75 శాతం ఉద్యోగాలు స్థానికులకే | CM Jagan Says 75 percent jobs in all types of industries for locals | Sakshi
Sakshi News home page

75 శాతం ఉద్యోగాలు స్థానికులకే

Published Wed, Jul 12 2023 4:30 AM | Last Updated on Wed, Jul 12 2023 4:30 AM

CM Jagan Says 75 percent jobs in all types of industries for locals - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకు చెందాల్సిందేనని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇది ఇప్పటికే కార్యాచరణలోకి రాగా సమగ్ర పర్యవేక్షణ ద్వారా మరింత సమర్థంగా అమ­లవుతుందన్నారు. దీనిపై సమీక్షిస్తూ క్రమం తప్ప­కుండా ఆరు నెలలకు ఒకసారి  నివేదికలు పంపాలని కలెక్టర్లకు సూచించారు.

ముఖ్యమంత్రి జగన్‌ అధ్య­క్షతన క్యాంపు కార్యాలయంలో మంగళవారం రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి(ఎస్‌ఐపీబీ) సమావేశం జరిగింది. రూ.13,295 కోట్ల పెట్టుబడులతో 10,181 ఉద్యోగాలను కల్పించే పలు ప్రాజెక్టుల ప్రతిపాదనలకు ఎస్‌పీబీ ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌ ఏమన్నారంటే..

స్థానికుల సహకారం కీలకం..
ప్రైవేట్‌ సహా అన్ని రకాల పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలి. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం చేసిన చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలి. ఇది అత్యంత ముఖ్యమైనది. ఉద్యోగాలను కల్పిస్తున్న పరిశ్రమలకు అన్ని రకాలుగా తోడుగా నిలుస్తున్నాం. భూములు, ఇతర వనరులను సమకూరుస్తున్నాం.

ఒక పరిశ్రమ ఏర్పాటై సమర్థంగా నడవాలంటే స్థానికుల సహకారం ఎంతో అవసరం. స్థానిక ప్రజల మద్దతుతోనే ఇది సాధ్యం. అందుకనే 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలి. స్థానికంగా ఆయా పరిశ్రమల పట్ల ఎలాంటి వ్యతిరేకత ఉండకూడదనే ఇవన్నీ చేస్తున్నాం. రాష్ట్రంలో నైపుణ్యాలకు కొదవలేదు. సరిపడా మానవ వనరులున్నాయి.

పంట ఉత్పత్తులకు ‘మద్దతు’ తప్పనిసరి 
కంపెనీలు ఏవైనా సరే.. రైతుల నుంచి పంట ఉత్పత్తులను కొనుగోలు చేసినప్పుడు కనీస మద్దతు ధర తగ్గకుండా కొనుగోలు చేయాల్సిందే. ఈమేరకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలి. పరిశ్రమలు వీలైనంత ఎక్కువగా శుద్ధి చేసిన, డీ శాలినేషన్‌ నీటినే వినియోగించుకునేలా చూడాలి. జనాభా పెరుగుతున్న కొద్దీ తాగునీటికి, వ్యవసాయానికి నీటి కొరత తలెత్తకుండా ఉండేందుకు డీశాలినేషన్‌ లాంటి ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా వీలైనంత ఎక్కువగా పరిశ్రమలకు నీటిని సమకూర్చడంపై దృష్టి పెట్టాలి. ఇజ్రాయిల్‌ తరహా విధానాలతో ముందుకు సాగాలి. 

హాజరైన మంత్రులు, ఉన్నతాధికారులు
ఎస్‌ఐపీబీ సమావేశంలో ఉపముఖ్యమంత్రి (పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ) బూడి ముత్యాలనాయుడు, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పర్యాటకశాఖ మంత్రి ఆర్‌కే రోజా, వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, సీఎస్‌ డాక్టర్‌ కేఎస్‌ జవహర్‌రెడ్డి, పరిశ్రమలశాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవెన్, రెవెన్యూ, పర్యాటకశాఖ స్పెషల్‌ సీఎస్‌ రజత్‌ భార్గవ, ఆర్ధికశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌ఎస్‌ రావత్, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ జి.సాయిప్రసాద్, ఇంధనశాఖ స్పెషల్‌ సీఎస్‌ కె.విజయానంద్, జీఏడీ స్పెషల్‌ సీఎస్‌ కె.ప్రవీణ్‌ కుమార్, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌ కుమార్, మార్కెటింగ్, సహకారశాఖ ముఖ్య కార్యదర్శి చిరంజీవి చౌదరి, హేండ్‌లూమ్స్‌ అండ్‌ టెక్స్‌టైల్స్‌ ముఖ్యకార్యదర్శి కె. సునీత, పరిశ్రమలశాఖ కమిషనర్‌ ప్రవీణ్‌ కుమార్, ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ వీసీ అండ్‌ ఎండీ ఎస్‌ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎస్‌ఐపీబీ ఆమోదించిన ప్రతిపాదిత ప్రాజెక్టులివీ..
1. వైఎస్సార్‌ జిల్లా వేంపల్లె మండలం అశోక్‌నగర్, బక్కన్నవారి పల్లె వద్ద 1,500 మెగావాట్ల హైడ్రో స్టోరేజీ పవర్‌ ప్రాజెక్టు నెలకొల్పనున్న జేఎస్‌డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్‌. రూ.8,104 కోట్ల పెట్టుబడితో డిసెంబర్‌ 2024లో పనులు ప్రారంభించేలా చర్యలు. ఏటా 3,314.93 మిలియన్‌ యూనిట్ల విద్యుదుత్పత్తి లక్ష్యం. దాదాపు 1,500 మందికి ఉద్యోగావకాశాలు.

2. నంద్యాల జిల్లా కోటపాడులో సోలార్, అనంతపురం జిల్లా బోయల ఉప్పలూరు, నంద్యాల, వైఎస్సార్‌ జిల్లాలో హీరో ఫ్యూచర్‌ ఎనర్జీస్‌ అనుబంధ సంస్థ క్లీన్‌ రెన్యువబుల్‌ ఎనర్జీ ప్రాజెక్టుల ఏర్పాటు. 225 మెగావాట్ల సోలార్, 150 మెగావాట్ల విండ్‌ పవర్‌ ఉత్పత్తి. రూ.2,450 కోట్ల పెట్టుబడితో 2023 అక్టోబరులో పనులు ప్రారంభం. చివరి దశ 2025 అక్టోబరు నాటికి పూర్తి చేయాలన్నది లక్ష్యం. 375 మందికి ఉద్యోగావకాశాలు.

3.విశాఖ జిల్లా అన్నవరంలో మే ఫెయిర్‌ హెటళ్లు, రిసార్టుల ఏర్పాటు. రూ.525 కోట్ల పెట్టుబడితో 750 మందికి ప్రత్యక్షంగా, 1000 మందికి పరోక్షంగా ఉద్యోగావకాశాలు. నాలుగేళ్లలో ప్రాజెక్టు పూర్తి. ప్రాజెక్టులో భాగంగా కన్వెన్షన్‌ సెంటర్, 250 హోటల్‌ గదులు, మినీ గోల్ఫ్‌ కోర్టు నిర్మాణం. షాపింగ్‌ మాల్‌ సహా విల్లాల సదుపాయం. 

4. తిరుపతి పేరూరు వద్ద రూ. 218 కోట్లతో హయత్‌ ఇంటర్‌నేషనల్‌ హోటల్‌ నిర్మాణం. 260 మందికి ప్రత్యక్షంగా, 1,296 మందికి పరోక్షంగా ఉద్యోగావకాశాలు.
మూడున్నరేళ్లలో పూర్తి కానున్న ప్రాజెక్టు.

5. విశాఖ జిల్లా అచ్యుతాపురం సమీపంలోని కృష్ణపాలెం వద్ద హిందుస్థాన్‌ కోకోకోలా బెవరేజెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీ యూనిట్‌ ఏర్పాటు. రూ.1,200 కోట్ల పెట్టుబడితో  ప్రత్యక్షంగా, పరోక్షంగా 1,800 మందికి ఉద్యోగావకాశాలు.

6. తిరుపతి జిల్లా వరదాయ పాలెం మండలం కువ్వకోలి వద్ద సీసీఎల్‌ పుడ్, బెవరేజెస్‌ లిమిటెడ్‌ కంపెనీ ఏర్పాటు. రూ.400 కోట్ల పెట్టుబడితో ప్రత్యక్షంగా, పరోక్షంగా 950 మందికి ఉద్యోగ అవకాశాలు. కాఫీ సాగుదారులు 2,500 మందికి కూడా లబ్ధి. ఏడాదికి 16 వేల టన్నుల ఉత్పత్తి లక్ష్యం.

7. నెల్లూరు జిల్లా కృష్ణపట్నం సమీపంలో గోకుల్‌ ఆగ్రో రిసోర్స్‌ లిమిటెడ్‌ కంపెనీతో ఎడిబుల్‌ ఆయిల్‌ తయారీ ఫ్యాక్టరీ. రూ.230 కోట్ల పెట్టుబడి. రోజుకు 1400 టన్నులు ఉత్పత్తి. ప్రత్యక్షంగా 350 మందికి, పరోక్షంగా 850 మందికి ఉద్యోగావకాశాలు. 2500 మంది రైతులకూ ఉపయోగం.

8. తిరుపతి జిల్లా శ్రీ సిటీ వద్ద కోకో బటర్, కోకో పౌడర్, కోకో మాస్‌ తయారీ ఫ్యాక్టరీ నిర్మాణం. ఏడాదికి 40 వేల టన్నుల తయారీ లక్ష్యం. రూ.168 కోట్ల పెట్టుబడితో 250 మందికి ప్రత్యక్షంగా, 800 మందికి పరోక్షంగా ఉద్యోగావకాశాలు. ఫ్యాక్టరీ ఏర్పాటుతో 3 వేల మంది రైతులకు కూడా ప్రయోజనం.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement