ఇటీవలి సంవత్సరాలలో ఒక వైపరీత్యం కనిపిస్తున్నది. భారతదేశం రోజురోజుకీ ధనిక దేశంగా మారుతున్నది. కానీ అదే దామాషాలో ఉపాధి అవకాశాలు పెరగడం లేదు. జాతీయాదాయం పెరిగితే, ఉద్యోగ అవకాశాలు కూడా అదే స్థాయిలో పెరుగుతాయని భావిస్తాం. కానీ అలా జరగడం లేదు. కోట్లాది మంది యువకులు నిరుద్యోగులుగా రోడ్ల మీదే ఉన్నారు. అందుకే వందల ఉద్యోగాలు ఉంటే, వాటికోసం లక్షల మంది పరీక్షలు రాస్తున్నారు. దీనికి కారణం – వేగంగా పెరిగిన యాంత్రీకరణ. దినదినాభివృద్ధి చెందుతున్న యాంత్రీకరణ, సాంకేతికత మనకు తెలియకుండానే మనుషుల్ని మింగేస్తున్నది. మనుషులతో మనుషుల కోసం అభివృద్ధి కాకుండా, పెట్టుబడిదారుల కోసం యంత్రాలతో అభివృద్ధి సాగుతున్నది.
‘‘ఉద్యోగ, ఉపాధి కల్పన, అసమానతల తొలగింపు మీద భారత ప్రభుత్వం దృష్టి సారించాలి. సామాజిక, ఉద్యోగ భద్రత గురించిన విధానాలను పటిష్ఠ పరచాలి. నైపుణ్యంతో కూడిన ఉత్పాదక పురోగతిని సాధించాలి. కోవిడ్‌తో ఏర్పడిన ఇంకా అనేక పరిణామాలను దృష్టిలో పెట్టుకొని ఈ విషయాలను మరింత లోతుగా ఆలోచించాలి.’’ అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌ఓ) డైరెక్టర్ జనరల్ గిల్బర్ట్ హంగ్‌బో సున్నితంగా చేసిన హెచ్చరిక ఇది.
ఇటీవలి సంవత్సరాలలో ఒక వైపరీత్యం కనిపిస్తున్నది. భారత దేశం రోజురోజుకీ ధనిక దేశంగా మారుతున్నది. స్థూల జాతీయా దాయం, తలసరి ఆదాయాలు పెరుగుతున్నాయి. కానీ అదే దామా షాలో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు పెరగడం లేదు. పైగా తగ్గు తున్నాయి. భారత్‌లో ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయనీ, నిరుపేద, అణగారిన వర్గాల ప్రజలు రోజు రోజుకీ ఆర్థిక ఇబ్బందు లకు గురవుతున్నారనీ ఐఎల్‌ఓ డైరెక్టర్ జనరల్ గిల్బర్ట్ హంగ్‌బో చెప్పిన మాటలు అక్షర సత్యాలు.
స్థూల జాతీయాదాయం, అంటే మన దేశంలో పోగవుతున్న సంపదలో తగ్గుదల లేదు. ఏడాదికేడాది ఆ పెరుగుదల కనిపిస్తూనే ఉన్నది. అదే సమయంలో నిరుద్యోగం కూడా ఆకాశాన్నంటుతున్నది. భారతదేశ ఆర్థికాభివృద్ధిలో చాలా హెచ్చుతగ్గులు ఉన్నాయి. 1991కి ముందు ప్రభుత్వం అనుసరించిన విధానాలను తిరస్కరించి, ఆర్థిక వ్యవస్థను సరళీకృతం చేశారు. సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకర ణల ద్వారా ఆర్థిక వ్యవస్థను ప్రైవేట్ వ్యక్తులకు, కంపెనీలకు అందు బాటులోకి తెచ్చారు. దాని తరువాత భారత స్థూల జాతీయాదా యాలు పెరిగినట్టు లెక్కలు చెబుతున్నాయి. 1960–70 దశకంలో జీడీపీ వృద్ధి రేటు 3–5 శాతం మాత్రమే ఉండింది. అయితే నిరుద్యో గితా రేటు 5 శాతానికి మించలేదు.
జీడీపీ వృద్ధి రేటు, నిరుద్యోగితా రేటును పోల్చి చూస్తే మన ఆర్థిక వ్యవస్థ పనితీరు అర్థం కాగలదు. 1999లో జీడీపీ వృద్ధిరేటు 8.85 ఉంటే, నిరుద్యోగితా రేటు 5.74 ఉండింది. 2003లో జీడీపీ వృద్ధి రేటు 7.5 ఉంటే, నిరుద్యోగితా రేటు 5.64 ఉండింది. 2021లో జీడీపీ వృద్ధిరేటును 8.95 గా గుర్తించారు. అయితే నిరుద్యోగితా రేటు కూడా అదే స్థాయిలో పెరిగింది. 2021లో ఇది 8.7 శాతంగా నమోదైంది. నిజానికి ఉత్పాదకత పెరిగి, జాతీయాదాయం పెరిగితే, ఉద్యోగ అవ కాశాలు కూడా అదే స్థాయిలో పెరుగుతాయని భావిస్తాం. కానీ అలా జరగలేదు. దీనికి కారణం ఏమిటనే ప్రశ్న మనలాంటి సామాన్యులకు రావడం సహజం.
దీనికి ప్రధానమైన ఒక కారణం, ప్రైవేట్ రంగం విస్తృతంగా జడలు విప్పడం. ఒక్కొక్కటిగా ప్రభుత్వ రంగాలను కబళిస్తూ వస్తోన్న ప్రైవేటు వ్యవస్థ సమాజం లోతుల నుంచీ సహజత్వాన్నీ, సామాజిక తత్వాన్నీ, సమైక్యతా నాదాన్నీ పెకిలిస్తూ వస్తున్నది. ఎవరైనా ఒక పెట్టుబడిదారుడు తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఉత్పత్తి చేయాలను కోవడవం సహజం. ఇక్కడ మనిషి, కార్మికుడు కేవలం ఒక సరుకు లాంటివాడు. ఎక్కువ మందిని ఒక పరిశ్రమలో పెట్టుకొని తక్కువ ఉత్పత్తి జరుగుతుంటే అతడు దానిని కొనసాగించడు. మనిషి కేంద్రంగా అభివృద్ధి, ఉత్పత్తి అనే మాటలు వ్యాపారికి అనవసరం. ఏదైనా యాంత్రిక, సాంకేతిక పరిజ్ఞానంతో అత్యధిక అభివృద్ధి సాధించే అవకాశం ఉంటే కార్మికులను నిర్దాక్షిణ్యంగా తొలగించడం లేదంటే, అదనంగా తీసుకోకపోవడం రివాజు. ఇదే కారణం వల్ల కార్మికులు, ఉద్యోగుల అవసరం లేకుండా పోతోంది.
ఇప్పుడు ప్రైవేటు రంగంలోనే కాదు, ప్రభుత్వ రంగ సంస్థల్లో, చివరకు ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా సిబ్బంది నియామకాలు తగ్గుతూ వస్తుండడానికి ఇదే కారణం. 2000 సంవత్సరం తరువాత పెరిగిన యాంత్రీకరణ, సాంకేతిక పరిజ్ఞానం మనిషి అవసరాన్ని తోసిరాజంటున్నాయి. ఇంకొక విషయం ఏమిటంటే, సాంకేతిక పరిజ్ఞానం నిరంతరం మారుతూనే›ఉంటుంది. ఈ రోజు వందమంది చేసే పనిని ఒక్కరు చేయగలిగితే, మరో సంవత్సరానికి వేయిమంది చేసే పనిని ఒక్కరే చేయగలుగుతున్నారు. అంటే ఆ స్థాయిలో ఉద్యో గుల, కార్మికుల అవసరం ఉత్పాదకతలో తగ్గిపోతున్నట్టు అర్థం చేసుకోవాలి. ఇది సమాజ మనుగడకు అత్యంత ప్రమాదకరం.
మనం నిత్యం చూస్తున్న వ్యవసాయం, నిర్మాణ రంగాలు దీనికి ప్రత్యక్ష ఉదాహరణలు. ఉదాహరణకు వరి పంటలో గతంలో అడు గడుగునా కూలీల శ్రమ అవసరమయ్యేది. ఈ రోజు దున్నడం కోసం ట్రాక్టర్లు, కోతకు మిషన్లు వచ్చాయి. చివరకు ఆడవాళ్లకు ఏకైక ఉపాధినిచ్చే నాట్లు, కలుపులు తీయడానికి కూడా చిన్న చిన్న మిషన్లు వచ్చాయి. అవి ఇంకా పూర్తి స్థాయిలో రావాల్సి ఉంది. కానీ ఇప్పటికే వరి పంటలో 70 శాతం వరకు కూలీల ప్రమేయం తగ్గింది. మిగతా 30 శాతం త్వరలో కనుమరుగు కానున్నది. అదేవిధంగా ప్రాజెక్టులు, భవన నిర్మాణ రంగంలో వచ్చిన యాంత్రీకరణతో ప్రాజెక్టులు అత్యంత వేగంగా పూర్తి అవుతున్నాయి. కానీ మనుషుల, కార్మికుల ప్రమేయం లేని అభివృద్ధి కనపడుతున్నది. తక్కువ మందికి ఎక్కువ నైపుణ్యం అందించే ఒక ప్రయత్నం సాగుతున్నది. అందుకే సాంకేతిక, నైపుణ్యాల విద్యలు ఈ దేశంలో కొద్దిమందికే అందుబాటులో ఉన్నాయి.
విద్యావ్యవస్థలో సాంకేతిక తను, నైపుణ్యాల శిక్షణలను అన్ని వర్గాల విద్యార్థులకు అందించాలని ప్రభుత్వం అనుకోవడం లేదు. దీనిలో ఈ దేశంలోని సామాజిక, ఆర్థిక అసమానతలు మళ్ళీ ప్రస్ఫుటంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం పరి శ్రమలకు, సేవారంగాలకు, వ్యవసాయరంగాలకు అవసరమైన సాంకే తిక విద్యను ప్రభుత్వ ఆధీనంలోని విద్యాసంస్థలు అందించడం లేదు. ఒకవేళ ఉన్నా వాటి సంఖ్య చాలా తక్కువ. వృత్తి నైపుణ్య విద్య, సాంకే తిక విద్యల కోసం ప్రత్యేక కోర్సులు ప్రవేశపెట్టి, వాటిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు రిజర్వేషన్లు లేకుండా చేస్తున్నారు. ఒకవేళ ఎవరైనా అందులో చేరాలనుకుంటే, వాటికి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇది కొన్ని వర్గాలకు ప్రస్తుత ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందు కోవడం అసాధ్యంగా మారుస్తున్నది. అందుకే ఐఎల్‌ఓ డైరెక్టర్ జనరల్ గిల్బర్ట్ హంగ్‌బో ఈ దేశంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో అణగారిన వర్గాలకు తగిన ప్రాతినిధ్యం ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. దేశం ఆర్థికాభివృద్ధిలో దూసుకు పోతుంటే, కోట్లాది మంది భారతీయ యువకులు నిరుద్యోగులుగా రోడ్ల మీదే ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే ఉద్యోగ పరీక్షల్లో వందల ఉద్యో గాలుంటే, లక్షల మంది ఆ పరీక్షలు రాస్తున్నారు.
అంతిమంగా ఒక విషయం చెప్పాలని ఉంది. ప్రజల ఓట్లతో గెలిచి, ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వాలు చాలా ముఖ్య మైన విషయాన్ని మర్చిపోతున్నాయి. లేదా మర్చిపోతున్నట్టు నటిస్తు న్నాయి. మానవ సమాజం మొదటి నుంచి శ్రమ ద్వారానే అభివృద్ధి చెందుతూ వచ్చింది. అది మేథోశ్రమ కావచ్చు, శారీరక శ్రమ కావచ్చు. ఇప్పుడు నూటికి 70 శాతం మంది నిరుద్యోగంలో గానీ, అర్ధ నిరు ద్యోగంలో గానీ జీవిస్తున్నారు. ఎవ్వరూ సంతృప్తికరంగా లేరు. దిన దినాభివృద్ధి చెందుతున్న యాంత్రీకరణ, సాంకేతికత మనకు తెలియ కుండానే మనుషుల్ని మింగేస్తున్నది. మనుషులతో మనుషుల కోసం అభివృద్ధి కాకుండా, పెట్టుబడిదారుల కోసం యంత్రాలతో అభివృద్ధి సాగుతున్నది. ఇప్పటికైనా ఈ దేశంలోని యువత తమ భవిష్యత్ గురించి ఆలోచించుకోవాలి. ప్రభుత్వాలు అనుసరిస్తున్న వైఖరిపై తమ గళాన్ని విప్పాలి. లేదంటే ఇక్కడ మనుషులకు బదులుగా సాంకేతిక వస్తువులు మాత్రమే మిగులుతాయి. అంతిమంగా మనిషి నిర్జీవంగా మారిపోతాడు. అసలు మనిషన్నవాడే మాయమైపోతాడు.
మల్లెపల్లి లక్ష్మయ్య, వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు
మొబైల్: 81063 22077
Comments
Please login to add a commentAdd a comment