరుద్యో గితా రేటు 5 శాతానికి మించలేదు. జీడీపీ వృద్ధి రేటు, నిరుద్యోగితా రేటును పోల్చి చూస్తే మన ఆర్థిక వ్యవస్థ పనితీరు అర్థం కాగలదు. 1999లో జీడీపీ వృద్ధిరేటు 8.85 ఉంటే, నిరుద్యోగితా రేటు 5.74 ఉండింది. 2003లో జీడీపీ వృద్ధి రేటు 7.5 ఉంటే, నిరుద్యోగితా రేటు 5.64 ఉండింది. 2021లో జీడీపీ వృద్ధిరేటును 8.95 గా గుర్తించారు. అయితే నిరుద్యోగితా రేటు కూడా అదే స్థాయిలో పెరిగింది. 2021లో ఇది 8.7 శాతంగా నమోదైంది. నిజానికి ఉత్పాదకత పెరిగి, జాతీయాదాయం పెరిగితే, ఉద్యోగ అవ కాశాలు కూడా అదే స్థాయిలో పెరుగుతాయని భావిస్తాం. కానీ అలా జరగలేదు. దీనికి కారణం ఏమిటనే ప్రశ్న మనలాంటి సామాన్యులకు రావడం సహజం. దీనికి ప్రధానమైన ఒక కారణం, ప్రైవేట్ రంగం విస్తృతంగా జడలు విప్పడం. ఒక్కొక్కటిగా ప్రభుత్వ రంగాలను కబళిస్తూ వస్తోన్న ప్రైవేటు వ్యవస్థ సమాజం లోతుల నుంచీ సహజత్వాన్నీ, సామాజిక తత్వాన్నీ, సమైక్యతా నాదాన్నీ పెకిలిస్తూ వస్తున్నది. ఎవరైనా ఒక పెట్టుబడిదారుడు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉత్పత్తి చేయాలను కోవడవం సహజం. ఇక్కడ మనిషి, కార్మికుడు కేవలం ఒక సరుకు లాంటివాడు. ఎక్కువ మందిని ఒక పరిశ్రమలో పెట్టుకొని తక్కువ ఉత్పత్తి జరుగుతుంటే అతడు దానిని కొనసాగించడు. మనిషి కేంద్రంగా అభివృద్ధి, ఉత్పత్తి అనే మాటలు వ్యాపారికి అనవసరం. ఏదైనా యాంత్రిక, సాంకేతిక పరిజ్ఞానంతో అత్యధిక అభివృద్ధి సాధించే అవకాశం ఉంటే కార్మికులను నిర్దాక్షిణ్యంగా తొలగించడం లేదంటే, అదనంగా తీసుకోకపోవడం రివాజు. ఇదే కారణం వల్ల కార్మికులు, ఉద్యోగుల అవసరం లేకుండా పోతోంది. ఇప్పుడు ప్రైవేటు రంగంలోనే కాదు, ప్రభుత్వ రంగ సంస్థల్లో, చివరకు ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా సిబ్బంది నియామకాలు తగ్గుతూ వస్తుండడానికి ఇదే కారణం. 2000 సంవత్సరం తరువాత పెరిగిన యాంత్రీకరణ, సాంకేతిక పరిజ్ఞానం మనిషి అవసరాన్ని తోసిరాజంటున్నాయి. ఇంకొక విషయం ఏమిటంటే, సాంకేతిక పరిజ్ఞానం నిరంతరం మారుతూనే›ఉంటుంది. ఈ రోజు వందమంది చేసే పనిని ఒక్కరు చేయగలిగితే, మరో సంవత్సరానికి వేయిమంది చేసే పనిని ఒక్కరే చేయగలుగుతున్నారు. అంటే ఆ స్థాయిలో ఉద్యో గుల, కార్మికుల అవసరం ఉత్పాదకతలో తగ్గిపోతున్నట్టు అర్థం చేసుకోవాలి. ఇది సమాజ మనుగడకు అత్యంత ప్రమాదకరం. మనం నిత్యం చూస్తున్న వ్యవసాయం, నిర్మాణ రంగాలు దీనికి ప్రత్యక్ష ఉదాహరణలు. ఉదాహరణకు వరి పంటలో గతంలో అడు గడుగునా కూలీల శ్రమ అవసరమయ్యేది. ఈ రోజు దున్నడం కోసం ట్రాక్టర్లు, కోతకు మిషన్లు వచ్చాయి. చివరకు ఆడవాళ్లకు ఏకైక ఉపాధినిచ్చే నాట్లు, కలుపులు తీయడానికి కూడా చిన్న చిన్న మిషన్లు వచ్చాయి. అవి ఇంకా పూర్తి స్థాయిలో రావాల్సి ఉంది. కానీ ఇప్పటికే వరి పంటలో 70 శాతం వరకు కూలీల ప్రమేయం తగ్గింది. మిగతా 30 శాతం త్వరలో కనుమరుగు కానున్నది. అదేవిధంగా ప్రాజెక్టులు, భవన నిర్మాణ రంగంలో వచ్చిన యాంత్రీకరణతో ప్రాజెక్టులు అత్యంత వేగంగా పూర్తి అవుతున్నాయి. కానీ మనుషుల, కార్మికుల ప్రమేయం లేని అభివృద్ధి కనపడుతున్నది. తక్కువ మందికి ఎక్కువ నైపుణ్యం అందించే ఒక ప్రయత్నం సాగుతున్నది. అందుకే సాంకేతిక, నైపుణ్యాల విద్యలు ఈ దేశంలో కొద్దిమందికే అందుబాటులో ఉన్నాయి. విద్యావ్యవస్థలో సాంకేతిక తను, నైపుణ్యాల శిక్షణలను అన్ని వర్గాల విద్యార్థులకు అందించాలని ప్రభుత్వం అనుకోవడం లేదు. దీనిలో ఈ దేశంలోని సామాజిక, ఆర్థిక అసమానతలు మళ్ళీ ప్రస్ఫుటంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం పరి శ్రమలకు, సేవారంగాలకు, వ్యవసాయరంగాలకు అవసరమైన సాంకే తిక విద్యను ప్రభుత్వ ఆధీనంలోని విద్యాసంస్థలు అందించడం లేదు. ఒకవేళ ఉన్నా వాటి సంఖ్య చాలా తక్కువ. వృత్తి నైపుణ్య విద్య, సాంకే తిక విద్యల కోసం ప్రత్యేక కోర్సులు ప్రవేశపెట్టి, వాటిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రిజర్వేషన్లు లేకుండా చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా అందులో చేరాలనుకుంటే, వాటికి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇది కొన్ని వర్గాలకు ప్రస్తుత ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందు కోవడం అసాధ్యంగా మారుస్తున్నది. అందుకే ఐఎల్ఓ డైరెక్టర్ జనరల్ గిల్బర్ట్ హంగ్బో ఈ దేశంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో అణగారిన వర్గాలకు తగిన ప్రాతినిధ్యం ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. దేశం ఆర్థికాభివృద్ధిలో దూసుకు పోతుంటే, కోట్లాది మంది భారతీయ యువకులు నిరుద్యోగులుగా రోడ్ల మీదే ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే ఉద్యోగ పరీక్షల్లో వందల ఉద్యో గాలుంటే, లక్షల మంది ఆ పరీక్షలు రాస్తున్నారు. అంతిమంగా ఒక విషయం చెప్పాలని ఉంది. ప్రజల ఓట్లతో గెలిచి, ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వాలు చాలా ముఖ్య మైన విషయాన్ని మర్చిపోతున్నాయి. లేదా మర్చిపోతున్నట్టు నటిస్తు న్నాయి. మానవ సమాజం మొదటి నుంచి శ్రమ ద్వారానే అభివృద్ధి చెందుతూ వచ్చింది. అది మేథోశ్రమ కావచ్చు, శారీరక శ్రమ కావచ్చు. ఇప్పుడు నూటికి 70 శాతం మంది నిరుద్యోగంలో గానీ, అర్ధ నిరు ద్యోగంలో గానీ జీవిస్తున్నారు. ఎవ్వరూ సంతృప్తికరంగా లేరు. దిన దినాభివృద్ధి చెందుతున్న యాంత్రీకరణ, సాంకేతికత మనకు తెలియ కుండానే మనుషుల్ని మింగేస్తున్నది. మనుషులతో మనుషుల కోసం అభివృద్ధి కాకుండా, పెట్టుబడిదారుల కోసం యంత్రాలతో అభివృద్ధి సాగుతున్నది. ఇప్పటికైనా ఈ దేశంలోని యువత తమ భవిష్యత్ గురించి ఆలోచించుకోవాలి. ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిపై తమ గళాన్ని విప్పాలి. లేదంటే ఇక్కడ మనుషులకు బదులుగా సాంకేతిక వస్తువులు మాత్రమే మిగులుతాయి. అంతిమంగా మనిషి నిర్జీవంగా మారిపోతాడు. అసలు మనిషన్నవాడే మాయమైపోతాడు. మల్లెపల్లి లక్ష్మయ్య, వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు మొబైల్: 81063 22077 -
ఏపీలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రభుత్వం సహకరించింది: అపాచీ కంపెనీ డైరెక్టర్ టోనీ
-
చిన్నవే దేశ భవితకు పెద్ద దిక్కు
ప్రపంచ వ్యాప్తంగా ‘మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ ప్రైజెస్‌లు’ (ఎంఎస్ఎంఈ లు) ఆర్థికాభివృద్ధిపరంగా మొత్తం పారిశ్రామిక రంగానికి ఇంజన్‌లాగా పని చేస్తున్నాయని ఆర్థికవేత్తలు గుర్తించారు. 140 కోట్ల మంది జనాభా గల మన దేశంలో పేదరికం పోవాలన్నా, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నా, ఆదాయ అసమానతలు తగ్గాలన్నా... సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) అభివృద్ధితోనే సాధ్యం. అంతేగాక భారతదేశం 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చెందాలంటే ఈ తరహా పరిశ్రమల అభివృద్ధి అత్యంత ఆవశ్యకం. చైనాలో ఇంటింటికీ ఒక కుటీర పరిశ్రమ ఉండటం, చైనా ఉత్పత్తులు ప్రపంచ వ్యాప్తంగా చలామణి అవ్వడంలో అక్కడి ప్రభుత్వ పెద్దల నిబద్ధత ఎంతో ఉంది. అందుకే చైనా నేడు ప్రపంచ కర్మాగారంగా ఉంది. ప్రభుత్వం వ్యాపార సంస్థ కాదని మన దేశంలోలాగా చైనా పాలకులు అనుకోవడం లేదు. చైనాలో స్థానికంగా పరిశ్రమలు స్థాపించి అభివృద్ధి పరిచినందువలన అక్కడి పేదరికం పోయింది. దీనికి గాను ప్రజలకు రుణాల రూపంలో పెట్టుబడులు సమకూర్చడం, వారికి తగిన శిక్షణ ఇవ్వడం, పరిశ్రమలకు కావలసిన సాంకేతిక సామగ్రిని అందించడం, మార్కెట్లను చూపించడం లాంటి పనుల్లో ప్రభుత్వం ఒక వైపు, ప్రైవేట్ పారిశ్రామిక రంగం మరొకవైపు సహాయ సహకారాలు అందిస్తున్నాయి. మన దేశం సంగతికొస్తే... ఈ ఎంఎస్ఎంఈల ద్వారా నేడు పారిశ్రామిక రంగంలో 97 శాతం ఉద్యోగ కల్పన జరుగుతున్నది. భారీ పరిశ్రమల ద్వారా కేవలం 3 శాతం మాత్రమే ఉద్యోగావకాశాలు ఉండటం గమనార్హం. ప్రస్తుతం దేశంలో 6.3 కోట్ల సంస్థలు ఎనిమిది వేల రకాల ఉత్పత్తులను చేస్తూ మన స్థూల జాతీయ ఉత్పత్తిలో 30 శాతం వాటా, దేశ పారిశ్రామిక ఉత్పత్తిలో 33 శాతం వాటా కలిగి ఉన్నాయి. ఈ పరిశ్రమలన్నీ అసంఘటిత రంగంలో ఉన్నాయి. వీటిని సంఘటితపరచి ఆర్థికపరమైన, సాంకేతికపరమైన సహాయం అందించి, సబ్సిడీలు కల్పిస్తే ఉపాధి కల్పనలో, ఆదాయాలు పెంపొందించడంలో దేశంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. అందుకే అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో వీటి అభివృద్ధికి ప్రత్యేక మంత్రిత్వ శాఖలు ఏర్పరిచారు. అయితే వీటికి ప్రభుత్వాల నుంచి తగిన ప్రోత్సాహకాలు అందడం లేదనే విమర్శ ఉంది. మన రాష్ట్రంలో 25.96 లక్షల ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. వీటిలో 70.69 లక్షల మంది ఉద్యోగులున్నారు. ఏపీలో గత ప్రభుత్వం నిరాదరణ వల్ల అనేక ఎంఎస్ఎంఈలు మూతపడే స్థితికి చేరుకున్నాయి. దీనికి తోడు కోవిడ్ సంక్షోభం వాటిని మరింత కుంగదీసింది. ఈ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్రంలో ఏ ఒక్క పరిశ్రమ మూతపడకూడదన్న ఉద్దేశంతో దేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్ జగన్ ప్రభుత్వం ‘రీస్టార్ట్ ప్యాకేజీ’ని ప్రకటించింది. దీని కింద ఎంఎస్ఎంఈలకు గత ప్రభుత్వం బకాయి పడిన రాయితీలతో పాటు ప్రస్తుత రాయితీలు కూడా కలిపి రూ. 2,086 కోట్లు విడుదల చేసింది. (చదవండి: శ్రమ విలువ తెలుసు కాబట్టే...) అంతేగాకుండా ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి దేశంలోనే తొలిసారిగా ‘వైఎస్ఆర్ జగనన్న బడుగు వికాసం పథకా’న్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా 2020–21లో ఎంఎస్ఎమ్ఈలకు చెందిన ఎస్సీ పారిశ్రామికవేత్తలకు రూ. 235.74 కోట్లు, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు రూ. 41.58 కోట్ల రాయితీలను విడుదల చేసింది. 2021–22 కాలంలో ఎస్సీ పారిశ్రామిక వేత్తలకు రూ. 111.78 కోట్లు, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు రూ. 24.41 కోట్లు రాయితీలను విడుదల చేసింది. ఈ విధంగా దేశంలోని మిగతా రాష్ట్రాలు కూడా ఎంఎస్ఎంఈలకు ప్రోత్సాహకాలు అందిస్తే... దేశం వాయువేగంతో అభివృద్ధి పథంలో దూసుకు పోతుందనడంలో సందేహం లేదు. (చదవండి: వికేంద్రీకరణ ఫలితాలు ఇప్పటికే షురూ!) - ఎనుగొండ నాగరాజ నాయుడు రిటైర్డ్ ప్రిన్సిపాల్ -
కోనసీమ జిల్లా పారిశ్రామిక పురోగతిపై ఆశలు
అమలాపురం టౌన్: కోనసీమ జిల్లా ఆవిర్భావంతో పారిశ్రామిక ప్రగతిపై ఆశలు చిగురిస్తున్నాయి. అన్ని ప్రాంతాలూ సమాంతర అభివృద్ధి సాధించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాల పునర్విభజన చేపట్టారు. ఈ నేపథ్యంలో జిల్లాలో ఉన్న వనరులతో పారిశ్రామిక అభివృద్ధిని ఆవిష్కరించేందుకు యంత్రాంగం సమాయత్తమవుతోంది. కోనసీమలో వ్యవసాయం, పర్యాటక రంగాలు ఎంతో అభివృద్ధి సాధించాయి. అలాగే చమురు, గ్యాస్ నిక్షేపాలకు కొదవ లేదు. కొబ్బరి పీచు పరిశ్రమ మధ్య, చిన్నతరహాకే పరిమితమైంది. కోనసీమ జిల్లాగా రూపాంతరం చెందడంతో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్లో ఎన్నో ఆశలు చిగురించాయి. పారిశ్రామిక ప్రగతికి శ్రీకారం చుట్టాలని మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు జిల్లా ఆవిష్కరణ దినోత్సవం రోజున ప్రకటించడాన్ని వారంతా స్వాగతిస్తున్నారు. కొబ్బరి అనుబంధ పరిశ్రమల్లో కోనసీమది మూడో స్థానం కొబ్బరి సిరులకు కేరళ తర్వాత కోనసీమ పేరే వినిపిస్తుంది. జిల్లా అయ్యాక రామచంద్రపురం, మండపేట నియోజకవర్గాల చేరికతో ఈ సీమలో కొబ్బరి విస్తీర్ణం 20 వేల ఎకరాలు పెరిగి 1.45 లక్షల ఎకరాలకు చేరుకుంది. ఈ ప్రాంతంలో కొబ్బరి ఆధారిత చిన్న, మధ్యతరహా పరిశ్రమలు 1,200 వరకూ ఉన్నాయి. వీటి ద్వారా దాదాపు 10 వేల కుటుంబాలు జీవనోపాధి పొందుతున్నాయి. కొబ్బరి అనుబంధ పరిశ్రమలతో ఉపాధి పొందుతున్న రాష్ట్రాల్లో కేరళ, తమిళనాడు మొదటి రెండు స్థానాల్లో ఉంటే, కోనసీమ మూడో స్థానంలో ఉంది. ఇక్కడి పరిశ్రమలు కేవలం పీచు, సన్నతాళ్లు, కొబ్బరి పొట్టు బ్రిక్స్ మాత్రమే తయారు చేస్తూ, దేశ, విదేశీ ఎగుమతుల ద్వారా ఏటా రూ.800 కోట్ల వ్యాపార లావాదేవీలు సాగిస్తున్నాయి. పారిశ్రామిక ప్రగతికి అడుగులు ఇలా కొబ్బరి ఆధారిత భారీ పరిశ్రమల స్థాపనకు ముందుకు వచ్చే ఔత్సాహికులకు ప్రజాప్రతినిధులు ప్రోత్సాకంగా నిలవాల్సి ఉంది. అలాగే చమురు సంస్థల్లోని హై ప్రెజర్ బావుల ద్వారా భారీ పరిశ్రమలకు గ్యాస్ సరఫరా చేస్తున్నట్టే, లో ప్రెజర్ బావుల ద్వారా గ్యాస్‌ను ఇక్కడ నెలకొల్పబోయే పరిశ్రమలకు సరఫరా చేస్తే విద్యుత్ భారాలు తగ్గుతాయి. తద్వారా ఉత్పత్తి వ్యయం తగ్గి, ఆయా సంస్థలు లాభాల్లో నడుస్తాయి. కొబ్బరి పీచు మాత్రమే కాకుండా ఈనెలు, చెక్కలు, చిప్పలు, ఆకుల నుంచి గృహోపయోగ, అలంకరణ వస్తువుల ఉత్పత్తి ద్వారా ఉపాధికి బాటలు వేయవచ్చు. కొబ్బరి పంట ద్వారా ఏటా రూ.2,300 కోట్ల టర్నోవర్ చేస్తున్న కోనసీమ కొబ్బరి ఆధారిత పరిశ్రమలను పూర్తి ప్రగతితో ముందుకు తీసుకువెళ్తే ఆ టర్నోవర్ రూ.3,500 కోట్లకు దాటుతుందని అంచనా. ఔత్సాహికులు సన్నద్ధం.. కోనసీమలో ఏదైనా సువిశాల ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ కారిడార్‌గా ప్రకటిస్తే పారిశ్రామికవేత్తలకు అనువుగా ఉంటుంది. పీచు పరిశ్రమలకు తోడు కొబ్బరి అనుబంధంగా ఉన్న అన్ని వస్తువుల తయారీకి కోనసీమలో కొన్ని భారీ పరిశ్రమల స్థాపన అత్యవసం. ఇప్పుడు జిల్లాతో సాకారమైతే మాలాంటి వారికి సంతోషమే. – రాణి శ్రీనివాసశర్మ, కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ క్వాయర్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్, ఊడిమూడి, పి.గన్నవరం మండలం -
Rayalaseema: పారిశ్రామిక ‘సీమ’
సాక్షి, అమరావతి: చౌడు భూముల్లో అభివృద్ధి వెలుగులు విరబూస్తున్నాయి. పరిశ్రమలతో కళకళలాడుతున్నాయి. కడప నగరానికి కూత వేటు దూరంలోని కొప్పర్తి ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. నాడు పది లక్షలు.. నేడు రూ.కోటిన్నర రెండేళ్ల క్రితం కొప్పర్తి కనుచూపు మేరంతా తుప్పలతో నిండిన చౌడు భూములే కనిపించేవి. ఒక్క భవనమూ లేదు. సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం రాగానే పరిస్థితి మారింది. రెండేళ్లలోనే రెండు పెద్ద పారిశ్రామిక వాడలు వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్, వైఎస్సార్ ఎలక్ట్రానిక్ మాన్యుఫాక్చరింగ్ క్లస్టర్ రూపుదిద్దుకున్నాయి. గత డిసెంబర్లో సీఎం జగన్ వీటిని ప్రారంభించి పలు పరిశ్రమలకు శంకుస్థాపన చేశారు. వివిధ పరిశ్రమల నిర్మాణంతో ఈ ప్రాంతం కళకళలాడుతోంది. ఇది మార్పునకు స్పష్టమైన సంకేతమని దేవేంద్ర సిమెంట్స్ అధినేత మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయానికి కూడా పనికిరాని ఈ భూములు ఏడాది క్రితం వరకు ఎకరా రూ.10 లక్షలు ఉండగా ఇప్పుడు మెయిన్ రోడ్డు పక్కన ఎకరం రూ.1.5 కోట్లు పలుకుతోందని తెలిపారు. వలస వెళ్లాల్సిన దుస్థితి తప్పిందని కొప్పర్తి పక్కన ఉన్న అంబాపురం వాసి కుంపటి ఓబిలేసు ఆనందంగా చెప్పాడు. భార్య భర్తకి కలిపి రోజుకు రూ.1,200 తక్కువ కాకుండా కూలి వస్తోందని తెలిపాడు. మారుతున్న సీమ రూపురేఖలు రాయలసీమలో మూడు భారీ పారిశ్రామిక పార్కులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అన్ని రకాల మౌలిక వసతులతో 36,133 ఎకరాలను పారిశ్రామిక అవసరాల కోసం అభివృద్ధి చేస్తోంది. విశాఖ–చెన్నై, హైదరాబాద్–బెంగళూరు పారిశ్రామిక కారిడార్లలో భాగంగా కొప్పర్తి నోడ్, చిత్తూరు నోడ్, ఓర్వకల్ నోడ్లను ఆసియా అభివృద్ధి బ్యాంకు, నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్ (నిక్‌డిట్) నిధులతో అభివృద్ధి చేస్తున్నారు. కొప్పర్తి నోడ్ కొప్పర్తి వద్ద 3,157 ఎకరాల్లో వైఎస్సార్ జగనన్న మెగా ఇండస్ట్రియల్ హబ్, వైఎస్ఆర్ ఈఎంసీ పార్కులను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసింది. వైఎస్ఆర్ జగనన్న ఎంఐహెచ్ ద్వారా రూ.25,000 కోట్ల పెట్టుబడులతో పాటు 75,000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. ఇప్పటికే 47 పరిశ్రమలకు 430 ఎకరాలు కేటాయించారు. రూ.1,837 కోట్ల పెట్టుబడితో ఈ పరిశ్రమలు స్థాపిస్తున్నారు. 8,941 మందికి ఉపాధి లభిస్తుంది. 801 ఎకరాల్లో వైఎస్సార్ ఈఎంసీని రూ.748.76 కోట్లతో అభివృద్ధి చేశారు. దీని ద్వారా రూ.9,000 కోట్ల పెట్టుబడులతో 25,000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. చిత్తూరు నోడ్ శ్రీకాళహస్తి వద్ద 23,538 ఎకరాల్లో ఏడీబీ నిధులతో ఈ పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేస్తున్నారు. రెండు దశల్లో రూ.1,577.21 కోట్లతో మౌలిక వసతుల పనులు వేగంగా జరుగుతున్నాయి. ఓర్వకల్లు కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద నిక్‌డిట్ నిధులతో 10,000 ఎకరాల్లో పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేస్తున్నారు. దీని ద్వారా ప్రత్యక్షంగా 62,000 మందికి, పరోక్షంగా 77,000 మందికి ఉపాధి లభిస్తుంది. ఇక్కడ రూ.37,300 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు వస్తాయని అంచనా వేస్తున్నారు. 3 ఎంఎంఎల్‌పీలు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ)తో కలిసి అనంతపురంలో భారీ మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కును ఏపీఐఐసీ అభివృద్ధి చేస్తోంది. దీంతోపాటు ఓర్వకల్లు, కొప్పర్తి వద్ద మరో రెండు మల్టీ మోడల్ లాజిస్టిక్ పార్కుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసింది. పారిశ్రామిక విప్లవం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2019 జూన్ నుంచి ఇప్పటివరకు 50కి పైగా భారీ పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించాయి. వీటి ద్వారా రూ.27,530 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 37,204 మందికి ఉపాధి లభించింది. కియా కార్ల కంపెనీ వాణిజ్యపరంగా ఉత్పత్తిని ప్రారంభించడమే కాకుండా విస్తరణ పనులు వేగంగా చేపడుతోంది. హీరో మోటోకార్ప్, టాటా స్మార్ట్‌ఫుడ్జ్, టోరే, అపోలో టైర్స్, టీహెచ్‌కే ఇండియా లాంటి పలు సంస్థలు ప్రభుత్వ సహకారంతో విజయవంతంగా ఉత్పత్తిని ప్రారంభించాయి. మరో 43 భారీ పరిశ్రమలు రాయలసీమలో పెట్టుబడులు పెడుతున్నాయి. వివిధ దశల్లో ఉన్న ఈ యూనిట్ల ద్వారా రూ. 42,421 కోట్ల పెట్టుబడితోపాటు 1,26,396 మందికి ఉపాధి లభిస్తుంది. ఇందులో ఆదిత్య బిర్లా ఫ్యాషన్, సెంచరీ ఫ్లైవుడ్స్, నీల్కమల్, పిత్తి లామినేషన్స్, రామ్‌కో సిమెంట్స్, ప్రిజిం సిమెంట్స్ , సుమిత్ ఫుట్‌వేర్, భారత్ ఎలక్ట్రానిక్స్, నాసీన్, బ్లూస్టార్, హావెల్స్ ఇండియా, ఆంబర్ ఎంటర్ప్రైజెస్, ఆల్ల్రాటెక్ సిమెంట్ వంటి సంస్థలున్నాయి. ఇదే సమయంలో రాయలసీమలో 5,923 ఎంఎంస్‌ఎంఈలు ఉత్పత్తి ప్రారంభించాయి. వీటి ద్వారా రూ.1,671 కోట్ల పెట్టుబడులతో పాటు 45,171 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తోంది. అభిప్రాయాలు రాష్ట్రమంతా అభివృద్ధి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందేలా అభివృద్ధి వికేంద్రీకరణను ప్రభుత్వం చేపట్టింది. రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాలను విశాఖ–చెన్నై, చెన్నై–బెంగళూరు, హైదరాబాద్–బెంగళూరు పారిశ్రామిక కారిడార్ల ద్వారా అభివృద్ధి చేస్తున్నాం. – జవ్వాది సుబ్రమణ్యం, వీసీఎండీ, ఏపీఐఐసీ ఏపీలో సరికొత్త నినాదం.. ‘‘రావాలి జగన్.. కావాలి జగన్.. అనే నినాదం రాష్ట్రమంతా మారుమోగింది. ఇప్పుడు ఆ నినాదం మారింది. జగన్ వచ్చారు... అభివృద్ధి తెచ్చారు’’ – కొప్పర్తిలో ఏఐఎల్ డిక్సన్ శంకుస్థాపన సందర్భంగా సంస్థ ప్రెసిడెంట్, సీవోవో పంకజ్‌శర్మ అంతకు మించి.. తొలుత రూ.600 కోట్ల పెట్టుబడి పెట్టాలనుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూసిన తర్వాత మూడు దశల్లో రూ.2,600 కోట్ల పెట్టుబడి పెడుతున్నాం. – బద్వేల్లో సెంచురీ ఫ్లైవుడ్ కంపెనీ చైర్మన్ సజ్జన్ భజాంక మరిన్ని కంపెనీలు తీసుకొస్తాం పెట్టుబడి ప్రతిపాదన అందజేసిన రెండు నెలల్లోనే భూమి పూజ చేయడం ఇక్కడి ప్రభుత్వ వ్యవస్థపై మా నమ్మకాన్ని పెంచుతోంది. మాతోపాటు ఇతర కంపెనీలను కూడా తీసుకొస్తాం. – పులివెందులలో ఆదిత్య బిర్లా ఫ్యాషన్ రిటైల్ లిమిటెడ్ ప్రకటన -
ఏపీలోని పరిశ్రమలకు ప్రోత్సాహకాలు
సాక్షి, అమరావతి: ఏపీలోని పరిశ్రమలకు ప్రోత్సాహకాలు సీఎం జగన్ రేపు(శుక్రవారం) విడుదల చేయనున్నారు. ఎంఎస్ఎమ్ఈ, స్పిన్నింగ్ మిల్లులు, టెక్స్‌టైల్‌కు ప్రోత్సాహకాలు అందజేయనున్నారు. కరోనా కష్టకాలంలో ఎంఎస్ఎమ్ఈలను ఏపీ ప్రభుత్వం ఆదుకున్న సంగతి తెలిసిందే. కాగా పరిశ్రమలకు ప్రోత్సాహకాలతో ఏపీలో పారిశ్రామికాభివృద్ది మరింత బలోపేతం కానుంది. ఇప్పటికే పరిశ్రమలకు ఏపీ ప్రభుత్వం తొలి విడత నిధులు విడుదల చేసింది. రెండో విడత నిధులను సీఎం జగన్ శుక్రవారం విడుదల చేయనున్నారు. చదవండి: ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాణ్యమైన వైద్యం అందాలి: సీఎం జగన్ -
పెట్రో కెమికల్ కారిడార్‌తో 50 లక్షల మందికి ఉపాధి అవకాశాలు..
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో పెట్రో కెమికల్ కారిడార్ ఏర్పాటుకు కేంద్రం సానుకూలంగా ఉందని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. 25వేల కోట్ల రూపాయలతో పెట్రో కెమికల్ కారిడార్ రూపొందించనున్నట్లు వెల్లడించారు. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌తో ఏపీ మంత్రి గౌతమ్‌రెడ్డి బుధవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్‌తో సుమారు 50 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు తెలిపారు.రానున్న 2, 3 ఏళ్లల్లో పెట్రో కెమికల్ రంగంలోకి భారీగా పెట్టుబడులు రాబోతున్నట్లు వెల్లడించారు. ఈస్ట్‌కోస్ట్ కారిడార్‌లో రూ.30వేల కోట్ల వరకు పెట్టుబడులు రానున్నట్లు తెలిపారు. రాబోయే రోజుల్లో ఇథనాల్ రంగంలోకి మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే అనుబంధ పరిశ్రమలు కలుపుకొని మరో 2 లక్షల కోట్ల పెట్టుబడులకు అవకాశం ఉందన్నారు. ఎట్టి పరిస్థితుల్లో పెట్రో కెమికల్ ప్రాజెక్టు పూర్తికి కేంద్రం నుంచి పూర్తి సహకారానికి అంగీకారం తెలిపేలా చేస్తామన్నారు. ఇటీవల పెట్రోల్‌లో ఇథనాల్ వినియోగం 10 శాతం నుంచి 20 శాతానికి కేంద్ర ప్రభుత్వం పెంచిందన్నారు. తద్వారా రాబోయే రోజుల్లో ఇథనాల్ రంగంలో మరిన్ని పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉంటున్నారు. రాష్ట్రంలో చక్కెర మిల్లుల నుంచి విడుదలయ్యే మొలాసిస్ నుంచి ఇథనాల్ తయారుచేయవచ్చని, చక్కెర మిల్లులు ప్రత్యేకంగా ఈ ప్లాంట్లను నెలకొల్పడానికి పెట్టుబడులు కావాలన్నారు. దేశవ్యాప్తంగా ఇథనాల్ ఉత్పత్తి పెంచే చర్యల్లో భాగంగా రూ. 1,000 కోట్లు కేంద్రం ఇవ్వనుందని తెలిపారు. ‘పెట్రో కెమికల్ కాంప్లెక్స్ గురించి ప్రాజెక్టు రిపోర్ట్ ప్రజంటేషన్ ఇవ్వడం జరిగింది. వయోబిలిటీ గ్యాప్ ఫండింగ్ పైనా కేంద్ర, రాష్ట్ర కార్యదర్శులు ప్రణాళిక సిద్ధం చేయడానికి దిశానిర్దేశం. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో చర్యలు. ఆ తర్వాత కేంద్రం ఆమోదంతో ప్రాజెక్టు పనులు మొదలు. అదే జరిగితే ప్రైవేటు పెట్టుబడులు కూడా అనేకం వస్తాయి. అభివృద్ధి, పెట్టుబడులకు సంబంధించి ఎంవోయూల గురించి చెప్పలేదు. కేవలం గ్రౌండ్ అయినవి మాత్రమే ఓపెన్‌గా ప్రకటించాం. రాష్ట్రంలో రూ. 30 వేల కోట్ల పెట్టుబడులు గ్రౌండ్ అవడమే కాకుండా, మరో రూ.16వేల కోట్లు ఎస్ఐపీసీలో క్లియర్ అయ్యాయి. ఎస్ఐపీబీ అనంతరం వీటిపై కూడా పూర్తి క్లారిటీ. కోవిడ్ విపత్తులోనూ 45,000 ఉపాధి అవకాశాలు సృష్టించడం చిన్న విషయం కాదు. ఆంధ్రప్రదేశ్‌లో గ్రౌండ్ అయిన ప్రాజెక్టుల గురించి అది కూడా 2019 నుంచి గ్రౌండ్ అయినవే చెప్పాం’. అని తెలిపారు. చదవండి: సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన లేళ్ల అప్పిరెడ్డి ఏపీ: గ్రూప్-1 ఇంటర్వ్యూలపై హైకోర్టు స్టే -
బడ్జెట్: తెలంగాణ రాష్ట్ర ప్రస్తావనేది..!
ఆశలు అడియాసలయ్యాయి. సాగునీటి ప్రాజెక్టుకు జాతీయహోదా లేదు. విభజన హామీల ఊసులేదు. రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఉనికిలేదు. పన్నుల వాటా, జీఎస్టీ పరిహారం చెల్లింపులో ఊరట లేదు. పురపాలికలు, పరిశ్రమలకు ప్రోత్సాహకాల జాడలేదు. మెట్రోరైలుకు మళ్లీ మొండిచేయి. స్పష్టంగా చెప్పాలంటే కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2021–22 వార్షిక బడ్జెట్లో రాష్ట్రానికి సంబంధించిన ఒక్క ప్రతిపాదన కూడా కనిపించలేదు. కరోనా కష్టకాలంలో రాష్ట్ర ఆర్థికవ్యవస్థ గాడిలో పడేందుకు అండగా నిలబడుతుందనుకున్నవారికి తెలుగింటి కోడలు నిర్మలాసీతారామన్ మొండిచెయ్యే చూపింది. – సాక్షి, హైదరాబాద్ రాష్ట్ర సాగునీటి రంగానికి ఈసారి కూడా కేంద్ర బడ్జెట్ నిధుల వరద పారించలేదు. కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుల్లో ఒకదానికి జాతీయ హోదా, మిషన్ కాకతీయకు ఆర్థిక సాయంపై రాష్ట్ర ప్రజల ఆశలను ఆవిరి చేసింది. కాళేశ్వరానికి జాతీ య హోదా ఇవ్వాలని సీఎం కేసీఆర్ రాసిన లేఖ లను కేంద్రం పట్టించుకోలేదు. ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే ఖర్చులో సింహభాగం అప్పు ల ద్వారానే సమకూర్చుకుంటున్నామని, ఆర్థికసాయం చేయాలని రాష్ట్రం చేసిన ప్రతిపాదనను కేంద్రం పట్టించుకోలేదు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీళ్లు అందిస్తున్నందున భగీరథ అప్పుల చెల్లింపులకు నిధులివ్వాలని, దాని నిర్వహణకు ఆర్థిక సహకారం అందించాలని సీఎం కోరినా స్పందన కరువైంది. చదవండి: (బడ్జెట్ 2021-22: ఓ లుక్కేయండి!) ఇక, నదుల అనుసంధాన ప్రక్రియకు కూడా నిధులు లేవు. అయితే, భగీరథ స్ఫూర్తితో కేంద్రం రూపొందించిన జల్‌జీవన్ మిషన్‌కు గత ఏడాది బడ్జెట్లో రూ.11,218 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది దాన్ని రూ.49,757 వేల కోట్లకు పెంచింది. పీఎంకేఎస్‌వై కింద కేటాయించిన రూ.11,588కోట్ల నుంచి కొమురంభీం, గొల్ల వాగు, ర్యాలివాగు, మత్తడివాగు, పెద్దవాగు, పాలెంవాగు, ఎస్సారెస్పీ–2, దేవాదుల, జగన్నాథ్‌పూర్, భీమా, వరద కాల్వ ప్రాజెక్టులకు రావాల్సిన రూ.200 కోట్లలో ఏమైనా విదిలిస్తారేమోనని రాష్ట్రం ఎదురుచూడాల్సి వస్తోంది. పురపాలకం.. ఇదీ వాలకం పురపాలక శాఖ పరిధిలో అమలవుతున్న పలు ప్రాజెక్టులకుగాను రూ.1,950 కోట్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా, ఒక్కరూపాయి కూడా బడ్జెట్లో కేటాయించలేదు. సీవరేజీ మాస్టర్ ప్లాన్‌కు రూ.750 కోట్లు, నాలాల అభివృద్ధికి రూ.240 కోట్లు, వరంగల్ నియో మెట్రోకు రూ.210 కోట్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులకు రూ.750 కోట్లు కావాలని అడిగినా, ఏ ఒక్క ప్రాజెక్టుకూ రూపా యి కూడా లేదు. మెట్రోరైలు ప్రాజెక్టు, జాతీయ రహదారులకు నిధులివ్వకుండా తెలుగింటి కోడలు నిరాశే మిగిల్చింది. పునర్విభజన.. ఏదీ ఆలోచన? ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం–2014 ప్రకారం రాష్ట్రాలకు రావాల్సిన ప్రాజెక్టులు, నిధుల విషయంలో కేంద్రం స్పష్టత ఇవ్వలేదు. ఆర్థిక సంఘం సిఫారసు మేరకు కేంద్ర పన్నుల్లో వాటాను తగ్గించిన కేంద్రం అదే ఆర్థిక సంఘం రాష్ట్రానికి సిఫారసు చేసిన స్పెషల్ గ్రాంటును విస్మరించింది. రూ. 730 కోట్ల స్పెషల్ గ్రాంటుతోపాటు వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి 2019 నుంచి ఇవ్వాల్సిన రూ.900 కోట్లు, నీతి ఆయోగ్ మిషన్ భగీరథకు సిఫారసు చేసిన వేల కోట్ల రూపాయల గురించి నిర్మలమ్మ పద్దులో ఒక్క సుద్ది కూడా లేదు. కేంద్ర ప్రాయోజిత పథకాల అమల్లో స్వేచ్ఛ, పింఛన్ పెంపు కింద ఆసరాల గురించి రాష్ట్రం ఆశించినా వాటి గురించి ఏమీ చెప్పలేదు. పన్నుల్లో వాటా, జీఎస్టీ పరిహారం చెల్లింపులో తనకు అనుకూలంగా మార్పులు చేసుకుంటున్న కేంద్రం రాష్ట్రాలకు ఎలాంటి వెసులుబాటు ఇవ్వలేదు. ఐటీఐఆర్‌తో పాటు బయ్యారం స్టీల్‌ఫ్యాక్టరీ, కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన వర్సిటీ ఏర్పాటు లాంటి విభజన హామీలు మళ్లీ అటకెక్కాయి. ఈ నేపథ్యంలో 2021–22గాను రాష్ట్రం రూపొందించే బడ్జెట్‌పై ప్రభావం ఉంటుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. పరిశ్రమలు.. ఆశలు అడియాశలు పారిశ్రామిక రంగ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనల్లో కనీసం ఒక్కటి కూడా కేంద్ర బడ్జెట్ లో ప్రస్తావనకు నోచుకోలేదు. హైదరాబాద్ ఫార్మాసిటీలో అంతర్గత మౌలిక సదుపాయాల కోసం కనీసం రూ.870 కోట్లు, వరంగల్ కాకతీయ టెక్స్టైల్ పార్కులో మౌలిక వసతుల కోసం కనీసం రూ.300 కోట్లు, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పరిసరాల్లో ఏర్పాటయ్యే నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్(నిమ్జ్)లో మౌలిక వసతుల కల్పనకు తొలిదశలో రూ. 500 కోట్లు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆవరణలో ఏర్పాటయ్యే నేషనల్ డిజైన్ సెంటర్‌కు రూ.200 కోట్ల ప్రాథమిక మూలధనం, ‘హైదరాబాద్– వరంగల్’ఇండస్ట్రియల్ కారిడార్‌కు రూ.3 వేల కోట్లు, ‘హైదరాబాద్– నాగపూర్’కారిడా ర్కు రూ.2 వేల కోట్లు.. ఇలా మొత్తంగా 2021–22 కేంద్ర బడ్జెట్లో రూ.5 వేల కోట్లు కేటాయించాలని మంత్రి కేటీఆర్ కేంద్రానికి రాసిన ఏ లేఖను కేంద్రం పట్టించుకున్న పాపాన పోలేదు. ఇక, రాష్ట్ర విభజనహామీల్లో కీలకమైన ఐటీఐఆర్ ప్రాజెక్టు కింద నిధులు మంజూరు చేయాలని తాజాగా కేటీఆర్ చేసిన ప్రతిపాదనను కూడా కేంద్రప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. దీంతో ఇక, ఈ ప్రాజెక్టు కోల్డ్‌స్టోరేజీలోకి నెట్టేసినట్టేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, ఎంఎస్ఎంఈ పరిశ్రమలను పునర్విచించడం, ఒకటి, రెండు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాలు రాష్ట్రంలోని పారిశ్రామిక రంగంపై కొంత మేర సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉందని పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి. రూ. 2.50 కోట్ల పెట్టుబడి ఉండే వాటిని ఎంఎస్ఎంఈలుగా గుర్తించాలన్న నిర్ణయంతో రాష్ట్రంలోని మరికొన్ని పరిశ్రమలకు ఈ జాబితా లో స్థానం లభించనుంది. పూర్తి నిరాశాజనకం కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో రైతులకు, బడుగు, బలహీన వర్గాలకు ఎలాంటి ఉపయోగం లేదని, పూర్తి నిరాశాజనకంగా ఉందని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ ఎంపీ లు, బీజేపీ నేతల అసమర్థత వల్లే రాష్ట్రం అన్యాయానికి గురైందని సోమవారం ఆయన ఒక ప్రకటనలో మండిపడ్డారు. ఎప్పటి మాదిరిగానే రైల్వే కేటాయింపుల్లో రాష్ట్రానికి మొండిచేయి చూపిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్‌కు మంజూరైన ఐటీఐఆర్ ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయకుండా కాలయాపన చేస్తోందని ఆరోపించారు. పెండింగ్‌లో ఉన్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ప్రత్యేక డివిజన్ డిమాండ్‌పై కేంద్రం ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలోని కేంద్ర సంస్థలకే నిధులు సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్లో తెలంగాణకు మళ్లీ నిరాశే ఎదురైంది. కేవలం తెలంగాణలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు మాత్రమే ఈ బడ్జెట్ పద్దుల్లో ప్రస్తావనకు వచ్చాయి. రాష్ట్రంలోని గిరిజన వర్సిటీకి రూ. 26.90 కోట్లు, ఐఐటీ హైదరాబాద్‌లో ఈఏపీ ప్రాజెక్టులకు రూ. 150 కోట్లు కేటాయించింది. జపాన్ ఆర్థికసాయంతో ఐఐటీ క్యాంపస్ అభివృద్ధికి రూ. 460.31 కోట్లు కేటాయించింది. హైదరాబాద్ అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్‌ప్లోరేషన్, రీసెర్చ్ సంస్థకు సర్వే, అణు ఖనిజాల అన్వేషణ నిమిత్తం రూ. 329.19 కోట్లు, హైదరాబాద్, మొహాలి, అహ్మాదాబాద్, గువాహటి, హజిపూర్, కోల్‌కతా, రాయ్‌బరేలి, మధురైల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ రిసెర్చ్ (నైపర్)కు రూ. 215.34 కోట్లు, హైదరాబాద్, కోల్‌కతా, గువాహటి, చెన్నైల్లోని డైరెక్టరేట్ ఆఫ్ హిందీ సంస్థలకు రూ.30 కోట్లు, హైదరాబాద్‌సహా దేశవ్యాప్తంగా ఉన్న 12 సీ–డాక్ కేంద్రాలకు రూ. 200 కోట్లు కేటాయించింది. సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్, ఐటీ (సి–మెట్)లో హైదరాబాద్‌సహా మూడు కేంద్రాలకు రూ. 80 కోట్లను ఆర్థిక మంత్రి కేటాయిం చారు. హైరరాబాద్ లోని నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డుకు రూ.23.84 కోట్లు, హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్కు రూ.124 కోట్లు, హైదరాబాద్‌లోని ఇండియన్ నేషనల్ సెంటర్‌ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (ఎన్సీఓఐఎస్)కు రూ. 24.50 కోట్లు, సింగరేణిలో పెట్టుబడులకు రూ. 2500 కోట్లు, హిందుస్థాన్ ఫ్లోరో కార్బన్ లిమిటెడ్ మూసివేత ఖర్చులకు రూ. 233.14 కోట్లు, మిథానిలో పెట్టుబడులకు రూ.1184.68 కోట్లు కేటా యించారు. తెలంగాణకు అన్యాయం జరిగింది: ఉత్తమ్ సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ తెలంగాణకు అన్యా యం చేసిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రానికి బీజేపీ వల్ల నష్టం జరుగుతోందని చెప్పేందుకు పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ నిదర్శనమన్నారు. ఢిల్లీలోని విజయ్‌చౌక్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ బడ్జెట్ ద్వారా రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదన్నారు. రాష్ట్రానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనల్లో ఒక్క అంశాన్ని కూడా ప్రస్తావించలేదని విమర్శించారు. ఆర్థిక మాం ద్యంతో ప్రజలు ఇబ్బంది పడుతున్న తరుణంలో పెట్రోల్, డీజిల్‌పై సెస్ పెంచడం దారుణమన్నారు. గత ఆరేళ్లలో రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నా వారికి మేలు చేసే చర్యలు బడ్జెట్లో ఏమాత్రం లేవన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు అయ్యిందని కేంద్ర ఆర్థిక మంత్రి చేసి న ప్రకటన పచ్చి అబద్ధమని మండిపడ్డారు. నయా క్యాపిటలిస్టులకు దోచిపెట్టే బడ్జెట్ : భట్టి సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురిచేసిందని, కొద్దిమంది నయా క్యాపిటలిస్టులకు ప్రజల సొమ్మును దోచిపెట్టే విధంగా బడ్జెట్‌ను తయారుచేశారని కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేత భట్టివిక్రమార్క విమర్శించారు. కార్పొరేట్ శక్తుల కోసమే కేంద్రం పనిచేస్తోందని ఈ బడ్జెట్ నిరూపిస్తోందని, సామాన్యులు, పేద, మధ్యతరగతి ప్రజల గురించి ఆలోచించకుండా బడ్జెట్ పెట్టారని ధ్వజమెత్తారు. సోమవారం అసెంబ్లీ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ జాతి సంపదను కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం చేసేలా బడ్జెట్ ఉందన్నారు. బయ్యారం ఫ్యాక్టరీ, కాజీపేటలో రైల్‌కోచ్ ఫ్యాక్టరీ, నీటిపారుదల ప్రాజెక్టుకు జాతీయ హోదా, గిరిజన వర్సిటీ లాంటి విభజన హామీల గురించి కనీసం ప్రస్తావించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం తెలంగాణకు ఇంత అన్యాయం చేస్తుంటే టీఆర్ఎస్, బీజేపీ ఎంపీలు నిద్రపోతున్నారా.. గాడిదలు కాస్తున్నారా అని ప్రశ్నించారు. ఇది చరిత్రాత్మక బడ్జెట్: బండి సంజయ్ సాక్షి, హైదరాబాద్: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను రాష్ట్ర బీజేపీ స్వాగతించింది. ప్రజాసంక్షేమం, ఆరోగ్యం, అభివృద్ధి ఆకాంక్షించేలా ఈ బడ్జెట్ ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దేశ ప్రజల ఆత్మవిశ్వాసాన్ని, పేద, మధ్యతరగతి జీవన ప్రమాణాలను పెంపొందించేలా ఈ బడ్జెట్ ఉందన్నారు. అదనంగా మరో కోటి మంది మహిళలకు ఉజ్వల పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల సాయంతో పాటు మరిన్ని జిల్లాల్లో ఇంటింటికీ గ్యాస్ ద్వారా మహిళల జీవితాల్లో వెలుగులు నింపేలా బడ్జెట్ ఉంద న్నారు. ఈ బడ్జెట్ ద్వారా 2021–22లో భారత ఆర్థిక ప్రగతి పరుగు పెడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. రాష్ట్రానికి మొండి చేయి చాడ వెంకట్‌రెడ్డి తెలంగాణకు బడ్జెట్లో మొండిచేయి చూపారు. దీర్ఘకాలికంగా ఉన్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఎంఎంటీఎస్ మెట్రో రైలు విస్తరణ ఊసే లేదు. కేంద్రం బరితెగించి కార్పొరేట్లకు అనుకూలంగా ప్రైవేటీకరణకు తలుపులు బార్లా తెరిచింది. ఈ ఏడాది 1.75 లక్షల కోట్ల మేర ఆస్తులను అమ్మకాల ద్వారా సమకూర్చుకోవా లని అనుకోవడం దారుణం. పెట్రోల్, డీజిల్‌పై సెస్ మోపడం దుర్మార్గం. బీమా రంగంలో విదేశీ పెట్టుబడులను 49 నుంచి 75 శాతానికి పెంచడం, మరిన్ని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకోవాలని నిర్ణయించడం దేశ భక్తులపనా? రాష్ట్రానికి నిధులు రాబట్టాలి: తమ్మినేని పేదలను మరింత పేదరికంలోకి, కార్పొరేట్లను మరింత లాభాల్లోకి నెట్టేలా ఈ బడ్జెట్ ఉంది. వ్యవసాయ చట్టాల రద్దుకు దేశ వ్యాప్తంగా ఉద్య మం జరుగుతుంటే టీఆర్ఎస్ కేంద్రానికి వత్తాసు పలికినా.. బడ్జెట్లో తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి నిధులు వచ్చేలా చూడాలి. నిత్యావసర సరుకులపై ప్రభావం చూపే పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పటికే ఆకాశాన్నంటుతుంటే మళ్లీ సెస్ విధించి పేదల బతుకులతో చెలగాటమాడుతోంది. -
స్వావలంబనతో ప్రతిష్ట పెరుగుతుంది!
న్యూఢిల్లీ: కేంద్రం ప్రకటించిన ‘ఆత్మనిర్భర్ భారత్’ విధానం దేశ శక్తి సామర్థ్యాలను పెంచేందుకు తోడ్పడుతుందని, రక్షణ రంగంలో మనం స్వావలంబన సాధిస్తే, ప్రపంచంలో భారత్ స్థాయి పెరుగుతుందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ప్రపంచశాంతి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత సుస్థిరంగా ఉండేందుకు ఇది సాయపడుతుందని పేర్కొన్నారు. రక్షణరంగ పరిశ్రమల సదస్సునుద్దేశించి గురువారం ప్రధాని ప్రసంగించారు. రక్షణ సామర్థ్యాల్లో స్వావలంబన సాధించడం ద్వారా హిందూ మహాసముద్ర ప్రాంతం రక్షణ కల్పనలో భారత్ పాత్ర పెరుగుతుందన్నారు. వ్యూహాత్మక సంబంధాలను బట్టి పలు మిత్ర దేశాలకు రక్షణ సరఫరాదారుగా కూడా మారుతుందని తెలిపారు. ‘ప్రపంచదేశాల్లో భారత్ అతిపెద్ద రక్షణ వస్తువుల దిగుమతిదారుగా ఉంది. దేశీయ ఉత్పత్తిని పెంచేందుకు గతంలో ఎలాంటి చర్యలు చేపట్టలేదు. రక్షణ పరికరాల దిగుమతులపై విధించిన నిషేధంతో దిగుమతులకు అడ్డుకట్ట పడటంతోపాటు దేశీయ పరిశ్రమ బలోపేతం అవుతుంది. నిషేధం జాబితాలో మరిన్ని వస్తువులను కూడా త్వరలో చేరుస్తాం’అని తెలిపారు. నూతన విధానంతో దేశీయ ఉత్పత్తి పెరగడంతోపాటు ప్రైవేట్ రంగం సాయంతో సాంకేతికత అభివృద్ధి చెందుతుందన్నారు. ఆటోమేటిక్ విధానంలో రక్షణ రంగంలోకి 75 శాతం ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామన్నారు. ఇది ప్రభుత్వ, ప్రైవేట్ రంగాలకు ఉభయతారకంగా పనిచేస్తుందని వివరించారు. ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో రక్షణ రంగ పరిశ్రమల కారిడార్ ఏర్పాటు దిశగా చర్యలు సాగుతున్నాయని వెల్లడించారు. వచ్చే ఐదేళ్లలో ఇందుకుగాను ప్రభుత్వం రూ.20 వేల కోట్లు వ్యయం చేస్తుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ జనరల్ బిపిన్ రావత్ మాట్లాడుతూ.. దేశీయ సాంకేతికత, సామగ్రిని ఉపయోగించుకుని యుద్ధంలో పోరాడి, విజయం సాధించడానికి మించిన సంతృప్తి మన జవాన్లకు మరేదీ లేదన్నారు. తరువాతి తరం సైనిక సంపత్తి అభివృద్ధిలో దేశీయ పరిశ్రమతో కలిసి ముందుకు సాగుతామన్నారు. -
పెట్టుబడులతో రండి..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులతో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో అద్భుతమైన పెట్టుబడి అవకాశాలు ఏర్పడనున్నాయని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు పేర్కొన్నారు. రాష్ట్రంలో జల విప్లవం కొనసాగుతుందని, తద్వారా వ్యవసాయ రంగంతో పాటు పాలు, మాంసం, చేపల ఉత్పత్తికి భవిష్యత్తులో భారీ అవకాశాలు ఏర్పడతాయని, పెద్ద మొత్తంలో ఫుడ్‌ప్రాసెసింగ్, వ్యవసాయరంగ అనుబంధ పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చే అవకాశముందన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే ఇతర రంగాల పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం విజయవంతంగా కొనసాగుతోందని, ఈ విషయంలో తెలంగాణ అగ్రభాగాన ఉందన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే వారికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని హామీనిచ్చారు. ఇన్వెస్ట్ ఇండియా ఇన్వెస్ట్మెంట్ ఫోరం ఫుడ్ ప్రాసెసింగ్ రంగంపై సోమవారం ఏర్పాటు చేసిన వెబినార్‌లో కేటీఆర్ మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి సుమారు 200 మంది వ్యవసాయ, ఫుడ్ ప్రాసెసింగ్ పెట్టుబడిదారులు దీనికి హాజరయ్యారు. రెడీ టు ఈట్, బేవరేజెస్, కాయగూరలు, పండ్లు, పౌల్ట్రీ, మాంసం ఉత్పత్తికి సంబంధించి పెట్టుబడులు పెట్టేందుకు వీరు ఆసక్తి చూపారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్‌లో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని, తద్వారా ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయడం అత్యంత సౌకర్యవంతమైన విషయమని కేటీఆర్ వారికి వివరించారు. పెట్టుబడులకు బడా సంస్థల ఆసక్తి ఇప్పటికే తెలంగాణ అనేక రంగాల్లో ప్రపంచ స్థాయి పరిశ్రమలను ఆకర్షించిందని, ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో అనేక పెద్దసంస్థలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో ప్రస్తుతం ప్రారంభించిన నూతన ప్రాజెక్టులతో భారీగా సాగునీటి వనరులు పెరుగుతాయని, తద్వారా వ్యవసాయ రంగంలో విభిన్న రకాలైన పంటలు, వ్యవసాయ ఉత్పత్తులు అందుబాటులోకి వస్తాయన్నారు. వ్యవసాయ, ఫుడ్ ప్రాసెసింగ్ ఉత్పత్తులను ఇతర ప్రాంతాలకు సులువుగా తరలించేందుకు వీలుగా రాష్ట్రం భౌగోళికంగా దేశానికి మధ్యలో ఉందన్నారు. రాష్ట్రంలో అపారంగా ప్రభుత్వ భూముల లభ్యత ఉందని, ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి ప్రత్యేకంగా పారిశ్రామికవాడలను ఏర్పాటు చేశామన్నారు. ప్రత్యేకంగా స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లను సైతం ఏర్పాటు చేయనున్నామన్నారు. రైతులను సంఘటిత పరిచే రైతుబంధు సమితులను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, ఇలాంటి కార్యక్రమాల ద్వారా వారికి అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు ప్రభుత్వానికి లేదా పరిశ్రమ వర్గాలకు సులువవుతుందన్నారు. స్థానికంగా ఉన్న పరిశ్రమలు లేదా ఇతర వర్గాలతో కలిసి వ్యాపారం నిర్వహించేందుకు కూడా ప్రభుత్వం సహకరిస్తుందని అంతర్జాతీయ పెట్టుబడిదారులకు మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. -
పరిశ్రమల సమస్యలపై డీజీపీకి టిఫ్ వినతి
సాక్షి, హైదరాబాద్: సుమారు 50 రోజుల తర్వాత పరిశ్రమలు తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య (టిఫ్) శుక్రవారం డీజీపీ మహేందర్‌రెడ్డికి విన్నవించింది. పరిశ్రమలు నడిచేందుకు వీలుగా అనుబంధ సంస్థలు, ముడి సరుకు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వివరించారు. అనుబంధ సంస్థలు, ఇతర దుకాణాలు తెరిచేందుకు చర్యలు తీసుకుంటామని డీజీపీ వారికి హామీ ఇచ్చారు. జంట నగరాల పరిధిలోని పరిశ్రమలు రాణిగంజ్ మీద ఆధారపడిన నేపథ్యంలో జీహెచ్ఎంసీతో సంప్రదిస్తామన్నారు. లాక్డౌన్ మూలంగా ఇతర జిల్లాలు, రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన కార్మికులు తిరిగి హైదరాబాద్‌కు వచ్చేందుకు పాస్‌లు జారీ చేస్తామని డీజీపీ హామీ ఇచ్చారు. పారిశ్రామిక వాడలోని స్పేర్‌పార్టులు, రిపేరింగ్ షాపులు, ఇతరత్రా ట్రాన్స్‌పోర్టు ఏజెన్సీలకు కూడా అనుమతులు మంజూరు చేస్తామన్నారు. పారిశ్రామికవాడల్లో కాకుండా ఇతర వాణిజ్య సముదాయాల్లో చిన్న చిన్న వ్యాపారాలు నడిచే శోభన కాలనీ, బాలానగర్, గీతానగర్, కుషాయిగూడ తదితర ప్రాంతాల్లో కార్యకలాపాలు కొనసాగించేందుకు డీజీపీ అంగీకరించినట్లు తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య వెల్లడించింది. డీజీపీని కలిసిన వారిలో తెలంగాణ పారిశ్రామిక వేత్తల సమాఖ్య అధ్యక్షులు కొండవీటి సుధీర్‌రెడ్డి, కార్యదర్శి మిరుపాల గోపాల్‌రావు, పారిశ్రామికవేత్త షేక్ మదర్ సాహెబ్, బల్క్ డ్రగ్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ జానీమియా, జీడిమెట్ల ఐలా చైర్మన్ సదాశివరెడ్డి తదితరులు ఉన్నారు. -
పరిశ్రమలకు ఉన్న ప్రతి సమస్య పరిష్కరిస్తున్నాం
-
పరిశ్రమలు 11,000 పెట్టుబడులు 1.73 లక్షల కోట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆర్థిక పురోగతి, అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం రూపొందించిన సులభతర వాణిజ్య, పారిశ్రామిక విధానం టీఎస్ఐపాస్(తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్, సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టమ్) ఐదేళ్లు పూర్తి చేసుకుంది. దేశంలోనే వినూత్నమైన పారిశ్రామిక విధానంగా చెబుతున్న టీఎస్ఐపాస్ ద్వారా ఐదేళ్లలో రూ.1.73 లక్షల కోట్ల పెట్టుబడులతో 11 వేలకుపైగా పరిశ్రమలు ఏర్పాటవగా 13 లక్షల మందికి ఉపాధి లభించినట్లు పరిశ్రమలశాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పరిశ్రమల అనుమతుల్లో పారదర్శక, సరళమైన, అవినీతిరహిత విధానం రూపొందిన టీఎస్ ఐపాస్‌కు 2014 నవంబర్ 27న చట్టబద్ధత కల్పించింది. జిల్లాలవారీగా వనరులను సద్వినియోగం చేసుకుంటూ పారిశ్రామిక అభివృద్ధి సాధించేందుకు 14 ప్రాధాన్యతా రంగాల్లో పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించాలని ఐపాస్‌లో లక్ష్యంగా నిర్దేశించింది. 3 కేటగిరీల్లో అవార్డులు.. నూతన పారిశ్రామిక విధానంగా పేర్కొనే టీఎస్ ఐపాస్‌కు చట్టబద్ధత కల్పించి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా పరిశ్రమలశాఖ ఆధ్వర్యంలో బుధవారం ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కె. తారక రామారావుతోపాటు మంత్రులు మహమూద్ అలీ, మల్లారెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి తదితరులు ఉత్సవాలకు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా చట్టం అమల్లో ప్రతిభ చూపిన 33 జిల్లాలను మూడు కేటగిరీలుగా వర్గీకరించి ఒక్కో కేటగిరీలో మూడేసి జిల్లాలకు బుధవారం అవార్డులు అందజేయనున్నారు. మొదటి కేటగిరీలో కరీంనగర్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, రెండో కేటగిరీలో సిద్దిపేట, కామారెడ్డి, మెదక్, మూడో కేటగిరీలో జగిత్యాల, మహబూబాబాద్, నాగర్‌కర్నూల్ జిల్లాల తరఫున ఆయా జిల్లాల కలెక్టర్లు అవార్డులు అందుకోనున్నారు. ప్రభుత్వ విభాగాల కేటగిరీలో ఉత్తర, దక్షిణ మండల విద్యుత్ పంపిణీ సంస్థలు, భూగర్భ జలవనరులు, రెవెన్యూ విభాగాలకు అవార్డులు అందించనున్నారు. టీఎస్ ఐపాస్‌ను సమర్థంగా అమలు చేయడంలో కీలకపాత్ర పోషించిన అధికారులు ఈవీ నర్సింహారెడ్డి (టీఎస్ఐఐసీ), అర్వింద్ కుమార్ (మెట్రోపాలిటన్ కమిషనర్), టీకే శ్రీదేవి (మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్), కె. విద్యాధర్ (టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్), నీతూకుమారి ప్రసాద్ (పీసీబీ సభ్య కార్యదర్శి), అహ్మద్ నదీమ్ (లేబర్, ఇండస్ట్రీస్ కమిషనర్) అవార్డులు అందుకోనున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలే ఎక్కువ ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ, ఫార్మా, విద్యుత్, ప్లాస్టిక్, ఇంజనీరింగ్, వ్యవసాయాధార, గ్రానైట్ స్టోన్ క్రషింగ్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, పేపర్, ప్రింటింగ్, టెక్స్టైల్, సిమెంట్, ఏరోస్పేస్, సోలార్, ఆటోమొబైల్ రంగాల పరిశ్రమలు టీఎస్‌ఐపాస్‌లో భాగంగా రాష్ట్రంలో ఏర్పాటయ్యాయి. ఈ విధానం వల్లే దేశీయ సంస్థలతోపాటు బహుళజాతి కంపెనీలు పెట్టుబడులతో రాష్ట్రానికి రాగా వాటిలో ఎక్కువగా ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఉన్నాయి. ఐపాస్ మూలంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ర్యాంకింగ్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం గత నాలుగేళ్లుగా జాతీయస్థాయిలో తొలి 2 స్థానాల్లో కొనసాగుతోంది. రాజధాని పరిసరాల్లోనే పారిశ్రామిక అభివృద్ధి కేంద్రీకృతం కాకుండా గ్రామాలకు విస్తరించే లక్ష్యంతో ఐపాస్‌లో భాగంగా పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేసి మౌలిక సౌకర్యాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఐపాస్ అమలుతో ఐదేళ్లలో పారిశ్రామిక పెట్టుబడుల ఆకర్షణలో 70 శాతానికిపైగా వృద్ధి సాధించినట్లు పరిశ్రమలశాఖ నివేదిక వెల్లడిస్తోంది ఐపాస్ ప్రత్యేకతలివే పారిశ్రామిక అనుమతులు పొందడాన్ని హక్కుగా చేస్తూ దరఖాస్తుదారుడు ఆన్లైన్లో వివరాలు సమర్పించేలా టీఎస్ఐపాస్ చట్టం–2014 రూపొందించారు. 27 ప్రభుత్వ విభాగాల పరిధిలో 35 అంశాలకు సంబంధించి అనుమతులు తీసుకోవాల్సి ఉండగా వాటన్నింటినీ ఐపాస్ గొడుగు కిందకు తెచ్చారు. పారిశ్రామిక అనుమతులకు 110 రకాలైన పత్రాలను సమర్పించాల్సి ఉండగా వాటి సంఖ్యను పదికి కుదించారు. దరఖాస్తు చేసిన 30 రోజుల్లోగా అనుమతి లభించని పక్షంలో అనుమతి లభించినట్లుగానే భావించాల్సి ఉంటుందనే నిబంధనకు చోటు కల్పించారు. రూ.200 కోట్లకు పైబడిన పెట్టుబడితో వచ్చే భారీ పరిశ్రమలకు అనుమతులను 15 రోజుల్లోనే ఇవ్వాలని చట్టంలో పేర్కొన్నారు. భారీ ప్రాజెక్టులకు అనుమతులిచ్చే ప్రక్రియను పర్యవేక్షించేం దుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ‘టీ స్విప్ట్’బోర్డుతోపాటు సీఎం నేతృత్వంలో ‘ఇండస్ట్రియల్ చేజింగ్ సెల్’ను ఏర్పాటు చేశారు. ఆన్లైన్లో దరఖాస్తుతోపాటు దరఖాస్తు రుసుము చెల్లింపునూ ఇదే విధానం లో చేయాలని చట్టంలో స్పష్టం చేయడంతో భారీ ఫలితాలు సాధించినట్లు పరిశ్రమల వర్గాలు వెల్లడించాయి. -
ఉందిలే కరువు నేల 'అనంత'కు మంచికాలం
పారిశ్రామిక అభివృద్ధి దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. కరువు జిల్లాలో మానవ వనరులకు కొదవ లేకపోవడం.. సాంకేతిక చేయూతకు యూనివర్సిటీలు సిద్ధంగా ఉండటం.. మెరుగైన రవాణా సౌకర్యం.. అన్నింటికీ మించి పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూమి.. వెరసి కంపెనీల ఏర్పాటుకు ‘అనంత’ సాదర స్వాగతం పలుకుతోంది. ఇందులో భాగంగా రానున్న ఐదేళ్ల కాలంలో 13వేల ఎకరాలకు పైగా భూమిని సేకరించేందుకు ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ(ఏపీఐఐసీ) ప్రణాళికను సిద్ధం చేసుకుంది. సాక్షి, అనంతపురం: జిల్లాలో కేవలం వ్యవసాయం మీదనే ఆధారపడి ప్రజానీకం జీవనం సాగిస్తున్నారు. అయితే, పొలాలకు కూడా వర్షాలే దిక్కు. ఈ నేపథ్యంలో పారిశ్రామికంగా జిల్లాను అభివృద్ధి చేస్తేనే పేదరికాన్ని పారదోలే అవకాశం ఉంటుంది. ఇదే అంశాన్ని కొద్దిరోజుల క్రితం రాష్ట్ర రాజధానితో పాటు రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సమావేశంలో కూడా జిల్లా ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. మరోవైపు పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం కూడా కొత్త పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. 2020–25 సంవత్సరాలకు నూతన పారిశ్రామిక విధానాన్ని వచ్చే ఏడాదిలోనే ప్రకటించనుంది. ఇందులో వెనుకబడిన ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధి కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకోనున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నియోజకవర్గానికో పారిశ్రామిక పార్కు ఏర్పాటు దిశగా కూడా ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ నేపథ్యంలో ఏదైనా పరిశ్రమ జిల్లాలో యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చిన వెంటనే అనువైన భూమిని చూపించేందుకు భారీ భూ బ్యాంకును సిద్ధం చేస్తుండటం విశేషం. మౌలిక సదుపాయాల్లో మేటి రాష్ట్ర విభజన తర్వాత మొత్తం 13 జిల్లాలో భారీగా భూమి లభ్యమయ్యే జిల్లాల్లో అనంత రెండో స్థానంలో ఉంది. కర్నూలులో ఇప్పటికే 30వేల ఎకరాల భూమి సిద్ధంగా ఉంది. ఆ తర్వాత ఎక్కువ భూమి లభించే ప్రాంతం అనంతనే. అందువల్ల ఏదైనా పరిశ్రమ నెలకొల్పేందుకు ముందుకు వస్తే.. అవసరమైన భూమిని చూపించేందుకు ఈ భూ బ్యాంకు దోహదపడనుంది. ఇక పరిశ్రమలకు అవసరమయ్యే విద్యుత్‌తో పాటు బెంగళూరు విమానాశ్రయం కేవలం 200 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. కొత్తగా అనంతపురం నుంచి అమరావతికి రహదారి నిర్మాణం జరగనుంది. తద్వారా రాష్ట్ర రాజధానికి కూడా కనెక్టివిటీ ఏర్పడనుంది. పుట్టపర్తి విమానాశ్రయాన్ని కూడా ప్రభుత్వం తీసుకోవాలనే యోచనలో ఉంది. తద్వారా ఆయా కంపెనీల ఉద్యోగుల రాకపోకలకు మరింత అనువుగా ఉండనుంది. ఇప్పటికే హిందూపురంలో అనేక పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. ఇక మానవ వనరులు జిల్లాలో పుష్కలంగా ఉన్నాయి. యూనివర్సిటీలు కూడా ఉన్న నేపథ్యంలో సాంకేతిక నిపుణుల కొరత కూడా ఇబ్బంది కూడా లేదు. మొత్తమ్మీద జిల్లాలో పారిశ్రామిక ప్రగతికి అనువైన మౌలిక సదుపాయాలున్న నేపథ్యంలో భూమిని కూడా సిద్ధం చేయడం ద్వారా యువతకు మరింత ఉపాధి లభించే అవకాశం ఏర్పడనుంది. జిల్లాలో ఎలక్ట్రిక్ బస్సుల తయారీ యూనిట్ జిల్లాలో ఎలక్ట్రిక్ బస్సుల తయారీ యూనిట్ ఏర్పాటు కానుంది. సుమారు 120 ఎకరాల విస్తీర్ణంలో వీరా వాహన ఉద్యోగ్ లిమిటెడ్ కంపెనీ రూ.వెయ్యి కోట్ల పెట్టుబడితో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. యూనిట్ ద్వారా ఏడాదికి 3వేల బస్సులు జిల్లాలో తయారు కానున్నాయి. ఇందుకు అనుగుణంగా సదరు సంస్థకు ఏపీఐఐసీ ద్వారా 120 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం భూ బ్యాంకును సిద్ధం చేస్తున్న తరుణంలో ఓ కంపెనీ తమ యూనిట్ ఏర్పాటుకు ముందుకు రావడం శుభపరిణామం. ఏడాదిలో భూసేకరణ లక్ష్యం మండలం భూ విస్తీర్ణం (ఎ‘‘ల్లో) కనగానపల్లి 3606.26 ధర్మవరం 533.52 కళ్యాణదుర్గం 106.07 గుంతకల్లు 103.97 అనంతపురం 33.38 కదిరి 93.11 ఉరవకొండ 26.21 మడకశిర 1648.82 పెనుకొండ 21.17 పుట్టపర్తి 522.39 -
నూతన పథకానికి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, ఒంగోలు టూటౌన్: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిశ్రమల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు చేయూతనిచ్చేందుకు కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. ప్రకటించిన కొత్త పథకానికి నవోదయం అనే పేరు కూడా పెట్టారు. రాష్ట్రంలో మూడేళ్లుగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహ పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) ఆదుకోవాలనేది ఈ పథకం ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగానే శుక్రవారం అసెంబ్లీలో ఈ కొత్త పథకానికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలను ప్రభుత్వం సుమారుగా 86 వేల వరకు గుర్తించింది. రూ.4వేల కోట్ల రుణాలు వన్ టైం రీస్ట్రక్చర్ చేయడానికి కేబినేట్ ఆమోదం తెలపడంపై సూక్ష్మ, చిన్న తరహ పరిశ్రమల యజమానుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం వల్ల ఏ ఒక్క చిన్న పరిశ్రమ ఎన్పీఏలుగా మారకుండా, ఖాతాలు స్తంభించకుండా ఉండే అవకాశం ఉంది. ప్రభుత్వం నిర్ణయంతో ఎంఎస్ఎంఈలకు మరింత రుణం, తక్షణ పెట్టుబడికి అవకాశం కల్పించే చర్యలు చేపట్టనుంది. ఈ పథకాన్ని వినియోగించుకునేందుకు తొమ్మిది నెలల వ్యవధిని ఏపీ కేబినేట్ కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. సంక్షోభం నుంచి పురోగమనం దిశగా.. జిల్లాలో 71 భారీ, మధ్య తరహా పరిశ్రమలు ఉండగా.. 335 సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో గ్రానైట్, ఆక్వారంగంతో పాటు ఇటుకల పరిశ్రమలు, సిమెంట్ ప్లైయాష్ బ్రిక్స్, బీరువాల తయారీ, విస్తరాకుల తయారీ, పచ్చళ్ల తయారీ, పాడి పరిశ్రమ, కేబుల్ నెట్వర్క్, మంచినీటి వ్యాపారం, ప్లాస్టిక్ బాటిల్స్ తయారీ, ప్రింటింగ్ రంగం, టైలరింగ్, జనపనార సంచుల తయారీ వంటి ఎన్నో సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు ఉన్నాయి. వీటిలో అత్యధిక శాతం చిన్న పరిశ్రమలు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నాయి. ఎక్కువ పరిశ్రమలకు ప్రోత్సాహం లేక చాలా వరకు మూతపడినవి కూడా ఉన్నాయి. ఇలా మూతపడిన పరిశ్రమలలో 30 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వారే ఉండటం గమనార్హం. గత మూడేళ్లుగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు 40 శాతం వరకు జిల్లాలో ఉన్నాయి. వీటిలో అర్హత కలిగిన సూక్ష్మ, చిన్న తర హా పరిశ్రమలను ఆర్థిక చేయూత కల్పించి తిరిగి జీవం పోసేందుకు సర్కార్ శ్రీకారం చుట్టడంపై పరిశ్రమల వర్గాల్లో సర్వాత్ర హర్షం వ్యక్తమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై డిక్కి ప్రతినిధులు వి. భక్తవత్సలం, హరిప్రసాద్, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు సీఎం నిర్ణయంపై కృతజ్ఞతలు తెలిపారు. దీనికి తోడు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో చిన్న పరిశ్రమలకు ఊరటనిస్తూ నిర్ణయం తీసుకోవడంపై ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు సర్వాత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. చిన్న పరిశ్రమలకు కోటిరూపాయల వరకు రుణం మంజూరుకు అవకాశం కల్పించే ప్రకటన చేయడం కూడా ఊరట కలిగించిందని తెలిపారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాల వల్ల రానున్న ఐదేళ్లలో చిన్న పరిశ్రమలు ఊపందుకునే అవకాశం ఉందని తెలిపారు. ఫలితంగా మరికొంత మంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాల కలగుతాయని తెలిపారు. ఎస్సీ 200 యూనిట్ల ఉచిత విద్యుత్.. చిన్న పరిశ్రమలకు చేయూతతో పాటు ఎస్సీ,ఎస్టీలకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు కేబినేట్ ఆమోదం తెలిపింది. 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ సరఫరా చేసేందుకు నిర్ణయంతీసుకుంది. దీంతోరాష్ట్రంలో 15,62,684 మంది ఎస్సీలకు లబ్ధి కలగనుంది. జిల్లాలో 7,30,412 మంది ఎస్సీలకు ప్రయోజనం కలగనుంది. ఈ పథకానికి రూ.411 కోట్లు ఖర్చు చేయనుంది. ఉచిత విద్యుత్ గతంలో కేవలం 100 యూనిట్ల వరకే ఉండేది. ఆ తరువాత సార్వత్రిక ఎన్నికలకు ముందు టీడీపీ ప్రభుత్వం మరో 20 యూనిట్లను అదనంగా పెంచింది. ఇదే సమయంలో జగన్ ఎన్నికల ప్రచారంలో ఎస్సీలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తామని ప్రకటించారు. ఆ ప్రకారం శుక్రవారం జరిగిన కేబినేట్ సమావేశంలో ఆమోద ముద్ర వేశారు. దీనిపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. -
పరిశ్రమల అభివృద్ధికి వసతుల కల్పన
రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి నారాయణ నెల్లూరు(రెవెన్యూ) : జిల్లాలో పరిశ్రమల అభివృద్ధికి పూర్తి స్థాయిలో వసతులు కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందని రాష్ట్ర పురపాల శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. నూతన జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఇండస్ట్రీస్‌పై పారిశ్రామికవేత్తలతో శనివారం నిర్వహించిన వర్క్‌షాపులో మంత్రి మాట్లాడారు. పరిశ్రమలు అభివృద్ధి చెందితే యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. జిల్లాలో పరిశ్రమల స్థాపనకు అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. సింగపూర్, జపాన్ దేశాలకు చెందిన పారిశ్రామికవేత్తలు జిల్లాలో పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వస్తున్నారన్నారు. దగదర్తిలో ఎయిర్‌పోర్టు నిర్మాణం త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఏపీఐఐసీ చైర్మన్ కృష్ణయ్య మాట్లాడుతూ శ్రీహరికోటను అనుసంధానం చేసుకుని పరిశ్రమలు వృద్ధి చేస్తామని తెలిపారు. జాయింట్ కలెక్టర్ ఏఎండీ. ఇంతియాజ్, కృష్ణపట్నంపోర్టు సీఈవో అనిల్‌కుమార్, నగర మేయర్ అజీజ్, మాజీ ఎమ్మెల్యే బీదా మస్తాన్‌రావు తదితరులు పాల్గొన్నారు. ఆర్అండ్బీ గెస్ట్‌హౌస్ ప్రారంభం నెల్లూరు(రెవెన్యూ) :కృష్ణపట్నం పోర్టు సీఎస్ఆర్ నిధులతో ఆధునికీకరించిన ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్‌ను రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ శనివారం ప్రారంభించారు. రూ.32 లక్షలతో మహాకవి తిక్కన పార్క్ అభివృద్ధికి మంత్రి, శంకుస్థాపన చేశారు. నారాయణ మాట్లాడుతూ కృష్ణపట్నం పోర్టు సీఎస్ఆర్ నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుందన్నారు. రూ.58 లక్షల ఖర్చుతో ఆర్ అండ్ బీ గెస్ట్‌హౌస్ ఆధునికీకరించారని చెప్పారు. రూ 1.10 కోట్లతో బోర్లు వేసేందుకు రెండు వాహనాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అభివృద్ధి పనులకు కృష్ణపట్నం పోర్టు రూ.2 కోట్ల నిధులు ఖర్చు చేస్తుందని తెలిపారు. నెల్లూరు ఎంపీ మేకపాటీ రాజమోహన్‌రెడ్డి, సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్, కలెక్టర్ ఎం జానకి, జాయింట్ కలెక్టర్ ఏఎండీ. ఇంతియాజ్, పోర్టు సీఈవో అనిల్‌కుమార్,బలరామిరెడ్డి పాల్గొన్నారు. -
‘పరిశ్రమ’తో నవ నిర్మాణం
నవ తెలంగాణ: ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలంటే... ముందు చూపుగల రాజకీయ నాయకత్వం, ఆర్థిక లక్ష్యాలు, భౌగోళిక పరిస్థితి అవసరం. తెలంగాణ నవ నిర్మాణం ఈ మూడింటిపైనే ఆధారపడి ఉంది. తెలంగాణలో ప్యూడల్ వ్యవస్థ వేళ్లూనికొని పోవడంతో ఇక్కడ పాఠశాలల ఏర్పాటు జరగలేదు. గ్రామీణ జీవితమంతా భూస్వామ్య వ్యవస్థలోనే ఉండేది. తెలంగాణలోని ప్రస్తుత రాజకీయ నాయకత్వం అంతా భూస్వామ్య భావజాలం ఉన్నవారే. ఆ ఊళ్లల్లో ఉండే సమాజమే ఆ నాయకత్వ లక్ష్యం. ప్యూడల్ రాజకీయాల్లో వారసత్వం, అసమానతలు, కులవ్యవస్థ, అంటరానితనం ప్రధానంగా ఉంటాయి. పేరుకు ప్రజాస్వామ్యమే కానీ ప్యూడల్ వ్యవస్థ నిర్మాణమే ఉందిక్కడ. సంజీవరెడ్డి ముఖ్యమంత్రి ఉండగా హైదరాబాద్‌లో ఐఐటీ నెలకొల్పేందుకు జర్మనీ వాళ్లు ముందుకు వచ్చారు. సంజీవరెడ్డి ఐఐటీ తమకొద్దని జవహర్లాల్ నెహ్రూకు చెప్పొచ్చాడు. మనం తిరస్కరించిన ఐఐటీని మద్రాసుకు ఎగురేసుకుపోయారు అప్పటి రాజగోపాలాచారి. ఇలా ప్యూడల్ వ్యవస్థ పునాదుల మీద వ చ్చిన నాయకత్వం పూర్తిగా గ్రామీణ వ్యవస్థ మీద ఆధారపడి ఉంటుంది. సంపద సరైన పంపిణీ... సంపదను సృష్టించడం ప్రధానం కాదు. ఆ సంపదను పంపిణీ చేసే పద్దతి తెలియాలి. ప్రస్తుతం ఆ సంపదలో 80 శాతం ధనికుల చేతుల్లోనే ఉండిపోయింది. రియల్ ఎస్టేట్ వచ్చి పేదలకు భూమి లేకుండా చేసింది. పోలవరం ద్వారా రాబోయే సంపద ఎవరి నుంచి వచ్చింది? దానికోసం భూములిచ్చిన గిరిజనుల నుంచే వచ్చింది. మరి వారికి ఆ పోలవరం నుంచి వచ్చే సంపద ఉపయోగపడుతుందా? లేనే లేదు. మరి ఆ సంపద సృష్టి ఎవరికోసం? ఆంధ్రప్రదేశ్ నాయకత్వం ప్రజల నాడిని గుర్తించకపోవడం వల్లే తెలంగాణ ఉద్యమం వచ్చింది. తెలంగాణ ప్రజలు సామాజిక మార్పు కోసం పోరాడారు. వివక్షకు వ్యతిరేకంగా పోరాడారు. ఈ నేపథ్యంలో తెలంగాణ నవ నిర్మాణంపై విస్తృతస్థాయిలో చర్చ జరగాలి. పారిశ్రామికీకరణే కీలకం తెలంగాణలో 80 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు. ఈ సంఖ్యను 50 శాతానికి తగ్గించాలి. ఎందుకంటే మనకు నీటి వనరులు తక్కువ. ఎత్తు భూములు కాబట్టి ప్రాజెక్టులు నిర్మించలేం. ఎత్తిపోతలు ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ అవుతుంది. కాబట్టి మన వ్యవ సాయం కేవలం 50 శాతం మందికే జీవనాన్ని ఇవ్వగలదు. మిగిలిన 30 శాతం మందిని కూడా ఇతర రంగాలకు మళ్లించాలి. వారికి ప్రత్యామ్నాయం చూపించకుండా వ్యవసాయం నుంచి బయటకు రప్పించలేం. అలాంటి ప్రత్యామ్నాయ విధానాలను తీసుకొచ్చే ముందుచూపు నాయకత్వమే అవసరం. తెలంగాణ ప్రాంతం పరిశ్రమలకు అనుకూలంగా ఉంటుంది. కరీంనగర్ చుట్టూ గ్రానైట్స్ గనులు ఉన్నాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో బొగ్గు గనులు విస్తారంగా ఉన్నాయి. బొగ్గుతో విద్యుత్ ఉత్పత్తి పెంచవచ్చు. పరిశ్రమలకు ఇది ఎంతో అనువైన ప్రాంతం. అణుశక్తికి ఉపయోగించే యురేనియం నిల్వలు ఆదిలాబాద్‌లో లభ్యమవుతున్నాయి. దాంతో యురేనియాన్ని ఉత్పత్తి చేసి అంతర్జాతీయ మార్కెట్లో విక్ర యించవచ్చు. తెలంగాణ ప్రాంత అభివృద్ధికి శాస్త్ర సాంకేతికత ప్రధానమైంది. విద్యుత్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేయాలి. థర్మల్, సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేయాలి. విద్యా వైద్యంపై కేంద్రీకరణ విద్యారంగంపై దృష్టి పెట్టకపోతే ఎక్కడా అభివృద్ధి జరగదు. విద్యారంగాన్ని ప్రభుత్వమే నిర్వహించాలి. తెలంగాణలో కార్పొరేట్ విద్యా వ్యవస్థను రద్దు చేయాలి. అందరికే ఒకే రకమైన విద్యను అందజేయాలి. గ్రామాల్లోని పాఠశాలల్లో నాణ్యమైన విద్యను అందించాలి. ఈ ప్రయోగాన్ని క్యూబా, బ్రెజిల్ వంటి దేశాల్లో అమలు చేశారు. క్యూబాలో విద్య కోసం ఖర్చు చేశారు. ప్రాథమిక, ఉన్నత విద్యారంగాన్ని అభివృద్ధి చేశారు. దీంతో ఆ దేశాల్లో విస్తృతంగా అభివృద్ధి జరిగింది. క్యూబా డాక్టర్లను వివిధ దేశాలకు సరఫరా చేయగలిగే స్థితికి చేరుకుంది. స్విట్జర్లాండ్ పక్కనే ఉన్న దేశం ఫిన్లాండ్. ఆ దేశం అమెరికాతో పోటీపడి సమానంగా స్థూల జాతీయ ఉత్పత్తి (జీడీపీ) సాధించింది. కానీ ఆ దేశానికి ఉన్న వనరులు చాలా తక్కువ. ఇండోనేషియా నుంచి మంచినీళ్లు, కంబోడియా నుంచి బియ్యం దిగుమతి చేసుకుంటుంది. కేవలం నౌకాయానం ద్వారా వచ్చే పన్నుల ద్వారానే ఆ దేశానికి ఆదాయం వస్తుంది. దాంతోనే ప్రాథమిక విద్యను అభివృద్ధి చేశారు. చిన్న రాష్ట్రాలు అభివృద్ధి కావాలంటే టెక్నాలజీ పెరగాలి. టెక్నాలజీ పెరగాలంటే విద్య మీద కేంద్రీకరించాలి. ఎక్కడైతే తల్లులు పౌష్టికాహారం తింటారో అక్కడ మేధావులు పుడ్తారు. మెదడు తల్లి గర్భంలోనే పుడుతుంది. క్యూబాలో గర్భిణుల మీద దృష్టి పెట్టారు. తెలంగాణ అభివృద్ధి చెందాలంటే అందరికీ అందుబాటులో వైద్య సౌకర్యాలు ఉండాలి. పౌష్టికాహారం గ్యారంటీ చేయాలి. వీటిమీద అవగాహన ఉన్న నాయకత్వం తెలంగాణను పరిపాలించాలి. అసమానతలు, కులవ్యవస్థకు మూలమైన ఫ్యూడల్ వ్యవస్థ అంతరించి రాజకీయ, ఆర్థిక, విద్యా రంగాల్లో సమూల మార్పులు రావాలని, అప్పుడే తెలంగాణ పునర్వికాసం సాధ్యమని మాజీ ఎమ్మెల్సీ చుక్కారామయ్య అభిప్రాయపడుతున్నారు... - మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్య అంతరంగం