Minister JUPALLY Krishna Rao
-
బయో ఆసియాలో వెయ్యి కోట్ల పెట్టుబడులు
సదస్సు సక్సెస్: మంత్రి జూపల్లి సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ కేంద్రంగా రెండు రోజులపాటు జరిగిన బయో ఆసియా-2016 సదస్సు పూర్తిస్థాయిలో విజయవంతమైనట్లు పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న టీఎస్ ఐపాస్‌కు అద్భుతమైన స్పందన లభిస్తోందని ఆయన బుధవారం సదస్సులో విలేకరులతో చెప్పారు. వివిధ కంపెనీలు రూ.వెయ్యి కోట్ల మేరకు పెట్టుబడులు పెట్టేందుకు ఈ సదస్సులో ముందుకొచ్చాయన్నారు. ఫెర్రింగ్ ఫార్మా కంపెనీ తమ భారత్ కార్యకలాపాలకు హైదరాబాద్‌ను కేంద్రంగా ఎంచుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రపంచస్థాయి హంగులతో ఏర్పాటు చేయబోతున్న ఫార్మాసిటీతో హైదరాబాద్ లైఫ్‌సెన్సైస్ హబ్‌గా మారుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదన్నారు. అన్నీ ఇక్కడి నుంచే: మైకేల్ ఫెర్రింగ్ ఫార్మా 21 ఏళ్లుగా ముంబై నుంచి పనిచేస్తున్నప్పటికీ హైదరాబాద్ కేంద్రం ఏర్పాటు తరువాత భారత్‌లో ప్రధాన కార్యాలయం ఇదే అవుతుందని సంస్థ సీఓఓ మైకెల్ పెటీగ్రూ తెలిపారు. హైదరాబాద్ కేంద్ర ఏర్పాటుకు 2.5 కోట్ల డాలర్లు (రూ.170 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నామన్నారు. పరిశోధన, అభివృద్ధి కేంద్రంతో మొదలుపెట్టి.. దశలవారీగా అన్ని లావాదేవీలు, తయారీలను ఇక్కడి నుంచే చేపడతామన్నారు. యూరప్, అమెరికాల్లో ఇప్పటికే ఇలాంటి కేంద్రాలు 11 వరకూ ఉండగా, హైదరాబాద్ కేంద్రం పన్నెండోది అవుతుందన్నారు. ఫెర్రింగ్ ఫార్మా భారత్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ డాక్టర్ అశోక్ అలాటే మాట్లాడుతూ, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్రల్లోని అనేక ప్రాంతాలను పరిశీలించిన తరువాత తాము హైదరాబాద్‌లో కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. -
రక్షణ రంగ పరిశ్రమలకు కేంద్రంగా రాష్ట్రం
డిఫెన్స్, ఏరోస్పేస్ పార్కుకు వెయ్యి ఎకరాలు ఏరోస్పేస్ సదస్సులో పరిశ్రమల మంత్రి జూపల్లి సాక్షి, హైదరాబాద్: రక్షణ రంగ పరిశ్రమలకు హైదరాబాద్ ఇప్పటికే కేంద్ర బిందువుగా ఉందని, నూతన పారిశ్రామిక విధానం ద్వారా ఈ రంగంలో మరిన్ని పెట్టుబడులు వస్తాయని రాష్ట్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. ఏరోస్పేస్ రంగం ప్రాధాన్యాన్ని గుర్తించినందునే తమ ప్రభుత్వం ఏరోస్పేస్, డిఫెన్స్ పార్కు ఏర్పాటుకు ఎలిమినేడులో వెయ్యి ఎకరాలు కేటాయించిందన్నారు. ప్రభుత్వ సంయుక్త భాగస్వామ్యంతో కీన్స్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్న రెండో ‘డిఫెన్స్, ఏరో సప్లై ఇండియా 2015’ సదస్సులో మంత్రి జూపల్లి పాల్గొని ప్రసంగించారు. వ్యూహాత్మకంగా అనువైన ప్రాంతం కావడంతో ైెహదరాబాద్ పరిసరాల్లో ఇప్పటికే డీఆర్డీఎల్, బీడీఎల్, డీఎంఆర్ఎల్, మిధాని, ఆర్సీఐ, ఎన్ఎఫ్సీ, ఓడీఎఫ్ తదితర ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటయ్యాయని చెప్పారు. రంగారెడ్డి జిల్లాలోని ఆదిబట్లలో రూ.3 వేల కోట్ల పెట్టుబడులతో ఏరోస్పేస్ పరికరాల తయారీకి ప్రత్యేక ఆర్థిక మండలి (సెజ్) ఏర్పాటైనట్లు తెలిపారు. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ ఇప్పటికే హెలికాప్టర్ క్యాబిన్లు తయారు చేస్తుండగా, త్వరలో అమెరికాకు చెందిన సిర్కోస్కీ ఎయిర్‌క్రాఫ్ట్ కార్పొరేషన్ కూడా మరో యూనిట్ ప్రారంభిస్తుందని వెల్లడించారు. రక్షణ, ఏరోస్పేస్ రంగంలో రాష్ట్రంలో సుమారు వేయికి పైగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు పని చేస్తున్నాయని జూపల్లి వెల్లడించారు. సదస్సులో నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే సారస్వత్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతోపాటు వివిధ ఏరోస్పేస్ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. -
టీఎస్ఐఐసీ భూములపై రుణాలు
♦ నెల రోజుల్లో పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి ప్రణాళిక ♦ ఉత్పత్తి ప్రారంభించాకే పరిశ్రమలకు భూ రిజిస్ట్రేషన్ ♦ టీఎస్ఐఐసీ పనితీరుపై మంత్రి జూపల్లి సమీక్ష సాక్షి, హైదరాబాద్: పారిశ్రామిక పార్కుల్లో మౌలిక సౌకర్యాల కల్పనకు అవసరమైన నిధుల సమీకరణకు తమ ఆధీనంలోని భూములపై రుణాలు తీసుకునే అంశాన్ని పరిశీలించాలని పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సౌకర్యాల కల్పన సంస్థ (టీఎస్ఐఐసీ)కి సూచించారు. సంస్థ కార్యాలయంలో మంగళవారం మంత్రి టీఎస్ఐఐసీ పనితీరును సమీక్షించారు. సమీక్షలో సంస్థ ఎండీ ఈ.వి.నర్సింహారెడ్డి, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి అవసరమైన కన్సల్టెంట్ల ఎంపిక, ప్రాజెక్టు రిపోర్టుల తయారీ తదితరాలను నెల రోజుల్లో పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూమిని గుర్తించడం, అభివృద్ధి చేయడం, పెట్టుబడిదారులకు రాష్ట్రంలో ఉన్న సౌకర్యాలను వివరించడంపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. టీఎస్ఐఐసీలో సిబ్బంది కొరతను తీర్చేందుకు టీఎస్పీఎస్సీ ద్వారా తక్షణమే నియామకాలు చేపట్టేందుకు అవసరమైన ప్రతిపాదనలు తయారుచేసి ప్రభుత్వానికి పంపించాలని ఆదేశించారు. పరిశ్రమల నిర్మాణం పూర్తయి ఉత్పత్తి ప్రారంభించిన తర్వాతే సంబంధిత సంస్థ పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని మంత్రి సూచించారు. టీఎస్ఐపాస్ విధానంలోని ప్రత్యేకతలను ప్రస్తావించిన జూపల్లి పారిశ్రామిక రంగంలో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచేలా సిబ్బంది పనిచేయాలన్నారు. పారిశ్రామిక పార్కుల్లో ఖాళీగా ఉన్న స్థలాలు, పరిశ్రమలకు కేటాయించిన భూములు, రాయిదుర్గ్ ఫైనాన్షియల్ జిల్లాలో భూముల కేటాయింపు, కేటాయింపులు జరిగినా వినియోగంలోకి రాని భూముల రద్దు, పెండింగ్‌లో ఉన్న కోర్టు కేసులు, ఫుడ్‌పార్కులు, ఫైబర్‌గ్లాస్ పార్కు, డ్రైపోర్టులు, టెక్స్టైల్ పార్కుల పురోగతి, ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ వినియోగం, ఎంఎల్ఆర్ మోటార్స్, శ్రీదేవి ఫుడ్స్‌కు కేటాయించిన భూములు, గేమ్ సిటీ, టీ హబ్ డిజైనర్ ఎంపిక, మైక్రోసాఫ్ట్‌కు పొరుగున పుప్పాలగూడలో వీజేఐల్ కన్సల్టెంట్స్‌కు కేటాయించిన భూ కేటాయింపులు రద్దు తదితర అంశాలపై మంత్రి సమీక్షించారు. పారిశ్రామికవాడల స్థానిక సంస్థలను (ఐలా)అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి చేర్చే అంశంపై సూత్రప్రాయంగా అంగీకరించినా ఫైలు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉందని అధికారులు జూపల్లి దృష్టికి తీసుకువచ్చారు. కోర్టులో ఉన్న కేసుల స్థితిగతులపై నివేదిక రూపొందించి క్రమం తప్పకుండా సమీక్షించాలని టీఎస్ఐఐసీ అధికారులను ఆదేశించారు. -
బంగారు తెలంగాణలో భాగస్వాములు కండి
♦ పారిశ్రామికవేత్తలకు మంత్రి జూపల్లి పిలుపు ♦ మూడో విడతలో 16 పరిశ్రమలకు అనుమతి సాక్షి, హైదరాబాద్ : స్థానికులకు ఉపాధి కల్పించడం ద్వారా రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమలు బంగారు తెలంగాణ సాధనలో భాగస్వాములు కావాలని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక విధానం (టీఎస్ ఐపాస్)లో భాగంగా మూడో విడతలో నూతనంగా ఏర్పాటయ్యే 16 పరిశ్రమల ప్రతినిధులకు అనుమతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా సచివాలయంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. మెదక్, మహబూబ్‌నగర్, నల్లగొండ, వరంగల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలో రూ.1,046 కోట్ల పెట్టుబడులతో వస్తున్న ఈ పరిశ్రమల ద్వారా 2,988 మందికి ఉపాధి దక్కుతుందని మంత్రి వెల్లడించారు. త్వరలో ఏర్పాటయ్యే స్కిల్ డెవలప్మెంట్ అకాడమీ ద్వారా పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యత కలిగిన మానవ వనరులు అందుబాటులోకి వస్తాయన్నారు. పాశ్చాత్య దేశాల్లో పరిశ్రమల అనుమతులకు కనీసం 45 రోజులు పడుతుండగా, టీఎస్ఐపాస్ ద్వారా 15 రోజుల్లోనే అనుమతులు ఇస్తున్నామని చెప్పారు. అనుమతుల్లో జాప్యం వల్ల పెట్టుబడులతో రాష్ట్రానికి వచ్చే ఏ ఒక్క పారిశ్రామికవేత్త ఇబ్బందులు పడకూడదనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఎలాంటి ఆటంకాలు, అవినీతి లేని పారిశ్రామిక విధానానికి దేశ, విదేశాల్లో ప్రశంసలు లభిస్తున్నాయని పేర్కొన్నారు. పెట్టుబడిదారులు తెలంగాణ రాష్ట్రానికి పారిశ్రామిక రాయబారులుగా వ్యవహరించాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో రాష్ట్రం బంగారు తెలంగాణగా ఆవిర్భవించడం ఖాయమన్నారు. జెనెసిస్ ప్రతినిధి వెంకట్‌రెడ్డి, అరబిందో పరిశ్రమ ప్రతినిధి ఐఎస్ రావు వేగంగా అనుమతులు జారీ చేయడంపై ప్రశంసలు కురిపించారు. -
కాలుష్యం వెదజల్లితే చర్యలు
కొత్తూరు : రాష్ట్రంలోకి కొత్త పరిశ్రమలను ఆహ్వానిస్తామని అదే సమయంలో కాలుష్యాన్ని వెద జల్లి ప్రజారోగ్యాన్ని దెబ్బతిసే పరిశ్రమలపై కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. రాష్ట్రంలో మూతపడినవాటితో పాటు ప్రస్తుతం కొనసాగుతున్న పరిశ్రమల స్థితిగతులను తెలుసుకునేందుకు ఆయన మంగ ళవారం మండలంలోని పలు పరిశ్రమలను సందర్శించారు. ఆయన వెంట మంత్రి లక్ష్మారెడ్డి కూడా ఉన్నారు. కొత్తరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానంతో త్వరలో జిల్లాలో పలు బహుళజాతి పరిశ్రమలు ఏర్పాటుకానున్నాయని వెల్లడించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు షాద్‌నగర్ పట్టణంలో పలు శిక్షణకేంద్రాలను ఏర్పాటుచేస్తామని చెప్పారు. కొత్త పరిశ్రమల ఏర్పాటుకు ఇప్పటికే జిల్లాలో వేల ఎకరాలను గుర్తించినట్లు వివరించారు. త్వరలో జిల్లాకు సమీపంలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ప్రారంభించేందుకు ఓ పెద్దసంస్థ కృషిచేస్తుంద న్నారు. స్పాంజ్ ఐరన్ పరిశ్రమ కాలుష్యంపై ఆగ్రహం మండలంలోని నర్సప్పగూడ గ్రామంలో కొనసాగుతున్న శ్యాంబాబా ఫెర్రోఅల్లాయిస్ ఐరన్ పరిశ్రమను స్వయంగా సందర్శించారు. ఈ సందర్భంగా పరిశ్రమలో కాలుష్య నియంత్రణ పరికరాలు ఉన్నప్పటికీ కరెంట్ బిల్లులు తగ్గించాలనే ఉద్ధేశంతో వాటిని వినియోగించడం లేదని తెలుసుకున్నారు. కాలుష్యం వెదజల్లే పరిశ్ర మలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని పీసీబీ అధికారులను ఆదేశించారు. టెక్సైటైల్ పార్కు సబ్సిడీని రికవరీ చేయాలి చేగూరు శివారులో హైటెక్స్ టెక్స్టైల్ పార్కు పేరుతో కొందరు గతంలో సుమారు 121ఎకరాలు తీసుకుని పూర్తిచేయలేదని.. నిర్వాహకులు కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల నుంచి సబ్సిడీ రూపంలో తీసుకున్న రూ.13కోట్లను తక్షణమే రికవరీచేయాలని కలెక్టర్‌ను ఆదేశించారు. అనంతరం సిద్ధాపూర్ శివారులో ప్రభుత్వ భూములను పరిశీలించారు. కార్యక్రమంలో కలెక్టర్ శ్రీదే వి, ఎస్పీ విశ్వప్రసాద్, జేసీ రాంకిషన్, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, జెడ్పీవైస్ చైర్మన్ నవీన్‌కుమార్‌రెడ్డి, ఎంపీపీ శివశంకర్‌గౌడ్, టీఆర్ఎస్ నేత వీర్లపల్లి శంకర్, ఆర్డీఓ హన్మంత్‌రెడ్డి, ఆయాశాఖ అధికారులు ఉన్నారు. స్థానికులను నియమించుకోవాలి జడ్చర్ల: జిల్లాను పారిశ్రామిక రంగంతో పాటు వ్యవసాయరంగం, ఇతర రంగా ల్లో అభివృద్ధి చేస్తామని మంత్రులు జూపల్లి కృష్ణారావు, సి.లక్ష్మారెడ్డి అన్నా రు. మంగళవారం వారు మండలంలోని పోలేపల్లి సెజ్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా హెటెరో ఫార్మా పరిశ్రమలో విలేకరులతో మాట్లాడారు. సెజ్, తదితర పరిశ్రమల్లో దాదాపు 70 శాతానికి పైగా స్థానికులే పనిచేస్తున్నారని తెలిపారు. ప్రత్యేక నైపుణ్యం కలిగిన పోస్టులకు స్థానికంగా అభ్యర్థులు లేని సమయంలో ఇతర ప్రాంతానికి చెందిన వారిని నియమించుకున్నా ఫర వాలేదని, అన్‌స్కిల్డ్, తదితర పోస్టులకు స్థానికులకే అవకాశం కల్పించాలని యాజమాన్యాలకు సూచించామని చెప్పారు. భవిష్యత్‌లో ఫార్మా, బయోటెక్నాలజీ, డిఫెన్స్, ఇంజనీరింగ్, టెక్స్టైల్స్, సెల్‌ఫోన్ తదితర అనేక పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయన్నారు. నిరుద్యోగుల్లో స్కిల్స్ అభివృద్ధి చేసేందుకు శిక్షణ ఇచ్చేందుకుగాను పాలమూరు యూనివర్సిటీలో స్థలాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. అమెజాన్, ఐకే వంటి పరిశ్రమలకు సంబంధించి కూడా గ్రామస్థాయిలో ఉపాది అవకాశాలు కల్పించే విధంగా కృషిచేస్తామన్నారు. -
బాబు కుట్రలను తిప్పికొడదాం
♦ ‘పాలమూరు’ను నిర్మించి తీరుతాం ♦ అఖిలపక్ష సమావేశంలో మంత్రి జూపల్లి కల్వకుర్త : పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ఎవరైనా అడ్డొస్తే అంతుచూస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు హెచ్చరించారు. పాలమూరు ప్రజలకు నీళ్లు రాకుండా అడ్డుపడుతున్న చంద్రబాబు కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. బుధవారం కల్వకుర్తి పట్టణంలో పాలమూరు ఎత్తిపోతల పథకంపై మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. చంద్రబాబు కేంద్రానికి రాసిన లేఖను వెనక్కి తెప్పిస్తారా? లేక ఇక్కడ టీడీపీ దుకాణం మూసుకుంటారని ఆ పార్టీ నేతలను ప్రశ్నించారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం నుంచి వచ్చే ఏడాది జూన్‌లో పూర్తిస్థాయిలో నీరు సరఫరా అవుతుందన్నారు. కొల్లాపూర్‌కు మాత్రమే కెఎల్ఐ నీరు తీసుకుపోయారని అనడం సరికాదన్నారు. మాజీ ఎంపీ మందా జగన్నాథం మా ట్లాడుతూ.. పాలమూరు ఎత్తిపోతల మూ డేళ్లలో పూర్తికావడం సాధ్యం కాకపోవచ్చుగాని, అన్ని అనుమతులు ఉంటే నిర్మాణం వేగంగా సాగుతుందన్నారు. ఉమ్మడి రాష్టంలో అన్నిదోచుకుపోయి తిరిగి ప్రత్యేకరాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా నీళ్లు దోచుకోవడానికి ప్రయత్నించడం దుర్మార్గమన్నారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు శివకుమార్ మాట్లాడుతూ.. రాజకీయాలను పక్కనపెట్టి పాలమూరు ఎత్తిపోతల పథకం సాధించడమే లక్ష్యంగా ముందుకుపోదామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ నాయకుడు పవన్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ ముందుగా క ల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా ఇక్కడి రైతాంగానికి సాగునీరు ఇవ్వాలని కోరారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి తాము పూర్తి మద్దతు ఇస్తామని కాలయాపన చేయవద్దని అన్నారు. బీజేసీ సభ్యుడు హరిప్రసాద్ మాట్లాడుతూ ప్రజలను రెచ్చగొట్టి మరో ఉద్యమం కమిటీలని కాలయాపన చేయాలని టీఆర్ఎస్ చూడటం సరికాదని సూ చించారు. పాలమూరు ఎత్తిపోతల నిర్మిం చడానికి ప్రణాళికాబద్దంగా ముందుకు పోవడంతోపాటు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తిచేయడానికి సిద్ధంకావాలని సూచిం చారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, బ్రిలియంట్ విద్యాసంస్థల అధినేత కసిరెడ్డి నారాయణరెడ్డి, నగరపంచాయతీ చైర్మన్ శ్రీశైలం, జెడ్పీటీసీ సభ్యులు రవి, నర్సింహ, వైస్ ఎంపీపీ పర్వతాలుగౌడ్, వెంకటయ్య, నాయకులు బాలాజీసింగ్, ఆనంద్‌కుమార్, విజితారెడ్డి, విజయ్‌గౌడ్, కౌన్సిలర్ సూర్యప్రకాష్‌రావు, బీజేసీ నాయకులు దుర్గప్రసాద్, కృష్ణగౌడ్, రాంరెడ్డి, బీఎస్సీ నేత కె.జం గయ్య, సీపీఎం నాయకులు, విశ్రాంతి ఉద్యోగులు పాల్గొన్నారు. -
సవాలుకు కట్టుబడి ఉన్నా!
టీడీపీ నేతలకు మంత్రి జూపల్లి బహిరంగ లేఖ హైదరాబాద్: మహబూబ్‌నగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణానికి గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు నిధులు వెచ్చించారని చెప్పుకుంటున్న టీడీపీ ఎమ్మెల్యేలు, నేతల ప్రకటనల్లో వాస్తవమెంతో తేల్చడానికి సిద్ధంగా ఉన్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం వారికి ఒక బహిరంగ లేఖ రాశారు. ‘మీ అధినేత చంద్రబాబు పాలమూరు జిల్లాతోపాటు తెలంగాణ ప్రయోజనాలకు వ్యతిరేకంగా అనుసరించిన వైఖరిని, పాలమూరు- ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకుంటున్న తీరును ప్రజల ముందు ఆధారాలతో బట్టబయలు చేయడానికి నాతో పాటు, నా సహచర ఎమ్మెల్యేలు, ఎంపీలు సిద్ధంగా ఉన్నాం’ అని మంత్రి లేఖలో పేర్కొన్నారు. పాత్రికేయులే న్యాయ నిర్ణేతలుగా.. టీవీ చానళ్లలో ప్రత్యక్ష ప్రసారం జరిగేలా చర్చ ఏర్పాటు చేయాలని, ఇందుకోసం పాత్రికేయులను తాను ప్రత్యేకంగా అభ్యర్థిస్తున్నానని చెప్పారు. అసెంబ్లీ కమిటీ హాల్లో ఈనెల 13, 15, 16 తేదీల్లో ఉదయం 11 నుంచి సిద్ధంగా ఉంటానని, లేదంటే మరే తేదీల్లోనైనా సిద్ధమేనని స్పష్టం చేశారు. పాలమూరు ప్రాజెక్టుల విషయంలో జూపల్లి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రావుల చంద్రశేఖర్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం జరుగుతున్న విషయం తెలిసిందే.