ఆశలు అడియాసలయ్యాయి. సాగునీటి ప్రాజెక్టుకు జాతీయహోదా లేదు. విభజన హామీల ఊసులేదు. రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఉనికిలేదు. పన్నుల వాటా, జీఎస్టీ పరిహారం చెల్లింపులో ఊరట లేదు. పురపాలికలు, పరిశ్రమలకు ప్రోత్సాహకాల జాడలేదు. మెట్రోరైలుకు మళ్లీ మొండిచేయి. స్పష్టంగా చెప్పాలంటే కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన 2021–22 వార్షిక బడ్జెట్‌లో రాష్ట్రానికి సంబంధించిన ఒక్క ప్రతిపాదన కూడా కనిపించలేదు. కరోనా కష్టకాలంలో రాష్ట్ర ఆర్థికవ్యవస్థ గాడిలో పడేందుకు అండగా నిలబడుతుందనుకున్నవారికి తెలుగింటి కోడలు నిర్మలాసీతారామన్ మొండిచెయ్యే చూపింది. – సాక్షి, హైదరాబాద్
రాష్ట్ర సాగునీటి రంగానికి ఈసారి కూడా కేంద్ర బడ్జెట్ నిధుల వరద పారించలేదు. కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుల్లో ఒకదానికి జాతీయ హోదా, మిషన్ కాకతీయకు ఆర్థిక సాయంపై రాష్ట్ర ప్రజల ఆశలను ఆవిరి చేసింది. కాళేశ్వరానికి జాతీ య హోదా ఇవ్వాలని సీఎం కేసీఆర్ రాసిన లేఖ లను కేంద్రం పట్టించుకోలేదు. ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే ఖర్చులో సింహభాగం అప్పు ల ద్వారానే సమకూర్చుకుంటున్నామని, ఆర్థికసాయం చేయాలని రాష్ట్రం చేసిన ప్రతిపాదనను కేంద్రం పట్టించుకోలేదు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నీళ్లు అందిస్తున్నందున భగీరథ అప్పుల చెల్లింపులకు నిధులివ్వాలని, దాని నిర్వహణకు ఆర్థిక సహకారం అందించాలని సీఎం కోరినా స్పందన కరువైంది. చదవండి: (బడ్జెట్ 2021-22: ఓ లుక్కేయండి!)
ఇక, నదుల అనుసంధాన ప్రక్రియకు కూడా నిధులు లేవు. అయితే, భగీరథ స్ఫూర్తితో కేంద్రం రూపొందించిన జల్‌జీవన్ మిషన్‌కు గత ఏడాది బడ్జెట్‌లో రూ.11,218 కోట్లు కేటాయించగా, ఈ ఏడాది దాన్ని రూ.49,757 వేల కోట్లకు పెంచింది. పీఎంకేఎస్‌వై కింద కేటాయించిన రూ.11,588కోట్ల నుంచి కొమురంభీం, గొల్ల వాగు, ర్యాలివాగు, మత్తడివాగు, పెద్దవాగు, పాలెంవాగు, ఎస్సారెస్పీ–2, దేవాదుల, జగన్నాథ్‌పూర్, భీమా, వరద కాల్వ ప్రాజెక్టులకు రావాల్సిన రూ.200 కోట్లలో ఏమైనా విదిలిస్తారేమోనని రాష్ట్రం ఎదురుచూడాల్సి వస్తోంది.
పురపాలకం.. ఇదీ వాలకం
పురపాలక శాఖ పరిధిలో అమలవుతున్న పలు ప్రాజెక్టులకుగాను రూ.1,950 కోట్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరగా, ఒక్కరూపాయి కూడా బడ్జెట్‌లో కేటాయించలేదు. సీవరేజీ మాస్టర్ ప్లాన్‌కు రూ.750 కోట్లు, నాలాల అభివృద్ధికి రూ.240 కోట్లు, వరంగల్ నియో మెట్రోకు రూ.210 కోట్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ పనులకు రూ.750 కోట్లు కావాలని అడిగినా, ఏ ఒక్క ప్రాజెక్టుకూ రూపా యి కూడా లేదు. మెట్రోరైలు ప్రాజెక్టు, జాతీయ రహదారులకు నిధులివ్వకుండా తెలుగింటి కోడలు నిరాశే మిగిల్చింది.
పునర్విభజన.. ఏదీ ఆలోచన?
ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం–2014 ప్రకారం రాష్ట్రాలకు రావాల్సిన ప్రాజెక్టులు, నిధుల విషయంలో కేంద్రం స్పష్టత ఇవ్వలేదు. ఆర్థిక సంఘం సిఫారసు మేరకు కేంద్ర పన్నుల్లో వాటాను తగ్గించిన కేంద్రం అదే ఆర్థిక సంఘం రాష్ట్రానికి సిఫారసు చేసిన స్పెషల్ గ్రాంటును విస్మరించింది. రూ. 730 కోట్ల స్పెషల్ గ్రాంటుతోపాటు వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి 2019 నుంచి ఇవ్వాల్సిన రూ.900 కోట్లు, నీతి ఆయోగ్ మిషన్ భగీరథకు సిఫారసు చేసిన వేల కోట్ల రూపాయల గురించి నిర్మలమ్మ పద్దులో ఒక్క సుద్ది కూడా లేదు.
కేంద్ర ప్రాయోజిత పథకాల అమల్లో స్వేచ్ఛ, పింఛన్ పెంపు కింద ఆసరాల గురించి రాష్ట్రం ఆశించినా వాటి గురించి ఏమీ చెప్పలేదు. పన్నుల్లో వాటా, జీఎస్టీ పరిహారం చెల్లింపులో తనకు అనుకూలంగా మార్పులు చేసుకుంటున్న కేంద్రం రాష్ట్రాలకు ఎలాంటి వెసులుబాటు ఇవ్వలేదు. ఐటీఐఆర్‌తో పాటు బయ్యారం స్టీల్‌ఫ్యాక్టరీ, కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన వర్సిటీ ఏర్పాటు లాంటి విభజన హామీలు మళ్లీ అటకెక్కాయి. ఈ నేపథ్యంలో 2021–22గాను రాష్ట్రం రూపొందించే బడ్జెట్‌పై ప్రభావం ఉంటుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు.
పరిశ్రమలు.. ఆశలు అడియాశలు
పారిశ్రామిక రంగ అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనల్లో కనీసం ఒక్కటి కూడా కేంద్ర బడ్జెట్ లో ప్రస్తావనకు నోచుకోలేదు. హైదరాబాద్ ఫార్మాసిటీలో అంతర్గత మౌలిక సదుపాయాల కోసం కనీసం రూ.870 కోట్లు, వరంగల్ కాకతీయ టెక్స్‌టైల్ పార్కులో మౌలిక వసతుల కోసం కనీసం రూ.300 కోట్లు, సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పరిసరాల్లో ఏర్పాటయ్యే నేషనల్ ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ జోన్(నిమ్జ్)లో మౌలిక వసతుల కల్పనకు తొలిదశలో రూ. 500 కోట్లు, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఆవరణలో ఏర్పాటయ్యే నేషనల్ డిజైన్ సెంటర్‌కు రూ.200 కోట్ల ప్రాథమిక మూలధనం, ‘హైదరాబాద్– వరంగల్’ఇండస్ట్రియల్ కారిడార్‌కు రూ.3 వేల కోట్లు, ‘హైదరాబాద్– నాగపూర్’కారిడా ర్‌కు రూ.2 వేల కోట్లు.. ఇలా మొత్తంగా 2021–22 కేంద్ర బడ్జెట్‌లో రూ.5 వేల కోట్లు కేటాయించాలని మంత్రి కేటీఆర్ కేంద్రానికి రాసిన ఏ లేఖను కేంద్రం పట్టించుకున్న పాపాన పోలేదు.
ఇక, రాష్ట్ర విభజనహామీల్లో కీలకమైన ఐటీఐఆర్ ప్రాజెక్టు కింద నిధులు మంజూరు చేయాలని తాజాగా కేటీఆర్ చేసిన ప్రతిపాదనను కూడా కేంద్రప్రభుత్వం బుట్టదాఖలు చేసింది. దీంతో ఇక, ఈ ప్రాజెక్టు కోల్డ్‌స్టోరేజీలోకి నెట్టేసినట్టేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, ఎంఎస్‌ఎంఈ పరిశ్రమలను పునర్విచించడం, ఒకటి, రెండు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాలు రాష్ట్రంలోని పారిశ్రామిక రంగంపై కొంత మేర సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉందని పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి. రూ. 2.50 కోట్ల పెట్టుబడి ఉండే వాటిని ఎంఎస్‌ఎంఈలుగా గుర్తించాలన్న నిర్ణయంతో రాష్ట్రంలోని మరికొన్ని పరిశ్రమలకు ఈ జాబితా లో స్థానం లభించనుంది.
పూర్తి నిరాశాజనకం కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో రైతులకు, బడుగు, బలహీన వర్గాలకు ఎలాంటి ఉపయోగం లేదని, పూర్తి నిరాశాజనకంగా ఉందని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్ ఎంపీ లు, బీజేపీ నేతల అసమర్థత వల్లే రాష్ట్రం అన్యాయానికి గురైందని సోమవారం ఆయన ఒక ప్రకటనలో మండిపడ్డారు. ఎప్పటి మాదిరిగానే రైల్వే కేటాయింపుల్లో రాష్ట్రానికి మొండిచేయి చూపిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్ హయాంలో హైదరాబాద్‌కు మంజూరైన ఐటీఐఆర్ ప్రాజెక్టుకు నిధులు విడుదల చేయకుండా కాలయాపన చేస్తోందని ఆరోపించారు. పెండింగ్‌లో ఉన్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ప్రత్యేక డివిజన్ డిమాండ్‌పై కేంద్రం ఎందుకు స్పందించలేదని ఆయన ప్రశ్నించారు.
రాష్ట్రంలోని కేంద్ర సంస్థలకే నిధులు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్‌లో తెలంగాణకు మళ్లీ నిరాశే ఎదురైంది. కేవలం తెలంగాణలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలు మాత్రమే ఈ బడ్జెట్ పద్దుల్లో ప్రస్తావనకు వచ్చాయి. రాష్ట్రంలోని గిరిజన వర్సిటీకి రూ. 26.90 కోట్లు, ఐఐటీ హైదరాబాద్‌లో ఈఏపీ ప్రాజెక్టులకు రూ. 150 కోట్లు కేటాయించింది. జపాన్ ఆర్థికసాయంతో ఐఐటీ క్యాంపస్ అభివృద్ధికి రూ. 460.31 కోట్లు కేటాయించింది. హైదరాబాద్ అటామిక్ మినరల్స్ డైరెక్టరేట్ ఫర్ ఎక్స్‌ప్లోరేషన్, రీసెర్చ్ సంస్థకు సర్వే, అణు ఖనిజాల అన్వేషణ నిమిత్తం రూ. 329.19 కోట్లు, హైదరాబాద్, మొహాలి, అహ్మాదాబాద్, గువాహటి, హజిపూర్, కోల్‌కతా, రాయ్‌బరేలి, మధురైల్లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ రిసెర్చ్ (నైపర్)కు రూ. 215.34 కోట్లు, హైదరాబాద్, కోల్‌కతా, గువాహటి, చెన్నైల్లోని డైరెక్టరేట్ ఆఫ్ హిందీ సంస్థలకు రూ.30 కోట్లు, హైదరాబాద్‌సహా దేశవ్యాప్తంగా ఉన్న 12 సీ–డాక్ కేంద్రాలకు రూ. 200 కోట్లు కేటాయించింది.
సెంటర్ ఫర్ మెటీరియల్స్ ఫర్ ఎలక్ట్రానిక్స్, ఐటీ (సి–మెట్)లో హైదరాబాద్‌సహా మూడు కేంద్రాలకు రూ. 80 కోట్లను ఆర్థిక మంత్రి కేటాయిం చారు. హైరరాబాద్ లోని నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డుకు రూ.23.84 కోట్లు, హైదరాబాద్‌లోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్‌కు రూ.124 కోట్లు, హైదరాబాద్‌లోని ఇండియన్ నేషనల్ సెంటర్‌ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ (ఎన్‌సీఓఐఎస్)కు రూ. 24.50 కోట్లు, సింగరేణిలో పెట్టుబడులకు రూ. 2500 కోట్లు, హిందుస్థాన్ ఫ్లోరో కార్బన్ లిమిటెడ్ మూసివేత ఖర్చులకు రూ. 233.14 కోట్లు, మిథానిలో పెట్టుబడులకు రూ.1184.68 కోట్లు కేటా యించారు.
తెలంగాణకు అన్యాయం జరిగింది: ఉత్తమ్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రంలోని బీజేపీ తెలంగాణకు అన్యా యం చేసిందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రానికి బీజేపీ వల్ల నష్టం జరుగుతోందని చెప్పేందుకు పార్లమెంటులో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ నిదర్శనమన్నారు. ఢిల్లీలోని విజయ్‌చౌక్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ బడ్జెట్ ద్వారా రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదన్నారు. రాష్ట్రానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న ప్రతిపాదనల్లో ఒక్క అంశాన్ని కూడా ప్రస్తావించలేదని విమర్శించారు. ఆర్థిక మాం ద్యంతో ప్రజలు ఇబ్బంది పడుతున్న తరుణంలో పెట్రోల్, డీజిల్‌పై సెస్ పెంచడం దారుణమన్నారు. గత ఆరేళ్లలో రైతు ఆత్మహత్యలు పెరుగుతున్నా వారికి మేలు చేసే చర్యలు బడ్జెట్‌లో ఏమాత్రం లేవన్నారు. రైతుల ఆదాయం రెట్టింపు అయ్యిందని కేంద్ర ఆర్థిక మంత్రి చేసి న ప్రకటన పచ్చి అబద్ధమని మండిపడ్డారు.
నయా క్యాపిటలిస్టులకు దోచిపెట్టే బడ్జెట్ : భట్టి
సాక్షి, హైదరాబాద్: బడ్జెట్ తీవ్ర నిరాశ, నిస్పృహలకు గురిచేసిందని, కొద్దిమంది నయా క్యాపిటలిస్టులకు ప్రజల సొమ్మును దోచిపెట్టే విధంగా బడ్జెట్‌ను తయారుచేశారని కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేత భట్టివిక్రమార్క విమర్శించారు. కార్పొరేట్ శక్తుల కోసమే కేంద్రం పనిచేస్తోందని ఈ బడ్జెట్ నిరూపిస్తోందని, సామాన్యులు, పేద, మధ్యతరగతి ప్రజల గురించి ఆలోచించకుండా బడ్జెట్ పెట్టారని ధ్వజమెత్తారు. సోమవారం అసెంబ్లీ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడుతూ జాతి సంపదను కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం చేసేలా బడ్జెట్ ఉందన్నారు. బయ్యారం ఫ్యాక్టరీ, కాజీపేటలో రైల్‌కోచ్ ఫ్యాక్టరీ, నీటిపారుదల ప్రాజెక్టుకు జాతీయ హోదా, గిరిజన వర్సిటీ లాంటి విభజన హామీల గురించి కనీసం ప్రస్తావించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం తెలంగాణకు ఇంత అన్యాయం చేస్తుంటే టీఆర్‌ఎస్, బీజేపీ ఎంపీలు నిద్రపోతున్నారా.. గాడిదలు కాస్తున్నారా అని ప్రశ్నించారు.
ఇది చరిత్రాత్మక బడ్జెట్: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను రాష్ట్ర బీజేపీ స్వాగతించింది. ప్రజాసంక్షేమం, ఆరోగ్యం, అభివృద్ధి ఆకాంక్షించేలా ఈ బడ్జెట్ ఉందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దేశ ప్రజల ఆత్మవిశ్వాసాన్ని, పేద, మధ్యతరగతి జీవన ప్రమాణాలను పెంపొందించేలా ఈ బడ్జెట్ ఉందన్నారు. అదనంగా మరో కోటి మంది మహిళలకు ఉజ్వల పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల సాయంతో పాటు మరిన్ని జిల్లాల్లో ఇంటింటికీ గ్యాస్ ద్వారా మహిళల జీవితాల్లో వెలుగులు నింపేలా బడ్జెట్ ఉంద న్నారు. ఈ బడ్జెట్ ద్వారా 2021–22లో భారత ఆర్థిక ప్రగతి పరుగు పెడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు.
రాష్ట్రానికి మొండి చేయి చాడ వెంకట్‌రెడ్డి
తెలంగాణకు బడ్జెట్‌లో మొండిచేయి చూపారు. దీర్ఘకాలికంగా ఉన్న కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, ఎంఎంటీఎస్ మెట్రో రైలు విస్తరణ ఊసే లేదు. కేంద్రం బరితెగించి కార్పొరేట్లకు అనుకూలంగా ప్రైవేటీకరణకు తలుపులు బార్లా తెరిచింది. ఈ ఏడాది 1.75 లక్షల కోట్ల మేర ఆస్తులను అమ్మకాల ద్వారా సమకూర్చుకోవా లని అనుకోవడం దారుణం. పెట్రోల్, డీజిల్‌పై సెస్ మోపడం దుర్మార్గం. బీమా రంగంలో విదేశీ పెట్టుబడులను 49 నుంచి 75 శాతానికి పెంచడం, మరిన్ని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్ముకోవాలని నిర్ణయించడం దేశ భక్తులపనా?
రాష్ట్రానికి నిధులు రాబట్టాలి: తమ్మినేని
పేదలను మరింత పేదరికంలోకి, కార్పొరేట్లను మరింత లాభాల్లోకి నెట్టేలా ఈ బడ్జెట్ ఉంది. వ్యవసాయ చట్టాల రద్దుకు దేశ వ్యాప్తంగా ఉద్య మం జరుగుతుంటే టీఆర్‌ఎస్ కేంద్రానికి వత్తాసు పలికినా.. బడ్జెట్‌లో తెలంగాణకు ఎలాంటి ప్రయోజనం చేకూరలేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రానికి నిధులు వచ్చేలా చూడాలి. నిత్యావసర సరుకులపై ప్రభావం చూపే పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పటికే ఆకాశాన్నంటుతుంటే మళ్లీ సెస్ విధించి పేదల బతుకులతో చెలగాటమాడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment