CM YS Jagan Mandate In Review of Industries and Infrastructure of AP - Sakshi
Sakshi News home page

Andhra Pradesh: పారిశ్రామిక స'పోర్టు'

Published Tue, Oct 11 2022 3:17 AM | Last Updated on Tue, Oct 11 2022 5:11 PM

CM YS Jagan Mandate In Review of Industries and infrastructure of AP - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న పోర్టులను ఆసరాగా చేసుకుని పోర్టు ఆధారిత పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట వేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికార యంత్రాంగానికి దిశా నిర్దేశం చేశారు. ఇందుకోసం అవసరమైతే ముగ్గురు ఐఏఎస్‌ అధికారులతో ఒక కమిటీని నియమించాలని సూచించారు. రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ (ఎస్‌ఐపీబీ) ఆమోదించిన ప్రాజెక్టులు త్వరగా ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

త్వరితగతిన అన్ని అనుమతులు మంజూరయ్యేలా సీఎస్, సీఎంవో అధికారులతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పెద్ద సంఖ్యలో ఉపాధి కల్పిస్తున్న ఎంఎస్‌ఎంఈలకు చేయూత అందించి అధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో పరిశ్రమలు – మౌలిక వసతులపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్లు.. ఇంటర్నెట్, ఎంఎస్‌ఎంఈలు, పారిశ్రామిక కారిడార్లపై దిశా నిర్దేశం చేశారు. ఆ వివరాలివీ..

పరిశ్రమలు – మౌలిక వసతులపై సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

ఎంఎస్‌ఎంఈలకు తోడ్పాటు
పరిశ్రమలు ప్రారంభం కావడమే కాకుండా అవి నిలదొక్కుకునేలా చర్యలు తీసుకోవాలి. పెద్దఎత్తున ఉపాధి కల్పిస్తున్న ఎంఎస్‌ఎంఈలకు చేదోడుగా నిలవాలి. వీటివల్ల పెద్ద సంఖ్యలో ఉపాధి లభించి నిరుద్యోగం తగ్గుతుంది. అందుకే ఎంఎస్‌ఎంఈలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ఎంఎస్‌ఎంఈలు నిలదొక్కుకునేలా నిరంతరం చేయూతనివ్వాలి. ఎంఎస్‌ఎంఈలపై మన ప్రభుత్వం దృష్టి పెట్టినట్లుగా మరే ప్రభుత్వం దృష్టిపెట్టలేదు.

ఎంఎస్‌ఎంఈ కార్పొరేషన్‌ క్రియాశీలకంగా వ్యవహరించాలి. విదేశాల్లో ఎంఎస్‌ఎంఈల రంగంలో ఉత్తమ విధానాలపై పరిశీలన చేసి ఇక్కడ అమలు చేసేలా తగిన చర్యలు తీసుకోవాలి. ఇతర దేశాల్లోని ప్రతిష్ట్మాత్మక ఎంఎస్‌ఎంఈ పార్కులతో ఒప్పందాలు కుదుర్చుకునే అంశాలను పరిశీలించాలి. ఏయే రంగాల్లో ఎంఎస్‌ఎంఈలు నడుస్తున్నాయి? వాటిని ఇక్కడకు రప్పించడం ద్వారా ఆదాయం, ఉద్యోగాల కల్పన ఎలా చేయవచ్చో ఆలోచన చేయాలి.

ఎంఎస్‌ఎంఈ పార్కుల నిర్వహణ విధానాలను పరిశీలించడంతో పాటు కాలుష్య నివారణ, ఉత్పత్తుల తయారీలో అత్యాధునిక విధానాలు, ఉద్యోగాల కల్పన తదితర అంశాలు పరిశీలనలో భాగం కావాలి. రాష్ట్రంలోని ఎంఎస్‌ఎంఈ పార్కుల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలి. మార్కెట్‌లో అవకాశాలున్న ఉత్పత్తులు ఎంఎస్‌ఎంఈల నుంచి వచ్చేలా తగిన తోడ్పాటు అందించాలి.

డిసెంబర్‌కు పూర్తిస్ధాయిలో ఇంటర్నెట్‌..
డిసెంబర్‌ నాటికి అన్ని గ్రామ సచివాలయాలు, ఆర్బీకేలు, స్కూళ్లను ఫైబర్‌తో అనుసంధానించి ఇంటర్‌నెట్‌ సౌకర్యం కల్పించాలి. 5జీ సేవలను గ్రామాలకు చేరవేసే విధంగా టెలికాం కంపెనీలతో ఏపీఎస్‌ఎఫ్‌ఎల్‌ పని చేయాలి. డిజిటల్‌ లైబ్రరీలు గ్రామాల్లో విప్లవాత్మక మార్పులు తెస్తున్నాయి. వైఎస్సార్‌ జిల్లా వేల్పులలో నెలకొల్పిన డిజిటల్‌ లైబ్రరీ ద్వారా సుమారు 30 మంది అక్కడ నుంచే ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో అన్‌ లిమిటెడ్‌ బ్యాండ్‌ విడ్త్‌తో ఇలాంటి లైబ్రరీలు వస్తే సొంతూరి నుంచే ఉద్యోగాలు చేసే పరిస్థితి వస్తుంది. అందుకే డిజిటల్‌ లైబ్రరీల ద్వారా వర్క్‌ఫ్రం హోం కాన్సెప్ట్‌ను బలోపేతం చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. దేశంలోనే ఇదొక వినూత్న వ్యవస్థ గా ఆదర్శంగా నిలుస్తుంది. 

బల్క్‌డ్రగ్‌ పార్కుపై ఫార్మా కంపెనీల ఆసక్తి
రాష్ట్రానికి మంజూరైన కాకినాడ బల్క్‌డ్రగ్‌ పార్కులో కంపెనీల ఏర్పాటుకు ఇప్పటికే ప్రధాన ఫార్మా కంపెనీల నుంచి ప్రతిపాదనలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. పార్కు నిర్మాణ ప్రణాళికను సీఎం జగన్‌కు వివరించడంతోపాటు గత మూడేళ్లలో పారిశ్రామిక ప్రగతి వివరాలను అధికారులు తెలియచేశారు. ప్రతి జిల్లాలో ఎంఎస్‌ఎంఈల కోసం రెండు క్లస్టర్లు అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు.

సమీక్షలో పరిశ్రమలు, వాణిజ్యం, పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్, సీఎస్‌ సమీర్‌శర్మ, పరిశ్రమలశాఖ స్పెషల్‌ సీఎస్‌ కరికాల వలవెన్, ఆర్ధికశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌ఎస్‌ రావత్, పరిశ్రమల శాఖ డైరెక్టర్‌ జి.సృజన, ఏపీఐఐసీ వీసీ అండ్‌ ఎండీ ఎన్‌.భరత్‌ గుప్తా, ఏపీ మారిటైం బోర్డు సీఈఓ షన్‌మోహన్, ఏపీ ఫైబర్‌నెట్‌ ఎండీ మధుసూదన్‌రెడ్డి, మారిటైం బోర్డు ఛైర్మన్‌ కాయల వెంకటరెడ్డి, ఏపీఐఐసీ ఛైర్మన్‌ మెట్టు గోవిందరెడ్డి, ఏపీఐడీసీ ఛైర్‌పర్సన్‌ బండి పుణ్యశీల, ఏపీటీపీసీ ఛైర్మన్‌ కె.రవిచంద్రారెడ్డి, ఏపీఎండీసీ ఛైర్‌ పర్సన్‌ షమీమ్‌ అస్లాం, ఏపీ ఎస్‌ఎఫ్‌ఎల్‌ ఛైర్మన్‌ పూనూరు గౌతమ్‌రెడ్డి, ఇండస్ట్రియల్‌ ప్రమోషన్‌ సలహాదారు రాజీవ్‌కృష్ణ, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ సలహాదారు లంక శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు. 

జూన్‌కు నాలుగు ఫిషింగ్‌ హార్బర్లు
పోర్టు అనుబంధ పారిశ్రామికాభివృద్ధికి పెద్ద పీట వేయాలి. విశాఖ – చెన్నై పారిశ్రామిక కారిడార్‌లో ప్రస్తుతమున్న పారిశ్రామిక నోడ్స్‌తో పాటు కొత్తగా అభివృద్ధి చేయనున్న మచిలీపట్నం, దొనకొండ నోడ్‌లకు అదనంగా భావనపాడు, రామాయపట్నం నోడ్‌లను అభివృద్ధి చేయాలి. రామాయపట్నం పోర్టును ముందుగా నిర్దేశించుకున్న ప్రకారం 2024 మార్చి నాటికి కాకుండా 2023 డిసెంబర్‌కు పనులు పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలి.

మచిలీపట్నం, భావనపాడు పోర్టు పనులను త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలి. మొదటి విడతలో నిర్మిస్తున్న జువ్వలదిన్నె, నిజాంపట్నం, మచిలీపట్నం, ఉప్పాడ ఫిషింగ్‌ హార్బర్లను 2023 జూన్‌ నాటికి పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలి. రెండో దశలో నిర్మించనున్న ఫిషింగ్‌ హార్బర్లు, ఫిష్‌ ల్యాండ్‌ సెంటర్లపైనా దృష్టి పెట్టాలి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement