వరద బీభత్సంతో కేరళ ప్రజలు ఉక్కిరి బిక్కిరవుతుంటే, వారి అవసరాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఉద్యోగికి ఓ గల్ఫ్ కంపెనీ యాజమాన్యం తగిన బుద్ధి చెప్పింది. కనీస మానవత్వాన్ని మరిచి వ్యాఖ్యానించాడు. నోటికొచ్చినట్టుగా అనుచితంగా ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్ పెట్టాడు. ఈ వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన కంపెనీ అతగాడిని ఉద్యోగంనుంచి తొలగించింది. తప్పయిందంటూ ఆనక లెంపలేసుకున్నా..ఆ కంపెనీ కనికరించలేదు. అటు ఈ వ్యాఖ్యలు చేసింది కేరళకు చెందిన వ్యక్తే కావడం గమనార్హం.
కేరళకు చెందిన రాహుల్ లులు గ్రూప్ కంపెనీ ఒమన్ బ్రాంచ్‌లో కేషియర్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. కేరళలో వరద బాధితులకు వలంటీర్లు సహాయం చేస్తుండడంపై రెండు రోజుల క్రితం ఫేస్‌బుక్‌లో ఆయనో పోస్ట్ పెట్టాడు. సహాయక శిబిరాల్లో ఎవరైనా సానిటరీ నేప్‌కిన్స్ కోసం అడిగితే, తాను మాత్రం వాటికి బదులుగా కండోమ్స్ అడుగుతానంటూ బాధితులను అవహేళన చేస్తూ మాట్లాడాడు. ఈ వ్యాఖ్యలు వైరల్ అవడంతో రాహుల్ ఉద్యోగం చేస్తున్న సంస్థ స్పందించింది. తక్షణమే రాహుల్‌ను ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది. మద్యం మత్తులోఅలా మాట్లాడాను తప్పైపోయింది, క్షమించండంటూ నాలిక్కరుచుకున్నా.. కంపెనీ ఎంతమాత్రం ఉపేక్షించలేదు. రాహుల్‌కు తగిన శాస్తి చేసింది.
కాగా కేరళ వరద బాధితుల పునరావాస కార్యక్రమాలకోసం విరాళమిచ్చిన గల్ఫ్ కంపెనీల్లో లులు గ్రూపు కంపెనీ కూడా ఉంది. కేరళకు చెందిన వ్యాపారవేత్త, లులు గ్రూపు ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ యూసుఫ్ అలీ 5కోట్ల రూపాయలును విరాళమిచ్చారు. అటు తమ ఆర్థిక వ్యవస్థ విజయంలో కేరళీయులది కీలక భాగమని, వారికి సహాయం చేయాల్సిన బాధ్యత తమపై ఉందంటూ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment