ఏపీ పెవిలియన్‌ను యూఏఈ విదేశాంగశాఖ మంత్రి తనిబిన్ అహ్మద్ ఆల్ జియాది తదితరులతో కలిసి ప్రారంభించిన మంత్రి మేకపాటి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామిక రంగానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పెద్ద పీట వేస్తున్నారని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చెప్పారు. ముఖ్యంగా వైద్యం, వ్యవసాయ రంగాలకు సీఎం అత్యంత ప్రాధాన్యతనిస్తున్నారని తెలిపారు. ఈ అవకాశాన్ని వినియోగించుకొని రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. పారిశ్రామిక మౌలిక వసతుల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం ముందుందని తెలిపారు.
రాష్ట్రంలో మూడు పోర్టులు, 9 ఫిషింగ్ హార్బర్లు, నాలుగు లాజిస్టిక్ పార్కులను అభివృద్ధి చేస్తోందన్నారు. రాష్ట్రం నుంచి వెళుతున్న మూడు పారిశ్రామిక కారిడార్లలో పెద్ద ఎత్తున మౌలిక వసతులు కల్పిస్తోందని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాలను వివరిస్తూ దుబాయ్ ఎక్స్‌పోలో ఏర్పాటు చేసిన ఏపీ పెవిలియన్‌ను యూఏఈ విదేశాంగ శాఖ మంత్రి తనిబిన్ అహ్మద్ ఆల్ జియాది, ఇండియాలో సౌదీ అరేబియా అంబాసిడర్ అహ్మద్ అబ్దుల్ రెహమాన్, యూఏఈలో భారత దౌత్యాధికారి సంజయ్ సుధీర్, రాష్ట్ర విదేశీ పెట్టుబడుల సలహాదారు జుల్ఫీలతో కలిసి మంత్రి మేకపాటి లాంఛనంగా ప్రారంభించారు.
రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరిస్తూ 12 థీమ్‌లతో ఏపీ పెవిలియన్ ఏర్పాటు చేశారు. ఘనంగా జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఇప్పటికే యూఏఈకి చెందిన అల్లానా గ్రూపు రాష్ట్రంలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో పెట్టుబడులు పెట్టిందని తెలిపారు. ఇదే విధంగా మరిన్ని కంపెనీలు ముందుకు రావాలని కోరారు. దుబాయ్ ఎక్స్‌పో సందర్భంగా ఆటోమొబైల్, టెక్స్‌టైల్, ఇన్‌ఫ్రా, స్కిల్, పెట్రోకెమికల్స్, ఎలక్ట్రిక్ వెహికల్స్ వంటి రంగాల్లో పెట్టుబడులపై దృష్టి సారించినట్లు తెలిపారు. ఏపీ పెవిలియన్‌కు మంచి స్పందన వస్తోందని, ఇప్పటికే 12 సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడి అవకాశాలపై చర్చించడానికి ఆసక్తిని వ్యక్తం చేసినట్లు తెలిపారు.
ఈ ఎక్స్‌పోలోనే మూడు భారీ పెట్టుబడులపై ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందన్నారు. రాష్ట్రంలో ఐటీ, ఫైనాన్షియల్ సేవల రంగంలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డి, వైస్ చైర్మన్, ఎండీ జవ్వాది సుబ్రమణ్యం, ఏపీ మారిటైమ్ డిప్యూటీ సీఈవో రవీంద్రనాథ్ రెడ్డి, , కర్నూలు ఎమ్మల్యే హఫీజ్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు
Comments
Please login to add a commentAdd a comment