AP Rayalaseema Will Emerge As An Industrial Hub: పారిశ్రామిక ‘సీమ’- Sakshi
Sakshi News home page

Rayalaseema: పారిశ్రామిక ‘సీమ’

Published Mon, Mar 14 2022 3:32 AM | Last Updated on Mon, Mar 14 2022 1:37 PM

Rayalaseema Emerge as an Industrial Hub - Sakshi

సాక్షి, అమరావతి: చౌడు భూముల్లో అభివృద్ధి వెలుగులు విరబూస్తున్నాయి. పరిశ్రమలతో కళకళలాడుతున్నాయి. కడప నగరానికి కూత వేటు దూరంలోని కొప్పర్తి ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం.

నాడు పది లక్షలు.. నేడు రూ.కోటిన్నర
రెండేళ్ల క్రితం కొప్పర్తి కనుచూపు మేరంతా తుప్పలతో నిండిన చౌడు భూములే కనిపించేవి. ఒక్క భవనమూ లేదు. సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం రాగానే పరిస్థితి మారింది. రెండేళ్లలోనే రెండు పెద్ద పారిశ్రామిక వాడలు వైఎస్సార్‌ జగనన్న మెగా ఇండస్ట్రియల్‌ హబ్, వైఎస్సార్‌ ఎలక్ట్రానిక్‌ మాన్యుఫాక్చరింగ్‌ క్లస్టర్‌ రూపుదిద్దుకున్నాయి. గత డిసెంబర్‌లో సీఎం జగన్‌ వీటిని  ప్రారంభించి పలు పరిశ్రమలకు శంకుస్థాపన చేశారు. వివిధ పరిశ్రమల నిర్మాణంతో ఈ ప్రాంతం కళకళలాడుతోంది. ఇది మార్పునకు స్పష్టమైన సంకేతమని దేవేంద్ర సిమెంట్స్‌ అధినేత మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. వ్యవసాయానికి కూడా పనికిరాని ఈ భూములు ఏడాది క్రితం వరకు ఎకరా రూ.10 లక్షలు ఉండగా ఇప్పుడు మెయిన్‌ రోడ్డు పక్కన ఎకరం రూ.1.5 కోట్లు పలుకుతోందని తెలిపారు. వలస వెళ్లాల్సిన దుస్థితి తప్పిందని కొప్పర్తి పక్కన ఉన్న అంబాపురం వాసి కుంపటి ఓబిలేసు ఆనందంగా చెప్పాడు. భార్య భర్తకి కలిపి రోజుకు రూ.1,200 తక్కువ కాకుండా కూలి వస్తోందని తెలిపాడు. 

మారుతున్న సీమ రూపురేఖలు
రాయలసీమలో మూడు భారీ పారిశ్రామిక పార్కులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అన్ని రకాల మౌలిక వసతులతో 36,133 ఎకరాలను పారిశ్రామిక అవసరాల కోసం అభివృద్ధి చేస్తోంది. విశాఖ–చెన్నై, హైదరాబాద్‌–బెంగళూరు పారిశ్రామిక కారిడార్లలో భాగంగా కొప్పర్తి నోడ్, చిత్తూరు నోడ్, ఓర్వకల్‌ నోడ్‌లను ఆసియా అభివృద్ధి బ్యాంకు, నేషనల్‌ ఇండస్ట్రియల్‌ కారిడార్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఇంప్లిమెంటేషన్‌ ట్రస్ట్‌ (నిక్‌డిట్‌) నిధులతో అభివృద్ధి చేస్తున్నారు. 

కొప్పర్తి నోడ్‌
కొప్పర్తి వద్ద 3,157 ఎకరాల్లో  వైఎస్సార్‌ జగనన్న మెగా ఇండస్ట్రియల్‌ హబ్, వైఎస్‌ఆర్‌ ఈఎంసీ పార్కులను రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేసింది. వైఎస్‌ఆర్‌ జగనన్న ఎంఐహెచ్‌ ద్వారా రూ.25,000 కోట్ల పెట్టుబడులతో పాటు 75,000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. ఇప్పటికే 47 పరిశ్రమలకు 430 ఎకరాలు కేటాయించారు. రూ.1,837 కోట్ల పెట్టుబడితో ఈ పరిశ్రమలు స్థాపిస్తున్నారు. 8,941 మందికి ఉపాధి లభిస్తుంది. 801 ఎకరాల్లో వైఎస్సార్‌ ఈఎంసీని రూ.748.76 కోట్లతో అభివృద్ధి చేశారు. దీని ద్వారా రూ.9,000 కోట్ల పెట్టుబడులతో 25,000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. 

చిత్తూరు నోడ్‌
శ్రీకాళహస్తి వద్ద 23,538 ఎకరాల్లో ఏడీబీ నిధులతో ఈ పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేస్తున్నారు. రెండు దశల్లో రూ.1,577.21 కోట్లతో మౌలిక వసతుల పనులు వేగంగా జరుగుతున్నాయి.

ఓర్వకల్లు
కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద నిక్‌డిట్‌ నిధులతో 10,000 ఎకరాల్లో పారిశ్రామిక పార్కును అభివృద్ధి చేస్తున్నారు. దీని ద్వారా ప్రత్యక్షంగా 62,000 మందికి, పరోక్షంగా 77,000 మందికి ఉపాధి లభిస్తుంది. ఇక్కడ రూ.37,300 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు వస్తాయని అంచనా వేస్తున్నారు.

3 ఎంఎంఎల్‌పీలు
నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ)తో కలిసి అనంతపురంలో భారీ మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ పార్కును ఏపీఐఐసీ అభివృద్ధి చేస్తోంది. దీంతోపాటు ఓర్వకల్లు, కొప్పర్తి వద్ద మరో రెండు మల్టీ మోడల్‌ లాజిస్టిక్‌ పార్కుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలను సిద్ధం చేసింది. 

పారిశ్రామిక విప్లవం
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత 2019 జూన్‌ నుంచి ఇప్పటివరకు 50కి పైగా భారీ పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించాయి. వీటి ద్వారా రూ.27,530 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 37,204 మందికి ఉపాధి లభించింది. కియా కార్ల కంపెనీ వాణిజ్యపరంగా ఉత్పత్తిని ప్రారంభించడమే కాకుండా విస్తరణ పనులు వేగంగా చేపడుతోంది. హీరో మోటోకార్ప్, టాటా స్మార్ట్‌ఫుడ్జ్, టోరే, అపోలో టైర్స్, టీహెచ్‌కే ఇండియా లాంటి పలు సంస్థలు ప్రభుత్వ సహకారంతో విజయవంతంగా ఉత్పత్తిని ప్రారంభించాయి. మరో 43 భారీ పరిశ్రమలు రాయలసీమలో పెట్టుబడులు పెడుతున్నాయి. వివిధ దశల్లో ఉన్న ఈ యూనిట్ల ద్వారా రూ. 42,421 కోట్ల పెట్టుబడితోపాటు 1,26,396 మందికి ఉపాధి లభిస్తుంది. ఇందులో ఆదిత్య బిర్లా ఫ్యాషన్, సెంచరీ ఫ్లైవుడ్స్, నీల్‌కమల్, పిత్తి లామినేషన్స్, రామ్‌కో సిమెంట్స్, ప్రిజిం సిమెంట్స్‌ , సుమిత్‌ ఫుట్‌వేర్, భారత్‌ ఎలక్ట్రానిక్స్, నాసీన్, బ్లూస్టార్, హావెల్స్‌ ఇండియా, ఆంబర్‌ ఎంటర్‌ప్రైజెస్, ఆల్ల్రాటెక్‌ సిమెంట్‌ వంటి సంస్థలున్నాయి. ఇదే సమయంలో రాయలసీమలో 5,923 ఎంఎంస్‌ఎంఈలు ఉత్పత్తి ప్రారంభించాయి. వీటి ద్వారా రూ.1,671 కోట్ల పెట్టుబడులతో పాటు 45,171 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభిస్తోంది.

అభిప్రాయాలు
రాష్ట్రమంతా అభివృద్ధి
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందేలా అభివృద్ధి వికేంద్రీకరణను ప్రభుత్వం చేపట్టింది. రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాలను విశాఖ–చెన్నై, చెన్నై–బెంగళూరు, హైదరాబాద్‌–బెంగళూరు పారిశ్రామిక కారిడార్ల ద్వారా అభివృద్ధి చేస్తున్నాం. 
– జవ్వాది సుబ్రమణ్యం, వీసీఎండీ, ఏపీఐఐసీ

ఏపీలో సరికొత్త నినాదం..
‘‘రావాలి జగన్‌.. కావాలి జగన్‌.. అనే నినాదం రాష్ట్రమంతా మారుమోగింది. ఇప్పుడు ఆ నినాదం మారింది. జగన్‌ వచ్చారు... అభివృద్ధి తెచ్చారు’’
– కొప్పర్తిలో ఏఐఎల్‌ డిక్సన్‌ శంకుస్థాపన సందర్భంగా సంస్థ ప్రెసిడెంట్, సీవోవో పంకజ్‌శర్మ

అంతకు మించి..
తొలుత రూ.600 కోట్ల పెట్టుబడి పెట్టాలనుకున్నాం. రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూసిన తర్వాత మూడు దశల్లో రూ.2,600 కోట్ల పెట్టుబడి పెడుతున్నాం.
– బద్వేల్‌లో సెంచురీ ఫ్లైవుడ్‌ కంపెనీ చైర్మన్‌ సజ్జన్‌ భజాంక

మరిన్ని కంపెనీలు తీసుకొస్తాం
పెట్టుబడి ప్రతిపాదన అందజేసిన రెండు నెలల్లోనే భూమి పూజ చేయడం ఇక్కడి ప్రభుత్వ వ్యవస్థపై మా నమ్మకాన్ని పెంచుతోంది. మాతోపాటు ఇతర కంపెనీలను కూడా తీసుకొస్తాం. 
– పులివెందులలో ఆదిత్య బిర్లా ఫ్యాషన్‌ రిటైల్‌ లిమిటెడ్‌ ప్రకటన

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement