
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనలకు అనుగుణంగా పెట్టుబడులను ఆకర్షించే దిశగా పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. ఈనెల 17, 18, 19 తేదీల్లో 3 రోజుల పాటు ఆయన ఢిల్లీలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. 17న హోటల్ తాజ్ ప్యాలస్‌లో నిర్వహించే 11వ ఇండియా కెమ్ అంతర్జాతీయ సదస్సులో పాల్గొంటారు. 100కు పైగా దేశాల నుంచి 7,000 మందికిపైగా వ్యాపారసంస్థల ప్రతినిధులు హాజరయ్యే ఈ సదస్సులో వివిధ కంపెనీలతో ఒప్పందం చేసుకునేందుకు మంత్రి మేకపాటి నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం ప్రణాళికలను పూర్తి చేసింది.
ముఖ్యమంత్రి మార్గనిర్దేశం మేరకు విశాఖ–కాకినాడ పెట్రో కెమికల్ కారిడార్‌తో పాటు కృష్ణపట్నం నోడ్‌లో పెట్టుబడులకు సంబంధించి వివిధ కంపెనీలతో ఒప్పందాలు కుదిరే అవకాశముంది. పెట్రో కెమికల్స్ రంగంలో మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడానికి మంత్రి, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. 17న మధ్యాహ్నం నేషనల్ టెక్నికల్ టెక్స్‌టైల్స్ మిషన్ ఆధ్వర్యంలో ఐటీసీ మౌర్యా హోటల్లో జరిగే జాతీయ స్థాయి సదస్సులో కూడా మంత్రి మేకపాటి పాల్గొంటారు. 18, 19 తేదీలలో మంత్రి మేకపాటి పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం కానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment