సాక్షి, హైదరాబాద్: సుమారు 50 రోజుల తర్వాత పరిశ్రమలు తిరిగి ప్రారంభమైన నేపథ్యంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య (టిఫ్) శుక్రవారం డీజీపీ మహేందర్‌రెడ్డికి విన్నవించింది. పరిశ్రమలు నడిచేందుకు వీలుగా అనుబంధ సంస్థలు, ముడి సరుకు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని వివరించారు. అనుబంధ సంస్థలు, ఇతర దుకాణాలు తెరిచేందుకు చర్యలు తీసుకుంటామని డీజీపీ వారికి హామీ ఇచ్చారు. జంట నగరాల పరిధిలోని పరిశ్రమలు రాణిగంజ్ మీద ఆధారపడిన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీతో సంప్రదిస్తామన్నారు. లాక్‌డౌన్ మూలంగా ఇతర జిల్లాలు, రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన కార్మికులు తిరిగి హైదరాబాద్‌కు వచ్చేందుకు పాస్‌లు జారీ చేస్తామని డీజీపీ హామీ ఇచ్చారు.
పారిశ్రామిక వాడలోని స్పేర్‌పార్టులు, రిపేరింగ్ షాపులు, ఇతరత్రా ట్రాన్స్‌పోర్టు ఏజెన్సీలకు కూడా అనుమతులు మంజూరు చేస్తామన్నారు. పారిశ్రామికవాడల్లో కాకుండా ఇతర వాణిజ్య సముదాయాల్లో చిన్న చిన్న వ్యాపారాలు నడిచే శోభన కాలనీ, బాలానగర్, గీతానగర్, కుషాయిగూడ తదితర ప్రాంతాల్లో కార్యకలాపాలు కొనసాగించేందుకు డీజీపీ అంగీకరించినట్లు తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య వెల్లడించింది. డీజీపీని కలిసిన వారిలో తెలంగాణ పారిశ్రామిక వేత్తల సమాఖ్య అధ్యక్షులు కొండవీటి సుధీర్‌రెడ్డి, కార్యదర్శి మిరుపాల గోపాల్‌రావు, పారిశ్రామికవేత్త షేక్ మదర్ సాహెబ్, బల్క్ డ్రగ్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ జానీమియా, జీడిమెట్ల ఐలా చైర్మన్ సదాశివరెడ్డి తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment