లులూ గ్రూప్ అధిపతి యూసుఫ్ అలీతో కేటీఆర్ కరచాలనం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రూ.500 కోట్ల పెట్టుబడితో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు లులూ గ్రూపు ముందుకు వచ్చింది. జీనోమ్ వ్యాలీలో ఇప్పటికే ఒక ఉత్పత్తి యూనిట్ కలిగి ఉన్న స్పెయిన్ కంపెనీ ‘కిమో ఫార్మా’రూ.100 కోట్ల పెట్టుబడితో మరో యూనిట్ ఏర్పాటుకు ఆసక్తి చూపింది. స్విట్జర్లాండ్‌కు చెందిన బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్ రంగ కంపెనీ ‘స్విస్ రే’నగరంలో తన కార్యాలయాన్ని ప్రారంభించనుంది. వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సు తొలిరోజు రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావుతో చర్చలు జరిపిన అనంతరం ఈ మేరకు పెట్టుబడులు పెట్టేందుకు ఆయా కంపెనీలు ముందుకు వచ్చాయని మంత్రి కార్యాలయం సోమవారం ఒక ప్రకటనలో తెలిపింది.
రాష్ట్రంలో మరోచోట యూనిట్: లులూ అధినేత
దావోస్‌లో కేటీఆర్.. లులూ గ్రూప్ అధిపతి యూసుఫ్ అలీతో సమావేశమై చర్చలు జరిపారు. రూ.500 కోట్లతో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ ఏర్పాటుకు యూసుఫ్ ముందుకు రాగా, దీనికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావాల్సిన అనుమతుల పత్రాలను మంత్రి అక్కడికక్కడే అందజేశారు. రాష్ట్రంలో మరోచోట సైతం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో పని చేస్తున్నామని, త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తామని యూసుఫ్ తెలిపారు. తమ యూనిట్లకు త్వరలోనే శంకుస్థాపన నిర్వహిస్తామన్నారు. తెలంగాణ ప్రాంతం నుంచి యూరప్ వంటి దేశాలకు ఫుడ్ ప్రాసెసింగ్ ఉత్పత్తులను ఎగుమతి చేసే స్థాయిలో తమ యూనిట్ ఉండనుందన్నారు. తెలంగాణలో భారీ కమర్షియల్ కాంప్లెక్సులు నిర్మించనున్నామని, హైదరాబాద్‌లో పలు స్థలాలను కూడా ఎంపిక చేశామని, యజమానులతో చర్చలు జరుగుతున్నాయని తెలిపారు. నగరంలో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో షాపింగ్ మాల్ నిర్మించాలన్నది తమ లక్ష్యమని చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహించడం ద్వారా వ్యవసాయోత్పత్తులు, అనుబంధ రంగాల ఉత్పత్తులకు డిమాండ్ పెంచాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని, లులూ గ్రూప్ అంతర్జాతీయ స్థాయి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌తో ఇది సాకారం కానుందని కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.
250 మందితో ‘స్విస్ రే’ కార్యాలయం
రాష్ట్రంలో నైపుణ్యం గల మానవ వనరుల లభ్యతను దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్‌లో తమ కార్యాలయాన్ని ప్రారంభించేందుకు ‘స్విస్ రే’గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ వెరోనికా స్కాట్టి బృందం మంత్రి కేటీఆర్‌తో జరిపిన చర్చల సందర్భంగా సంసిద్ధత వ్యక్తం చేసింది. తొలుత 250 మంది ఉద్యోగులతో తమ కార్యాలయాన్ని ప్రారంభిస్తామని, దశల వారీగా ఈ సంఖ్యను మరింతగా పెంచుకుంటూ వెళ్తామని వెరోనికా తెలిపారు. సంస్థ డేటా, డిజిటల్ విభాగాలను బలోపేతం చేయడం, బీమా ఉత్పత్తులను రూపొందించడం, రిస్క్ మేనేజ్‌మెంట్ వంటి అంశాలపై తమ హైదరాబాద్ కార్యాలయం పనిచేస్తుందని చెప్పారు. ఇన్నోవేషన్, ఇతర సహకారం కోసం టీ–హబ్‌తో భాగస్వామ్యానికి సైతం సంసిద్ధత వ్యక్తం చేశారు.
భవిష్యత్తులో కిమో ఏపీఐ యూనిట్
కిమో ఫార్మా 2018లో నగరంలో క్వాలిటీ కంట్రోల్, స్టెబిలిటీ ల్యాబ్స్ వంటి విభాగాల్లో తమ కార్యకలాపాలను ప్రారంభించింది. కాగా రూ.100 కోట్లతో తమ రెండో ఉత్పత్తి యూనిట్ ఏర్పాటు చేస్తామని కిమో గ్రూప్ డైరెక్టర్ జీన్ డానియల్ బోనీ మంత్రి కేటీఆర్‌తో జరిపిన చర్చల సందర్భంగా వెల్లడించారు. భవిష్యత్తులో ఆక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రెడియంట్ (ఏపీఐ) ఉత్పత్తి యూనిట్‌తో పాటు పరిశోధన, అభివృద్ధి కేంద్రాన్ని నగరంలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.
‘మీషో’ ఈ–కామర్స్ భారీ పెట్టుబడి: కేటీఆర్ ట్వీట్
ఈ–కామర్స్ పరిశ్రమ ‘మీషో’ హైదరాబాద్‌లో కార్యాలయం ఏర్పాటుకు ముందుకు వచ్చిందని, ద్వితీయ శ్రేణి నగరాల్లో రిటైల్ సేల్స్‌పై దృష్టి పెట్టనుందని కేటీఆర్ ట్విటర్ ద్వారా ప్రకటించారు. డబ్ల్యూఈఎఫ్‌లో వచ్చిన మరో భారీ పెట్టుబడి ఇది అని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment