హైదరాబాద్ లో లులూ మెగా మాల్
♦ 50 ఎకరాల్లో ఏర్పాటుకు కసరత్తు
♦ 100 ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు
♦ టీఎస్‌ఐఐసీ అంగీకారం!
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రిటైల్ రంగంలో ఉన్న యూఏఈకి చెందిన లులూ గ్రూప్... హైదరాబాద్‌లో మెగా షాపింగ్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తోంది. ఈ మాల్‌లో లులూ గ్రూప్‌నకు చెందిన భారీ హైపర్ మార్కెట్ కూడా యాంకర్ యూనిట్‌గా ఏర్పాటుకానుంది. 2019 నాటికి నిర్మాణం పూర్తయ్యే ఈ మాల్ కోసం... 50 ఎకరాల స్థలం సమకూర్చాల్సిందిగా తెలంగాణ ప్రభుత్వాన్ని సంస్థ కోరింది. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు నేతృత్వంలోని అధికారులు రాష్ట్రంలో పెట్టుబడుల విషయమై కొన్ని నెలలుగా లులూ గ్రూప్‌తో చర్చలు జరుపుతున్నారు. స్మార్ట్ సిటీ ఏర్పాటుపై కూడా కంపెనీతో చర్చించారు. భారత్‌లో రూ.5,000 కోట్లు..
దేశంలో అతిపెద్ద మాల్‌ను 2013లో కేరళలోని కొచ్చిలో 17 ఎకరాల్లో కంపెనీ ఏర్పాటు చేసింది. దీన్లో ఒకేసారి లక్ష మంది షాపింగ్ చేయవచ్చు. లులూ హైపర్‌మార్కెట్ యాంకర్ యూనిట్‌గా 315 బ్రాండ్లు ఔట్‌లెట్లను తెరిచాయి. దీనికి కంపెనీ రూ.1,600 కోట్లు ఖర్చు చేసింది. హైదరాబాద్ ప్రాజెక్టు ఇంత కంటే భారీ స్థాయిలో ఉండనుంది. మరోవైపు చెన్నై, బెంగళూరు, తిరువనంతపురంలో షాపింగ్ మాల్స్ నాలుగేళ్లలో రానున్నాయి. 2019 నాటికి భారత్‌లో రూ.5,000 కోట్ల పెట్టుబడి పెట్టనున్నట్లు గ్రూప్ వ్యవస్థాపకుడు యూసుఫ్ అలీ ప్రకటించారు.
ప్రాసెసింగ్ యూనిట్లు సైతం...
పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్ యూనిట్‌తో పాటు మాంసం ప్రాసెసింగ్ యూనిట్‌ను తెలంగాణలో నెలకొల్పేందుకు లులూ గ్రూప్ కృతనిశ్చయంతో ఉంది. వీటికై 100 ఎకరాల స్థలం కావాలని ప్రభుత్వాన్ని కోరింది. భాగ్యనగరానికి వెలుపల అనువైన స్థలాలను టీఎస్‌ఐఐసీ చూపించింది కూడా. వీటికి రూ.300 కోట్ల దాకా ఖర్చు చేసే అవకాశం ఉందని సమాచారం. మొత్తంగా తెలంగాణలో లులూ గ్రూప్ రూ.2,500 కోట్లకుపైగా వెచ్చించనున్నట్టు తెలుస్తోంది. ఇక కన్వెన్షన్ సెంటర్లను ఏపీలో ఏర్పాటు చేయాలని ఈ గ్రూప్ భావిస్తోంది.