తెలంగాణలో రూ.2,500 కోట్ల పెట్టుబడులు
- లూలూ గ్రూప్ అంగీకారం
- దుబాయ్‌లో లూలూ చైర్మన్ అలీతో మంత్రి కేటీఆర్ భేటీ
- మూడు ప్రాజెక్టుల ఏర్పాటుకు సంసిద్ధత
- హైదరాబాద్‌లో అత్యాధునిక షాపింగ్ మాల్ ఏర్పాటు
- గల్ఫ్‌లోని వలస కార్మికులను వెనక్కి రప్పిస్తామన్న కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: మధ్యప్రాచ్య దేశాల్లో రిటైల్ చైన్ వ్యాపారంలో ప్రఖ్యాతిగాంచిన లూలూ గ్రూప్ వచ్చే ఏడాదిలోగా తెలంగాణలో రూ. 2,500 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత వ్యక్తం చేసింది. తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులుగా సోమవారం తనను కలసిన ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కె.తారక రామారావు పరిశ్రమల శాఖ కమిషనర్ జయేశ్ రంజన్‌లతో లూలూ గ్రూప్ చైర్మన్ ఎం.ఎ.యూసఫ్‌అలీ ఈ విషయాన్ని ప్రకటించారు.
ఐదు బిలియన్ డాలర్ల టర్నోవర్ కలిగిన లూలూ గ్రూప్‌నకు మిడిల్‌ఈస్ట్‌లో వందకు పైగా హైపర్‌మార్కెట్లు ఉన్నాయి. గల్ఫ్‌లో యూసఫ్ అలీకి అత్యంత ధనవంతునిగా పేరుంది. తెలంగాణలో మూడు ప్రాజెక్టులను ఏర్పాటు చేసేందుకు ఈ గ్రూప్ సంసిద్ధత వ్యక్తం చేసింది. పండ్లు, కూరగాయల ప్రాసెసింగ్ యూనిట్, సమీకృత మాంసం ప్రాసెసింగ్ యూనిట్, హైదరాబాద్‌లో అత్యాధునిక షాపింగ్ మాల్ ఏర్పాటుచేస్తామని ఆయన తెలిపారు. తమ యూనిట్ల స్థాపన కు తెలంగాణలో యోగ్యమైన భూములను పరిశీలించేందుకు, ప్రాజెక్టుల ప్రతిపాదనలతో లూలూగ్రూప్ ప్రతినిధుల బృందం జనవరిలో తెలంగాణకు రానుంది.
సోనాపూర్ క్యాంపు సందర్శన
దుబాయ్ పర్యటనలో భాగంగా సోమవారం గల్ఫ్‌లో పనిచేస్తున్న తెలంగాణ కార్మికుల నివాస ప్రాంతాలను మంత్రి కేటీఆర్ సందర్శించారు. సోనాపూర్ క్యాంపులో నివసిస్తున్న వారి స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. తొలుత ఏజెంట్ల చేతిలో మోసపోయామని, ఆపై పని కల్పించే యజమానులు కూడా కనీస వేతనాలు అమలు చేయకుండా శ్రమదోపిడీ చేస్తున్నారని వాపోయారు. గల్ఫ్‌కు వెళ్తున్న కార్మికులు మోసానికి గురికాకుండా తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.
గల్ఫ్‌లో తెలంగాణ వారు లక్షమందికిపైగా వలస కార్మికులుండగా.. ఒక్క సోనాపూర్ క్యాంపులోనే 20 వేల మంది ఉన్నట్లు చెప్పారు. చాలీచాలని వేతనాలతో బతుకులీడుస్తున్న వలస కార్మికులందరినీ వెనక్కి రప్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. వీరంతా తెలంగాణకు వచ్చే పక్షంలో వృత్తినైపుణ్య శిక్షణ ఇప్పించి ఉపాధి కల్పించేందుకు చర్యలు చేపడతామన్నారు. గల్ఫ్‌కు వచ్చే వారికి ఇక్కడి చట్టాలు, హక్కులపై అవగాహన కల్పించడం, ఇండియన్ కాన్సులేట్‌లో తెలుగు మాట్లాడే వారిని నియమించడం, బాధితులకు న్యాయ సహాయం, కార్మికులకు జీవిత బీమా తదితర కార్యక్రమాలతో కొత్త పాలసీని తేనున్నట్లు మంత్రి పేర్కొన్నారు.