బయో ఆసియాలో వెయ్యి కోట్ల పెట్టుబడులు
సదస్సు సక్సెస్: మంత్రి జూపల్లి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా రెండు రోజులపాటు జరిగిన బయో ఆసియా-2016 సదస్సు పూర్తిస్థాయిలో విజయవంతమైనట్లు పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న టీఎస్ ఐపాస్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోందని ఆయన బుధవారం సదస్సులో విలేకరులతో చెప్పారు. వివిధ కంపెనీలు రూ.వెయ్యి కోట్ల మేరకు పెట్టుబడులు పెట్టేందుకు ఈ సదస్సులో ముందుకొచ్చాయన్నారు. ఫెర్రింగ్ ఫార్మా కంపెనీ తమ భారత్ కార్యకలాపాలకు హైదరాబాద్‌ను కేంద్రంగా ఎంచుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచస్థాయి హంగులతో ఏర్పాటు చేయబోతున్న ఫార్మాసిటీతో హైదరాబాద్ లైఫ్‌సెన్సైస్ హబ్‌గా మారుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదన్నారు.
అన్నీ ఇక్కడి నుంచే: మైకేల్
ఫెర్రింగ్ ఫార్మా 21 ఏళ్లుగా ముంబై నుంచి పనిచేస్తున్నప్పటికీ హైదరాబాద్ కేంద్రం ఏర్పాటు తరువాత భారత్‌లో ప్రధాన కార్యాలయం ఇదే అవుతుందని సంస్థ సీఓఓ మైకెల్ పెటీగ్రూ తెలిపారు. హైదరాబాద్ కేంద్ర ఏర్పాటుకు 2.5 కోట్ల డాలర్లు (రూ.170 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నామన్నారు. పరిశోధన, అభివృద్ధి కేంద్రంతో మొదలుపెట్టి.. దశలవారీగా అన్ని లావాదేవీలు, తయారీలను ఇక్కడి నుంచే చేపడతామన్నారు. యూరప్, అమెరికాల్లో ఇప్పటికే ఇలాంటి కేంద్రాలు 11 వరకూ ఉండగా, హైదరాబాద్ కేంద్రం పన్నెండోది అవుతుందన్నారు. ఫెర్రింగ్ ఫార్మా భారత్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ అశోక్ అలాటే మాట్లాడుతూ, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్రల్లోని అనేక ప్రాంతాలను పరిశీలించిన తరువాత తాము హైదరాబాద్‌లో కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.