సాక్షి, చెన్నై: ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తొలిసారిగా విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. మార్చిలో దుబాయ్‌లో జరిగే పెట్టుబడుల మహానాడుకు ఆయన హాజరవుతారని సమాచారం. దుబాయ్‌లో మార్చిలో 192 దేశాల నేతృత్వంలో పెట్టుబడుల మహానాడు, ఎగ్జిబిషన్ జరగనుంది. ఇందులో తమిళనాడు ప్రభుత్వం తరపున వ్యవసాయం, చేనేత, వర్తక, పారిశ్రామిక రంగాల గురించి ప్రత్యేక స్టాల్ ఏర్పాటుకు నిర్ణయించారు. ఈ స్టాల్‌ను వీక్షించడంతో పాటుగా పెట్టుబడిదారుల్ని ఆకర్షించే విధంగా సీఎం స్వయంగా రంగంలోకి దిగేందుకు నిర్ణయించినట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
విద్యార్థులతో సరదాగా....
చెన్నై మెరీనా తీరంలో ప్రజలసందర్శనార్థం శకటాల్ని కొలువు దీర్చిన విషయం తెలిసిందే. పెద్ద ఎత్తున సోమవారం పాఠశాలలకు చెందిన విద్యార్థులు వీటిని వీక్షించేందుకు మెరీనాకు వచ్చారు. అదే సమయంలో సచివాలయానికి వెళ్తున్న సీఎం విద్యార్థుల్లో తానూ ఒకరయ్యారు. కాన్వాయ్ నిలిపివేసి శకటాల వద్దకు వెళ్లారు. విద్యార్థులతో కలిసి సరదాగా కాసేపు గడిపారు. సెల్ఫీలు తీసుకున్నారు.
చదవండి: (తమిళనాడును తాకిన హిజాబ్ సెగ.. రియాక్షన్ ఇది)
సీఎంతో భేటీ
సచివాలయంలో సీఎం ఎంకే స్టాలిన్‌తో శ్రీలంక ప్రభుత్వ ప్రతినిధులు, మంత్రులు సెంథిల్ తొండమాన్, బీనవ్ తొండమాన్ భేటీ అయ్యారు. రెండు దేశాల మధ్య జాలర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, ఈలం తమిళుల సంక్షేమం గురించి ఈసందర్భంగా చర్చించారు. అలాగే, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్‌గా నియమితులైన ఏఎస్ కుమారి, సభ్యులు స్టాలిన్‌ను కలిసి ఆశీర్వాదం అందుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment