lulu Group
-
లులు గ్రూప్ అధినేత మంచి మనసు.. ప్రశంసిస్తున్న నెటిజన్లు
అప్పు తీర్చలేక ఇంటిని కోల్పోయిన కేరళ మహిళకు లులు గ్రూప్ అధినేత ఎంఏ యూసుఫ్ అలీ అండగా నిలిచారు. ఆమె చెల్లించాల్సిన లోన్ మొత్తాన్ని చెల్లించడమే కాకుండా.. అదనంగా మరో రూ. 10 లక్షలు సాయం చేశారు.కేరళలోని నార్త్ పరవూర్‌కు చెందిన సంధ్య 2019లో ఇల్లు కట్టుకోవడానికి ఒక ప్రైవేట్ సంస్థ నుంచి నాలుగు లక్షల రూపాయలు లోన్ తీసుకుంది. ఇంటి నిర్మాణానికి ఖర్చు పెరగడంతో.. మరింత అప్పు చేయాల్సి వచ్చింది. కొన్ని రోజుల తరువాత ఆమె భర్త పిల్లలను, తనను వదిలి ఎక్కడికో వెళ్లిపోయారు.భర్త ఇల్లు వదిలి వెళ్లిపోవడంతో సంధ్యకు కుటుంబ పోషణ భారమైంది. దానికి తోడు లోన్ చెల్లించడం కష్టతరమైంది. చాలీచాలని జీతంతో ముందుకుసాగుతున్న ఈమె సకాలంలో లోన్ తీర్చలేకపోయింది. దీంతో వడ్డీతో కలిపి మొత్తం అప్పు రూ. 8 లక్షలకు చేరింది. ఈ మొత్తాన్ని చెల్లించాలని లోన్ ఇచ్చిన కంపెనీలు ఈమెపై ఒత్తిడి తెచ్చాయి.లోన్ చెల్లించడంలో విఫలమవడంతో లోన్ ఇచ్చిన సంస్థలు ఇంటిని స్వాధీనం చేసుకున్నాయి. కట్టు బట్టలతో.. పిల్లలతో సహా సంధ్య రోడ్డుపై నిలబడాల్సి వచ్చింది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇది ఎంఏ యూసఫ్ అలీ కంటపడటంతో.. తక్షణమే స్పందించారు.ఇదీ చదవండి: బంగారం కొనడానికి గోల్డెన్ ఛాన్స్!.. రెండో రోజు తగ్గిన ధరలుసంధ్య లోన్ మొత్తం చెల్లించాలని తన సిబ్బందిని ఆదేశించారు. అంతే కాకుండా వారి జీవితం కొంత సాఫీగా సాగటానికి మరో రూ. 10 లక్షలు ఇవ్వాలని చెప్పడంతో సంధ్య సమస్యలు తీరిపోయాయి. కష్టాల్లో ఉన్న మహిళకు.. లులు మాల్ అధినేత అండగా నిలబడంతో నెటిజన్లు యూసఫ్ అలీని తెగ మెచ్చుకుంటున్నారు. -
రూ.4000 కోట్లతో షాపింగ్ మాల్.. మూడువేల జాబ్స్
భారతదేశంలో లులు గ్రూప్ ఇంటర్నేషనల్ కార్యకలాపాలను విస్తరించడానికి చైర్మన్ అండ్ ఎండీ 'ఎంఏ యూసఫ్ అలీ' ప్రయాణిస్తూనే ఉన్నారు. ఇందులో భాగంగానే ఇప్పుడు అహ్మదాబాద్‌లో అతిపెద్ద షాపింగ్ మాల్ నిర్మించనున్నట్లు ఈయన పేర్కొన్నారు. దీనికోసం ఇప్పటికే 3,50,000 చదరపు అడుగుల భూమిని సేకరించినట్లు కూడా అలీ వెల్లడించారు.భారతదేశంలో అతిపెద్ద షాపింగ్ మాల్ నిర్మించడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి మద్దతు లభిస్తోందని యూసఫ్ అలీ అన్నారు. ఈ మాల్ నిర్మాణం పూర్తయితే సుమారు 3000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడించారు. ఈ షాపింగ్ మాల్ నిర్మించడానికి సుమారు రూ. 4000 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా.ప్రస్తుతం భారతదేశంలో ప్రధాన నగరాలైన బెంగళూరు, హైదరాబాద్, కొచ్చి, లక్నో, తిరువనంతపురం, కోయంబత్తూరులలో లులు మాల్స్ ఉన్నాయి. హైదరాబాద్‌లో గత ఏడాది లులు మాల్ ప్రారంభమైంది.ఇదీ చదవండి: గణేష్ చతుర్థి: స్వీట్స్ ఆర్డర్లలో ఆ నగరమే టాప్.. యూఏఈలోని అబుదాబిలో ప్రధాన కార్యాలయాన్ని కలిగిన 'లులు గ్రూప్ ఇంటర్నేషనల్' మిడిల్ ఈస్ట్ అండ్ నార్త్ ఆఫ్రికన్ రిటైల్ పరిశ్రమలో ట్రెండ్‌సెట్టర్‌గా పిలువబడుతుంది. ఈ సంస్థ సుమారు 49 దేశాల్లో హైపర్ మార్కెట్లు, సూపర్ మార్కెట్లను నిర్వహిస్తోంది. ఇందులో ఈజిప్టు, ఇండియా, ఇండోనేసియా, మలేషియా మొదలైన దేశాలు ఉన్నాయి.#WATCH | Kerala: On investment in India, Chairman & Managing Director of Lulu Group International, Yusuffali M. A. says, "...I am very happy to give employment to my fellow citizens...India's biggest shopping mall is in Ahmedabad...I am getting full support from the central… pic.twitter.com/PFsxwVRRu3— ANI (@ANI) September 8, 2024 -
ఫుడ్ ప్రాసెసింగ్‌కు రాష్ట్రం గమ్యస్థానం
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయంతోపాటు అనుబంధ రంగాల్లో రాష్ట్రం విప్లవాత్మక పురోగతి సాధించడం ద్వారా ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులకు ఆకర్షణీయమైన గమ్యస్థానంగా మారుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు అన్నారు. వ్యవసాయ, అనుబంధ రంగాల్లో సాధించిన ఐదు విప్లవాలతో అనేక దిగ్గజ సంస్థలు పెట్టుబడులతో ముందుకు వస్తుండటంతో రైతులు, ప్రభుత్వ ఆదాయం పెరగడంతోపాటు రైతుల జీవన ప్రమాణాలు మెరుగవుతున్నాయన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్, ఎగుమతులు, రిటైల్ రంగంలో అంతర్జాతీయంగా పేరొందిన లులు గ్రూప్ తెలంగాణలో రూ. 3,650 కోట్ల పెట్టుబడితో కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పత్రాలను సోమవారం మంత్రి కేటీఆర్ సమక్షంలో లులు గ్రూప్ ఇంటర్నేషనల్ చైర్మన్, మేనేజింగ్ డైరక్టర్ యూసుఫాలీ ఎంఏ స్వీకరించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటైన తొమ్మిదేళ్లలోనే రాష్ట్ర ప్రభుత్వ తలసరి ఆదాయం రెట్టింపైందని, జీఎస్డీపీలోనూ భారీగా వృద్ధిరేటు నమోదైందన్నారు. నాలుగేళ్ల రికార్డు సమయంలో కాళేశ్వరాన్ని ఎత్తిపోతలను పూర్తి చేయడం ద్వారా రాష్ట్రంలో సాగు విస్తీర్ణం 90 లక్షల ఎకరాలకు చేరిందన్నారు. రాష్ట్రం ఏర్పడే నాటికి వరి దిగుబడి 68 లక్షల మెట్రిక్ టన్నులు కాగా ప్రస్తుతం 3.5 కోట్ల టన్నులకు చేరిందని చెప్పారు. తెలంగాణ బియ్యం కోసం కర్ణాటక, తమిళనాడు నుంచి కూడా డిమాండ్ ఉందన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ, మత్స్య, మాంసం, పాడి , పామాయిల్ విప్లవాలు సాధించడంతో రైతులకు ఆదాయం పెరిగిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. రోజుకు ఐదు లక్షల లీటర్ల పాలను ప్రాసెస్ చేసే మెగా డెయిరీని రూ. 300 కోట్లతో ఈ ఏడాది ఆగస్టులో ఏర్పాటు చేస్తున్నట్లు కేటీఆర్ ప్రకటించారు. రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగాన్ని ప్రోత్సహించేందుకు 10 వేల ఎకరాల్లో ప్ర త్యేక ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ రంగంలో పెట్టుబడులతో ముందుకొస్తే స్థలం కేటాయించేందుకు సిద్ధమని యూసుఫాలీకి హామీ ఇచ్చారు. రాష్ట్రంలో లులు పెట్టుబడులు రూ. 3,650 కోట్లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కేంద్రంగా పనిచేస్తున్న తాము తెలంగాణలో రూ. 3,650 కోట్లతో కార్యకలాపాలు ప్రారంభిస్తున్నట్లు లులు గ్రూప్ ఇంటర్నేషనల్ సీఎండీ యూసుఫాలీ ఎంఏ ప్రకటించా రు. తొలివిడతలో రూ. 500 కోట్ల మేర పెట్టుబడి పెడుతుండగా ఇందులో రూ. 300 కోట్లతో కూకట్‌పల్లిలో ఏర్పాటు చేసిన మాల్‌ను ఈ ఏడాది ఆగస్టులో ప్రారంభిస్తామన్నారు. ఈ మాల్ ద్వారా 2 వేల మందికిపైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. మరో రూ. 200 కోట్లతో చెంగిచెర్లలో రోజుకు 60 టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో 2,500 మందికి ఉపాధి కల్పించేలా ఆధునిక ఇంటిగ్రేటెడ్ మాంసం ప్రాసెసింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మరో 18 నెలల్లో ఈ ప్లాంట్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయన్నారు. వచ్చే ఐదేళ్లలో లులు గ్రూప్ ద్వారా తెలంగాణలో రూ. 3,150 కోట్ల కొత్త పెట్టుబడులు వస్తాయని, రూ. 2 వేల కోట్లతో హైదరాబాద్‌లో డెస్టినేషన్ షాపింగ్‌మాల్, రూ.వెయ్యి కోట్లతో ప్రధాన నగరాలు, ఇతర పట్టణాల్లో మినీమాల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రభుత్వం సహకరిస్తే తెలంగాణ నుంచి 5 లక్షల టన్నుల బియ్యం కొనుగోలుతోపాటు ఫిష్ ప్రాసెసింగ్ సెంటర్‌ను తక్షణమే ఏర్పాటు చేస్తా మని యూసుఫాలీ ప్రకటించారు. సమా వేశంలో పశుసంవర్థక శాఖ ప్రత్యేక కార్యదర్శి అధర్ సిన్హా, టీఎస్ఐఐసీ చైర్మన్ ఈవీ నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఇప్పటివరకు చూడని కోట్లు విలువైన 'యూసఫ్ అలీ' కార్ల ప్రపంచం!
M.A Yusuf Ali Car Collection: భారతదేశంలోని ప్రముఖ పారిశ్రామిక వేత్తల్లో ఒకరైన 'లులు గ్రూప్ ఇంటర్నేషనల్' (Lulu Group International) అధినేత 'ఎమ్ఏ యూసఫ్ అలీ' (M.A Yusuf Ali) గురించి దాదాపు అందరికి తెలుసు. ఎందుకంటే ఈయన ఇండియాలోని సంపన్నుల జాబితాలో ఒకరు మాత్రమే కాదు, కోట్లు విలువ చేసే అనేక అన్యదేశ్యపు లగ్జరీ కార్లను కూడా కలిగి ఉన్న ప్రముఖుల జాబితాలో కూడా ఒకరు. యూసఫ్ అలీ గ్యారేజిలోని లగ్జరీ కార్లను గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. రోల్స్ రాయిస్ ఘోస్ట్ ప్రపంచ మార్కెట్లో అత్యంత ఖరీదైన కారుగా ప్రసిద్ధి చెందిన రోల్స్ రాయిస్ కేవలం సంపన్న వ్యాపారవేత్తలు, సినీ సెలబ్రిటీలు మాత్రమే కొనుగోలు చేస్తారు. ఈ జాబితాలో యూసఫ్ అలీ ఉన్నారు. ఈయన రోల్స్ రాయిస్ కంపెనీకి చెందిన ఘోస్ట్ కారుని కలిగి ఉన్నారు. దీని ధర సుమారు రూ. 8 కోట్ల వరకు ఉంటుందని అంచనా. భారతదేశంలో ఉన్నప్పుడు ఈయన ఈ కారునే ఎక్కువగా వినియోగిస్తారని సమాచారం. ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్ ల్యాండ్ రోవర్ కంపెనీకి చెందిన ఖరీదైన రేంజ్ రోవర్ వోగ్ కూడా ఈయన గ్యారేజిలో ఉంది. యూసఫ్ అలీ కొనుగోలు చేసిన ఈ కారు వైట్ కలర్ పెయింట్ స్కీమ్ కలిగి చూడచక్కగా ఉంటుంది. ఇతని వద్ద బ్లాక్ కలర్ ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ వోగ్ కూడా ఉన్నట్లు సమాచారం. వీటిని తన కుటుంబంతో పాటు ప్రయాణించడానికి ఉపయోగిస్తాడని తెలుస్తోంది. ఈ కార్లు కేరళ రిజిస్ట్రేషన్ నెంబర్ కలిగి ఉండటం గమనార్హం. బెంట్లీ బెంటాయగా బెంట్లీ కంపెనీకి చెందిన బెంటాయగా వంటి విలాసవంతమైన SUV కూడా యూసఫ్ అలీ ఖాన్ గ్యారేజిలో ఉంది. ఇది కూడా కేరళ రిజిస్ట్రేషన్ కలిగి ఉంది. భారతదేశంలో మొట్ట మొదటి బెంట్లీ బెంటాయగా కొనుగోలు చేసిన వ్యక్తి యూసఫ్ అలీ కావడం ఇక్కడ తెలుసుకోవలసిన విషయం. (ఇదీ చదవండి: ఆనంద్ మహీంద్రా ఇకనైనా శ్రద్ద పెట్టండి - నెట్టింట్లో మహిళ ట్వీట్ వైరల్!) రోల్స్ రాయిస్ కల్లినన్ ముఖేష్ అంబానీ వంటి కుబేరుల వద్ద ఉన్న రోల్స్ రాయిస్ కల్లినన్ కూడా యూసఫ్ అలీ గ్యారేజిలో ఉంది. ఎక్కువమంది సెలబ్రిటీలు ఇష్టపడి కొనుగోలు చేసే రోల్స్ రాయిస్ కార్లలో కల్లినన్ ప్రధానంగా చెప్పుకోదగ్గ మోడల్. ఈ కారుని అతడు దుబాయ్‌లో ఉపయోగిస్తాడని తెలుస్తోంది. (ఇదీ చదవండి: కన్నీళ్లు తెప్పిస్తున్న స్విగ్గీ డెలివరీ బాయ్ కష్టాలు.. కస్టమర్ సాయంతో జాబ్ కొట్టాడిలా..!) రోల్స్ రాయిస్, బెంట్లీ వంటి కార్లతో పాటు యూసఫ్ అలీ మినీ కూపర్ కంపెనీకి చెందిన మినీ కంట్రీమ్యాన్, మెర్సిడెస్-మేబ్యాక్ GLS, లెక్సస్ LX750, BMW 7-సిరీస్, మెర్సిడెస్-మేబ్యాక్ S600 వంటి ఖరీదైన కార్లు ఆయన గ్యారేజిలో ఉన్నాయి. ప్రపంచంలో అత్యంత ఖరీదైన కార్లను ఉపయోగించే ధనవంతుల జాబితాలో యూసఫ్ అలీ ఖాన్ కూడా ఒకరుగా ఉన్నారు. -
హెచ్డీఎఫ్సీ బ్యాంక్–లులు భాగస్వామ్యం
తిరువనంతపురం: ప్రైవేటు రంగ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యూఏఈకి చెందిన లులు ఎక్సే్చంజ్ ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. దీని ప్రకారం ఇరు సంస్థలు భారత్, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) ప్రాంతంలో సీమాంతర చెల్లింపులను బలోపేతం చేస్తాయి. తొలి దశలో రెమిట్నౌ2ఇండియా సేవలను హెచ్డీఎఫ్సీ అందుబాటులోకి తేనుంది. యూఏఈ నుంచి కస్టమర్లు భారత్‌లోని ఏదేని బ్యాంక్ ఖాతాకు ఐఎంపీఎస్, నెఫ్ట్ విధానంలో హెచ్డీఎఫ్సీ డిజిటల్ బ్యాంకింగ్ వేదికల ద్వారా నగదు పంపవచ్చు. భారత్‌లో లులు ఫారెక్స్, లులు ఫిన్సర్వ్ కంపెనీల బలోపేతానికి సైతం ఈ ఒప్పందం దోహదం చేస్తుందని బ్యాంక్ తెలిపింది. -
రెడీగా ఉండండి.. భారత్‌లో మరిన్ని షాపింగ్ మాల్స్
న్యూఢిల్లీ: యూఏఈకి చెందిన లులూ గ్రూప్ భారత్‌లో మరిన్ని వాణిజ్య సముదాయాల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే కంపెనీ కొచ్చి, త్రివేండం, బెంగళూరు, లక్నో, త్రిసూర్ నగరాల్లో రూ.7,000 కోట్ల వ్యయంతో ఐదు షాపింగ్ మాల్స్‌ను నిర్మించింది. ‘‘భారత మార్కెట్ లూలు గ్రూప్‌నకు అత్యంత కీలకమైంది. ఇక్కడి వ్యవస్థీకృత రిటైల్ రంగం కేవలం 12 శాతం మాత్రమే వినియోగంలో ఉంది. ఈ విభాగంలో భారీ వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడతాము’’ అని గ్రూప్ షాపింగ్ మాల్స్ డైరెక్టర్ శిబు ఫిలిప్స్ తెలిపారు. చదవండి: Apple: యాపిల్ భారీ షాక్, ఉద్యోగులపై వేటు! -
తెలంగాణలో రూ.500 కోట్లతో లులూ పరిశ్రమ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రూ.500 కోట్ల పెట్టుబడితో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు లులూ గ్రూపు ముందుకు వచ్చింది. జీనోమ్ వ్యాలీలో ఇప్పటికే ఒక ఉత్పత్తి యూనిట్ కలిగి ఉన్న స్పెయిన్ కంపెనీ ‘కిమో ఫార్మా’రూ.100 కోట్ల పెట్టుబడితో మరో యూనిట్ ఏర్పాటుకు ఆసక్తి చూపింది. స్విట్జర్లాండ్‌కు చెందిన బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగ కంపెనీ ‘స్విస్ రే’నగరంలో తన కార్యాలయాన్ని ప్రారంభించనుంది. వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సు తొలిరోజు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావుతో చర్చలు జరిపిన అనంతరం ఈ మేరకు పెట్టుబడులు పెట్టేందుకు ఆయా కంపెనీలు ముందుకు వచ్చాయని మంత్రి కార్యాలయం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలో మరోచోట యూనిట్: లులూ అధినేత దావోస్‌లో కేటీఆర్.. లులూ గ్రూప్ అధిపతి యూసుఫ్ అలీతో సమావేశమై చర్చలు జరిపారు. రూ.500 కోట్లతో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటుకు యూసుఫ్ ముందుకు రాగా, దీనికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావాల్సిన అనుమతుల పత్రాలను మంత్రి అక్కడికక్కడే అందజేశారు. రాష్ట్రంలో మరోచోట సైతం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామని, త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తామని యూసుఫ్ తెలిపారు. తమ యూనిట్లకు త్వరలోనే శంకుస్థాపన నిర్వహిస్తామన్నారు. తెలంగాణ ప్రాంతం నుంచి యూరప్ వంటి దేశాలకు ఫుడ్ ప్రాసెసింగ్ ఉత్పత్తులను ఎగుమతి చేసే స్థాయిలో తమ యూనిట్ ఉండనుందన్నారు. తెలంగాణలో భారీ కమర్షియల్ కాంప్లెక్సులు నిర్మించనున్నామని, హైదరాబాద్‌లో పలు స్థలాలను కూడా ఎంపిక చేశామని, యజమానులతో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. నగరంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో షాపింగ్ మాల్ నిర్మించాలన్నది తమ లక్ష్యమని చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహించడం ద్వారా వ్యవసాయోత్పత్తులు, అనుబంధ రంగాల ఉత్పత్తులకు డిమాండ్ పెంచాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని, లులూ గ్రూప్ అంతర్జాతీయ స్థాయి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌తో ఇది సాకారం కానుందని కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. 250 మందితో ‘స్విస్ రే’ కార్యాలయం రాష్ట్రంలో నైపుణ్యం గల మానవ వనరుల లభ్యతను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్‌లో తమ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ‘స్విస్ రే’గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ వెరోనికా స్కాట్టి బృందం మంత్రి కేటీఆర్‌తో జరిపిన చర్చల సందర్భంగా సంసిద్ధత వ్యక్తం చేసింది. తొలుత 250 మంది ఉద్యోగులతో తమ కార్యాలయాన్ని ప్రారంభిస్తామని, దశల వారీగా ఈ సంఖ్యను మరింతగా పెంచుకుంటూ వెళ్తామని వెరోనికా తెలిపారు. సంస్థ డేటా, డిజిటల్ విభాగాలను బలోపేతం చేయడం, బీమా ఉత్పత్తులను రూపొందించడం, రిస్క్ మేనేజ్మెంట్ వంటి అంశాలపై తమ హైదరాబాద్ కార్యాలయం పనిచేస్తుందని చెప్పారు. ఇన్నోవేషన్, ఇతర సహకారం కోసం టీ–హబ్‌తో భాగస్వామ్యానికి సైతం సంసిద్ధత వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కిమో ఏపీఐ యూనిట్ కిమో ఫార్మా 2018లో నగరంలో క్వాలిటీ కంట్రోల్, స్టెబిలిటీ ల్యాబ్స్ వంటి విభాగాల్లో తమ కార్యకలాపాలను ప్రారంభించింది. కాగా రూ.100 కోట్లతో తమ రెండో ఉత్పత్తి యూనిట్ ఏర్పాటు చేస్తామని కిమో గ్రూప్ డైరెక్టర్ జీన్ డానియల్ బోనీ మంత్రి కేటీఆర్‌తో జరిపిన చర్చల సందర్భంగా వెల్లడించారు. భవిష్యత్తులో ఆక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రెడియంట్ (ఏపీఐ) ఉత్పత్తి యూనిట్‌తో పాటు పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని నగరంలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ‘మీషో’ ఈ–కామర్స్ భారీ పెట్టుబడి: కేటీఆర్ ట్వీట్ ఈ–కామర్స్ పరిశ్రమ ‘మీషో’ హైదరాబాద్‌లో కార్యాలయం ఏర్పాటుకు ముందుకు వచ్చిందని, ద్వితీయ శ్రేణి నగరాల్లో రిటైల్ సేల్స్‌పై దృష్టి పెట్టనుందని కేటీఆర్ ట్విటర్ ద్వారా ప్రకటించారు. డబ్ల్యూఈఎఫ్‌లో వచ్చిన మరో భారీ పెట్టుబడి ఇది అని తెలిపారు. -
‘అందుకే లూలూ సంస్థకు భూములు రద్దు చేశాం’
సాక్షి, అమరావతి : యూఏఈకి చెందిన లూలూ గ్రూప్ సంస్థ ఎప్పటికీ ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టమని చెప్పిందనే వార్తాల్లో ఏలాంటి వాస్తవం లేదని పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి కొట్టిపారేశారు. ఈ విషయంపై తమకు ఎలాంటి సమాచారం అందలేదని స్పష్టం చేశారు. గురువారం సచివాలయంలో మంత్రి మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వం ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటుకు లూలూ గ్రూప్ సంస్థకు విశాఖపట్నంలో 13.83 ఎకరాల భూమి కేటాయించిందని పేర్కొన్నారు. లూలూ సంస్థ సింగిల్ బీడ్ వేసినా.. అది నిబంధనలకు విరుద్ధం అని తెలిసినా.. ప్రభుత్వం వారికే ఇచ్చిందని విమర్శించారు. సింగిల్ బిడ్ మాత్రమే రావడంతోపాటు ఆ భూమి ప్రైమ్ ఏరియాలో ఉండటం కూడా సంస్థను రద్దు చేయడానికి ఒక కారణమన్నారు. ఈ సంస్థకు కేటాయించిన భూములపై కేసులు ఉన్నాయని మంత్రి తెలిపారు. అవినీతికి మేము వ్యతిరేకం ఇక ఆ ప్రాంతంలో రూ.50 కోట్ల ఆదాయం వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారని, అయితే టీడీపీ చాలా తక్కువ రెంటల్ వాల్యూకు అక్కడి భూములను లూలూ సంస్థకు ఇచ్చారని వెల్లడించారు. లూలూ కంపెనీకి లెటర్ ఆఫ్ ఇండెంట్ ఇచ్చినా గత ప్రభుత్వం ఏమి చేయలేకపోయిందని విమర్శించారు. అవినీతికి తాము వ్యతిరేకమని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ముందు నుంచే చెబుతూ వస్తున్నారని, అందుకే రాష్ట్ర ప్రజలకు నష్టం కలిగే ఆలోచనను నిరోధించామని తెలిపారు. ఏపీఐఐసీ దగ్గర కూడా గొప్ప టెక్నాలజీ ఉందని, గతంలో అనేక నిర్మాణాలను చేపట్టిందన్నారు. దాదాపు రూ.1000 కోట్లతో అనంతపురంలో విద్యుత్ బస్సుల నిర్మాణ సంస్థ వీరా వాహన ఉద్యోగ ప్రైవేటు లిమిటెడ్‌తో ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. ఆర్బిట్రేషన్ ప్రతి ఒక్కరి హక్కు. పీపీఏల విషయంలో ఆర్బిట్రేషన్‌కు వెళ్లడంలో తప్పు లేదని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం తప్పు చేస్తే తాము ఎందుకు తప్పుచేయాలని ప్రశ్నించారు. గత టీడీపీ ప్రభుత్వం చిన్న, మధ్యతరహా కంపెనీలకు మౌలిక వసతులు కల్పించకుండా ఇబ్బందులు పెట్టిందని ఆరోపించారు. తమ ప్రభుత్వం ఇచ్చే భూములలో పరిశ్రమల నిర్మాణానికి ఎలాంటి ఆటంకాలు లేకుండా చూస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. -
గాల్లో లూలూ!
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరంలో భారీగా నిర్మించతలపెట్టిన లూలూ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ ప్రాజెక్టు పెండింగులో పడినట్టు తెలిసింది. బీచ్ రోడ్డుకు ఆనుకుని ఏపీఐఐసీ మైదానంలో పబ్లిక్ ప్రయివేటు భాగస్వామ్యం (పీపీపీ) కింద దీని నిర్మాణానికి గత టీడీపీ ప్రభుత్వం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి చెందిన లూలూ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. గత ఏడాది ఫిబ్రవరి 24వ తేదీ సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభం రోజున భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కలిసి అప్పటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. సుమారు రూ.2 వేల కోట్ల అంచనా వ్యయంతో ఈ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. లూలూ కన్వెన్షన్ సెంటర్‌కు తొలుత ఏపీఐఐసీకి చెందిన 9.20 ఎకరాలు కేటాయించారు. ఆ తర్వాత సీఎంఆర్ సంస్థకు చెందిన 3.4 ఎకరాలు తీసుకుని పరిహారంగా వివిధ చోట్ల ఉన్న 4.85 ఎకరాలు ఆ సంస్థకు ఇచ్చారు. కొన్నాళ్ల క్రితం ఏపీఐఐసీ స్థలానికి ఆనుకుని ఉన్న 2.12 ఎకరాల ప్రయివేటు స్థలాన్ని కూడా లూలూ సంస్థ యాజమాన్యం కేటాయించాలని కోరింది. దీనికి ప్రభుత్వం సై అంటూ భూసేకరణకు కూడా పూనుకుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి రూ.300 కోట్లు డిపాజిట్ చేయాలని చంద్రబాబు కోరినట్టు సమాచారం. టీడీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని ముందే ఊహించిన లూలూ యాజమాన్యం అందుకు ససేమిరా అన్నట్టు తెలిసింది. దీంతో లూలూకు సంబంధించిన ప్రక్రియ ముందుకు సాగడానికి అధికార యంత్రాంగం కూడా వెనకడుగు వేసింది. కొన్నాళ్ల క్రితం ప్రతిపాదిత లూలూ కన్వెన్షన్ సెంటరు స్థలాన్ని చదును చేసి, ఆ తర్వాత దాని జోలికెళ్లలేదు. ఫలితంగా ఈ లూలూ కన్వెన్షన్ సెంటర్ ప్రగతి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. ‘లూలూ’ ఒప్పందాలను రద్దుచేయాలి అల్లిపురం (విశాఖ దక్షిణం): గత ప్రభుత్వం విశాఖనగరంలో అంతర్జాతీయ సంస్థ లూలూకు కేటాయించిన భూ కేటాయింపులు రద్దు చేయాలని సీపీఎం నగర కార్యదర్శి బి.గంగారావు కోరారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆన్లైన్లో ఒక లేఖ పంపించారు. మధురవాడలో స్థాపించడానికి నిర్ణయించి టెండర్లు ఆహ్వానించారని, అయితే నాటి ముఖ్యమంత్రి జోక్యంతో ఈ ప్రక్రియను మధ్యలోనే నిలిపివేసి మధురవాడ నుంచి నగర నడిబొడ్డున ఉన్న రామకృష్ణాబీచ్ వద్దకు మార్చారని చెప్పారు. టెండర్లను పక్కన పెట్టి లూలూ సంస్థకు ఏకపక్షంగా ఏపీఐఐసీకి చెందిన 9.5 ఎకరాలు స్థలాన్ని నామమాత్రపు లీజుకు కేటాయించటమే కాకుండా 4.5 ఎకరాల ప్రైవేటు స్థలాన్ని కూడా సేకరించి లూలూ సంస్థకు కేటాయించారని లేఖలో పేర్కొన్నారు. ఈ పనులన్నీ నిబంధనలకు విరుద్ధంగా స్వయంగా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జోక్యంతోనే జరిగాయని వివరించారు. పర్యావరణ, వుడా సంబంధిత అధికారులు నిబంధనలకు విరుద్ధమని తెలిపినా ఆయన పట్టించుకోలేదని చెప్పారు. అప్పట్లో అన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ఆందోళన కూడా చేశాయని, ఈ విషయాన్ని పాదయాత్రలో మీ దృష్టికి తేగా అధికారంలోకి వచ్చిన తరువాత ఈ ఒప్పందాలను రద్దు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. పారదర్శక పాలనకు శ్రీకారం హర్హణీయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వై.ఎస్.జగన్మోహన్రెడ్డికి గంగారావు అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రిగా పారదర్శకమైన పాలనకు ఆయన శ్రీకారం చుట్టడం ఆహ్వానించదగ్గ విషయమని పేర్కొన్నారు. నూతన ప్రభుత్వ పాలన విధానాలకు అనుగుణంగా గత ప్రభుత్వం లూలూ సంస్థతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు. బాబుపై ముడుపుల ఆరోపణలు ఈ కన్వెన్షన్ సెంటర్ కోసం వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను అప్పనంగా ధారాదత్తం చేయడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌కు రూ.500 కోట్ల ముడుపులు ముట్టాయని అఖిలపక్ష నేతలు, మేధావులు గతంలో ఆరోపించారు. దీని టెండర్లలోనూ అవకతవకలు జరిగాయని ధ్వజమెత్తారు. ఈ కన్వెన్షన్ సెంటర్ వల్ల చిన్న మాల్స్, దుకాణాలు దెబ్బతిని 25 వేల మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు గండిపడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.పర్యాటకులను ఆకట్టుకుంటున్న విశాఖ బీచ్‌రోడ్డులో ఈ కన్వెన్షన్ సెంటర్ పూర్తయితే బీచ్‌రోడ్‌లో కూర్చునేందుకు అడుగు స్థలం కూడా ఉండదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా లూలూ సంస్థకు జరిపిన భూ కేటాయింపుల వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. భూ కేటాయింపులను అడ్డుకునేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని నిర్ణయించారు. -
కేరళ వరదలు : కారుకూత, తగిన శాస్తి
వరద బీభత్సంతో కేరళ ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతుంటే, వారి అవసరాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఉద్యోగికి ఓ గల్ఫ్ కంపెనీ యాజమాన్యం తగిన బుద్ధి చెప్పింది. కనీస మానవత్వాన్ని మరిచి వ్యాఖ్యానించాడు. నోటికొచ్చినట్టుగా అనుచితంగా ఫేస్బుక్లో ఒక పోస్ట్ పెట్టాడు. ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కంపెనీ అతగాడిని ఉద్యోగంనుంచి తొలగించింది. తప్పయిందంటూ ఆనక లెంపలేసుకున్నా..ఆ కంపెనీ కనికరించలేదు. అటు ఈ వ్యాఖ్యలు చేసింది కేరళకు చెందిన వ్యక్తే కావడం గమనార్హం. కేరళకు చెందిన రాహుల్ లులు గ్రూప్ కంపెనీ ఒమన్ బ్రాంచ్‌లో కేషియర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. కేరళలో వరద బాధితులకు వలంటీర్లు సహాయం చేస్తుండడంపై రెండు రోజుల క్రితం ఫేస్బుక్లో ఆయనో పోస్ట్ పెట్టాడు. సహాయక శిబిరాల్లో ఎవరైనా సానిటరీ నేప్కిన్స్ కోసం అడిగితే, తాను మాత్రం వాటికి బదులుగా కండోమ్స్ అడుగుతానంటూ బాధితులను అవహేళన చేస్తూ మాట్లాడాడు. ఈ వ్యాఖ్యలు వైరల్ అవడంతో రాహుల్ ఉద్యోగం చేస్తున్న సంస్థ స్పందించింది. తక్షణమే రాహుల్‌ను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది. మద్యం మత్తులోఅలా మాట్లాడాను తప్పైపోయింది, క్షమించండంటూ నాలిక్కరుచుకున్నా.. కంపెనీ ఎంతమాత్రం ఉపేక్షించలేదు. రాహుల్‌కు తగిన శాస్తి చేసింది. కాగా కేరళ వరద బాధితుల పునరావాస కార్యక్రమాలకోసం విరాళమిచ్చిన గల్ఫ్ కంపెనీల్లో లులు గ్రూపు కంపెనీ కూడా ఉంది. కేరళకు చెందిన వ్యాపారవేత్త, లులు గ్రూపు ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ యూసుఫ్ అలీ 5కోట్ల రూపాయలును విరాళమిచ్చారు. అటు తమ ఆర్థిక వ్యవస్థ విజయంలో కేరళీయులది కీలక భాగమని, వారికి సహాయం చేయాల్సిన బాధ్యత తమపై ఉందంటూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
హైదరాబాద్ లో లులూ మెగా మాల్
♦ 50 ఎకరాల్లో ఏర్పాటుకు కసరత్తు ♦ 100 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ♦ టీఎస్ఐఐసీ అంగీకారం! హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రిటైల్ రంగంలో ఉన్న యూఏఈకి చెందిన లులూ గ్రూప్... హైదరాబాద్‌లో మెగా షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తోంది. ఈ మాల్లో లులూ గ్రూప్‌నకు చెందిన భారీ హైపర్ మార్కెట్ కూడా యాంకర్ యూనిట్‌గా ఏర్పాటుకానుంది. 2019 నాటికి నిర్మాణం పూర్తయ్యే ఈ మాల్ కోసం... 50 ఎకరాల స్థలం సమకూర్చాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని సంస్థ కోరింది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు నేతృత్వంలోని అధికారులు రాష్ట్రంలో పెట్టుబడుల విషయమై కొన్ని నెలలుగా లులూ గ్రూప్‌తో చర్చలు జరుపుతున్నారు. స్మార్ట్ సిటీ ఏర్పాటుపై కూడా కంపెనీతో చర్చించారు. భారత్‌లో రూ.5,000 కోట్లు.. దేశంలో అతిపెద్ద మాల్‌ను 2013లో కేరళలోని కొచ్చిలో 17 ఎకరాల్లో కంపెనీ ఏర్పాటు చేసింది. దీన్లో ఒకేసారి లక్ష మంది షాపింగ్ చేయవచ్చు. లులూ హైపర్‌మార్కెట్ యాంకర్ యూనిట్‌గా 315 బ్రాండ్లు ఔట్లెట్లను తెరిచాయి. దీనికి కంపెనీ రూ.1,600 కోట్లు ఖర్చు చేసింది. హైదరాబాద్ ప్రాజెక్టు ఇంత కంటే భారీ స్థాయిలో ఉండనుంది. మరోవైపు చెన్నై, బెంగళూరు, తిరువనంతపురంలో షాపింగ్ మాల్స్ నాలుగేళ్లలో రానున్నాయి. 2019 నాటికి భారత్‌లో రూ.5,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు గ్రూప్ వ్యవస్థాపకుడు యూసుఫ్ అలీ ప్రకటించారు. ప్రాసెసింగ్ యూనిట్లు సైతం... పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్ యూనిట్‌తో పాటు మాంసం ప్రాసెసింగ్ యూనిట్‌ను తెలంగాణలో నెలకొల్పేందుకు లులూ గ్రూప్ కృతనిశ్చయంతో ఉంది. వీటికై 100 ఎకరాల స్థలం కావాలని ప్రభుత్వాన్ని కోరింది. భాగ్యనగరానికి వెలుపల అనువైన స్థలాలను టీఎస్ఐఐసీ చూపించింది కూడా. వీటికి రూ.300 కోట్ల దాకా ఖర్చు చేసే అవకాశం ఉందని సమాచారం. మొత్తంగా తెలంగాణలో లులూ గ్రూప్ రూ.2,500 కోట్లకుపైగా వెచ్చించనున్నట్టు తెలుస్తోంది. ఇక కన్వెన్షన్ సెంటర్లను ఏపీలో ఏర్పాటు చేయాలని ఈ గ్రూప్ భావిస్తోంది. -
తెలంగాణలో రూ.2,500 కోట్ల పెట్టుబడులు
లూలూ గ్రూప్ అంగీకారం దుబాయ్‌లో లూలూ చైర్మన్ అలీతో మంత్రి కేటీఆర్ భేటీ మూడు ప్రాజెక్టుల ఏర్పాటుకు సంసిద్ధత హైదరాబాద్‌లో అత్యాధునిక షాపింగ్ మాల్ ఏర్పాటు గల్ఫ్‌లోని వలస కార్మికులను వెనక్కి రప్పిస్తామన్న కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: మధ్యప్రాచ్య దేశాల్లో రిటైల్ చైన్ వ్యాపారంలో ప్రఖ్యాతిగాంచిన లూలూ గ్రూప్ వచ్చే ఏడాదిలోగా తెలంగాణలో రూ. 2,500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులుగా సోమవారం తనను కలసిన ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు పరిశ్రమల శాఖ కమిషనర్ జయేశ్ రంజన్‌లతో లూలూ గ్రూప్ చైర్మన్ ఎం.ఎ.యూసఫ్‌అలీ ఈ విషయాన్ని ప్రకటించారు. ఐదు బిలియన్ డాలర్ల టర్నోవర్ కలిగిన లూలూ గ్రూప్‌నకు మిడిల్ఈస్ట్లో వందకు పైగా హైపర్మార్కెట్లు ఉన్నాయి. గల్ఫ్‌లో యూసఫ్ అలీకి అత్యంత ధనవంతునిగా పేరుంది. తెలంగాణలో మూడు ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు ఈ గ్రూప్ సంసిద్ధత వ్యక్తం చేసింది. పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్ యూనిట్, సమీకృత మాంసం ప్రాసెసింగ్ యూనిట్, హైదరాబాద్‌లో అత్యాధునిక షాపింగ్ మాల్ ఏర్పాటుచేస్తామని ఆయన తెలిపారు. తమ యూనిట్ల స్థాపన కు తెలంగాణలో యోగ్యమైన భూములను పరిశీలించేందుకు, ప్రాజెక్టుల ప్రతిపాదనలతో లూలూగ్రూప్ ప్రతినిధుల బృందం జనవరిలో తెలంగాణకు రానుంది. సోనాపూర్ క్యాంపు సందర్శన దుబాయ్ పర్యటనలో భాగంగా సోమవారం గల్ఫ్‌లో పనిచేస్తున్న తెలంగాణ కార్మికుల నివాస ప్రాంతాలను మంత్రి కేటీఆర్ సందర్శించారు. సోనాపూర్ క్యాంపులో నివసిస్తున్న వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. తొలుత ఏజెంట్ల చేతిలో మోసపోయామని, ఆపై పని కల్పించే యజమానులు కూడా కనీస వేతనాలు అమలు చేయకుండా శ్రమదోపిడీ చేస్తున్నారని వాపోయారు. గల్ఫ్‌కు వెళ్తున్న కార్మికులు మోసానికి గురికాకుండా తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. గల్ఫ్‌లో తెలంగాణ వారు లక్షమందికిపైగా వలస కార్మికులుండగా.. ఒక్క సోనాపూర్ క్యాంపులోనే 20 వేల మంది ఉన్నట్లు చెప్పారు. చాలీచాలని వేతనాలతో బతుకులీడుస్తున్న వలస కార్మికులందరినీ వెనక్కి రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. వీరంతా తెలంగాణకు వచ్చే పక్షంలో వృత్తినైపుణ్య శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పించేందుకు చర్యలు చేపడతామన్నారు. గల్ఫ్‌కు వచ్చే వారికి ఇక్కడి చట్టాలు, హక్కులపై అవగాహన కల్పించడం, ఇండియన్ కాన్సులేట్‌లో తెలుగు మాట్లాడే వారిని నియమించడం, బాధితులకు న్యాయ సహాయం, కార్మికులకు జీవిత బీమా తదితర కార్యక్రమాలతో కొత్త పాలసీని తేనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.