ప్రతిపాదిత లూలూ కన్వెన్షన్ సెంటర్ స్థలం
సాక్షి, విశాఖపట్నం: విశాఖ నగరంలో భారీగా నిర్మించతలపెట్టిన లూలూ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ ప్రాజెక్టు పెండింగులో పడినట్టు తెలిసింది. బీచ్ రోడ్డుకు ఆనుకుని ఏపీఐఐసీ మైదానంలో పబ్లిక్ ప్రయివేటు భాగస్వామ్యం (పీపీపీ) కింద దీని నిర్మాణానికి గత టీడీపీ ప్రభుత్వం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి చెందిన లూలూ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. గత ఏడాది ఫిబ్రవరి 24వ తేదీ సీఐఐ భాగస్వామ్య సదస్సు ప్రారంభం రోజున భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడుతో కలిసి అప్పటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. సుమారు రూ.2 వేల కోట్ల అంచనా వ్యయంతో ఈ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. లూలూ కన్వెన్షన్ సెంటర్‌కు తొలుత ఏపీఐఐసీకి చెందిన 9.20 ఎకరాలు కేటాయించారు. ఆ తర్వాత సీఎంఆర్ సంస్థకు చెందిన 3.4 ఎకరాలు తీసుకుని పరిహారంగా వివిధ చోట్ల ఉన్న 4.85 ఎకరాలు ఆ సంస్థకు ఇచ్చారు. కొన్నాళ్ల క్రితం ఏపీఐఐసీ స్థలానికి ఆనుకుని ఉన్న 2.12 ఎకరాల ప్రయివేటు స్థలాన్ని కూడా లూలూ సంస్థ యాజమాన్యం కేటాయించాలని కోరింది. దీనికి ప్రభుత్వం సై అంటూ భూసేకరణకు కూడా పూనుకుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వానికి రూ.300 కోట్లు డిపాజిట్ చేయాలని చంద్రబాబు కోరినట్టు సమాచారం. టీడీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని ముందే ఊహించిన లూలూ యాజమాన్యం అందుకు ససేమిరా అన్నట్టు తెలిసింది. దీంతో లూలూకు సంబంధించిన ప్రక్రియ ముందుకు సాగడానికి అధికార యంత్రాంగం కూడా వెనకడుగు వేసింది. కొన్నాళ్ల క్రితం ప్రతిపాదిత లూలూ కన్వెన్షన్ సెంటరు స్థలాన్ని చదును చేసి, ఆ తర్వాత దాని జోలికెళ్లలేదు. ఫలితంగా ఈ లూలూ కన్వెన్షన్ సెంటర్ ప్రగతి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది.
‘లూలూ’ ఒప్పందాలను రద్దుచేయాలి
అల్లిపురం (విశాఖ దక్షిణం): గత ప్రభుత్వం విశాఖనగరంలో అంతర్జాతీయ సంస్థ లూలూకు కేటాయించిన భూ కేటాయింపులు రద్దు చేయాలని సీపీఎం నగర కార్యదర్శి బి.గంగారావు కోరారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ఆన్‌లైన్‌లో ఒక లేఖ పంపించారు. మధురవాడలో స్థాపించడానికి నిర్ణయించి టెండర్లు ఆహ్వానించారని, అయితే నాటి ముఖ్యమంత్రి జోక్యంతో ఈ ప్రక్రియను మధ్యలోనే నిలిపివేసి మధురవాడ నుంచి నగర నడిబొడ్డున ఉన్న రామకృష్ణాబీచ్ వద్దకు మార్చారని చెప్పారు. టెండర్లను పక్కన పెట్టి లూలూ సంస్థకు ఏకపక్షంగా ఏపీఐఐసీకి చెందిన 9.5 ఎకరాలు స్థలాన్ని నామమాత్రపు లీజుకు కేటాయించటమే కాకుండా 4.5 ఎకరాల ప్రైవేటు స్థలాన్ని కూడా సేకరించి లూలూ సంస్థకు కేటాయించారని లేఖలో పేర్కొన్నారు. ఈ పనులన్నీ నిబంధనలకు విరుద్ధంగా స్వయంగా నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జోక్యంతోనే జరిగాయని వివరించారు. పర్యావరణ, వుడా సంబంధిత అధికారులు నిబంధనలకు విరుద్ధమని తెలిపినా ఆయన పట్టించుకోలేదని చెప్పారు. అప్పట్లో అన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు ఆందోళన కూడా చేశాయని, ఈ విషయాన్ని పాదయాత్రలో మీ దృష్టికి తేగా అధికారంలోకి వచ్చిన తరువాత ఈ ఒప్పందాలను రద్దు చేస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు.
పారదర్శక పాలనకు శ్రీకారం హర్హణీయం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డికి గంగారావు అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రిగా పారదర్శకమైన పాలనకు ఆయన శ్రీకారం చుట్టడం ఆహ్వానించదగ్గ విషయమని పేర్కొన్నారు. నూతన ప్రభుత్వ పాలన విధానాలకు అనుగుణంగా గత ప్రభుత్వం లూలూ సంస్థతో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేయాలని విజ్ఞప్తి చేశారు.
బాబుపై ముడుపుల ఆరోపణలు
ఈ కన్వెన్షన్ సెంటర్ కోసం వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను అప్పనంగా ధారాదత్తం చేయడం ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌కు రూ.500 కోట్ల ముడుపులు ముట్టాయని అఖిలపక్ష నేతలు, మేధావులు గతంలో ఆరోపించారు. దీని టెండర్లలోనూ అవకతవకలు జరిగాయని ధ్వజమెత్తారు. ఈ కన్వెన్షన్ సెంటర్ వల్ల చిన్న మాల్స్, దుకాణాలు దెబ్బతిని 25 వేల మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు గండిపడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.పర్యాటకులను ఆకట్టుకుంటున్న విశాఖ బీచ్‌రోడ్డులో ఈ కన్వెన్షన్ సెంటర్ పూర్తయితే బీచ్‌రోడ్‌లో కూర్చునేందుకు అడుగు స్థలం కూడా ఉండదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా లూలూ సంస్థకు జరిపిన భూ కేటాయింపుల వ్యవహారంపై సీబీఐతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. భూ కేటాయింపులను అడ్డుకునేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయించాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment