సాక్షి, హైదరాబాద్: వ్యవసాయంతోపాటు అనుబంధ రంగాల్లో రాష్ట్రం విప్లవాత్మక పురోగతి సాధించడం ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో సాధించిన ఐదు విప్లవాలతో అనేక దిగ్గజ సంస్థలు పెట్టుబడులతో ముందుకు వస్తుండటంతో రైతులు, ప్రభుత్వ ఆదాయం పెరగడంతోపాటు రైతుల జీవన ప్రమాణాలు మెరుగవుతున్నాయన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్, ఎగుమతులు, రిటైల్ రంగంలో అంతర్జాతీయంగా పేరొందిన లులు గ్రూప్ తెలంగాణలో రూ. 3,650 కోట్ల పెట్టుబడితో కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది.
ఇందుకు సంబంధించిన పత్రాలను సోమవారం మంత్రి కేటీఆర్ సమక్షంలో లులు గ్రూప్ ఇంటర్నేషనల్ చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ యూసుఫాలీ ఎంఏ స్వీకరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటైన తొమ్మిదేళ్లలోనే రాష్ట్ర ప్రభుత్వ తలసరి ఆదాయం రెట్టింపైందని, జీఎస్‌డీపీలోనూ భారీగా వృద్ధిరేటు నమోదైందన్నారు.
నాలుగేళ్ల రికార్డు సమయంలో కాళేశ్వరాన్ని ఎత్తిపోతలను పూర్తి చేయడం ద్వారా రాష్ట్రంలో సాగు విస్తీర్ణం 90 లక్షల ఎకరాలకు చేరిందన్నారు. రాష్ట్రం ఏర్పడే నాటికి వరి దిగుబడి 68 లక్షల మెట్రిక్ టన్నులు కాగా ప్రస్తుతం 3.5 కోట్ల టన్నులకు చేరిందని చెప్పారు. తెలంగాణ బియ్యం కోసం కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా డిమాండ్ ఉందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ, మత్స్య, మాంసం, పాడి , పామాయిల్ విప్లవాలు సాధించడంతో రైతులకు ఆదాయం పెరిగిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. రోజుకు ఐదు లక్షల లీటర్ల పాలను ప్రాసెస్ చేసే మెగా డెయిరీని రూ. 300 కోట్లతో ఈ ఏడాది ఆగస్టులో ఏర్పాటు చేస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని ప్రోత్సహించేందుకు 10 వేల ఎకరాల్లో ప్ర త్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ రంగంలో పెట్టుబడులతో ముందుకొస్తే స్థలం కేటాయించేందుకు సిద్ధమని యూసుఫాలీకి హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో లులు పెట్టుబడులు రూ. 3,650 కోట్లు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కేంద్రంగా పనిచేస్తున్న తాము తెలంగాణలో రూ. 3,650 కోట్లతో కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్లు లులు గ్రూప్ ఇంటర్నేషనల్ సీఎండీ యూసుఫాలీ ఎంఏ ప్రకటించా రు. తొలివిడతలో రూ. 500 కోట్ల మేర పెట్టుబడి పెడుతుండగా ఇందులో రూ. 300 కోట్లతో కూకట్‌పల్లిలో ఏర్పాటు చేసిన మాల్‌ను ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభిస్తామన్నారు.
ఈ మాల్ ద్వారా 2 వేల మందికిపైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. మరో రూ. 200 కోట్లతో చెంగిచెర్లలో రోజుకు 60 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో 2,500 మందికి ఉపాధి కల్పించేలా ఆధునిక ఇంటిగ్రేటెడ్ మాంసం ప్రాసెసింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మరో 18 నెలల్లో ఈ ప్లాంట్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయన్నారు. వచ్చే ఐదేళ్లలో లులు గ్రూప్ ద్వారా తెలంగాణలో రూ. 3,150 కోట్ల కొత్త పెట్టుబడులు వస్తాయని, రూ. 2 వేల కోట్లతో హైదరాబాద్‌లో డెస్టినేషన్ షాపింగ్‌మాల్, రూ.వెయ్యి కోట్లతో ప్రధాన నగరాలు, ఇతర పట్టణాల్లో మినీమాల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వం సహకరిస్తే తెలంగాణ నుంచి 5 లక్షల టన్నుల బియ్యం కొనుగోలుతోపాటు ఫిష్ ప్రాసెసింగ్ సెంటర్‌ను తక్షణమే ఏర్పాటు చేస్తా మని యూసుఫాలీ ప్రకటించారు. సమా వేశంలో పశుసంవర్థక శాఖ ప్రత్యేక కార్యదర్శి అధర్ సిన్హా, టీఎస్‌ఐఐసీ చైర్మన్ ఈవీ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment