సాక్షి, అమరావతి/సాక్షి, న్యూఢిల్లీ: సులభతర వాణిజ్య రాష్ట్రాల ర్యాంకింగ్స్ (ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్–ఈవోడీబీ)లో రాష్ట్రం మరోసారి సత్తా చాటింది. వరుసగా రెండవ ఏడాది పూర్తిగా సంస్కరణల ప్రయోజనాలు పొందిన వ్యాపారవేత్తల నుంచి తీసుకున్న అభిప్రాయాల ఆధారంగా ప్రకటించిన ర్యాంకుల్లో మొదటి స్థానంలో నిలిచి గత ర్యాంకింగ్‌ను కాపాడుకుంది. దీంతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం పరిశ్రమలకు అందిస్తున్న తోడ్పాటుకు ప్రపంచ స్థాయిలో మరోసారి గుర్తింపు లభించింది. ముఖ్యంగా కరోనా వంటి మహమ్మారితో పారిశ్రామిక రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న సమయంలో నిర్వహించిన సర్వేలో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలవడం గమనార్హం.
గురువారం ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ సంయుక్తంగా బిజినెస్ రిఫామ్స్ యాక్షన్ ప్లాన్ 2020ని ప్రకటించారు. గతంలో మాదిరి ర్యాంకులుగా కాకుండా ఈసారి టాప్ అచీవర్స్, అచీవర్స్, యాస్పైర్స్, ఎమర్జింగ్ బిజినెస్ ఎకో సిస్టమ్స్ పేరుతో నాలుగు విభాగాలుగా రాష్ట్రాలను విభజించి ప్రకటించారు. సర్వేలో 92 శాతం మార్కులు దాటిన ఏడు రాష్ట్రాలను టాప్ అచీవర్స్‌గా ప్రకటించారు. ఇందులో ఏపీ 97.89 శాతంతో మొదటి స్థానంలో నిలవగా ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా గుజరాత్ (97.77%), తమిళనాడు(96.67%), తెలంగాణ (94.86%), హరియాణా (93.42%), పంజాబ్ (93.23%), కర్ణాటక (92.16%) ఉన్నాయి.
హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్ అచీవర్స్‌గా నిలిచాయి. అసోం, ఛత్తీస్‌గఢ్, గోవా, జార్ఖండ్, కేరళ, రాజస్థాన్, పశ్చిమబెంగాల్‌లు యాస్పైర్స్‌గా.. అండమాన్–నికోబార్, బిహార్, చండీగఢ్, డామన్–డయ్యూ, దాద్రానగర్–హవేలీ, జమ్మూ–కశ్మీర్, మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్, పుదుచ్చేరి, త్రిపుర రాష్ట్రాలు ఎమర్జింగ్ బిజినెస్ ఎకోసిస్టమ్స్‌గా నిలిచాయి. తగినంత యూజర్ డేటా లేనందున సిక్కిం, మిజోరం, అరుణాచల్‌ప్రదేశ్, లక్షద్వీప్, లదాఖ్‌ల ఫీడ్‌బ్యాక్ పొందలేకపోయామని కేంద్రం పేర్కొంది.
301 సంస్కరణల ఆధారంగా ర్యాంకింగ్స్
19 ప్రభుత్వ శాఖలకు సంబంధించిన 301 సంస్కరణల ఆధారంగా ఈ ర్యాంకులను ప్రకటించారు. ఈ సంస్కరణలను రాష్ట్ర ప్రభుత్వం 2021 జనవరి నాటికే కట్టుదిట్టంగా అమలు చేసింది. ఒక్కొక్క సంస్కరణ ద్వారా ప్రయోజనం పొందిన వారిలో కనీసం 20 మందిని రాండమ్‌గా సర్వే చేయడం ద్వారా ర్యాంకులను నిర్ణయించారు. రాష్ట్రంలో ఈ సంస్కరణల ద్వారా 8,850 మంది ప్రయోజనం పొందినట్లు డీపీఐఐటీ వెబ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్నారు. సర్వేలో వీరు పేర్కొన్న అభిప్రాయాల ఆధారంగా ప్రకటించిన ర్యాంకుల్లో 97.89 శాతం సంతృప్తితో రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది.
రాష్ట్రంలో ఏర్పాటైన పరిశ్రమలకు చేయూతనందించే విధంగా రిలేషన్ షిప్ మేనేజర్లు ఏర్పాటు చేయడం, ఔట్ రీచ్ కార్యక్రమాల ద్వారా పరిశ్రమల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించడం, పరిశ్రమల సమస్యలను తక్షణం పరిష్కరించే విధంగా స్పందన ఆన్‌లైన్ పోర్టల్ అందుబాటులోకి తీసుకురావడం, మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ ఉద్యోగులకు శిక్షణ ఇవ్వడం, సింగిల్ డెస్క్ ద్వారా 93కు పైగా సేవలను అందిస్తుండంఈ ర్యాంక్ రావడానికి దోహదం చేసినట్లు పరిశ్రమల శాఖ వర్గాలు పేర్కొన్నాయి. గరిష్టంగా 21 రోజుల్లో అనుమతులు ఇచ్చే విధంగా సింగిల్ డెస్క్ పోర్టల్ పని చేస్తోందని, 2022 జూన్ 29 నాటికి 71,164 అనుమతులను ఈ పోర్టల్ ద్వారా ఇచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. రానున్న కాలంలో 23 విభాగాలకు ఈ సింగిల్ డెస్క్ సేవలను విస్తరించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.
పారిశ్రామికవేత్తలు జగన్ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు
పరిశ్రమలకు ఒక రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా సహకారం అందిస్తోందోన్న విషయాన్ని ఈ సర్వే వెల్లడించింది. వైఎస్ జగన్ పరిశ్రమలకు అందిస్తున్న సహకారానికి పారిశ్రామికవర్గాల నుంచి ఆమోదం లభించింది. పూర్తిగా పారిశ్రామికవేత్తల సర్వే ద్వారా ర్యాంకులు ప్రకటించిన రెండు సార్లు కూడా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలవడం గమనార్హం. పారిశ్రామిక సుస్థిరాభివృద్ధి కోసం ఇదే ప్రభుత్వం కొనసాగాలని పారిశ్రామికవేత్తలు కోరుకుంటున్న విషయాన్ని తెలియచేస్తోంది. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ సురక్షితమైన రాష్ట్రం కావడంతో ఇప్పుడు పొరుగు రాష్ట్రాలన్నీ మనవైపు చూస్తున్నాయి.
– గుడివాడ అమరనాథ్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి.
ప్రభుత్వ సహకారంపై సంతృప్తి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నాలుగోసారి ఈవోడీబీ ర్యాంకుల్లో మొదటి స్థానంలో నిలిచింది. ఇందులో 2019, 2020 ర్యాంకులు విభిన్నమైనవి. గతంలో ప్రభుత్వ నివేదికల ఆధారంగా ర్యాంకులు ప్రకటించేవారు. కానీ గత రెండేళ్లుగా అమలు చేసిన సంస్కరణలు ప్రయోజనకరంగా ఉన్నాయా లేదా అని పారిశ్రామికవేత్తల నుంచి అభిప్రాయాలను తీసుకొని ర్యాంకులు ప్రకటిస్తున్నారు. ఈ ప్రభుత్వ సహకారంపై పారిశ్రామికవేత్తలు పూర్తి స్థాయిలో సంతృప్తి వ్యక్తం చేయడం వల్లే వరుసగా రెండుసార్లు మొదటి స్థానం పొందగలిగాం.
– కరికల్ వలవన్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, పరిశ్రమలు, పెట్టుబడుల శాఖ
వ్యాపార సంస్కరణలకు పెద్ద పీట
దేశంలో 1991 నుంచి సంస్కరణల స్వభావం మారింది. 1991 నాటి సంస్కరణల మాదిరిగా ఇప్పుడు ఒత్తిడి పరిస్థితులు లేవు. మరింత పారదర్శకమైన వ్యవస్థను రూపొందించడమే లక్ష్యం. కొన్నేళ్లుగా వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక కింద అమలు చేస్తున్న సంస్కరణలు మంచి ఫలితాలను అందిస్తున్నాయి.
– నిర్మాలా సీతారామన్, కేంద్ర ఆర్థిక మంత్రి.
దేశ ర్యాంకింగ్ మెరుగు పర్చుకోవడమే లక్ష్యం
సులభతర వాణిజ్యంలో దేశం ర్యాంక్ మెరుగు పరచాలన్న ప్రధాని మోదీ ఆలోచనలకు అనుగుణంగా 2014లో ఈజ్ ఆఫ్ డూయింగ్ సంస్కరణలకు నాంది పలికాం. దీనివల్ల ఇప్పుడు సులభతర వాణిజ్యం అనేది కొన్ని ప్రాంతాలు, నగరాలకే పరిమితం కాకుండా దేశ వ్యాప్తంగా ప్రతిబింబిస్తోంది.
– పీయూష్ గోయల్, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి.
తయారీ రంగంలో కొత్తపెట్టుబడులు ఖాయం : ఫ్యాప్సీ
సులభతర వాణిజ్య ర్యాంకుల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి టాప్ అచీవర్స్‌గా గుర్తింపు రావడంపై ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ (ఫ్యాప్సీ) హర్షం వ్యక్తంచేసింది. రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలకు త్వరితగతిన అనుమతులు లభించే విధంగా పూర్తి స్థాయిలో మద్దతు ఇవ్వడం ద్వారా రాష్ట్రం ఈ ఘనత సాధించిందని ఫ్యాప్సీ ప్రెసిడెంట్ సీవీ అచ్యుతరావు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. దీనివల్ల రాష్ట్రం తయారీ రంగంలో కొత్త పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు సులభతర పారిశ్రామిక వాతావరణం మెరుగవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment