దావోస్‌లో జోష్‌గా..  తెలంగాణకు భారీ పెట్టుబడులు.. | Ktr Said Telangana Perfect Place for Investment in Wef 22 | Sakshi
Sakshi News home page

దావోస్‌లో జోష్‌గా..  తెలంగాణకు భారీ పెట్టుబడులు..

Published Thu, May 26 2022 1:04 AM | Last Updated on Thu, May 26 2022 1:05 AM

Ktr Said Telangana Perfect Place for Investment in Wef 22 - Sakshi

స్టాడ్లర్‌ రైల్‌ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు బ్రొక్‌మెయ్, ఫెర్రింగ్‌ ఫార్మా కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు  గిలియో బృందానికి జ్ఞాపికలు అందిస్తున్న మంత్రి కేటీఆర్‌. చిత్రంలో జయేశ్‌ రంజన్‌ తదితరులు 

సాక్షి, హైదరాబాద్‌: దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో తెలంగాణ భారీ పెట్టుబడులు సాధిస్తోంది. పలు ప్రముఖ కంపెనీలు రాష్ట్రంలో పెద్దమొత్తంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయి. పలు కంపెనీలు తమ విస్తరణ ప్రణాళికలు ప్రకటిస్తున్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ బుధవారం రెండు భారీ పెట్టుబడులు సాధించింది. రైల్వే కోచ్‌ల తయారీలో పేరొందిన స్టాడ్లర్‌ రైల్‌ సంస్థ వచ్చే రెండేళ్లలో రూ.1,000 కోట్లు పెట్టుబడిగా పెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు తెలంగాణ పెవిలియన్‌లో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వంతో స్టాడ్లర్‌ రైల్‌ అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది.

స్విట్జర్లాండ్‌కు చెందిన స్టాడ్లర్‌ రైల్‌ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు ఆన్స్‌ గార్డ్‌ బ్రొక్‌మెయ్, తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ ఈ ఎంవోయూపై సంతకాలు చేశారు. రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా మోకిలలో ఇప్పటికే  రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసిన మేధా సర్వోడ్రైవ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌తో కలిసి స్టాడ్లర్‌ రైల్‌ ఇక్కడ రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తుంది. ప్రస్తుత పెట్టుబడి ద్వారా సుమారు 2,500 మందికి కొత్తగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఈ ఫ్యాక్టరీలో తయారయ్యే కోచ్‌లు భారత్‌కే కాకుండా ఆసియా పసిఫిక్‌ ప్రాంతానికి కూడా ఎగుమతి అవుతాయి. కాగా స్టాడ్లర్‌ రైల్‌ పెట్టుబడిపై మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. విదేశాలకు కూడా కోచ్‌లు ఎగుమతి చేసే స్థాయికి చేరుకోవడం తెలంగాణకు గర్వకారణమన్నారు. ప్రపంచ స్థాయి పెట్టుబడులకు తెలంగాణ ఆకర్షణీయ గమ్యస్థానంగా మారిందనే విషయం మరోసారి నిరూపితమైందని చెప్పారు. తెలంగాణలో ఏర్పాటు చేసే తమ యూనిట్‌కు అత్యంత ప్రాధాన్యత ఉందనిబ్రొక్‌మెయ్‌ పేర్కొన్నారు. తమ కంపెనీ ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో అభివృద్ధిని సాధించేందుకు ఈ పెట్టుబడి దోహదపడుతుందన్నారు. 

స్వల్ప వ్యవధిలోనే ఫెర్రింగ్‌ ఫార్మా విస్తరణ 
భారత్‌లో తమ విస్తరణ ప్రణాళికలకు తెలంగాణ రాష్ట్రాన్ని ఎంచుకున్నట్లు మరో స్విస్‌ సంస్థ ఫెర్రింగ్‌ ఫార్మా ప్రకటించింది. దావోస్‌లోని తెలంగాణ పెవిలియన్‌లో బుధవారం మంత్రి కేటీఆర్‌తో సంస్థ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు అల్లేసండ్రో గిలియో ప్రతినిధి బృందం సమావేశం అయ్యింది. క్రోన్, అల్సరేటివ్‌ కోలైటిస్‌ వంటి (జీర్ణకోశ సంబంధిత) వ్యాధుల చికిత్సలో ఉపయోగించే ‘పెంటసా‘ను ఉత్పత్తి చేసేందుకు తెలంగాణలోని కొత్త ప్లాంట్‌ను వినియోగించుకోనున్నట్లు తెలిపింది. ప్రపంచంలోని అతిపెద్ద మేసాలజైన్‌ అనే యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇంగ్రేడియంట్‌ (ఏపీఐ) తయారీదారుల్లో ఒకటిగా ఉన్న ఫెర్రింగ్‌ ఫార్మా ప్రస్తుతం వివిధ దేశాల్లో తన ఉత్పత్తులను తయారు చేస్తోంది. వీటికి అదనంగా హైదరాబాద్‌ నగరంలో తన ఫార్ములేషన్‌ యూనిట్‌ ఏర్పాటు చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది. నెలరోజుల క్రితమే తమ యూనిట్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించిన సంస్థ స్వల్ప వ్యవధిలోనే అదనంగా మరో రూ.500 కోట్లు పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. 

‘ష్నైడర్‌ ఎలక్ట్రిక్‌’మరో యూనిట్‌ 
తెలంగాణలో ఇప్పటికే కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఫ్రెంచ్‌ కంపెనీ ష్నైడర్‌ ఎలక్ట్రిక్‌ రాష్ట్రంలో మరో తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. దావోస్‌లో మంత్రి కేటీఆర్‌తో బుధవారం భేటీ సందర్భంగా సంస్థ కార్యనిర్వాహక ఉపాధ్యక్షుడు లుక్‌ రిమోంట్‌ ఈ మేరకు ప్రకటన చేశారు. తెలంగాణలో పనిచేస్తున్న తమ యూనిట్‌ ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రమాణాలు కలిగిన ఫ్యాక్టరీగా అడ్వాన్సŠడ్‌ లైట్‌ హౌస్‌ అవార్డును అందుకున్నదని రిమోంట్‌ తెలిపారు. ఐఓటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఎనలిటిక్స్, ఏఐ డీప్‌ లెర్నింగ్‌ వంటి సాంకేతిక పరిజ్ఞానం వాడినందుకు ఈ అవార్డు దక్కిందన్నారు. తెలంగాణలో తమ కంపెనీ కార్యకలాపాలు సాఫీగా కొనసాగుతున్నాయంటూ, రాష్ట్రంలో ఉన్న పారిశ్రామిక స్నేహపూర్వక వాతావరణంపై ఆయన ప్రశంసలు కురిపించారు. తెలంగాణ ఉన్న ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకునే తమ కంపెనీ విస్తరణకు పూనుకున్నట్లు తెలిపారు. తమ నూతన తయారీ ప్లాంట్‌ ఎనర్జీ మేనేజ్‌మెంట్, ఆటోమేషన్‌ సంబంధిత ఉత్పత్తులను తయారు చేస్తుందని చెప్పారు. ష్నైడర్‌ ఎలెక్ట్రిక్‌ అదనపు తయారీ యూనిట్‌ వలన కొత్తగా 1,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని కేటీఆర్‌ తెలిపారు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement