దావోస్‌లో ‘తెలంగాణ లైఫ్‌సైన్సెస్ ఇండస్ట్రీస్ విజన్ ఫర్ 2030’ అంశంపై చర్చలో తన అభిప్రాయాలు చెబుతున్న మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కరోనా సంక్షోభం నేపథ్యంలో లైఫ్‌సైన్సెస్ (జీవశాస్త్ర) రంగానికి ప్రాధాన్యత మరింత పెరిగిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. ఈ రంగంలో ప్రపంచ స్థాయి పోటీని తట్టుకుని నిలబడేందుకు భారత్‌లో విప్లవాత్మకమైన సంస్కరణలు అవసరమని అన్నా రు. భారత్‌లో ఈ రంగం పురోగతికి అవసరమైన విధానాలకు అంతగా మద్దతు లభించడం లేదని చెప్పారు. అదే సమయంలో లైఫ్‌సైన్సెస్ రంగానికి హైదరాబాద్ రాజధానిగా మారిందని తెలిపారు. దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో భాగంగా లైఫ్‌సైన్సెస్ రంగానికి సంబంధించి.. ‘తెలంగాణ: ఆసియాలో పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణలకు కీలక స్థానం’అనే అంశంపై సోమవారం జరిగిన చర్చలో కేటీఆర్ పాల్గొన్నారు.
ఐటీ, ఫార్మా రంగాలు కలిసి పనిచేయాలి
తెలంగాణలో లైఫ్‌సైన్సెస్ రంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్ ‘హైదరాబాద్ ఫార్మా సిటీ’ఏర్పాటు చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి సరైన మద్దతు లభించడం లేదని మంత్రి విమర్శించారు. కొత్త ఆవిష్కరణలకు ఊతమివ్వడం ద్వారానే ఈ రంగం అభివృద్ధి చెందుతుందన్నారు. భవిష్యత్తులో లైఫ్‌సైన్సెస్ రంగంలో కొత్త ఆవిష్కరణలు ప్రయోగశాలను దాటి డిజిటల్ డ్రగ్ డిస్కవరీ (ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కొత్త ఔషధాల ఆవిష్కరణ) వైపు పయనిస్తాయని అన్నారు. ఈ నేపథ్యంలో ఐటీ, ఫార్మా రంగాలు కలిసి పనిచేయాల్సిన అవసరముందని సూచించారు.
సులభతర విధానాలు అవసరం
భారత్‌లో పరిశోధన, అభివృద్ధి రంగాల్లో విదేశీ పెట్టుబడులకు వీలుగా సులభతర విధానాలు అవసరమని, ఈ విషయంలో కేంద్రం చొరవ తీసుకోవాలని కేటీఆర్ అన్నారు. వచ్చే దశాబ్దం పాటు భారత్ లైఫ్‌సైన్సెస్ రంగం అభివృద్ధి పథంలో నడిచే అవకాశముందని, ఔషధ తయారీ సంస్థలు ప్రస్తుతమున్న మందుల తయారీకే పరిమితం కాకుండా, కొత్త మందులను తయారు చేసే దిశగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. భారత్‌లో నైపుణ్యానికి కొదవలేదని, లైఫ్‌సైన్సెస్ రంగంలో పరిశోధన, అభివృద్ధి, ఆవిష్కరణలకు ప్రాధాన్యతనిస్తూ భారీగా పెట్టుబడులు పెట్టాల్సిన అవసరముందని అన్నారు. తెలంగాణలో లైఫ్‌సైన్సెస్ రంగంలోని ఔత్సాహిక పరిశోధకులకు సహకారం అందించేందుకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో ఉన్న ప్రముఖ సంస్థలతో కలిసి పనిచేస్తోందని తెలిపారు. ఈ చర్చాగోష్టిలో కేటీఆర్‌తో పాటు డాక్టర్ రెడ్డీస్ సంస్థకు చెందిన జీవీ ప్రసాద్‌రెడ్డి, పీడబ్ల్యూసీకి చెందిన మహమ్మద్ అథర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment